బజెట్‌పై చాలామంది విశ్లేషించారు. మెగసెసాయ్ ఎవార్డు గ్రహీత, గ్రామీణ సమస్యలపై అథారిటీ అనదగిన జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ చేసిన ఒక పరిశీలన ఆకట్టుకునేట్లా వుంది. కార్పోరేట్లకు ఏ విధంగా అచ్చే దిన్ వచ్చాయో ఆయన అంకెలతో సహా నిరూపించారు. థాబ్దాలుగా అన్ని కేంద్ర ప్రభుత్వాలూ కార్పోరేట్లకు మేలు చేస్తున్నాయని అందరూ అనుకుంటూ వస్తాం కానీ నిర్ధారణగా తెలియదు. అంతకముందు సంగతి వదిలేసి 2005-06 నుండి కార్పోరేట్ల నుండి వదులుకున్న ఆదాయాన్ని బజెట్‌లో ప్రభుత్వం విడిగా చూపసాగింది. ఆ ఏడాది రూ. 35 వేల కోట్లు కార్పోరేటు ఇన్‌కమ్ టాక్స్‌పై, 66 వేల కోట్లు ఎక్సయిజ్ డ్యూటీపై, 128 వేల కోట్లు కస్టమ్స్ డ్యూటీపై వదిలేశారు. మొత్తం 2లక్షల 29 వేల కోట్లు అన్నమాట. పేదల సంక్షేమంకై పాటుపడాలంటే అలాటి మినహాయింపులకు ముకుతాడు వేయాలి. కానీ ఎన్‌డిఏ ప్రభుత్వం వేసిందా? 2014-15 సం||రానికి వదులుకున్న ఆదాయం 5 లక్షల 49 వేల కోట్లు అయింది! అంటే పదేళ్ల క్రితం దానికి దగ్గర దగ్గర రెండున్నర రెట్లన్నమాట! గత పదేళ్లగా వదలుకున్న మొత్తం ఎంతో తెలుసా? 42 లక్షల కోట్ల రూపాయలు.. అంటే 42 తర్వాత 12 సున్నాలు. ఇప్పటికే చాలా యిచ్చేశాం చాలు అనుకుని కొత్త బజెట్‌లో ఏమైనా తగ్గించారా?
కొత్త బజెట్‌లో బంగారం, వజ్రాలు, జవహరీపై తగ్గించిన కస్టమ్స్ డ్యూటీ వలన ప్రభుత్వ ఆదాయానికి వచ్చిన లోటు రూ.75,592 కోట్లు. ఇవి కొనేవి డబ్బున్నవారే కదా! మరి ఎందరో పేదలకు ఉపాధి కల్పిస్తున్న 'నరేగా' (మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీము)కు కేటాయించిన మొత్తం ఎంతో తెలుసా? రూ.34,699 కోట్లు. కితం ఏడాది కంటె రూ.5 వేల కోట్లు ఎక్కువ యిచ్చాం అని జైట్లే చెప్పుకున్నారు. గమనించవలసిన దేమిటంటే దీనిలోంచి కేంద్రం రాష్ట్రాలకు బకాయి పడిన రూ.6 వేల కోట్లు తీసేయాలి. ఆ విధంగా చూస్తే గతంలో కంటె తక్కువగా ఎలాట్ చేశారని గమనించాలి. నరేగా పథకంలో లోటుపాట్లు వున్నాయని అందరూ ఒప్పుకున్న నిజం. దానికి కారణం – స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా దేశమంతా – అవసరం లేని చోట కూడా – దాన్ని అమలు చేయడం. పని చేసినా చేయకపోయినా సగం డబ్బులు యిచ్చి, సగం తినేస్తున్నారు. ఇలాటి లోపాలు సవరించాలి. స్వచ్ఛభారత్ ఉద్యమానికి, నరేగాకు ముడిపెడితే నిఘా ఏర్పడి, లోపాలు సవరించబడతాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు లేదు. దీనికి నిధుల్లో కోత పెట్టింది. సబ్సిడీలు యిచ్చి పేదలను చెడగొట్టం అంటున్న యీ ప్రభుత్వమే కార్పోరేట్ యిన్‌కమ్ టాక్స్‌ను రైట్ ఆఫ్ చేస్తోంది. యుపిఏ ప్రభుత్వపు ఆఖరి సంవత్సరంలో ఆ మొత్తం రూ.58 వేల కోట్లయితే, మోదీ ప్రభుత్వపు తొలి సంవత్సరంలో అది రూ.62 వేల కోట్లు (అంచనా) అంటే 8% ఎక్కువన్నమాట. చిత్రం ఏమిటంటే దీనికి అరుణ్ జైట్లే పెట్టిన పేరు – కార్పోరేట్ రంగానికి యిచ్చే ఇన్సెన్టివ్ (ప్రోత్సాహకం)!
దీనికి యివ్వడానికి ఎక్కడో అక్కడ తగ్గించాలిగా! తగ్గించారు. పిల్లల ఆరోగ్యసంబంధిత స్కీముల్లో 22% కోత, విద్యాసంబంధిత స్కీముల్లో 25% కోత… యిలా! కార్పోరేట్లకు గత పదేళ్లలో యిచ్చిన 'ప్రోత్సాహకాల' విలువ 42 లక్షల కోట్లు కదా. దానితో ఏమేం చేసి వుండవచ్చో సాయినాథ్ చెప్పారు – నరేగాను ప్రస్తుత స్థాయిలో 121 సం||లు నడపవచ్చు, ఫుడ్ సబ్సిడీని ప్రస్తుత స్థాయిలో 34 ఏళ్లు యివ్వవచ్చు. ఈ అంకెలన్నీ బజెట్‌లో కనబడుతున్నవి. కనబడని సౌకర్యాలు కూడా కార్పోరేట్లు పొందుతున్నాయని సాయినాథ్ ఎత్తిచూపారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఎన్‌పిఏ (నిరర్ధక ఆస్తులు)లలో సింహభాగం ధనికులు, కార్పోరేట్లదే. పేర్లు చెప్పమంటే చట్టప్రకారం చెప్పకూడదు, రహస్యం అంటారు. ఇవే బ్యాంకులు మధ్యతరగతివారు, రైతుల విషయంలో మాత్రం కుదువ పెట్టిన బంగారం వేలం వేయడానికి, వారి పేర్లు పేపర్లో ప్రకటించడానికి ఏ మాత్రం సంకోచించవు. ఆ ఋణాల విషయంలో హెడాఫీసు నుండి మేనేజర్లకు తాఖీదులు వస్తూ వుంటాయి. కార్పోరేట్ ఋణాల విషయంలో మాత్రం ముందుకు వెళ్లడానికి వీల్లేకుండా చేతులు కట్టేస్తారు. హెడాఫీసు లెవెల్లో సూపర్‌వైజ్ చేస్తున్నాం అంటారు. ఎన్‌పిఏల గురించి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయమంత్రి 'అవి రెండు లక్షల కోట్లకు చేరాయి – కొన్ని సంవత్సరాలుగా' అన్నారు. ఎన్నేళ్లుగా? వాటి విలువ రాబట్టే సాధనం వుందా? దానికి సమాధానం లేదు. ఇది కాకుండా 'కార్పోరేట్ డెట్ రిస్ట్రక్చరింగ్' అనే పేర బకాయిల అంకె యింకా పెద్దది అంటారు సాయినాథ్. భూమి మీద కనబడే ప్రతీ విషయాన్ని లోతుగా పరిశోధించాలనుకునే పాత్రికేయులు, సంపాదకులు యీ విషయంలో మాత్రం నిస్తేజంగా వుంటారు. మరీ లోతుగా వెళితే తమ యజమాని పేరే తగలవచ్చేమోనని భయం. ఆ వార్త వేస్తే తన ఉద్యోగానికే ముప్పు! కఠోరవాస్తవం ఏమిటంటే – గద్దె మీద ఎవరున్నా పెద్దలు మరింత పెద్దలవుతున్నారు, పేదలు మరింత పేదలవుతున్నారు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)