‘తూర్పు’ తీరంపై కేంద్రం సవతితల్లి ప్రేమ!
గత యుపిఎ ప్రభుత్వ హయాంలో తూర్పుగోదావరి జిల్లాలో పంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వివిధ జాతీయ స్థాయి సంస్థల అడ్రస్ ఒక్కొక్కటిగా గల్లంతయ్యే దుస్థితి వాటిల్లింది. గత కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలకు ప్రస్తుత ప్రభుత్వాలు మోకాలడ్డటంతో ఈ పరిస్థితి వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లాకు కేటాయించిన వివిధ జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ముఖ్యమైన ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఐయుసిటిఇ)ను మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు జరుగుతుండగా అదే బాటలో త్రిపుల్ ఐటి పరిస్థితి తయారయ్యింది. అలాగే అప్పటి ప్రభుత్వం ప్రకటించిన పెట్రోలియం వర్సిటీ కూడా ఈ ప్రాంతాన్ని వదిలివెళ్ళిపోయే దయనీయ స్థితి ఏర్పడింది.
గత ప్రభుత్వ హయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తూర్పుగోదావరి జిల్లాకు త్రిపుల్ ఐటిని మంజూరు చేసింది. ఈ జిల్లాలోని తొండంగి మండలంలో త్రిపుల్ ఐటి నిర్మాణానికై 100 ఎకరాలను అప్పటి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సేకరించాయి. తొండంగిలో నిర్మించే త్రిపుల్ ఐటికి అప్పటి కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్ళంరాజు అప్పట్లో కాకినాడలో హైటెక్ పద్ధతిలో భూమిపూజ చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం 2014 జూన్ నుండే అకడమిక్ ఇయర్ ప్రారంభం కావల్సి ఉంది. ఐతే ఏడాది గడచినా ఈ త్రిపుల్ ఐటి కార్యరూపం దాల్చిన దాఖలాలు లేకపోవడంతో ఆయా వర్గాలు తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించిన అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలలోకి వెళ్ళిన అప్పటి కేంద్ర ప్రభుత్వం పలు జాతీయ స్థాయి విద్యా సంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించింది. త్రిపుల్ ఐటిని ప్రభుత్వప్రైవేట్ పార్టనర్ షిప్ పద్ధతిలో నిర్మిస్తున్నట్టు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. జిఎంఆర్, చైతన్య విద్యా సంస్థలను ప్రధాన భాగస్వాములను చేస్తూ త్రిపుల్ ఐటి నిర్వహణ బాధ్యతలను ఈ రెండు సంస్థలకూ అప్పగిస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. తూర్పు తీరంలో త్రిపుల్ ఐటి ఏర్పాటుతో ఈ ప్రాంతం టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందడంతో పాటు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యా ప్రమాణాలతో స్థానిక యువతకు విద్యను అందించేందుకు మార్గం సుగమం అవుతుందని ఆశించారు. ఇదిలావుండగా త్రిపుల్ ఐటి మరుగున పడటాన్ని పలువురు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎంపిలు ఈవిషయంలో కేంద్రంపై వత్తిడి తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. అలాగే జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమస్యను రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
త్రిపుల్ ఐటి బాటలో పెట్రో వర్సిటి…..
తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోలియం విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటుచేస్తామని గత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కృష్టాగోదావరి బేసిన్ (కెజి బేసిన్)కు కేంద్రస్థానంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోనే పెట్రో వర్సిటీని నియమిస్తే ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచించారచు. విశాఖకాకినాడ తీరాన్ని పెట్రోలియం అండ్ కెమికల్ పెట్రోలియం ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (పిసిపిఐఆర్)గా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో అనేక పెట్రోకెమికల్ పరిశ్రమలు కాకినాడ కేంద్రంగా ఆవిర్భవించనున్నాయి. ఈ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పెట్రోలియం వర్సిటిని ఇక్కడే నిర్మించాలన్నది ఆయా వర్గాల వాదన! ఐతే ఇటీవల పెట్రో వర్సిటీని విశాఖ జిల్లాలో ఏర్పాటుచేసేందుకై కేంద్రం నిర్ణయించడం ఆయా వర్గాలను తీవ్ర విస్మయానికి గురి చేస్తోంది.
ఐయుసిటిఇ తరలింపునకు కుట్ర!
యుపిఎ ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా కాకినాడలో ప్రారంభించిన ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఐయుసిటిఇ) మరో ప్రాంతానికి తరలిపోయే దుస్ధితి వాటిల్లింది. దీని నిర్వహణ బాధ్యతలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం విస్మరించడంతో సెంటర్ మూతపడింది. ఎంతో విలువైన ఈ సెంటర్‌పై పొరుగు రాష్ట్రాల వారి దృష్టి పడింది. కేంద్ర ప్రభుత్వం,యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (యుజిసి)ల వద్ద పలుకుబడి కలిగిన ఆయా రాష్ట్రాల పాలకులు, అధికారులు కాకినాడ నుండి ఐయుసిటిఇని తమ రాష్ట్రాలకు తరలించుకోపోయేందుకు విశ్వప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ సెంటర్‌ను ఏ రాష్ర్టంలో ఏర్పాటుచేస్తే ఆ రాష్ర్టంలో విద్యా వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు దోహదపడుతుంది.
దీనిని దృష్టిలో ఉంచుకుని కాకినాడలో అలంకార ప్రాయంగా మిగిలిన ఐయుసిసెంటర్‌ను తరలించుకుపోయేందుకు ఆయా రాష్ట్రాల మేధావి వర్గం ఢిల్లీస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. గత కేంద్ర ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్ళంరాజు చొరవతో యుజిసి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాకు ఈ జాతీయ స్థాయి విద్యాశిక్షణ సంస్థ మంజూరయ్యింది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు కేంద్రమంత్రి పళ్ళంరాజు, యుజిసి ఉన్నతాధికారులు ఈసెంటర్ కార్యకలాపాలను కాకినాడ జెఎన్‌టియులో ప్రారంభించారు. పూర్తిస్థాయి వసతి సౌకర్యలు, భవన సముదాయాలు నిర్మించేవరకు వర్సిటీ క్యాంపస్‌లోనే ఈ సెంటర్‌ను నిర్వహించారు.
దీని నిర్వహణ బాధ్యతలను చూసేందుకు జెఎన్‌టియుకు చెందిన ఓ ప్రొఫెసర్‌కు కోఆర్డినేటర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. సెంటర్‌ను ప్రారంభించగానే ఒకటి, రెండు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అప్పట్లో ఐయుసిటిఇకి డైరెక్టర్‌గా ఒరిస్సాకు చెందిన ఓ సీనియర్ ప్రొఫెయర్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజులేక మళ్ళీ ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. హైదరాబాద్ సెంట్రర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు సమానమైన హోదాను కలిగివుండే ఐయుసిటిఇ డైరెక్టర్ పదవి కోసం అప్పట్లీ దేశ వ్యాప్తంగా సుమారు 200 మంది పోటీ పడ్డారు. ఈసెంటర్ నిర్వహణకై ఏడాదికి 60 కోట్ల వంతున ఐదేళ్ళకు 300 కోట్ల రూపాయల బడ్డెట్‌ను తొలి దశ క్రింద కేటాయించినట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది.
పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయం స్థాయి వరకు బోధనా సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ఈ సెంటర్ ప్రధాన ద్యేయం! ఉపాధ్యాయులకు అధునాతన పద్ధతుల్లో శిక్షణ కల్పిస్తేనే వారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రపంచస్థాయి ప్రమాణాలకు ధీటుగా అందించగలరన్న కాన్సెప్ట్‌తో ఐఇని ఏర్పాటుచేశారు. కేంద్రంలో ప్రభుత్వం మారాక, కొత్త ప్రభుత్వం గాని, యుజిసి గాని ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో నేడు ఇతర రాష్ట్రాల మేధావి వర్గం దృష్టి ఈ సెంటర్‌పై పడింది. కాగా కేంద్రం ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ సెంటర్ నిర్వహణ బాధ్యతలను రాష్ర్ట ప్రభుత్వానికి బదలాయించాల్సిందిగా విద్యావేత్తలు, యువత కోరుతోంది.
డిఎస్‌ఆర్