‘తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా’..అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఊత పదం. ఈ మాట లక్షలసార్లు చెప్పారు. కాని…రాను రాను బంగారు తెలంగాణ సంగతేమోగాని రాష్ర్టం ‘కంగారు తెలంగాణ’గా మారుతోంది. అంతా గందరగోళం. ప్రజల్లో అభద్రతా భావం. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన. ముఖ్యమంత్రి ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో, ‘ప్రపంచం అబ్బురపడేలా చేస్తాను’ అంటూ ఏం తలనొప్పి పనులు చేస్తారోనని జనం భయపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఊరు వదిలి వలసపోతే ప్రభుత్వ పథకాలను, వాటి ప్రయోజనాన్ని కోల్పోవల్సి వస్తుందని గ్రామీణ తెలంగాణ ప్రజలు కంగారుపడుతున్నారు. కేసీఆర్ మాటలు ఘనంగా ఉన్నా చేతలు అంతంతమాత్రంగా ఉండటంతో కంగారుతోపాటు అసంతృప్తి కూడా ప్రారంభమైంది. ‘ఏదో అనుకుంటే ఏదో అయ్యిందే’ అని పాడుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి వర్గాన్నీ ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి ఇంకా ఆరు నెలలు కూడా పూర్తికాకముందే ‘ఇదా మనం కోరుకున్న తెలంగాణ?’ అనే అంతర్మథనం సామాన్యుల నుంచి మేధావుల వరకు మొదలైంది. వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం కష్టమైపోతుండటంతో ప్రత్యర్థులపై మాటల దాడులు చేయడంతోపాటు తెలంగాణ సెంటిమెంటు తగ్గకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ఇంకా ఉద్యమ నాయకుడిగానే మాట్లాడుతున్నారు. అప్పటి ఆరోపణలే చేస్తూ కాలం గడుపుతున్నారు.
మరో విదర్భగా తెలంగాణ?
మహారాష్ర్టలోని విదర్భ రైతు ఆత్మహత్యల ప్రాంతంగా పేరుబడిపోయింది. విదర్భ అనగానే ఆత్మహత్యలు తప్ప మరేం గుర్తుకురావు. ఇక్కడా వేర్పాటువాదం ఎప్పటినుంచో ఉంది. దాన్ని కూడా నాయకులు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు నలుగురైదుగురు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుండంతో ఇది మరో విదర్భగా మారే పరిస్థితి కనబడుతోంది. రాష్ర్ట విభజన జరిగి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు నెలల కాలంలోనే దాదాపు ఐదొందలమంది వరకు రైతులు ప్రాణాలు తీసుకున్నారని రైతు సంఘాల అంచనా. వీరిలో ఎక్కువమంది పత్తి రైతులు ఉన్నారని తెలుస్తోంది. ఈ ఆత్మహత్యలు ఇంకెంత కాలం కొనసాగుతాయోనని మేధావులు, విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం విద్యుత్తు కోతలు. ఇతర కారణాలకొస్తే అప్పుల భారం, నీటి కొరత, పురుగుమందుల బెడద, నాసిరకం విత్తనాలు మొదలైనవి ఉన్నాయి. ప్రధానంగా తీవ్ర విద్యుత్ కోతల కారణంగా రైతాంగం అతలాకుతలమవుతోంది. ఆందోళన చెందుతోంది. ఆవేదనగా ఉంది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యుత్ సమస్యకు చంద్రబాబు నాయుడే ప్రధాన కారకుడని, ఆయన వల్లనే తెలంగాణకు ఈ దుర్గతి పట్టిందని కేసీఆర్ నిప్పులు చెరుగుతుండగా, నీకు ముందు చూపు లేకపోవడం వల్లనే కరెంటు సమస్య వచ్చింది. నా మాదిరిగా నీకు విజన్ లేదు అంటూ బాబు అటాక్ చేస్తున్నారు. పాలకులు చేస్తున్న వాదోపవాదాల్లో నిజానిజాలేమిటో తెలియని అమాయక రైతులు నిస్సహాయంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. రైతులకు రుణ మాఫీ ఎంతటి ప్రహసనంగా మారిందో చూశాం. ఈ రుణ మాఫీకి పెట్టే డబ్బుతో కరెంటు కొన్నట్లయితే ఇన్ని ఆత్మహత్యలు జరిగేవి కావని సామాజికవేత్తలు చెబుతున్నారు. చివరకు టీఆర్‌ఎస్‌టీడీపీ నాయకులు ఒకరి కార్యాలయాలపై మరొకరు దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మూడేళ్లపాటు కరెంటు కోతలు భరించాల్సిందేనంటూ అదే పనిగా చెబుతున్న కేసీఆర్ నెపాన్ని ప్రత్యర్థుల మీదకు నెట్టడం కంటే సమస్య పరిష్కారానికి కృషి చేయడం మంచిది. గత ప్రభుత్వాల విధానాలు సమస్యకు కొంతవరకు కారణమైవుండొచ్చు. కాదనం. కాని పదేపదే అదే ప్రచారం చేసినందువల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.
తగ్గిన ఖరీఫ్ సాగు…బతుకు ఎలా సాగు?
తెలంగాణలో ఖరీఫ్ సాగు దారుణంగా తగ్గిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కరెంటు కోతలకు తోడు వానలు సరిగా కురవకపోవడంతో పంటలు ఎండిపోయాయి. వ్యవసాయ శాఖ అంచనాలు తప్పిపోయాయి. వానలు సరిగా లేకపోడంతో ఖరీఫ్ సీజనే ఆలస్యంగా ప్రారంభమైంది. దానికితోడు ఎప్పటిమాదిరిగానే విత్తనాల, ఎరువుల కొరత ఏర్పడింది. రాష్ర్టంలోని 464 మండలాల్లో 324 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. 0 శాతం మండలాలు దుర్భిక్ష పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. కేసీఆర్ పాలన మొదలైన ఆరో రోజు నుంచే రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేయడం ప్రారంభించారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రికీ ఇలాంటి పరిస్థితి ఎదురైవుండదు. ఇప్పటికీ సబ్‌స్టేషన్లను ముట్టడిస్తున్నారు. అధికారులను నిర్భంధిస్తున్నారు. పంటలు కాల్చేసుకుంటున్నారు. విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలకూ రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించిన సర్కారు తరువాత దీన్ని ఒక్క రోజుకు తగ్గించింది. రాష్ర్టంలో ఇప్పటికే చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. ఇక చిన్నతరహా పరిశ్రమల సంగతి చెప్పనక్కర్లేదు. తెలంగాణలో పరిశ్రమలు స్థాపించేవారి కోసం లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, రెండు మూడు రోజుల్లోనే సమస్త అనుమతులూ ఇచేస్తామని, పారిశ్రామికవేత్తల దరఖాస్తులను తానే స్వయంగా పరిశీలిస్తానని కేసీఆర్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యున్నత పారిశ్రామిక విధానం అమలుచేస్తామని అన్నారు. కాని ఇప్పటివరకూ ఏ పరిశ్రమలూ వచ్చిన దాఖలాలు లేవు. కారణం…విద్యుత్ సమస్య. వచ్చిన హీరో కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ ఎగరేసుకుపోయింది. ఉన్నవి మూతుబడుతుంటే కొత్తవి ఎలా వస్తాయని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఉదాహరిస్తే ఎన్నో గాథలు…
రాష్ర్టంలో కరెంటు సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి కాస్త వివరంగా చెప్పుకున్నాం. ఇతర సమస్యలు వివరిస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది’ అనే పరిస్థితి ఉంది. కేసీఆర్ నిర్ణయాలు ఎంత వేగంగా ప్రకటిస్తున్నారో సమస్యలూ అంతే వేగంగా వస్తున్నాయి. ఫీజు యింబర్స్‌మెంట్, దళితులకు మూడెకరాల భూమి, రుణ మాఫీ, కేజీ టూ పీజీ ఉచిత విద్య, పింఛన్లు, రేషన్ కార్డులు, ఆహార భద్రతా కార్డులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, దీన్ని నిరసిస్తూ రగులుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం, పేదలకు రెండు బెడ్‌రూముల ఇళ్ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు, తగ్గుతున్న తెలంగాణ ఆదాయం….ఇలా సవాలక్ష సమస్యలు కేసీఆర్ ముందున్నాయి. ఆరు నూరైనా సరే తాను చేసిన 42 మంత్రివర్గ నిర్ణయాలను అమలు చేసితీరుతానంటున్న కేసీఆర్‌కు అవి అమలు చేయాలంటేనే తల ప్రాణం తోకకు వస్తోంది. కాని అవి పూర్తికాకముందే కొత్త నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. ఇన్ని నిర్ణయాలను ఎలా అమలు చేయాలో అర్థం కాకనే ఆయన బడ్జెటును సుదీర్ఘ కాలం వాయిదా వేసినట్లు విమర్శలొచ్చాయి. ఆయన నిర్ణయాలు తెలంగాణ అభివృద్ధికి దోహదపడతాయేమోగాని వాటి అమలు ఆషామాషీ వ్యవహారం కాదు.
ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యం
రకరకాల పథకాలు ప్రవేశపెడుతూ, సెంటిమెంటు పరిధి నుంచి ప్రజలు వైదొలగకుండా జాగ్రత్తపడుతూ, పొరుగు రాష్ర్టంపై దుమ్మెత్తిపోస్తూ…ఇలా జనాన్ని ఆకట్టుకునేలా వ్యవహరించడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడటంతోనే బతుకులు బ్రహ్మాడంగా మారిపోతాయని, అంతా సుభిక్షంగా ఉంటుందని నమ్మబలికిన కేసీఆర్ ‘బంగారు తెలంగాణ’ వంటి ఆకర్షణీయ నినాదాలతో ప్రజలను ఆకర్షించారు. కాని..అధికారం చేపట్టాక తత్వం బోధపడింది. ఏదైనా ఒక పథకం ప్రకటించగానే, ఆ వెంటనే లబ్ధిదారులను తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో వెంటనే మార్గదర్శకాలు విడుదల కాకపోవడం, విడుదలైనా అనేక మార్పులు చేర్పులు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇలాంటి చర్యలు ప్రజల్లో అసంతృప్తికి దారి తీస్తున్నాయి.
దరఖాస్తులేక సమయం పోతోంది
కేసీఆర్ రోజుకో పథకం ప్రకటిస్తుండటంతో వాటి ద్వారా లబ్ధి పొందే పేదలు తమ సమయమంతా దరఖాస్తులు చేసుకోవడానికే పోతోందని వాపోతున్నారు. ప్రపంచంలో ఎవరూ, ఎక్కడా, ఎప్పుడూ నిర్వహించని రీతిలో ఒక్క రోజులో తెలంగాణ సమగ్ర సర్వే నిర్వహించిన సర్కారు దాని తరువాత కూడా ప్రతి పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని చెబుతూనే ఉంది. సమగ్ర సర్వేతో అన్ని సమస్యలూ సులభంగా పరిష్కారమవుతాయని, లబ్ధిదారుల వివరాలు పక్కాగా సర్కారు దగ్గర ఉంటాయని, కంప్యూటర్ మీట నొక్కగానే మారుమూల గ్రామంలోని ఎల్లయ్య చరిత్ర మొత్తం తెలుస్తుందని చెప్పిన కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఊరొదిలిపోతే సంక్షేమ పథకాలు చేజారిపోతాయన్న భావనలో పేదలున్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం అందుకోవాలని ఆత్రంగా ఉన్నారు. కాని వారి ఆశల మీద నీళ్లు చల్లుతూ ప్రభుత్వం రకరకాల నిబంధనలు పెడుతోంది. దీంతో ప్రతి పథకం కొంతమందికే పరిమితమైపోతోంది. అంటే సంక్షేమం పేదలందరికీ కాదని అర్థమవుతోంది. ఓ పక్క తెలంగాణ ఆదాయం తగ్గుతోందని ఆవేదన చెందుతున్న కేసీఆర్‌కు పథకాల అమలుకు నిధులు సమకూర్చలేనేమోననే భయం పట్టుకుంది. అందుకే పథకాలు ప్రకటించి నిబంధనల సంకెళ్లు వేస్తున్నారు. కేసీఆర్ చర్యలు ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తుండటంతో దాన్ని ఆసరా చేసుకొని ఉద్యమించేందుకు ప్రతిపక్షాలు రంగం సిద్ధం చేస్తున్నాయి.
ఎం.నాగేందర్