ఈ సబ్జక్ట్ పాతదే కానీ, గతనెల్లాళ్లగా హైదరాబాదు ఎయిర్‌పోర్టులో బంగారం స్మగుల్ చేస్తూ పట్టుబడిన కేసులు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. గత మూణ్నెళ్లల్లో యీ ఎయిర్‌పోర్టు నుండే బంగారం అక్రమ రవాణా పెరిగిందని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. చైనా మాఫియా, పాకిస్తాన్ ఏజంట్లతో కలిసి దక్షిణాది రాష్ట్రవాసుల ద్వారా భారత్‌లోకి బంగారం స్మగుల్ చేయిస్తోందని కథనాలు కూడా వెలువడ్డాయి. అధికారులు చెప్పే అంకెలు వాస్తవాలకు కడుదూరంగా వున్నాయని పరిశీలకులు అంటున్నారు. నెలకు మూడు టన్నుల బంగారం భారతదేశంలోకి అక్రమంగా వస్తోందని చిదంబరం గారన్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వారు యీ అంచనా చాలా తక్కువనీ ఏడాదికి 150-200 టన్నుల బంగారం భారత్‌లోకి చొరబడుతోందని అంటున్నారు. 2012లో 871 కేసులు బుక్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ 99 కోట్ల రూ.లు. 2 డిసెంబరు నాటికి 1131 కేసులు, బంగారం విలువ 320 కోట్ల రూ.లు. మన కస్టమ్స్ శాఖలో సిబ్బంది తక్కువ. ఉన్నవారిలో మహిళా యిన్‌స్పెక్టర్లు మరింత తక్కువ. మహిళా స్మగ్లర్లను తనిఖీ చేయడం యిబ్బంది అవుతోంది. భారతీయులకు బంగారంపై మోజు ఎక్కువ. ఆడా, మగా అందరూ వేసుకుంటారు. పైగా బ్లాక్‌మనీ దాచుకోవడానికి బంగారం అత్యంత సులభమైన సా
ధనం. మన స్వర్ణదాహాన్ని తీర్చడానికి భారత్‌లో దొరికే బంగారం ఏ మూలకూ చాలదు. అందువలన అన్ని దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి చూస్తాం. ఇలాటప్పుడు ప్రభుత్వం ఆచరణసాధ్యమైన విధానాలను రూపొందించి, స్మగ్లింగ్ జరగకుండా చేయాలి. కానీ అనేక తెలివితక్కువ విధానాలను రూపొందించిన యుపిఏ, మహామేధావి చిదంబరం గారి సలహామేరకు 2011లో బంగారంపై ఇంపోర్టు డ్యూటీ 2% వుంటే, దాన్ని 2013 నాటికి 10% చేశారు. పైగా రిజర్వు బ్యాంక్ చేత 2013 ఆగస్టులో ఆదేశాలు జారీ చేయించారు – ఎవరైనా బంగారు వర్తకులు ముడి బంగారాన్ని దిగుమతి చేసుకుంటే దానిలో 20% బంగారాన్ని ప్రాసెస్ చేసి మళ్లీ ఎగుమతి చేయాలని!
ఈ విధానాల వలన బంగారం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగింది. గల్ఫ్‌లో మనవాళ్లు ఎంతోమంది పనిచేస్తూ వుంటారు. వాళ్లలో చాలామందికి ఉద్యోగాలు దొరికి వుండవు, దొరికినవి పోయి వుంటాయి. 'ఇండియాలో ఇంటికి వెళ్లి రావాలంటే రిటర్న్ టిక్కెట్ యిస్తాం, పైన లక్షో, రెండో ముట్టచెబుతాం. కిలోకి 30 వేల నుండి 50 వేల రూ.ల దాకా కమిషన్.' అని ఆశపెట్టి వాళ్లను స్మగ్లర్లగా మారుస్తున్నారు. గల్ఫ్‌లో కేరళీయులు అందునా ముస్లిములు ఎక్కువమంది కాబట్టి కేరళ యిలాటి స్మగ్లింగ్‌లో అగ్రస్థానంలో వుంది. కాసర్‌గోడ్, కోళికోడ్, మళప్పురం జిల్లాలోని 35 ఏళ్ల లోపున్న ముస్లిం యువకులు యీ కార్యకలాపాల్లో ఆరితేరడంతో యిలాటి స్మగ్లర్లను 'కాసర్‌గోడ్ గ్యాంగ్' గా వ్యవహరిస్తున్నారు. వారిపై ప్రత్యేకంగా కన్నువేసి వుంచుతున్నారు. కస్టమ్స్‌వారి కన్ను కప్పడానికి స్మగ్లర్లు అవలంబిస్తున్న కొత్తకొత్త విధానాలు వింటే వాళ్ల తెలివితేటలకు అబ్బురపడతాం. టీవీ సెట్లలో, లాప్‌టాప్‌ల్లో, మొబైల్ బ్యాటరీల్లో, ఎమర్జన్సీ ల్యాంపుల్లో, పెన్నుల్లో, బూట్లలో, బెల్టుల్లో బంగారం తేవడం ఎప్పణ్నుంచో వింటున్నాం. ఇప్పుడు బంగారాన్ని ఆక్వా రెజియా (ఒక పాలు నైట్రిక్ యాసిడ్, మూడు పాళ్లు హైడ్రోక్లోరిక్ యాసిడ్)లో కరిగించి దాన్ని కండోమ్స్‌లో నింపి, వాటన్నిటిని లిక్విడ్ డిటర్జెంట్ డబ్బాల్లోనో, డిష్ వాషింగ్ లిక్విడ్స్ డబ్బాల్లోనో పెట్టి తెచ్చేస్తున్నారు. కస్టమ్స్ వాళ్లు అడిగితే బట్టలుతికే ద్రవం తెచ్చుకున్నాం అంటున్నారు. ఈ మధ్య ఒకతను అలాగ పట్టుకుని వస్తూ వుంటే కస్టమ్స్‌వారి మెటల్ డిటెక్టర్ సిగ్నల్ యిచ్చింది. వెతికితే ఎక్కడా లోహపదార్థం కనబడలేదు. చివరకు ఒక్కోటీ తీసి చీల్చి చెండాడితే ద్రవరూపంలో వున్న 2 కిలోల బంగారం దొరికింది.
ఆ మధ్య మంగుళూరు ఎయిర్‌పోర్టులో కాఫీపొడితో కలిపి తెచ్చిన అరకిలో బంగారపు రజను దొరికింది. అరకిలో బంగారాన్ని ఖర్జూర గింజల్లా మార్చి ఖర్జూరాల్లో జొనిపి తెచ్చిన కేసు పుణెలో దొరికింది. ట్రాలీ హేండిల్‌లో బంగారం దాచాడు ఒక ప్రబుద్ధుడు. మరొక మేధావి బంగారంతో స్టేపుల్ పిన్స్ చేయించి, వాటిని తన సామాన్లు పెట్టిన అట్టపెట్టెలకు స్టేపుల్ చేయించాడు. వాటర్ ప్యూరిఫైయర్‌లో చేసిన వైరింగ్ 4 కిలోల బంగారంతో చేశారని బెంగుళూరు ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌వారు కనుగొన్నారు. బంగారాన్ని పల్చగా రేకుల్లా చేయించి క్రేపు రిబ్బన్లలా పట్టుకుని వస్తూంటే కోచి అధికారులు పట్టుకున్నారు. లోదుస్తులకు బంగారు తీగలతో ఎంబ్రాయిడరీ చేయించి వేసుకుంటున్నారు. ఆ మధ్య ఒక గడ్డపాడి మీద అనుమానంతో కస్టమ్స్ అధికారి చాచి లెంపకాయ కొట్టాడు. అతని చేతికి గట్టిగా తగిలింది. ఏమిట్రా అని చూస్తే గడ్డంలో బంగారు తీగలు దాచాడు. కాసర్‌గోడ్‌లో ఓ టైలర్ 430 గ్రా.ల బంగారాన్ని 29 కాప్యూల్స్ రూపంలో మింగివేసి తెచ్చాడు. ఎయిర్‌పోర్టు నుండి అతను బయటపడ్డాడు కానీ బంగారం అతనిలోంచి బయటపడడానికి తిరస్కరించింది. అన్ని రకాల ప్రయత్నాలు చేశాక చివరకు కలోనోస్కోపీ చేసి బయటకు లాగారు. రూ.2 లక్షలకు ఆశపడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఇక ఆడవాళ్లయితే బురఖాల్లో ప్రత్యేకమైన జేబులు కుట్టించుకుని తెచ్చేస్తున్నారు. దుబాయి వెళ్లేటప్పుడు నకిలీ నగలు వేసుకుని వెళుతూ అవి అసలు సిసలు బంగారం అని ప్రకటిస్తున్నారు. అక్కడకు వెళ్లి అసలైనవి దిగేసుకుని వస్తున్నారు.
ఇలా పట్టుబడిపోతూ వుంటే స్మగ్లర్లకు నష్టం కదాన్న అనుమానం వస్తుంది. అందుకే వాళ్లు ఎనిమిదేసి సభ్యుల సిండికేట్లగా ఏర్పడుతున్నారు. ఎవరైనా ఒకరి కాండిడేటు పట్టుబడి బంగారం పోతే, తక్కిన ఏడుగురు విజయవంతంగా బయటకు తేగలిగితే ఆ నష్టం దీనిద్వారా పూడ్చుకుంటారు. ఈ సారి ఒకరిది పోతే యింకోసారి యింకోరిది పోవచ్చు. ఒక విధమైన గ్రూపు ఇన్సూరెన్సు అన్నమాట. మొత్తం స్మగ్లింగ్‌లో 2-3% మాత్రమే పట్టుబడుతోందని ఒక అంచనా. ఇంత భారీ ఎత్తున స్మగ్లింగ్ జరుగుతోందంటే యీ ముఠాలకు మద్దతుగా ట్రావెల్ ఏజన్సీలు, విమాన సంస్థల సిబ్బంది, కస్టమ్స్ అధికారుల్లో కొందరు, ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ స్టాఫ్, రాజకీయనాయకులు.. అందరూ వున్నారని వూహించవచ్చు. వీరి వెనక్కాల న్యాయవాదులు రెడీగా వుంటారు. ఎవరైనా పట్టుబడిన గంటలోపు అడ్వకేట్ అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఒక్కరోజు కస్టడీలో వుంటే చాలు బెయిల్ వచ్చేస్తోంది. చట్టం కూడా ఎంత బలహీనంగా వుందంటే – కోటి రూ.ల విలువైన బంగారం స్మగ్లింగ్ కేసులో మాత్రమే నాన్-బెయిలబుల్ అఫెన్సుగా చూస్తారు. పట్టుబడిన బంగారాన్ని కాస్త తక్కువగా చూపించి విలువ 99 లక్షలే అంటే, బెయిల్ వచ్చేస్తుంది. వ్యవహారాలు యింత ఘోరంగా వుంటే మన ఆర్థిక వ్యవస్థ ఎలా బాగు పడుతుంది?
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2014)