ఎమ్బీయస్‌: కార్పోరేట్‌ గాడ్‌ఫాదర్‌….

కోర్టు ఆగ్రహానికి గురైన సహారా గ్రూపు చైర్మన్‌ సుబ్రత రాయ్‌ జైల్లో కూర్చోవలసి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో రాజకీయనాయకులందరినీ మేనేజ్‌ చేశాను కదాన్న ధైర్యంతో కాబోలు కోర్టు ఆదేశాలను ధిక్కరించి కోర్టులో హాజరు కాలేదు. అదేమంటే…

కోర్టు ఆగ్రహానికి గురైన సహారా గ్రూపు చైర్మన్‌ సుబ్రత రాయ్‌ జైల్లో కూర్చోవలసి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో రాజకీయనాయకులందరినీ మేనేజ్‌ చేశాను కదాన్న ధైర్యంతో కాబోలు కోర్టు ఆదేశాలను ధిక్కరించి కోర్టులో హాజరు కాలేదు. అదేమంటే మా ముసలితల్లిని చూడడానికి వెళ్లానని సెంటిమెంటు రంగరించబోయాడు. కోర్టు కరగలేదు సరికదా, జ్యుడిషియల్‌ కస్టడీకి పంపింది. ఎవరో బాధితుడు అతని మొహన సిరా పూశాడు. రియల్‌ ఎస్టేట్‌, ఎయిర్‌లైన్సు, హోటల్స్‌, ఫైనాన్సు, మీడియా – యిలా పలురంగాల్లో విపరీతంగా సంపాదించిన రాయ్‌ జైల్లో కూర్చోవలసి రావడం విధివైపరీత్యమే. తనపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా, అవి ఒక పక్కన రుజువౌతున్నా, మేం నిజాయితీపరులం, భారతమాత ముద్దుబిడ్డలం అంటూ  దబాయింపు ప్రకటనలు గుప్పించడం రాయ్‌కే చెల్లింది. తెలుగుపేపర్లలో సైతం ఫుల్‌ పేజి యాడ్స్‌ యిస్తూ పాపం వీళ్లు అమాయకులేమో అని మనం కన్‌ఫ్యూజ్‌ అయ్యేట్లుగా వుంటాయి ఆ యాడ్స్‌. అతని కార్యస్థలం లక్నో. అక్కడ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు రెసిడెంటు ఎడిటరుగా పనిచేసిన ఉత్తమ్‌ సేన్‌గుప్త తానెరిగిన సుబ్రత రాయ్‌ గురించి యిటీవల ఒక వ్యాసం రాశారు. 1980లలో లాంబ్రెట్టా స్కూటర్‌పై తిరిగిన రాయ్‌ పది,పదిహేనేళ్లు తిరిగేసరికి 50 వేల కోట్ల రూ.ల సామ్రాజ్యాన్ని నడిపాడు. అదంతా ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయనాయకుల, దేశంలోని పారిశ్రామికవేత్తల బ్లాక్‌మనీయే అన్నది అందరూ చెప్పుకునే మాట. అందుకనే అతను ఎన్ని ఆర్థిక అక్రమాలు చేసినా, అధికారంలో వున్న ఏ ప్రభుత్వమూ అతని జోలికి రాలేదు. 

అతని సామ్రాజ్యంలో అతను ఒక డాన్‌. ఉద్యోగులకు కావలసినవన్నీ సమకూర్చి అతని దృష్టిలో దేవుడిగా మారిపోయాడు. అతని గురించి అనేక కథలు ప్రచారంలో వున్నాయి. వాటిలో ఒకటి – అతను గొప్పవాడయ్యాక గోరఖ్‌పూర్‌లో తనతో స్నేహంగా వున్న ఒకతను చనిపోయాడని ఆలస్యంగా తెలిసింది. వెంటనే అతని యింటికి వెళ్లి నిరుద్యోగులైన అతని పిల్లలకు తన సంస్థలో ఉద్యోగాలు యిచ్చాడు. అండర్‌వరల్డ్‌ డాన్‌కు యిలాటి యిమేజే వుంటుంది. అతనికోసం ప్రాణాలు అర్పించడానికైనా సహారా ఉద్యోగులు సిద్ధపడతారు. అతని సంస్థలో ఎటువంటి చట్టాలు పాటించబడవు. పరిశీలించడానికి ఏ ప్రభుత్వ అధికారీ సాహసించడు. 'నేను పనివాళ్లలో ఒకణ్ని. నా హోదా మేనేజింగ్‌ డైరక్టరు కాదు, మేనేజింగ్‌ వర్కర్‌' అని చెప్పుకున్న రాయ్‌, ఆ పేరుతో దేనికీ బాధ్యత వహించలేదు. లక్నోలో ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఒకతను వాపోయాడు – ''సహారా ప్రెస్‌ తనిఖీ చేయడానికి ఎప్పుడు వెళ్లినా నాకు చుక్కెదురైంది. లోపలికి రానిచ్చేవారు కాదు. గేటు దగ్గరే నిలబెట్టి ఎవరు కావాలి? అని అడిగేవారు. జనరల్‌ మేనేజర్‌ అంటే ఆ డెజిగ్నేషన్‌తో ఎవరూ లేరు అని చెప్పేవారు. పోనీ ఫ్యాక్టరీ మేనేజర్‌ అంటే ఆ డెజిగ్నేషన్‌తోనూ ఎవరూ లేరు అని చెప్పేవారు. ఇలా ఏవో పేర్లు పెట్టేసుకుని తప్పించుకునేవారు.'' అని. 

సహారా గ్రూపు డెవలప్‌ చేసిన 'సహారా శహర్‌' అనేక వివాదాలకు నెలవైంది. పబ్లిక్‌ కోసం బ్రహ్మాండమైన లగ్జరీ హౌసింగ్‌ ప్రాజెక్టు కడతామంటూ సహారా గ్రూపు లక్నో డెవలప్‌మెంట్‌ అథారిటీ వారినుండి అతి చౌకగా పెద్ద స్థలాన్ని లీజుపై తీసుకుంది. ఎయిర్‌పోర్టు నుండి హెలికాప్టర్‌లో రాకపోకలు సాగించడానికి హెలిప్యాడ్‌ వుండే యీ ప్రాజెక్టులో సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ రూ.18 లక్షలకు యిస్తామని ప్రకటించింది. స్థలం వచ్చాక కొన్నాళ్లకి పబ్లిక్‌ మాట వదిలేసి తన కంపెనీ ఆఫీసు కట్టేసుకుంది. హెలిప్యాడ్‌ మాత్రమే కాదు, గాల్ఫ్‌ కోర్సు, దేశంలోనే అతి పెద్దదైన ఆడిటోరియమ్‌, కాటేజీలు, గెస్ట్‌హౌస్‌లు, రెస్టారెంటు, చెరువులు, రాయ్‌ సమావేశాలు నిర్వహించుకోవడానికి పెద్ద భవంతి… యివన్నీ వచ్చేశాయి. ఇవన్నీ బయటకు కనబడకుండా ఎత్తయిన ప్రహారీగోడ కట్టారు. పటిష్టమైన కాపలా పెట్టారు. ఈ ఎస్టేటు ఫోటోలు తీసుకోవడానికి ఎవర్నీ లోపలికి అనుమతించేవారు కారు. ఎవరినైనా ప్రత్యేకంగా ఆహ్వానించినా గేటు దగ్గర కెమెరాలు అన్నీ విడిచి పెట్టి రావాలి. తమ వాహనాలను అక్కడే విడిచిపెట్టి సహారా వారి వాహనాల్లోనే లోపలకి వెళ్లాలి. దీనిపై ఆరోపణలు వస్తే ప్రభుత్వం విచారణకై కమిటీలు నియమించింది. ఎన్ని నియమాలు ఉల్లంఘించబడ్డాయో ఐదు నివేదికలు తయారయ్యాయి. ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు. 

అటువంటిది కళ్యాణ్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా వుండగా ఏం తేడా వచ్చిందో ఏమో కానీ ఓ రోజు లక్నో డెవలప్‌మెంట్‌ అథారిటీని పిలిచి లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు భూమి స్వాధీనం చేసుకోమని ఆదేశించాడు. సరే అంటూనే అథారిటీవారు మీడియాకు ఉప్పందించారు. సహారా గ్రూపుకి కూడా..!  అంతే వీళ్లంతా అక్కడకి వెళ్లేసరికి వందలాది సహారా ఉద్యోగులు గేట్ల ముందు పడుక్కున్నారు. లోపలకి వెళ్లనివ్వలేదు. ఈ గలభాలో ఎలాగైనా లోపలికి దూరి సహారా శహర్‌ వైభవాన్ని ఫోటోలు తీసి, లోకానికి చాటాలని ఫోటోజర్నలిస్టులు ప్రయత్నించారు. వారిని సహారా ఉద్యోగులు చావగొట్టి కెమెరా లాక్కుని రీళ్లు బయటకు తీసి ఎక్స్‌పోజ్‌ చేసేశారు. మనోజ్‌ ఛబ్రా అనే టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా స్టాఫ్‌ ఒక రీలు సరిపడా ఫోటోలు తీసి దాన్ని తన సాక్సుల్లో దాచుకుని, మరొకటి లోడ్‌ చేసి ఫోటోలు తీస్తూండగా వాళ్లకు పట్టుబడ్డాడు. వాళ్లు ఆ కెమెరాలోని రీలు లాక్కున్నారు. రోజంతా రగడ జరిగాక, సాయంత్రానికి ముఖ్యమంత్రితో ఒప్పందం కుదిరింది. అంతే, అంతా గప్‌చుప్‌. ఇంత పెద్ద సంఘటనను మర్నాడు పేపర్లలో ఓ మూల వేసి వూరుకున్నారు. సహారా పలుకుబడి అలాటిది. అయితే టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం యిదంతా బయటపెట్టదలచింది. ఫ్రంట్‌ పేజీలోనే వివరంగా వ్యాసం రాసి మనోజ్‌ తన సాక్సులో రీలు దాచి డెవలప్‌ చేసి యిచ్చిన ఫోటోలు కూడా వేసింది. లక్నోవాసులకు సహారా శహర్‌ యిలా వుంటుంది అని తెలిసివచ్చింది. రాయ్‌కు కోపం వచ్చింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా మేనేజర్‌గా వున్న వి.పి.సాహికి స్వయంగా ఫోన్‌ చేసి 'మీ రిపోర్టు వలన మాకు చాలా బాధ కలిగింది. ఇకపై టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించే ఏ పత్రికకూ యాడ్స్‌ యివ్వము. అంతేకాదు, ఫిలింఫేర్‌ ఎవార్డుల స్పాన్సర్‌షిప్‌ గురించి చర్చలు జరుగుతున్నాయి కదా, అది కూడా స్పాన్సర్‌ చేయం.'' అని చెప్పాడు. 

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా దీనికి భయపడలేదు సరికదా, మరో మూడు రోజుల తర్వాత యింకా వివరంగా మరో కథనం ప్రచురించింది. దీనికంతా కారణభూతుడైన రెసిడెంటు ఎడిటరు ఉత్తమ్‌ సేన్‌గుప్తాను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా యాజమాన్యం మందలించలేదు. ఒక నెల్లాళ్ల తర్వాత ''మీ సందేహాలు తీర్చడానికి సుబ్రత రాయ్‌ మీకు యింటర్వ్యూ యిస్తాడట. వెళ్లండి.'' అని చెప్పింది. ఉత్తమ్‌ వెళ్లాడు. ఇంటర్వ్యూలో ''మీ ఎయిర్‌లైన్సు, హౌసింగ్‌ ప్రాజెక్ట్‌స్‌, మీడియా అన్నీ నష్టాల్లో వున్నాయి. అయినా మీరు ఎదుగుతూనే వున్నారు. ఎలా?'' అని అడిగాడు. ''మీరు చెప్పినవన్నీ కలిపితే నా మొత్తం టర్నోవర్‌లో 2% వుండదు.'' అన్నాడు రాయ్‌. ఉత్తమ్‌ తెల్లబోయి ''తక్కిన 98% టర్నోవర్‌ ఏ బిజినెస్‌ తాలూకుది?'' అని అడిగాడు. రాయ్‌ చిరునవ్వుతో ''పారా-బ్యాంకింగ్‌'' అన్నాడు. బ్యాంకింగ్‌ చట్టాలకు లొంగకుండా చట్టవిరుద్ధంగా చేసే ఫైనాన్సు వ్యాపారానికి అతను పెట్టిన ముద్దుపేరది. రూ.20,000 కోట్ల రూ.ల లావాదేవీలు క్యాష్‌లో నిర్వహించిన గ్రూపు అది! అలాటి రాయ్‌ బ్లాక్‌ మనీ గురించి మాట్లాడితే ఉత్తమ్‌కు మతి పోకుండా వుంటుందా? ''పబ్లిక్‌కై ఉద్దేశించిన భూమిని ప్రయివేటు అవసరాలకు ఎలా మార్చారు?' అని ఉత్తమ్‌ అడిగిన ప్రశ్నకు బదులుగా ''మా దగ్గర యిళ్లు కొంటానన్నవాళ్లు చెక్కులు యివ్వం అన్నారు. క్యాష్‌ తీసుకోండి అని బతిమాలారు. నేను ఒప్పుకోలేదు. అందుకే ఆ ప్రాజెక్టు ఐడియా విరమించాను.'' అని చెప్పాడు గొప్పగా. ''బాగానేవుంది, అలాటప్పుడు ఆ భూమిని లక్నో అథారిటీకి వాపసు యిచ్చేయాలిగా..'' అని అడిగాడు ఉత్తమ్‌. ''అలా ఎలా యిస్తాం? మేం తీసుకున్నపుడు ఆ నేలంతా ఎగుడుదిగుడుగా,  తడితడిగా, గుంటలతో వుంది, పాములు తిరిగేవి. మా ఉద్యోగులు దాన్నంతా సాపు చేశారు. బయటివాళ్లు వచ్చి గొడవలు చేసినపుడు ప్రాణాలొడ్డి కాపాడారు. దానిపై మేం బోల్డు ఖర్చు పెట్టాం.'' అన్నాడు రాయ్‌. 

ఇలా ఏ మాత్రం తొణక్కుండా ఫ్రాడ్‌ చేసిన రాయ్‌కు ''భారత పర్వ'' పేరుతో దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించాడు. భారతమాత బొమ్మను లోగోగా పెట్టి చాలా హంగు చేశాడు. ఆ పేరుతో దేశం నలుమూలల నుండి జర్నలిస్టులను, మేధావులు, జడ్జిలను ఆహ్వానించి వాళ్లకు సర్వసౌఖ్యాలు సమకూర్చాడు. ఖరీదైన బహుమతులు యిచ్చాడు. ఉప్పుతిన్న విశ్వాసంతో వారు నోరెత్తలేదు. అతని యింట్లో ఫంక్షన్‌లకు దేశంలోని పెద్దపెద్ద నాయకులు, ఇండస్ట్రియలిస్టులే కాదు, సినిమా తారలు, ఆటగాళ్లు కూడా వచ్చారు. అది చేస్తాను, యిది చేస్తాను, దేశ ముఖచిత్రాన్ని మార్చేస్తాను అంటూ యితను గొప్ప కబుర్లు చెపుతూ వచ్చాడు. అతని చట్టవిరుద్ధమైన చర్యలన్నీ యిన్నాళ్లూ చెల్లుతూ వచ్చాయి. ఇటీవల అవన్నీ బయటకు రావడానికి కారణం సోనియాతో అతను పేచీ పడడమే అని చెప్తున్నారు. ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వంతో అతనికి రాజీ కుదిరితే, కేసుల్లోంచి బయటపడిపోయినా ఆశ్చర్యపడనక్కరలేదు.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]