ఆంధ్రరాష్ట్రపు కొత్త రాజధాని అయినా, ప్రౌడ్ వైజాగ్ పునర్నిర్మాణమైనా పిపిపి విధానంలో కడతామనే సంకేతాలు తరచుగా యిస్తూంటారు బాబు. ఎందుకంటే ప్రభుత్వమే మొత్తమంతా కడుతుందంటే ప్రజలు నమ్మరని ఆయనకూ తెలుసు. మొత్తం ప్రయివేటు వాళ్ల చేతికి అప్పగిస్తామని చెపితే భారీ కమిషన్లు చేతులు మారి వుంటే శంకిస్తారనీ తెలుసు. అందువలన 'పబ్లిక్-ప్రయివేట్-పార్టనర్‌షిప్ (పిపిపి)లో కడతాం, భూవనరులు, పన్ను మినహాయింపులు వంటివి ప్రభుత్వ బాధ్యత, నిధులు తెచ్చుకుని లాభసాటిగా కొంతకాలం నిర్వహించుకుని, ఖర్చులు రాబట్టుకున్నాక మళ్లీ ప్రభుత్వానికి అప్పగించేసి మర్యాదగా వెళ్లిపోవడం ప్రయివేటు కంపెనీల బాధ్యత' అని చెప్తారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో పిపిపి విధానం మంచిది అని 2000 సం||రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రతిపాదించి అమలు చేసింది. యుపిఏ ప్రభుత్వం దాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లింది. ఇటీవలి కాలంలో యిది తారకమంత్రంగా భాసిస్తోంది. బాబు ప్రభుత్వమే కాదు, కెసియార్ ప్రభుత్వం కూడా దీన్ని అనేక చోట్ల జపిస్తూ వుంటుంది. మోదీ ప్రభుత్వం దీన్ని మరింత జోరుగా అమలు చేయబోతోంది. బజెట్ ప్రసంగంలో అరుణ్ జైట్లీ భారతదేశం ప్రపంచ పిపిపిలకు గమ్యంగా మారుతుంది అన్నారు. 3పి ఇండియా అనే సంస్థ స్థాపించి దానికి మూలధనంగా రూ. 500 కోట్లు కేటాయించారు.
వినడానికి ఎంతో న్యాయబద్ధంగా, సమంజసంగా వున్న యీ ఫార్ములా అమలులోకి వచ్చేసరికి ఏమవుతోంది? అనే సందేహం సాధారణ ప్రజలను పీడిస్తూ వుంటుంది. ఎందుకంటే బిఓటి (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) పద్ధతిన ఓ రోడ్డు వేయడానికి ప్రయివేటు కంపెనీ అనుమతి యిస్తారు. తమ నిధులతో రోడ్డు వేశాక వాళ్లు టోల్ వసూలు చేస్తారు. ఎంతకాలం చేస్తారు, ఎంత చేస్తారు? అనే విషయం ప్రభుత్వం బహిరంగ పరచదు. అక్కడ టోల్ గేట్ దగ్గర కూడా రాసి వుండదు. గడువు దాటిన తర్వాత కూడా ఆ వసూళ్లు అలా కొనసాగుతూ పోతూంటాయి. ఇటీవల మహారాష్ట్రలో రాజ్ ఠాకరే టోల్ గేట్లు బద్దలు కొట్టినప్పుడు అన్యాయంగా తోచినా, విచారణ జరిపిస్తే వాళ్లలో కొన్ని అక్రమంగా వసూలు చేస్తున్నాయని తేలింది. టోల్ గేట్ విషయంలోనే యిలాటి మోసాలు జరిగితే మరి పెద్ద పెద్ద వెంచర్స్ విషయంలో ఏం జరుగుతోంది? హైదరాబాదులో రాజీవ్ ఎయిర్‌పోర్టుకి అంత స్థలం యివ్వడం అవసరమేనా? వసూలు చేస్తున్న యూజర్ ఫీజు సరైనదేనా? ఒప్పందంలో రాసుకున్న ప్రకారమే చేస్తున్నారా? మధ్యలో పెంచారా? తూర్పు హైదరాబాదులో యింకో యింటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కడతానని కెసియార్ అంటున్నారు. దానికీ యింత స్థలం ధారాదత్తం చేస్తారా? ''ప్రస్తుతం మన దేశంలో 900 పిపిపి ప్రాజెక్టులున్నాయి. సమాచార హక్కు (ఆర్‌టిఐ) ఉపయోగించి వీటిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే ఆ చట్టం కింద వీటికి మినహాయింపు యిచ్చారు. అందుకే లోక్‌పాల్ కింద వీటికి తేవాలని పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టబోతే దాన్ని తిరస్కరించారు.'' అంటారు సిపిఎం రాజ్యసభ ఎంపీ కె ఎన్ బాలగోపాల్. మరి సమాచారం తెలియడం ఎలా?
కొన్ని పిపిపిలపై కాగ్ (కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) నిర్వహించిన ఆడిట్ రిపోర్టు బట్టి మనం తక్కిన వాటి సంగతి వూహించవచ్చు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు విషయంలో జరిగిన పిపిపి ఒప్పందం ఏ విధంగా అమలైందో కాగ్ పరిశీలించింది. అది జులై నెలలో విడుదలైంది. 2000 సం||రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం కేంద్రంలో వుండగా దేశంలోని ప్రధానమైన నాలుగు ఎయిర్‌పోర్టుల ఆధునీకరణ చేపట్టాలన్న సలహా వచ్చింది. దానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదు కాబట్టి ఆ యా ఎయిర్‌పోర్టులను దీర్ఘకాలపు లీజుపై ప్రయివేటు కంపెనీలకు అప్పగించి వాళ్లనే ఆ పని చేపట్టమనాలని అనుకుంది. అయితే ఆ లీజులను కాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫయిర్స్ (సిసిఇఏ) పరీక్షించాలని షరతు విధించింది. ఆ విధానం కిందే 2006లో ముంబయి ఎయిర్‌పోర్టు ఆధునీకరణకు ఎయిర్‌పోర్ట్‌స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ముంబయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లి. (ఎమ్‌ఐఎఎల్)కు మధ్య ఆపరేషన్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఎగ్రిమెంట్ (ఒఎమ్‌డిఏ) జరిగింది. లీజు ఒప్పందం కూడా జరిగింది. రెండింటిలో లీజ్ కిచ్చిన భూమి విస్తీర్ణం రాయలేదు. ఫ్లాట్ కొంటేనే గోడల సరిహద్దులు రాస్తారు కదా, యింత ముఖ్యమైన దానిలో యీ వివరం వుండకపోవడమేమిటి? సరే ఎంత యిచ్చారో యిప్పటికైనా మాకు చెప్పండి అని అడిగితే ఏఏఐ వాళ్లు మా దగ్గర సమాచారం లేదన్నారు. అది 1875 ఎకరాలు అని కొందరంటారు. సర్వే చేయిస్తే 2006 ఎకరాలుగా తేలింది. ముంబయిలోనే కాదు, ఢిల్లీలో కూడా యిదే తంతు. అక్కడ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు విషయంలో జరిగిన పిపిపి గురించి 2012-13 ఆడిట్ రిపోర్టు యిలాటివే కనిపెట్టింది. అదీ ఆ తర్వాత పబ్లిక్ ఎక్కవుంట్స్ కమిటీ (పిఎసి) చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఈ పిపిపి ఒప్పందాల వలన ప్రభుత్వం లాభపడిందో, దాని ప్రయోజనాలు కాపాడబడ్డాయా లేదా అని చూడమన్నారు. అప్పుడు యిలాటివి బయటపడ్డాయి.
ముంబయి, ఢిల్లీ ఒప్పందాలు రెండింటిలో ప్రాజెక్టు వ్యయం ముందు అనుకున్నదాని కంటె విపరీతంగా పెరిగిపోయింది. అది రాబట్టుకోవడానికి నిర్వాహకులు ప్రయాణీకులపై యూజర్ ఫీజు విధించారు. అలా విధించవచ్చని ఒప్పందంలో లేదు. ఆ మేరకు చట్టమూ లేదు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఆపరేటర్లు యూజర్ ఫీజు ద్వారా రూ. 1481 కోట్లు గడించారు. ఇదేం అన్యాయమని బాలగోపాల్ ప్రధానికి రాస్తే వాళ్లు సరే అయితే డెవలప్‌మెంట్ ఫీజు పేరుతో వసూలు చేసుకో అన్నారు. ఎయిర్‌పోర్టులు తమకు ఎలాట్ చేసిన స్థలాన్ని వాణిజ్యపరంగా వాడుకుని సొమ్ము చేసుకుంటున్నాయి. తమకు మొదట యిచ్చిన స్థలమే కాకుండా యింకా కావాలని అడుగుతున్నాయి. ప్రభుత్వం యిచ్చేస్తోంది కూడా. ముంబయి ఎయిర్‌పోర్టు విషయంలో నిర్వాహకుల నుండి అతి తక్కువ మొత్తం తీసుకుని ఏఏఐ 48 ఎకరాలు కట్టబెట్టింది. అంతేకాదు, 30 ఏళ్ల కన్సెషన్ పీరియడ్‌ను ఎవర్నీ అడగనక్కరలేకుండా మరో 30 ఏళ్లపాటు పెంచుకునే అధికారం ఎంఏఐఎల్‌కు ఏఏఐ ధారాదత్తం చేసింది. ఇరుపక్షాల సమ్మతితో యిది జరగాల్సి వుందని కాగ్ తప్పుపట్టింది.
ఈ క్లాజ్ కారణంగా ముంబయి ఎయిర్‌పోర్టుపై 60 ఏళ్లపాటు ఎంఏఐఎల్ దే రాజ్యం. నిజానికి వాళ్లు అనుకున్న టైముకి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. ఈ ఆలస్యం వలన పడిన భారం ఎంత అని 2011 అక్టోబరులో చూస్తే రూ. 3485 కోట్లుగా తేలింది. అంతే, ఆ భారాన్ని డెవలప్‌మెంట్ ఫీజు పేరుతో ప్రయాణీకులపై మోపారు. ఒప్పందం ప్రకారం వాళ్లు యిలా చేయడానికి వీల్లేదు. అప్పు తెచ్చో, పెట్టుబడి సంపాదించో ఆ నిధులు సమకూర్చుకుని వుండాలి. ప్రభుత్వంలో వున్నవాళ్లు తమ స్వార్థప్రయోజనాల కోసం కార్పోరేట్లతో చేతులు కలిపి, ప్రజలు తమకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జాతీయ సంపదను దోచుకుంటున్నారు. దానికి పిపిపిలు అనువుగా వున్నాయని యిలాటి ఉదాహరణలు చూపుతున్నాయి. వీటన్నిటిని ఆర్‌టిఐ కింద తెచ్చినపుడు చాలా విషయాలు బయటపడతాయి. ఇప్పటిదాకా నడిచిన ఎన్‌డిఏ, యుపిఏ ప్రభుత్వాలు దాపరికంతోనే వ్యవహరించాయి. ప్రయివేటీకరణ దిశగా అతివేగంగా అడుగులు వేస్తున్న మోదీ ఒప్పందాలలో పారదర్శకత పాటించి, వాటిని బహిరంగ చర్చకు గురి చేసినపుడే ప్రజలకు నమ్మకం కుదురుతుంది. లేకపోతే గతంలో జరిగిన అనర్థాలకు పది రెట్లు భవిష్యత్తులో జరుగుతాయనే సందేహం కలుగుతుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2014)