డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి ఇంటర్వ్యూ

బన్నీ సినిమాల్లో ‘రేసుగుర్రం’ బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది: డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి Advertisement స్టయిలిష్‌ డైరెక్టర్‌ అని సురేందర్‌ రెడ్డికి పేరు. అల్లు అర్జున్‌ని స్టయిలిష్‌ స్టార్‌ అని అంటారు. ఈ ఇద్దరి స్టయిల్స్‌…

బన్నీ సినిమాల్లో ‘రేసుగుర్రం’ బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది: డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి

స్టయిలిష్‌ డైరెక్టర్‌ అని సురేందర్‌ రెడ్డికి పేరు. అల్లు అర్జున్‌ని స్టయిలిష్‌ స్టార్‌ అని అంటారు. ఈ ఇద్దరి స్టయిల్స్‌ కలిస్తే ఎలా ఉంటుందో రేసుగుర్రంలో చూడబోతున్నాం. బన్నీ ఎనర్జీని నూరు శాతం వాడుకుని రేసుగుర్రం తీసానని సురేందర్‌రెడ్డి అంటున్నాడు. తను తీసిన సినిమాల్లో ఇది కొత్తగా ఉంటుందని, ఫ్యామిలీ ఎమోషన్స్‌ హైలైట్‌గా అన్ని వర్గాలని ఆకట్టుకునే కూల్‌ సమ్మర్‌ ఎంటర్‌టైనర్‌ అవుతుందని సురేందర్‌రెడ్డి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. బన్నీ సినిమాల్లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం అతని మాటల్లో కనిపించింది. అతనొక్కడే సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని తనవైపుకి తిప్పుకుని… ఇప్పటికీ తన పేరుతో అసోసియేట్‌ అయి ఉన్న ఆ కిక్‌ మెయింటైన్‌ చేస్తూ.. అగ్రశ్రేణి దర్శకుడిగా కొనసాగుతున్న సురేందర్‌ రెడ్డితో.. రేసుగుర్రం రిలీజ్‌ నేపథ్యంలో గ్రేట్‌ఆంధ్ర చేసిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ…

‘రేసుగుర్రం’ ఎలాంటి సినిమా?   

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. బన్నీ ఎనర్జీకి తగ్గట్టుగా ఫన్‌ జోనర్‌లో ఉండే సినిమా.

అల్లు అర్జున్‌తో ఇంతవరకు చాలా మంది పెద్ద డైరెక్టర్స్‌ వర్క్‌ చేసారు. ఒక్కొక్కరు తమ స్టయిల్లో అతడిని ప్రెజెంట్‌ చేశారు. మరి మీరు అతడిలో చూపించబోతున్న కొత్త యాంగిల్‌ ఏంటి?

అల్లు అర్జున్‌ని ఇంతవరకు ఎవరూ చూపించని విధంగా, కొత్తగా చూపించేసానని నేను అనను కానీ… తన ఎనర్జీని హండ్రెడ్‌ పర్సెంట్‌ వాడుకున్నాను. తను చాలా ఎనర్జిటిక్‌ స్టార్‌. దానిని ఫుల్‌గా వాడుకుంటే అవుట్‌పుట్‌ ఎలా ఉంటుందో రేసుగుర్రంలో చూస్తారు. బన్నీలో ఒక స్పెషాలిటీ ఉంది. ఏదైనా క్యారెక్టర్‌ చెప్పగానే దానిని ఎలా కొత్తగా చేయవచ్చు. ఏమేమి యాడ్‌ చేస్తే అది స్పెషల్‌గా ఉంటుంది… లాంటివి తనే ఆలోచించుకుని, హోమ్‌వర్క్‌ చేసి.. ‘ఇలా చేస్తే ఎలా ఉంటుంది?’, ‘ఇలా ట్రై చేద్దామా’ అని అడుగుతాడు. ఏదో చేయాలనే తపన తనలో ఉంది. తన ఇన్‌పుట్స్‌ కొన్ని నేను తీసుకున్నాను. 

రేసుగుర్రం రొటీన్‌ కమర్షియల్‌ ఫార్ములా సినిమానా లేక ఏదైనా కొత్తదనం ఉంటుందా?

కొత్తదనం ఉంటుందని చెప్పను. అలా అని రొటీన్‌ కమర్షియల్‌ ఫార్ములా అని కూడా అనను. ఫార్ములా సినిమానే కానీ ట్రీట్‌మెంట్‌ కొత్తగా ఉంటుంది. బేసిగ్గా ఫ్యామిలీ ఎమోషన్స్‌పై ఎక్కువ కాన్సన్‌ట్రేట్‌ చేసాను.

మీ ప్రీవియస్‌ ఫిలింస్‌కీ, దీనికీ..

(మధ్యలోనే అందుకుని) టోటల్‌గా డిఫరెంట్‌ ఫిలిం. నేనింతకుముందు ఈ జోనర్‌లో సినిమా చేయలేదు. అతనొక్కడే, అతిథి, అశోక్‌, ఊసరవెల్లి.. ఇవన్నీ యాక్షన్‌ ఫిలింస్‌. నేను ఇంతవరకు చేసిన వాటిలో డిఫరెంట్‌ మూవీ కిక్‌. అది కంప్లీట్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌ బేస్డ్‌గా ఉంటుంది. అలాగే రేసుగుర్రంలో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా బాగా ఉంటాయి. నేను తీసిన సినిమాలు మాత్రమే కన్సిడర్‌ చేస్తే ఇది కొత్తదనం ఉన్న సినిమానే.

ఫ్యామిలీ ఎమోషన్స్‌ అని పదే పదే అంటున్నారు.. మరి మాస్‌కి నచ్చుతుందంటారా?

ఇది ఆల్‌ క్లాస్‌ ఆడియన్స్‌కి నచ్చే సినిమా అండీ. బన్నీ ఎనర్జీ యూత్‌కి బాగా నచ్చుతుంది. మాస్‌కి నచ్చే యాక్షన్‌ పార్ట్‌ ఉంది. ఫ్యామిలీస్‌ని ఆకట్టుకునే ఎమోషన్స్‌ ఉన్నాయి. టోటల్‌గా రేసుగుర్రం ఒక కంప్లీట్‌ ఫిలిం. సమ్మర్‌లో ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడ్డానికి ఎలాంటి ఎంటర్‌టైనర్‌ అయితే బాగుంటుందని అనుకుంటారో అలాంటి సినిమా ఇది.

ట్రెయిలర్‌ చూస్తే బ్రదర్స్‌ మధ్య క్లాష్‌ దీనికి బేస్‌ అనిపిస్తుంది.. కావాలనే ప్లాట్‌ రివీల్‌ చేసారా?

లేదండీ… ఇందులో బ్రదర్స్‌ మధ్య క్లాష్‌ ఉంటుంది కానీ అదే రేసుగుర్రం ప్లాట్‌ కాదు. జస్ట్‌ ఒక పార్ట్‌ మాత్రమే. అన్నదమ్ముల మధ్య క్లాష్‌ సినిమా అంతా ఉంటుంది… అలా అని అది సీరియస్‌గా ఉండదు. టామ్‌ అండ్‌ జెర్రీ కైండ్‌ ఆఫ్‌ రిలేషన్‌ అనుకోండి.

ఊసరవెల్లి ఆశించిన రిజల్ట్‌ సాధించకపోయే సరికి సేఫ్‌ గేమ్‌ కోసం మళ్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీద డిపెండ్‌ అయ్యారా?

అలా అని ఏమీ లేదు. యాక్షన్‌ ఫిలింస్‌ ఎక్కువ చేసాను. మధ్యలో కిక్‌ ఒకటే ఎంటర్‌టైనర్‌. ఊసరవెల్లి తర్వాత మళ్లీ వెంటనే యాక్షన్‌ ఫిలిం ఎందుకని రేసుగుర్రం చేసాను. ఆ జోనర్‌ ఎప్పటికీ వదిలిపెట్టను. ఇంకా చాలా యాక్షన్‌ ఫిలింస్‌ చేస్తాను (నవ్వుతూ).

ఊసరవెల్లి విషయంలో ఎక్కడ మిస్టేక్‌ జరిగిందని అనుకుంటున్నారు?

ఎక్కడ మిస్టేక్‌ జరిగిందో, నేను తీద్దామనుకున్న దాంట్లో ఏది మిస్‌ అయ్యానో నాకు నిజంగా తెలీదు కానీ… నేను ఇంతవరకు తీసిన సినిమాల్లో నేను బాగా ఇష్టపడ్డ సినిమా, ఇప్పటికీ నాకు పర్సనల్‌గా చాలా దగ్గరైన సినిమా ఊసరవెల్లి. దాంట్లో ఒక స్ట్రాంగ్‌ కంటెంట్‌ ఉంటుంది. మేబీ అది అందరికీ రీచ్‌ అయి ఉండకపోవచ్చు. కమర్షియల్‌ రిజల్ట్‌తో సంబంధం లేకుండా చూస్తే నేను చేసిన వాటిలో ది బెస్ట్‌ సినిమా ఊసరవెల్లి అని చెప్తాను.

మీరు బెస్ట్‌ అనుకున్న సినిమాని ఆడియన్స్‌ బెస్ట్‌ అనుకోలేదు. మీరు ఎక్స్‌పెక్ట్‌ చేసిన రేంజ్‌కి ఆ సినిమా రీచ్‌ కాలేదు. అప్పుడు మీరెలా ఫీలయ్యారు?

నేను రిజల్ట్‌ విషయంలో పెద్దగా ఫీలవలేదు కానీ ఆ సినిమా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకున్నాను. అది ఎందుకు సక్సెస్‌ అవలేదనేది నాకిప్పటికీ తెలీదు. కానీ డెఫినెట్‌గా ఊసరవెల్లి మళ్లీ చేస్తాను. హిందీలోనో, ఎక్కడో తప్పకుండా రీమేక్‌ చేస్తాను. హిందీలో రీమేక్‌ చేద్దామని చాలా మంది నన్ను అడిగారు. టైమ్‌ వచ్చినప్పుడు మళ్లీ ఊసరవెల్లి చేస్తాను.

మీ కెరీర్‌ బిగినింగ్‌లోనే మీకు ఎన్టీఆర్‌, మహేష్‌లాంటి పెద్ద స్టార్స్‌ ఆపర్చునిటీస్‌ ఇచ్చారు. వాటిని మీరు సక్సెస్‌లుగా మలచుకోలేకపోయారు. అవి సక్సెస్‌ అయి ఉంటే దర్శకుడిగా ఈపాటికే మీ స్థాయి మరింత పెరిగి ఉండేది. మంచి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేదని ఎప్పుడైనా బాధ పడ్డారా?

దాని గురించి ఎప్పుడూ బాధ పడలేదండీ. నేనెప్పుడూ సక్సెస్‌, ఫెయిల్యూర్‌ గురించి ఆలోచించలేదు. నాతో వర్క్‌ చేసే హీరోలు కూడా నా స్టయిల్‌ ఇష్టపడి చేస్తున్నారే కానీ నా సినిమాల రిజల్ట్స్‌ ఏమిటనేది చూడట్లేదు. డెఫినెట్‌గా మళ్లీ నేను మహేష్‌తో చేస్తాను. ఎన్టీఆర్‌తోను మళ్లీ చేస్తాను. చరణ్‌తో చేస్తాను. కమర్షియల్‌ సినిమాలు చేస్తాను కానీ ఒకే రకం మూస సినిమాలు చేయడానికి ఇష్టపడను. నాకంటూ ఒక స్టయిల్‌ ఉంది. దానిని ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉన్నారు. సో ఆ సినిమాలు ఇంకా బాగా ఆడి ఉంటే అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు.

మళ్లీ ఎన్టీఆర్‌తో చేస్తే తనని ఎలా చూపించాలని అనుకుంటున్నారు?

డెఫినెట్‌గా తనని కొత్తగా చూపించడానికే ట్రై చేస్తాను. నేను తనతో చేసిన ప్రతిసారీ కొత్తగా చూపించాలనే చూసాను. ఏదో రోజు తనని కొత్తగా చూపించే సక్సెస్‌ అవుతాను (నవ్వుతూ). ఎందుకంటే తను కూడా కొత్తగా చేయాలనే కోరుకుంటున్నాడు. తనకి ప్రతి సినిమాలోను కొత్తగా కనిపించాలని ఉంటుంది. అందుకే ఎన్టీఆర్‌తో చేస్తే మాత్రం రొటీన్‌ సినిమా చేయను. కొత్తగానే ట్రై చేస్తాను. 

 ‘అతిథి’ చేసినప్పుడు మహేష్‌కి సీరియస్‌ ఇమేజ్‌ ఉంది. కానీ ఇప్పుడు తన ఇమేజ్‌ పూర్తిగా మారిపోయింది. ఈసారి మహేష్‌తో చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు?

 నేను మహేష్‌తో ఇప్పుడు చేయాల్సి వస్తే డెఫినెట్‌గా కిక్‌లాంటి సినిమానే చేస్తాను. అంత ఫన్‌ ఉన్న సినిమానే చేస్తాను. అతిథి చేసినప్పుడు మహేష్‌కి ఉన్న ఇమేజ్‌ వేరు. ఇప్పుడున్న మహేష్‌ వేరు. తన సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువ కోరుకుంటున్నారు. తనతో ఈసారి చేస్తే మాత్రం ఎంటర్‌టైనరే చేస్తా కానీ సీరియస్‌ ఎమోషన్స్‌తో అయితే డెఫినెట్‌గా చేయను.

అతనొక్కడే, ఊసరవెల్లి సినిమాల్లో హీరోయిన్‌ క్యారెక్టర్స్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మన కమర్షియల్‌ సినిమాల్లో, అదీ యాక్షన్‌ జోనర్‌లో చేసిన సినిమాల్లో హీరోయిన్స్‌ని అంత స్ట్రాంగ్‌గా చూపించడం చాలా రేర్‌. ఈ విషయంలో మీరు స్పెషల్‌ కేర్‌ తీసుకుంటారా లేక అలా సెట్‌ అయిందా?

ఊసరవెల్లి కథకి అమ్మాయే బేస్‌. అమ్మాయి క్యారెక్టర్‌ మీదే కథ మొత్తం రన్‌ అవుతుంది. అలాగే అతనొక్కడేలో కూడా హీరోయిన్‌, హీరో ప్యారలల్‌గా రివెంజ్‌ తీర్చుకోవడమనేది ప్లాట్‌. ఆ కథలకి హీరోయిన్‌ క్యారెక్టర్స్‌ బేస్‌ అవడం వల్ల అలా స్ట్రాంగ్‌ అనిపించాయి. అది కావాలని చేసింది కాదు కానీ హీరోయిన్‌ క్యారెక్టర్‌కి కూడా ఇంపార్టెన్స్‌ ఉండాలని మాత్రం అనుకుంటాను.

‘రేసుగుర్రం’లో శృతిహాసన్‌ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?

కథకి సెంటర్‌ పాయింట్‌ తను కాదు. కానీ సినిమాలో హైలైట్‌ మాత్రం ఆ అమ్మాయే. చాలా డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌. శృతిహాసన్‌ చాలా బాగా చేసింది. రేపు సినిమా చూసి బయటకి వచ్చాక ఆ అమ్మాయి క్యారెక్టర్‌ గురించి ఎక్కువ మాట్లాడతారు.

మీ సినిమాలు కొన్ని ఫెయిల్‌ అయి ఉండవచ్చు కానీ మీ చిత్రాల ఆడియోస్‌ మాత్రం చాలా సక్సెస్‌ అయ్యాయి. రేసుగుర్రం పాటలు కూడా బాగా క్లిక్‌ అయ్యాయి. మ్యూజిక్‌ పరంగా మీ సినిమాలు ఇంతగా క్లిక్‌ అవడానికి రీజన్‌ ఏమిటి?

చిన్నప్పట్నుంచీ నేను మ్యూజిక్‌ లవర్‌. మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం నాకు. అందుకే నా సినిమాల మ్యూజిక్‌ విషయంలో అసలు కాంప్రమైజ్‌ కాను. మ్యూజిక్‌ డైరెక్టర్‌తో ఫైట్‌ చేసి అయినా నాకు కావాల్సినట్టుగా చేయించుకుంటాను. రేసుగుర్రం ఆడియో గురించి చెప్పాలంటే ఇది నా సినిమాల్లో బ్లాక్‌బస్టర్‌ ఆడియో. బిఫోర్‌ రిలీజ్‌ నా సినిమాల్లో దేనికీ ఈ ఆడియోకి వచ్చినంత రెస్పాన్స్‌ రాలేదు.

సినిమా రిలీజ్‌ దగ్గరకి వచ్చిందంటే చాలా మంది టెన్షన్‌ పడుతుంటారు. కానీ మీరు చాలా రిలాక్స్‌డ్‌గా కనిపిస్తున్నారు…

(నవ్వుతూ)… నేను అన్ని సినిమాలకీ ఇలాగే ఉంటానండీ. నేను తీసిన సినిమాలన్నీ చూడండి. నేను ఇంతవరకు తీసినవాటిలో డిజాస్టర్‌ ఏదీ లేదు. నా సినిమాలు చూడలేక జనం తిట్టుకున్న సందర్భాలేమీ లేవు. కొన్ని కొన్ని సార్లు అనుకున్న టైమ్‌కి సినిమా రిలీజ్‌ చేయలేకపోవడం వల్ల కొన్నిటికి ఎక్స్‌పెక్ట్‌ చేసిన రిజల్ట్‌ రాలేదు. ప్రతి సినిమా కూడా కొత్తగా ఉండాలని ట్రై చేస్తాను. సీన్స్‌ కొత్తగా ఎలా ప్రెజెంట్‌ చేయవచ్చా అని ఆలోచిస్తాను. అందుకే ప్రతి సినిమా విషయంలో నేను కాన్ఫిడెంట్‌గానే ఉంటాను. ఇది ఆడదు అనే థాట్‌ అనేదే నాకు రాదు. తీసుకోవడమే బలమైన కంటెంట్‌ తీసుకుంటాను. స్క్రిప్ట్‌ విషయంలో, మ్యూజిక్‌ విషయంలో, మేకింగ్‌ విషయంలో అస్సలు కాంప్రమైజ్‌ కాను. కొన్నిసార్లు అనుకున్న రిజల్ట్‌ రాదు. దాని గురించి కూడా ఎక్కువ బాధ పడను. ఒక రోజు ‘అయ్యో మనం అనుకున్నట్టు రాలేదే’ అని ఫీలయినా నెక్స్‌ట్‌ డే మళ్లీ ‘నెక్స్‌ట్‌ ఏంటి’ అని పనిలో పడిపోతాను. అండ్‌ ప్రొడ్యూసర్స్‌ ప్లానింగ్‌ పక్కాగా చేస్తే రిలీజ్‌కి ముందు డైరెక్టర్‌ రిలాక్స్‌ అయిపోవచ్చు. బుజ్జిగారు రిలీజ్‌కి వన్‌ వీక్‌ ముందు సెన్సార్‌ పూర్తి చేసారు. నాలుగు రోజుల ముందే అన్ని చోట్లకి కంటెంట్‌ వెళ్లిపోయింది. అన్ని చోట్లా టైమ్‌కి ప్రీమియర్స్‌ వేసేసుకోవచ్చు. మామూలుగానే రిలాక్స్‌డ్‌గా ఉంటాను. ఇక ఇంత పక్కాగా ప్లాన్‌ చేసే ప్రొడ్యూసర్స్‌ ఉంటే ఇంకా రిలాక్స్‌ అయిపోవచ్చు.

అతనొక్కడే మీ సొంత కథతోనే తీసారు. ఆ తర్వాత మీరు కథలు రాయడం మానేసారెందుకని…

కరెక్ట్‌ క్వశ్చన్‌ అడిగారు… (నవ్వుతూ). వంశీతో (వక్కంతం వంశీ) నాకున్న ర్యాపో వల్ల మేమిద్దరం కలిసి ట్రావెల్‌ అయిపోతున్నాం. అశోక్‌ తర్వాత వంశీ పరిచయం అయ్యాడు. నాకేమి కావాలో తనకి తెలుసు. మా ఇద్దరి ఆలోచనలు మ్యాచ్‌ అవుతాయి. తనతో వర్క్‌ చేయడం స్టార్ట్‌ చేసాక నేను కథల గురించి ఆలోచించకుండా ఆ బాధ్యత పూర్తిగా తనకే ఇచ్చేసాను. నేను కోరుకున్న విధంగా కథ రెడీ చేసిస్తాడని వంశీపై నాకు నమ్మకముంది. నేనే కథ రాయాలి, స్క్రిప్ట్‌ మొత్తం నాదే అయి ఉండాలి అని నేనెప్పుడూ అనుకోలేదు. నా దగ్గర కూడా కొన్ని కథలున్నాయి. అయితే వాటిపై నేను వర్క్‌ చేయలేదు. నాకు నచ్చిన కంటెంట్‌ తను ఇస్తున్నప్పుడు ‘లేదు నా కథే నేను చేయాలి’ అనుకోలేను కదా. మేబీ రేపు తను డైరెక్టర్‌ అయి కథలు రాయడం మానేసినపుడు నా కథలతో నేను తీస్తాను.

కిక్‌ 2 చేస్తున్నారట కదా.. కిక్‌ సినిమాకి సీక్వెల్‌ తీసే స్కోప్‌ ఉందంటారా?

ఆ కథకి సీక్వెల్‌ కాదండీ… ఇది ఆ క్యారెక్టర్‌కి సీక్వెల్‌ అనుకోవచ్చు. అదే క్యారెక్టర్‌ తీసుకుని ఇంకో కథ అల్లామన్నమాట. 

మీ ఇమ్మీడియట్‌ ప్రాజెక్ట్‌ అదేనా?

ఇంకో చిన్న సినిమా కూడా ఒకటి అనుకుంటున్నాను. కొత్త వాళ్లతో క్యూట్‌ లవ్‌స్టోరీ చేయాలని నాకెప్పట్నుంచో ఉంది. ఈ రెండిట్లో ఏది ముందు చేస్తాననేది నాకు ఇంకా క్లారిటీ లేదు. బట్‌ నా నెక్స్‌ట్‌ రెండు సినిమాలైతే ఇవే ఉంటాయి.

కిక్‌ 2కి కళ్యాణ్‌రామ్‌ ప్రొడ్యూసర్‌ కదా. తను హీరోగా సినిమా చేయమని అడగలేదా?

అది కూడా ఉంటుందండీ. ఎప్పుడని చెప్పలేను కానీ డెఫినెట్‌గా మా ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుంది. తన బ్యానర్‌ స్టార్ట్‌ చేసినప్పుడే వేరే హీరోలతో కూడా చేయాలని తను అనుకునేవాడు. రీసెంట్‌గా మరోసారి ఆ ప్రపోజల్‌తో వచ్చేసరికి కిక్‌ 2 తన బ్యానర్‌లో చేయాలని నిర్ణయించుకున్నాను. కళ్యాణ్‌రామ్‌తో, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఎప్పుడైనా సినిమా చేస్తాను. ఎందుకంటే నా సంస్థ అది. నా సినిమాతో స్టార్ట్‌ అయింది. నేను ఈ రోజు ఏదైనా ఒక పొజిషన్‌కి రీచ్‌ అయ్యానంటే అది ఆ సంస్థ వల్లే. ఆ గ్రాటిట్యూడ్‌ నాకు ఎప్పటికీ ఉంటుంది.

‘రేసుగుర్రం’ సినిమా అల్లు అర్జున్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందని ఫాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. ఆ లెక్క ప్రకారం మీ సినిమాకి బెంచ్‌ మార్క్‌ ‘జులాయి’. దానిని ఇది దాటుతుందంటారా?

డెఫినెట్‌గా దాటుతుందనే హండ్రెడ్‌ పర్సెంట్‌ నమ్ముతున్నాను. ఇది ప్రిడిక్షన్‌ కాదు కానీ మా ప్రోడక్ట్‌ మీద మాకున్న కాన్ఫిడెన్స్‌. హీరో ఈ సినిమాకి పెట్టిన స్పెషల్‌ ఎఫర్ట్స్‌ కానివ్వండి… టోటల్‌గా వచ్చిన అవుట్‌పుట్‌ కానివ్వండి.. నేనైతే ఒకటి అనుకుంటున్నాను. బన్నీ ఇంతవరకు చేసిన సినిమాలన్నిటికంటే… డెఫినెట్‌గా ఇది ఒక రూపాయి ఎక్కువే కలెక్ట్‌ చేస్తుంది కానీ తక్కువ కలెక్ట్‌ చేయదు.

ఏ సినిమాకి అయినా మేకింగ్‌తో పాటు పబ్లిసిటీ కూడా మస్ట్‌ అయిపోయిందిప్పుడు. మీ సినిమాకి మాత్రం అంతగా ప్రమోషనల్‌ యాక్టివిటీ కనిపించడం లేదెందుకని.

నా కాన్సెప్ట్‌ ఏంటంటే… లో ప్రొఫైల్‌లో వెళ్లడానికే నేను ఇష్టపడతాను. హైప్‌ పెంచడం ఇష్టపడను. ప్రమోషన్స్‌ విపరీతంగా చేసేయాలని, లేదా అస్సలు చేయకూడదని అనుకోలేదు. ఎంత అవసరమో అంతే చేద్దాం కానీ మరీ ఓవర్‌ హైప్‌ పెంచొద్దు అనుకున్నాం.

మీ సినిమాలకి బడ్జెట్‌ ఎక్కువవుతుందనే కంప్లయింట్‌ ఉంది…

అదేమీ లేద్సార్‌. ఏ సినిమాకి అయినా జరిగే బిజినెస్‌ని బట్టే బడ్జెట్‌ పెడతారు. బన్నీతో నా కాంబినేషన్‌లో ఇంత బిజినెస్‌ అవుతుందంటే దాని ప్రకారమే బడ్జెట్‌ ఇస్తారు. బన్నీ సినిమాకి నలభై కోట్లు వస్తుంది.. సో మనం ఇరవై కోట్లలో తీసేద్దామని ఎవరూ అనుకోరు. అలాగే ఎంతయినా ఫర్లేదని, అరవై కోట్లు ఖర్చు పెట్టేద్దామని కూడా అనుకోరు. బిజినెస్‌ పొటెన్షియల్‌ని బట్టి ఖర్చు పెడతారు. నాకు వచ్చే సినిమాలు అలాగే వస్తున్నాయి. నాతో తీసే నిర్మాతలు కూడా అలాంటి వాళ్లే అవుతున్నారు. నేను తీసిన వాటిలో కాస్ట్‌ ఫెయిల్యూర్‌ అయిన సినిమా ఏదీ లేదు. కిక్‌ సినిమాకి మాత్రమే బిజినెస్‌ రేంజ్‌కి మించి ఖర్చు పెట్టాం. దానికి ఎక్కువ బడ్జెట్‌ అయినా కానీ వర్కవుట్‌ అయింది. రేసుగుర్రం సినిమాని కూడా అనుకున్న బడ్జెట్‌లోనే కంప్లీట్‌ చేసాం.

– గణేష్‌ రావూరి

[email protected]

twitter.com/ganeshravuri