'పంచపాండవులంటే నాకు తెలియదా? మంచంకోళ్లలా ముగ్గురు అంటూ రెండు వేళ్లు చూపించిదొకావిడ' అనేగి పాత సామెతే! ఎక్కడో మొదలుపెట్టి క్రమంగా స్థాయి దింపుతూ వచ్చినపుడు యీ సామెత వాడతారు. టిడిపి వారి ఋణమాఫీకి యిది బాగా వర్తిస్తుంది. ఎన్నికల టైములో ఏ వివరాలూ లేకుండా 'రైతుల ఋణమాఫీ' అంటూ హోరెత్తించేశారు. రైతులు తమకున్న సమస్త్త ఋణాలభారం చంద్రబాబు తన నెత్తిన వేసుకుంటున్నాడనుకున్నారు. చంద్రబాబు యిచ్చిన అనేక హామీల జోరులో దీని గురించి పెద్దగా పట్టించుకుని వుండేవారు కాదేమో కానీ, జగన్ తన ప్రచారంలో వూరూరూ తిరిగి 'బాబు ఫలానా హామీ యిచ్చాడు, కానీ అమలు చేయలేడు' అంటూ దీనికి విస్తృత ప్రచారం కల్పించాడు. ప్రజలు 'రెండో భాగం సంగతి అవతల చూద్దాంలే, యీ హామీ ఏదో బాగుంది' అనుకుని టిడిపిని ఆదరించారు. నెగ్గిన తర్వాత ఆ హామీ పాములా టిడిపి మెడకు చుట్టుకుంది. చంద్రబాబు ఆ పామును తన మెడలోంచి తీసి ఓ కమిటీ మెళ్లో పడేసి, 'ఇప్పణ్నుంచి అటు చూడండి' అని ప్రజలకు చెప్పారు. ఆ విధంగా మాఫీకోసం ఎదురు చూసిన రైతులకు కమిటీ దక్కింది. ఇక కమిటీ ఏం చేయబోతుందో, ఏం చెప్పబోతుందో ఎదురుచూస్తూ కూర్చోవచ్చు. ఈలోగా బాబుగారిని ప్రశ్నలతో వేధించకూడదు. అది మర్యాద కాదు.
ఈ లెక్కలు ముందు చూసుకోలేదా?
అయితే కొందరికి అన్నీ సందేహాలే. హామీ యిచ్చేటప్పుడు యీ అంశాలన్నీ పరిశీలించలేదా? అని. బాబుగారు టిడిపి మానిఫెస్టో ఆషామాషీగా తయారు చేయించలేదని మీడియా మనకు హామీ యిచ్చింది. ఆర్థికనిపుణులు కూలంకషంగా చర్చించి, ఆచరణసాధ్యమైన హామీలు మాత్రమే మానిఫెస్టోలో పొందుపరచారని టిడిపి నాయకులు చెపుతూ వచ్చారు. టిడిపి మానిఫెస్టో రాసిన ఆర్థికనిపుణుడు కుటుంబరావుగారు ఓ సారి టీవీ చర్చలో ఫోన్-యిన్‌లోకి వచ్చి ఆ మేరకు ధీమా వ్యక్తపరచారు కూడా. 'ఎలా చేయగలరు? అంత స్తోమత ఎక్కడిది?' అని ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటివారు కవ్వించడానికి చూశారు. కంఠంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూండగా కుటుంబరావుగారు 'బాబుగారి ప్రమాణస్వీకారం రోజున తొలి సంతకం చేస్తూన్న క్షణాన మీ సందేహాలన్నీ పటాపంచలవుతాయి' అని ఊరించారు. ఋణమాఫీ జరిగేనా? అని నేను వ్యాసం రాస్తే చాలామంది పాఠకులు – ఆ కుటుంబరావుగారి మాటలు వినే కాబోలు – 'ఎంతోమంది నిపుణులు మాఫీ సాధ్యమే అని చెపుతున్నారు, నీకొచ్చిన బాధేమిటి? ఈ కుశంకలు దేనికి' అంటూ చివాట్లేశారు. ఇప్పుడు నాకూ శంకలు తీరిపోయాయి. మనకూ ఓ కమిటీ దక్కింది. 15 రోజుల్లో మధ్యంతర నివేదిక, 45 రోజుల్లో పూర్తి నివేదిక, ఇంకేం కావాలి?
విభజన పుణ్యమాని రెండు రాష్ట్రాల ఆర్థికస్థితిగతుల గురించి చిన్నపిల్లాడికి కూడా తెలిసేవిధంగా పేపర్లు రాస్తూ వచ్చాయి. కిరణ్‌కుమార్ రెడ్డిగారు స్కూలు టీచర్లా విపులంగా చెప్తూ వచ్చారు. ఇవేళ కొత్తగా మారిపోయిన అంకెలు లేవు. అయినా బాబు 'అంతా అయోమయంగా వుంది' అంటున్నారు. విభజన గందరగోళంగా జరిగింది అంటున్నారు. ఈ గందరగోళపు, అన్యాయ, అక్రమ విభజన బిల్లునే ఆయన తెలంగాణ యూనిట్ సభ్యులు సమర్థించారు. లోకసభలో వున్న యిద్దరు టిటిడిపి ఎంపీలు యిలాగే కావాలన్నారు. అడ్డుపడబోయిన ఆంధ్ర టిడిపి ఎంపీని చావగొట్టి చెవులు మూసి, ఆస్పత్రికి వెళ్లేట్లా చేశారు. వాళ్లకే బాబు మళ్లీ టిక్కెట్లు యిచ్చి ప్రోత్సహించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు తెలుసుకదా- ఆంధ్ర చేతిలో చిప్ప తప్ప మరేమీ లేదని. మానిఫెస్టో రాసిన ఆర్థిక నిపుణులకు యీయన సరిగ్గా యిన్‌పుట్స్ యివ్వలేదా? అదే జరిగి వుంటే, ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రమాణస్వీకారం చేసేందుకు మధ్యలో 22 రోజులున్నాయి. నెగ్గగానే తనదే అధికారం, బాధ్యత అని తెలుసు కాబట్టి యీ కమిటీ అప్పుడే వేయించినా యీ పాటికి మధ్యంతర నివేదిక వచ్చేసేది. రెండు, మూడు రోజుల్లో వానలు వచ్చేస్తున్నాయి. ఖరీఫ్ పంటకు ఋణాలు కావాలి. ఈ నివేదిక చేతికి వచ్చి, దానిపై కాబినెట్ నిర్ణయం తీసుకుని, నిధులకోసం తిరిగి, బ్యాంకులకు యిచ్చి, వారి నుండి ఆదేశాలు వెలువడేట్లా చేయడానికి కనీసం నెలపట్టదా? అప్పటినుంచి రైతులు కొత్త ఋణాలు తీసుకోవడం మొదలుపెడితే ఎప్పటికి పంటలు వేస్తారు? ఏం పండిస్తారు?
'బ్యాంకులకు ఆదేశాలిచ్చేస్తాం..'
'అబ్బే, అప్పటిదాకా ఆగనక్కరలేదు, బాబుగారు బ్యాంకులకు ఆదేశాలు యిచ్చేస్తారు, నాబార్డ్‌కు చెప్తారు' అని కొందరు నాయకులు టీవీల్లో చెప్పేస్తున్నారు. ఆయన ఆదేశాలు యివ్వవచ్చేమో కానీ పుచ్చుకునేందుకు బ్యాంకులు సిద్ధంగా వుండవు. బ్యాంకు ఆఫీసరుగా నా అనుభవం చెప్తున్నాను – ప్రభుత్వం ఏదైనా పథకం, స్కీము ప్రకటించగానే పేపర్లో వస్తుంది. అవేళ బ్యాంకుకి వెళ్లేసరికి ఆ పేపరు కటింగ్ పట్టుకుని కొందరు కస్టమర్లు సిద్ధం. దీని కింద లోను యివ్వాలి కదా, దీని కింద హెచ్చు వడ్డీ రేటు యివ్వాలి కదా.. అంటూ. మాకు ఒళ్లు మండిపోతుంది. 'పేపరు చూసి బ్యాంకులు నడపమండి. మాకు మా హెడాఫీసు నుండి సర్క్యులర్ రావాలి, అప్పుడే ఏదైనా చేయగలం' అంటాం చికాకు అణుచుకుంటూ. 'అదెప్పుడు వస్తుంది?' అని అడుగుతారు వాళ్లు ఆతృతగా.
''సాక్షాత్తూ ఆర్థికమంత్రి పేపరు స్టేటుమెంటు యిచ్చినా అది పట్టించుకోం. ఆయన ఆర్‌బిఐ గవర్నరును ఒప్పించాలి. పథకం విధివిధానాలను రూపొందించి, ఆర్‌బిఐ సర్క్యులర్ యిస్యూ చేశాక అది వివిధ బ్యాంకుల హెడాఫీసులకు వెళుతుంది. అది ముందు పెట్టుకుని వాళ్లు తమ బ్యాంకుకి అనువుగా మళ్లీ సర్క్యులర్ తయారుచేస్తారు. ఇంగ్లీషులో తయారయ్యాక దానికి హిందీ, స్థానికభాషల్లో అనువాదం కోసం వేరే శాఖలకు వెళుతుంది. సంబంధిత అధికారుల సంతకం కోసం కొన్ని రోజులపాటు టేబుల్‌మీదే పడి వుండవచ్చు కూడా. ఫైనల్ సర్క్యులర్ ఏ జనరల్ మేనేజరో సంతకం పెట్టాల్సి వుంటుంది. ఆయన ఊళ్లో లేకపోతే ఆగుతుంది. ఆ సర్క్యులర్ బ్రాంచ్‌కి వచ్చాక, బ్రాంచ్ మేనేజర్ పోస్టు తెరిచి, దాన్ని చూసి సంబంధిత డిపార్టుమెంటు పంపడానికి ఒక రోజు పడుతుంది. అప్పుడే దాన్ని అమలు చేస్తాం…' అని చెప్తాం. వాళ్లు విసుక్కుని వెళ్లిపోతారు. బ్యాంకులు రాష్ట్రప్రభుత్వం ఆధీనంలో వుండవు. వాళ్లు వాళ్ల హెడాఫీసుకే బాధ్యులు. రాష్ట్ర అధికారులతో సమన్వయం కోసం స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సమావేశాలు జరుగుతూ వుంటాయి. ఆ సమావేశాలపై ఏ బ్యాంకుకి పెద్ద యింట్రస్టు వుండదు. వెళితే టైమ్ వేస్టు అని బ్రాంచ్ మేనేజరు ఎగ్గొడదామని చూస్తాడు. ఆర్గనైజర్‌నుంచి ఒత్తిడి వెస్తే ఎవరినైనా పంపాలని చూస్తాడు. ఏ అధికారీ వెళ్లడానికి యిష్టపడడు. బతిమాలో, ఆదేశించో పంపుతూంటారు.
కొత్త అప్పులివ్వడం ఆషామాషీ కాదు
రాష్ట్రప్రభుత్వాన్ని నడిపే పార్టీ తన రాజకీయప్రయోజనాల కోసం బ్యాంకు రూల్సు పట్టించుకోకుండా వ్యవహరించమని అడగవచ్చు, ఆదేశించవచ్చు. కానీ బ్యాంకులో వున్న డబ్బు కస్టమర్లది. రూల్సు పాటించకపోతే హెడాఫీసు వారు తాట తీస్తారు. డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. అందుకని ఎవరూ రిస్కు తీసుకోరు. పాత బకాయి వున్నవాడికి కొత్త లోను యిస్తే యిచ్చినవాడికి తలకాయనొప్పి. వంద సంజాయిషీలు యిచ్చుకోవాలి. అందువలన ఋణమాఫీ జరిగి, పాత ఖాతాలన్నీ మూసేస్తే తప్ప కొత్త లోను యివ్వరు. మంత్రుల హామీలు పేపర్లో చదివి ఎవరైనా రైతులు బ్యాంకులకు వెళితే అధికారులు వాళ్లకు ఏదో ఒకటి నచ్చచెప్పి పంపించేస్తూ వుంటారు. పాత ఖాతా మూసేయడం కూడా అంత యీజీ కాదు. ఎందుకంటే చంద్రబాబు తన పాదయాత్రలో ఋణమాఫీ గురించి మాఫీ యిచ్చాక, దాన్ని నమ్మి చాలామంది అవసరం లేకపోయినా అప్పులు తీసుకున్నారట, అప్పటికే తీసుకున్నవాళ్లు తిరిగి కట్టడం మానేశారట. సకాలంలో వాయిదాలు కట్టకపోతే పెనాల్టీగా వడ్డీ రేటు పెరుగుతుంది. ఉదాహరణకు లక్ష వరకు ఋణాలు మాఫీ చేయమని ప్రభుత్వం అందనుకోండి. అది అసలుకా, వడ్డీతో కలిపి ఆ రోజువరకు వున్న ఔట్‌స్టాండింగ్ ఎమౌంట్‌కా అన్న విషయంలో క్లారిటీ యివ్వాలి. పెనాల్టీ వడ్డీతో కలిపి బకాయి లక్ష దాటింది కాబట్టి మాఫ్ చేయం అంటే రైతుకి బాధేస్తుంది. నేను తీసుకున్నది 90 వేలు ఋణమే కదా అని పేచీ పెట్టుకుంటాడు.
పైగా ఏ ఋణం అన్నదానిపై స్పష్టత రాలేదు. వ్యవసాయఋణం మాఫీ చేస్తాం అని మ్యానిఫెస్టోలో ఒక చోట రాసి, తరువాతి లైనులోనే రైతు ఋణాల మాఫీ అని రాశారట. రైతు ఋణం అంటే రైతుకు గల అన్ని రకాల ఋణం అనే అభిప్రాయం వ్యాపించింది. వ్యవసాయ ఋణం (క్రాప్ లోన్) మాత్రమే అంటే దానికి సాధారణంగా యిన్సూరెన్సు వుంటుంది. పంట విఫలమయినపుడు ఇన్సూరెన్సు కంపెనీయే డబ్బు యిస్తుంది. పంట బాగా పండినా ఋణం వెనక్కి కట్టని రైతుకి సహాయం చేయడం అంటే అసంమజసంగా తోస్తుంది. బంగారం కుదువ బెట్టిన కేసుల్లో ఆ పాటి బంగారం వున్నవాడికి కూడా మాఫీయా అనిపిస్తుంది. ఇంట్లో పెళ్లి ఖర్చుకోసం బంగారం కుదువ పెట్టినా వ్యవసాయం కోసం అని రాయించారనుకోండి, వాళ్లకు మాఫీ వర్తిస్తుందా? ఈ లోను సొమ్ము ఎలా వినియోగం అయిందో ఎవరైనా నిరూపించగలరా? అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా బంగారం ఋణాలపై ఏమీ మాట్లాడటం లేదు. ఈ చర్చలన్నీ పార్టీలు ఎన్నికలకు ముందు చేయవు. ఏదీ స్పష్టంగా చెప్పవు. అన్నదాత కన్నీరు తుడుస్తాం, ఇంటి పెద్దకొడుకులా ఆదుకుంటాం – యిలాటి కవిత్వం ఒలకబోస్తారు. నెగ్గాక 'అలా ఎలా కుదురుతుంది?' అంటూ నచ్చచెప్పబోతారు. 'వందలాది ఎకరాలున్న రైతులకు కూడా ఋణమాఫీ చేయాలా?' అని సిఎం రమేష్‌గారు యివాళ టీవీలో మండిపడ్డారు. చేయమని ఎవరన్నారు? 'ఇన్ని ఎకరాలుంటే చేస్తాం, అంతకంటె ఎక్కువుంటే చేయం' అని ఎన్నికలకు ముందు వారే చెప్పి వుంటే ఏ గందరగోళమూ వుండేది కాదు. విధివిధానాలపై యిప్పుడు కమిటీ వేశారు. ఇవి తేలేటప్పటికి ఖరీఫ్ టైము దాటిపోతుంది.
58 నుండి 60 విషయంలో కమిటీ అక్కరలేక పోయింది
ఉద్యోగస్తుల రిటైర్‌మెంట్ వయసు పెంపు విషయంలో కమిటీ వేయాలని బాబుగారికి తోచలేదు. నిజానికి అదీ ఒక చిక్కు సమస్యే. ఉద్యోగులు 65 ఏళ్ల దాకా పని చేయడానికి రెడీ అంటారు. ఎప్పుడో యిక్ష్వాకుల కాలంలో ఉద్యోగాల్లో దూరినవాళ్లు 35, 40 ఏళ్లు పని చేసేస్తూ వుంటే మా గతి ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తారు. సీనియారిటీ పెరిగినకొద్దీ జీతం పెరుగుతూ వుంటుంది. భత్యాలు పెరుగుతూ వుంటాయి. మెడికల్ బిల్లుల ఖర్చు పెరుగుతూ వుంటుంది. కుటుంబసభ్యులకు కూడా ఎల్‌టిసి సౌకర్యం, మెడికల్ సౌకర్యం.. అంటూ ఒక్కో ఉద్యోగిపై తడిసిమోపెడు అవుతూంటుంది. ఆ ఖర్చుతో కొత్త ఉద్యోగులు ముగ్గుర్ని పెట్టుకోవచ్చు. అందుకే మల్టీ నేషనల్ కంపెనీలు 45 ఏళ్లు దాటినవాళ్లను ఎంతో కొంత యిచ్చి వదుల్చుకుందామని చూస్తూ వుంటాయి. వయసు పై బడితే సామర్థ్యం తగ్గుతుందని వారి భయం. ఏవో కొన్ని ఉద్యోగాలలో మాత్రమే అనుభవజ్ఞులు కావలసి వస్తారు. రొటీన్ ఉద్యోగాలలో ఎవరైనా నడిచి పోతుంది. యువత అయితే కుటుంబపు బాదరబందీ వుండదు. లేటుగా కూర్చోమన్నా కూర్చుంటారు… వంటి లెక్కలు వేస్తారు. అంకితభావంతో పని చేయడం అనేది వ్యక్తి బట్టి వుంటుంది. వయసుతో సంబంధం లేదు. ప్రభుత్వం కూడా యిదే ఫిలాసఫీ అవలంబించసాగింది. రాష్ట్రప్రభుత్వంలో వేలాది పోస్టులు ఖాళీగా వుంచడానికి కారణం అదే. కాంట్రాక్టు ఉద్యోగులను పెట్టుకుని పని నడిపించేస్తున్నారు.
ఒకసారి వుద్యోగం సంపాదించినవాళ్లు ఎల్లకాలం కొనసాగుదామని చూస్తారు. మనిషి ఆయుర్దాయం పెరుగుతోంది. రిటైరయి బయటకి వెళితే 25, 30 ఏళ్లపాటు ఖాళీగా కూర్చోవలసి వస్తోంది. ఖర్చులకు పెన్షన్‌తో సరిపెట్టుకున్నా సమయం గడపడం ఎలాగో తెలియదు. అందువలన ఉద్యోగి సంఘాలన్నీ రిటైర్‌మెంట్ వయసు పెంపు గురించి అడుగుతూనే వుంటాయి. మరి మా సంగతి ఏమిటని నిరుద్యోగ యువత అడుగుతూంటుంది. మీరు ఉద్యోగాలకు అప్లయి చేసుకునే వయసు 35 నుండి 40 కి పెంచాం పొండి అంటూంటుంది ప్రభుత్వం. అది పరిష్కారమా? ఓ బెంగాలీ సినిమా వుంది. కథేమిటంటే – ఓ కంపెనీలో పది ఖాళీలున్నాయి. ఒక్కో ఉద్యోగానికి పదిమంది చొప్పున వందమందిని యింటర్వ్యూకి పిలుస్తాం అని ప్రకటిస్తారు. కానీ వేలాది మంది నిరుద్యోగులు వచ్చిపడతారు. ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగుతారు. చాలాసేపు ఆందోళన జరిగాక కంపెనీ యజమాని యీ నిరుద్యోగులను చూసి జాలిపడి ఒక ప్రకటన చేస్తాడు – ఉద్యోగాల సంఖ్య పెంచుతామని కాదు, 'ఒక ఉద్యోగానికి పదిమందికి బదులుగా ముప్ఫయిమందిని యింటర్వ్యూ చేస్తాం' అని. నిరుద్యోగులందరూ ఏదో సాధించినట్లు కేరింతలు కొడతారు. దీనిలోని వ్యంగ్యం మనసుకు తాకుతుంది. నిరుద్యోగ యువతకు కావలసినది – ఉద్యోగం, అప్లయి చేసుకునేందుకు వయసు పరిమితి పెంపు కాదని నాయకులు ఎప్పుడు గుర్తిస్తారో!
నిరుద్యోగుల విషయంలో కమిటీ జాన్తా నై
రిటైర్‌మెంట్ వయసు పెంపు అనేది ఉద్యోగులకు వరం, నిరుద్యోగులకు శాపం. ఇద్దరిమధ్య సమతూకం సాధించడానికి పాలకులు ప్రయత్నించాలి. తెలంగాణలో కెసియార్ ఆ సాహసం చేయలేదు. టి-ఉద్యోగులకు సెంట్రల్ స్కేలు యిస్తానన్నారు, తెలంగాణ యింక్రిమెంటు యిస్తానన్నారు, ఆంధ్రవాళ్లను తరిమేసి ప్రమోషన్లు యిప్పిస్తానన్నారు కానీ 58 నుండి 60 చేస్తాననలేదు. అలా అంటే ఉస్మానియాలో తన దిష్టిబొమ్మలు తగలబడతాయని భయం. ఎందుకంటే నేది విద్యార్థులే రేపటి నిరుద్యోగులు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది ప్రధాన భూమిక. 2009లో ఖమ్మంలో కెసియార్ నిరాహారదీక్ష విరమించి కూడా విద్యార్థుల భయం చేత మళ్లీ మొదలెట్టారు. ఆంధ్రలో విద్యార్థులలో అలాటి చైతన్యం లేదు. తిరగబడరన్న ధైర్యం. అందుకే కమిటీ, గిమిటీ ఏమీ లేకుండా బాబు 60 కి పెంచిపారేశారు. ఉద్యోగుల తాత్కాలిక విభజన మాత్రమే జరిగిన యీ సమయంలో యీ పెంపు ఎన్నో సమస్యలకు దారితీస్తోంది. ఎవరికి వర్తిస్తుందో, ఎవరికి వర్తించదో అంతా అయోమయం. దీని విషయంలో కమిటీ వేసి అవన్నీ సార్ట్ ఔట్ చేసిన తర్వాతనే ప్రకటించి వుంటే సబబుగా వుండేది. కానీ దానికి కమిటీ లేదు, ఋణమాఫీ విషయంలో మాత్రం కమిటీ కావాలి. ఎందుకు?
ఆంధ్రలో విద్యార్థులు తిరగబడరన్న ధీమా వుంది కానీ రైతుల విషయంలో ఆ గ్యారంటీ లేదు. పొరుగిల్లు తెలంగాణలో కాస్త రుచి చూపించారు. అందువలన ఒక్కసారిగా విధివిధానాలు ప్రకటిస్తే కొంప మునుగుతుందని, ఐసియులో వున్న పేషంటు గురించి డాక్టర్లు చెప్పే తరహాలో క్రమక్రమంగా వాళ్ల మెదళ్లలో సందేహాలు ప్రవేశపెడుతున్నారు. చివరకు ఏ లక్షకో తేలిస్తే, 'అసలు ఏమీ యివ్వడేమోనని బెంగ పెట్టుకున్నాం, ఎక్కడికక్కడే ఎంకటలక్ష్మీ' అని సరిపెట్టుకుంటారని ఆశ. ఎందుకంటే కమిటీ రిపోర్టులో ఫలానా పరిమితి వరకు మాఫ్ చేయవచ్చు అని సిఫార్సు చేసినా నిధుల సంగతి ఏం చెప్తారు? కేంద్రం ఆదుకోవాలి అని ముక్తాయింపు యిస్తారు. అది పట్టుకుని కేంద్రం వద్దకు వెళ్లాలి. ఇది మా స్కీము కాదు కదా అని కేంద్రం అనవచ్చు. చివరకు రాజకీయ కారణాల వలన.. ఏదో కాస్త.., అదీ విడతలుగా.. యిస్తాం అనవచ్చు. ఇది యిప్పట్లో అయ్యే వ్యవహారం కాదు. అందువలన రైతుల ఆశలపై కాస్త కాస్త నీళ్లు చల్లుతూ, రాజధాని గురించో మరో దాని గురించో మాట్లాడుతూ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు.
-ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2014)