టీమిండియాకు కొత్త నడతను.. అభిమానులకు కమ్మటి విజయాల రుచిని.. చూపిన ఒకనాటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోచ్ గా అవతారం ఎత్తే సమయం వచ్చేసినట్టుగానే ఉంది. కెప్టెన్ గా భారత క్రికెట్ అభిమానుల్లో చిర స్థాయికి నిలిచిపోయే గంగూలీ ని టీమిండియాకు కోచ్ గా చేయడానికి బీసీసీఐ ప్రెసిడెంట్ జగ్ మోహన్ దాల్మియా చాలా ఆసక్తితో ఉన్నాడు. తనకు అత్యంత సన్నిహితుడు అయిన దాదాను జట్టుకు మార్గదర్శకుడిగా నియమించాలనేది దాల్మియా ఆలోచన.
దాదా కోచ్ గా వస్తే.. సగటు భారత క్రికెట్ అభిమాని కూడా ఆనందిస్తాడు.. ప్రత్యేకించి ఆట నుంచి రిటైర్డ్ అయ్యాకా కూడా అపారమైన అభిమాన గణాన్ని కలిగి ఉన్న ఆటగాడు గంగూలీ. ఆఖరికి సచిన్ ను అయినా ఇష్టపడని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఉంటాడేమో కానీ.. గంగూలీని కాదనుకొనే ఇండియన్ ఉండడు!
అత్యంత క్లిష్టపరిస్థితుల మధ్య.. సచిన్ కూడా తనతో కాదని వదిలేసిన కెప్టెన్సీని గంగూలీ చేపట్టాడు. అద్భుతాలు చేసి చూపించాడు. అనేక మంది యువ ఆటగాళ్లకు ప్రోత్సాహాన్ని ఇచ్చి.. టీమిండియాను వరస విజయాల బాట పట్టించి.. దాదాగా నిలిచాడు. ఇండియా గంగూలీ కెప్టెన్సీకి ముందు కూడా ఎన్నో విజయాలు సాధించింది.. అయితే గంగూలీ ఆధ్వర్యంలో.. సాధించిన విజయాల ఈ తరానికి కిక్కునిచ్చాయి. ఆ తర్వాత కూడా టీమిండియా ఆట తీరు గంగూలీ చూపిన మార్గంలోనే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీంతో భారత క్రికెట్ జట్టు గమనాన్ని గంగూలీకి ముందు.. గంగూలీకి తర్వాత అని విభజించవచ్చు.
మరి అలాంటి గంగూలీ కోచ్ గా వస్తే.. ధోనీ లాంటి కెప్టెన్ కు తోడయితే.. ఇండియాలో క్రికెట్ కే మరింత క్రేజ్ వస్తుందని చెప్పవచ్చు. అభిమానుల్లో టీమిండియాపై మరింత అభిమానం పెరుగుతుంది. అయితే ఇప్పుడు కోచ్ గా గంగూలీ అంటే.. ధోనీ దానికి సమ్మతిస్తాడా? లేక విదేశీ కోచ్ కే ప్రిఫర్ చేస్తాడా?! అనేది సందేహం.
ధోనీ మదిలో ఆసీస్ మాజీ ఆటగాడు మైక్ హస్సీ ఉన్నాడని టాక్. హస్సీని కోచ్ గా చేసేయాలని ధోనీ అనుకొంటున్నాడట. అయితే టీమిండియా మేనేజర్ రవిశాస్త్రి వంటి వారు విదేశీ కోచ్ ఎందుకు? అనే వాదనను లేవనెత్తుతున్నారు. మరి అంతిమంగా ధోనీ అభిప్రాయానికే విలువ ఉండొచ్చు. ఏం జరుగుతుందో!