చిన్న రాష్ట్రాలతోనే ప్రగతి సాధ్యం అని వాదించేవారు పంజాబ్, హరియాణాల పోలిక చూపిస్తూ వుంటారు. ఆ రాష్ట్రాలకున్న సహజవనరులు, రాజధానికి సామీప్యత విషయంలో సౌలభ్యం, అక్కడి ప్రజల గుణగణాలు అన్ని రాష్ట్రాలలో వుండవని వాళ్లకు తోచదు. పంజాబ్‌లో యిప్పుడున్న పారిశ్రామిక పరిస్థితి కూడా వాళ్ల దృష్టికి వచ్చినట్టు లేదు. పంజాబ్‌లో వున్న శిరోమణి అకాలీదళ్-బిజెపి ప్రభుత్వహయాంలో 2007 నుండి అనేక పరిశ్రమలు మూతపడ్డాయని రాష్ట్ర కాంగ్రెసు ఆరోపించింది. అవి వట్టి ఆరోపణలే అని ప్రభుత్వం కొట్టిపారేసింది. అప్పుడు కాంగ్రెసు పార్టీ సమాచారహక్కు చట్టం కింద ప్రభుత్వం నుండే యీ గణాంకాలు కోరింది. రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య శాఖ జనవరి 31 న యిచ్చిన సమాచారం ప్రకారం గత ఏడేళ్లలో 18,770 ఫ్యాక్టరీలు మూసేశారని తెలిపింది. ఫిబ్రవరి 3న కాంగ్రెసు ప్రతినిథి ప్రెస్‌మీట్ పెట్టి యీ సమాచారంతో ప్రభుత్వాన్ని ఏకేశాడు. వెంటనే పంజాబ్ పరిశ్రమల శాఖ మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు అయిన మదన్ మోహన్ మిత్తల్ 'అబ్బే యిది, 2007 నుండి ఏడేళ్లలో మూతపడినవాటి సంఖ్య కాదు, 2007కు ముందున్న ఏడేళ్లలో మూతపడిన వాటి సంఖ్య' అని వాదించాడు. ఆ ఏడేళ్లలో ఐదేళ్లపాటు కాంగ్రెసు ప్రభుత్వం వుంది మరి! పరిశ్రమల శాఖలో సెక్రటరీగా పనిచేస్తున్న వికాస్ ప్రతాప్ సింగ్ 'దీనిలో యిచ్చిన సమాచారం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ వారి 2007-08 రిపోర్టులో నుండి తీసుకున్నది' అని తేల్చేశాడు.
ఎవరి హయాంలో ఎన్ని మూతపడ్డాయన్నది రాజకీయనాయకులు చర్చించుకునే విషయం. కనబడే వాస్తవం ఏమిటంటే గత పది, పన్నెండేళ్లగా పంజాబ్‌లో పరిశ్రమలు దెబ్బతింటున్నాయి, మూతపడుతున్నాయి. అమృత్‌సర్, జలంధర్, లుధియానా, మండీ గోబిందగఢ్, బటాలా, కపూర్‌తలాలో అనేక పారిశ్రామిక వాడలు బావురుమంటున్నాయి. ఒక్క అమృత్‌సర్‌లోనే 8 వేలకు పై చిలుకు యూనిట్లు మూతపడ్డాయి. 1930ల నుండి ఐరన్ అండ్ స్టీలు హబ్‌గా పేర్గాంచిన మండీ గోబిందగఢ్‌లో 450 స్టీలు ఫ్యాక్టరీలు వుండేవి. ఇప్పుడు వాటిలో 280 యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. వజీర్‌పూర్‌లో 25 కోట్ల రూ.లతో పెట్టిన రోలింగ్ మిల్లు ఐదేళ్లలోనే నష్టాల్లో కూరుకుపోయింది. పెద్దగా వాడకపోయినా యంత్రాలను అమ్ముదామంటే కొనేవాడు లేడు. విప్పేసి విడివిడి భాగాలుగా స్క్రాప్ కింద అమ్మేస్తున్నారు. అనేక ఫ్యాక్టరీల స్థితి యిలాగే వుంది. మూసేసిన మిల్లుల నుండి ఏ కాడికి వస్తే ఆ కాడికి సంపాదిద్దామనే వుద్దేశంతో ఫ్యాక్టరీ నేల తవ్వి ఆ మట్టి అమ్ముకుంటున్నారు యజమానులు. ఇన్నేళ్లగా ఐరన్ ఫ్యాక్టరీ నడపడంతో అనేక యినుపముక్కలు ఫ్యాక్టరీ నేలలోకి దూరిపోయాయి. మట్టి దేవితే వచ్చే యినుము అమ్ముకోవచ్చని ఆ మట్టి కొనుక్కుంటున్నారు కొందరు చిన్న వ్యాపారులు. ఒకప్పుడు ఆక్సిజన్ బాటిలింగ్ యూనిట్ వున్నచోట యిప్పుడు రెండు డజన్ల గేదెలతో డైరీ ఫారం నడుస్తోంది. ఒకప్పుడు జెకె మిల్లు నడిచినచోట యిప్పుడు రెసిడెన్షియల్, కమ్మర్షియల్ కాంప్లెక్సులు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుండి వచ్చి స్థిరపడిన దాదాపు లక్షమంది పనివాళ్లలో మూడోవంతు మంది మాత్రమే యిక్కడున్నారు. తక్కినవాళ్లు పొట్ట నింపుకోవడానికి స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు.
ఇలాటి పరిస్థితి రావడానికి కారణం – 1995లో పంజాబ్ తయారీదారుల విషయంలో కేంద్రం తీసుకున్న ఒక నిర్ణయం. ముడిసరుకు వేరే చోట నుండి తెచ్చుకుంటే రవాణాపై అయిన ఖర్చు పరిహారంగా యిచ్చే (ఫ్రయిట్ యీక్వలైజేషన్) స్కీము కేంద్రం ఉపసంహరించింది. గతంలో భిలాయి నుండి యినుము తెచ్చుకుంటే భిలాయిలో అమ్మే ధరకే పంజాబ్ తయారీదారులకు అమ్మేవారు. స్కీము తీసేయడంతో భిలాయ్ రేటు కంటె మెట్రిక్ టన్నుకి రూ.2800 ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తోంది. ఇక దానితో పంజాబ్‌లో తయారయ్యే సరుకుల ఖరీదు పెరిగింది. 2003లో ఎన్‌డిఏ ప్రభుత్వం పంజాబ్‌కు పొరుగున వున్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లలో పదేళ్లపాటు టాక్స్ హాలీడే యివ్వడంతో అక్కడి తయారీదారులు తమ సరుకులను వీళ్లకంటె చవకగా యిస్తున్నారు. ఇక వీళ్లవి అమ్ముడుపోవడం మానేశాయి. పదేళ్లు గడిచాక పరిస్థితి మెరుగుపడుతుందేమోననుకుంటే టాక్స్ హాలీడేను యింకో ఐదేళ్లపాటు పెంచి పంజాబ్ పరిశ్రమ పొట్టకొట్టారు. దీని నుండి మనం గ్రహించవలసిన విషయం ఒకటి వుంది. రేపు సీమాంధ్రకు టాక్స్ హాలీడే, ప్రత్యేక ప్రతిపత్తి యిస్తే తెలంగాణలోని పరిశ్రమలు యిదే రీతిలో దెబ్బ తింటాయి. ప్రత్యేక ప్రతిపత్తి యీ రోజు ఐదేళ్లు మాత్రమే అంటున్నారు. ఆనాటి రాజకీయ అవసరాలకోసం, ఎన్నికలకు ముందు యింకో ఐదేళ్లు పెంచితే..?
విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ కొరత వుంటుందని అందరికీ తెలుసు. కొత్త ప్రాజెక్టులు కడతామని ఎన్నికలలో వాగ్దానాలు చేయవచ్చు. అవి కార్యరూపం ధరించేటప్పటికి ఎన్ని థాబ్దాలు పడతాయో తెలియదు. ఈలోగా బయటి రాష్ట్రాల నుండి కొంటామంటారు. కానీ దాని వలన యూనిట్ ధర పెరిగి అది పరిశ్రమలను దెబ్బతీస్తుంది. హరియాణాలో ఫర్నేస్‌లకు యూనిట్ రూ.5.30 చొ||న వసూలు చేస్తూండగా పంజాబ్‌లో రూ.6.33 తీసుకుంటున్నారు. రేపు పైగా వ్యాట్ కూడా ఎక్కువ. ఈ పరిస్థితి రేపు తెలంగాణకు రాకుండా ఎలా చూస్తారో తెలియదు. ఈ పరిస్థితుల గురించి పంజాబ్ ప్రభుత్వాధికారులను అడిగితే ''ఈ పారిశ్రామికవేత్తలు పన్నులు ఎక్కువ అని సణగడం కాదు. తమ ఉత్పాదనలకు సరికొత్త టెక్నాలజీతో మెరుగులు దిద్దుకోవాలి. వేల్యూ యాడ్ చేయాలి. పాతపద్ధతులను పట్టుకుని వేళ్లాడితే ఎలా?'' అన్నారు. ''అయితే ప్రభుత్వం వాళ్లకు కొత్త టెక్నాలజీలో తర్ఫీదు యిప్పిస్తోందా?'' అని అడిగితే తెల్లమొహం వేసి ''అలాటి ప్రతిపాదన ఏదీ మా దగ్గర లేదు'' అని తప్పించుకున్నారు. గణాంకాలు బయటపెట్టి పంజాబ్ కాంగ్రెసు పార్టీ చేసిన హంగామాతో ప్రభుత్వం మేలుకొంది. ఉక్కు ఉత్పాదనలపై వ్యాట్‌ను 50% తగ్గించింది. డిసెంబరు 2013లో పంజాబ్ ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పరచి రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి చాలా ప్రోత్సాహకాలు ప్రకటించింది. ''అవన్నీ కొత్తగా పెట్టేవారికి, ఎప్పణ్నుంచో పెట్టుబడులు పెట్టి, అవి మునిగిపోతున్నవారిని ఆదుకునే చర్యలేవీ?'' అని అడుగుతున్నారు పాపం ఫ్యాక్టరీ యజమానులు. రాష్ట్రం చిన్నదైనంత మాత్రాన సమస్యలేవీ వుండని, అంతా సస్యశ్యామలంగా వుంటుందని అనుకోవడం పొరబాటని పంజాబ్ అనుభవం నుండి గ్రహించాలి.
-ఎమ్బీయస్ ప్రసాద్