ఎనభయ్యేళ్ళ తర్వాత తీవ్ర భూకంపాన్ని చవిచూసింది నేపాల్. పర్యాటకులకు స్వర్గధామమైన ఈ హిమాలయాల దేశం, తుపాను దెబ్బకు నిలువునా వణికిపోయింది.. వణికిపోతూనే వుంది. నిన్న 8.1 తీవ్రతతో వచ్చిన భూకంపం నేపాల్‌ని కుదిపేస్తే, ఈ రోజు తాజాగా వచ్చిన 6.7 తీవ్రత గల భూకంపంతో మరింత నష్టం వాటిల్లింది నేపాల్‌కి. దెబ్బ మీద దెబ్బ.. అనుకునేలోపు, ఈ రోజు నేపాల్ రాజధాని ఖాట్మండులో భారీ వర్షం కురిసింది. వడగళ్ళ వాన కురియడంతో భూకంప బాధితుల కష్టాలు పదింతలయ్యాయి.
ఓ సారి తీవ్ర భూకంపం వచ్చాక, రెండు మూడు రోజులపాటు.. ఒక్కోసారి వారం పది రోజులపాటు కాస్త తక్కువ తీవ్రతతో ప్రకంపనలు వస్తూనే వుంటాయి. దాంతో, ప్రజలు కూలిపోగా మిగిలిన ఇళ్ళలోకి వెళ్ళేందుకు ఇష్టపడరు. ఆరుబయటే కొన్నాళ్ళపాటు జీవనం సాగించాల్సి వుంటుంది. అలాంటివారి నెత్తిన భారీ వర్షాలు పిడుగులా పడటమంటే అంతకన్నా దయనీయ స్థితి ఇంకేముంటుంది.?
ప్రకృతి పగబట్టిందా.? అనే స్థాయిలో నేపాల్ అతలాకుతలమైపోయింది.. ఇంకా ఇంకా నష్టపోతూనే వుంది. ప్రపంచంలోని వివిధ దేశాలు నేపాల్‌ని ఆదుకునేందుకు ముందుకొస్తున్నాయి. అమెరికా ఇప్పటికే నేపాల్‌కి తక్షణ సహాయం కింద పది లక్షల డాలర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. పొరుగుదేశం తీవ్రంగా నష్టపోవడంతో పెద్దమనసుతో భారతదేశం నేపాల్‌ని అన్ని విధాలా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల్ని పంపడంతోపాటు ఆహారం, మందులు వంటివి నేపాల్‌కి పంపింది భారతదేశం.
ఎవరెంతగా సహాయం చేసినా నేపాల్ కుదుటపడటం ఇప్పట్లో జరిగే పని కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు నేపాల్‌లో జరగాల్సింది పునర్‌నిర్మాణం. అంతలా నేపాల్ తీవ్ర భూకంపం ధాటికి సర్వనాశనమైపోయింది.