సీమాంధ్ర ఫిలిం ఛాంబర్‌ వెనుక ఎవరున్నారు.?

తెలుగు సినీ పరిశ్రమలో విభజన సెగలు తారాస్థాయికి చేరుకున్నాయి. సినీ పరిశ్రమను రెండుగా విభజించాలన్న వాదన గత కొన్నాళ్ళుగా విన్పిస్తోంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల్ని కాపాడేందుకు, సినీ పరిశ్రమ పరంగా అవకాశం వుండాలనీ, అందుకే…

తెలుగు సినీ పరిశ్రమలో విభజన సెగలు తారాస్థాయికి చేరుకున్నాయి. సినీ పరిశ్రమను రెండుగా విభజించాలన్న వాదన గత కొన్నాళ్ళుగా విన్పిస్తోంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల్ని కాపాడేందుకు, సినీ పరిశ్రమ పరంగా అవకాశం వుండాలనీ, అందుకే తెలంగాణ సినిమా ఉనికి అత్యవసరమనీ కొందరు తెలంగాణ ప్రాంత వ్యక్తులు హల్‌చల్‌ చేస్తున్న విషయం విదితమే. అయితే ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినా సినీ పరిశ్రమ ఒక్కటిగానే వుండాలన్న వాదన మెజార్టీ సినీ ప్రముఖుల నుంచ వ్యక్తమవుతోంది.

ఇదిలా వుండగానే ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర ఫిలిం ఛాంబర్‌ ఏర్పాటయ్యింది. గుంటూరు జిల్లాలో కొందరు ఛాంబర్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించేసుకున్నారు. విజయవాడ ` గుంటూరు మధ్య సినీ కార్యకలాపాలు, సినిమా సిటీ నిర్మాణం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీమాంధ్ర ఫిలిం ఛాంబర్‌ ప్రతినిథులు ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేసేయడం గమనార్హం.

ఇంతకీ సీమాంధ్ర ఫిలిం ఛాంబర్‌ వెనుక ఎవరున్నారు.? అంటే మాత్రం దానికి సమాధానం లభించడంలేదు. ప్రస్తుతానికి మీడియా ముందుకొచ్చినవారెవరూ సినీ పరిశ్రమలో ప్రముఖులు కారు. పైగా వారి గురించి ఎవరికీ తెలియని పరిస్థితి. దాంతో ఇదేదో అమాంబాపతు యవ్వారం.. అని సినీ జనం అనుకుంటోంటే, దీన్ని సాకుగా చేసుకుని తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ పేరుతో సినీ పరిశ్రమలో విభజన కోసం డిమాండ్లు మరింత ఉధృతం చేసేందుకు తెరవెనుక కార్యాచరణ షురూ అయ్యిందట. అదే గనుక నిజమైతే, సినీ పరిశ్రమలో గందరగోళం తప్పదు.