అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్ కందా
మేం ఏ ఎండకా గొడుగు పడతామా?
1989 ఎలక్షన్స్‌లో కాంగ్రెసు నెగ్గి చెన్నారెడ్డిగారు సిఎం అయ్యారు.
ఆయన యింకా ప్రమాణస్వీకారం చేయలేదు కానీ అధికారుల బదిలీల గురించి ఆలోచిస్తున్నారని విన్నాను. అప్పట్లో గవర్నరుగా వున్న కుముద్‌బెన్ జోషీగారు ఆవిడ ఆఫీసులో సెక్రటరీగా నన్ను నియమించమని పట్టుబడుతున్నారు.
ఎన్టీ రామారావుగారు సిఎంగా వుండగానే ఫైల్ ఆయన వద్దకు వచ్చింది. ఆయన నా అభిప్రాయం అడిగారు. ''చాలా చిన్నప్పుడే రెండున్నర సంవత్సరాలు అక్కడ గడిపాను. ఉత్సాహం, శక్తీ వుండగా ఫీల్డ్‌లో పనిచేయాలని వుంది.'' అని చెప్పాను.
ఆయన నా వాదన ఒప్పుకుని ఫైల్ ఆయన దగ్గరే వుంచుకున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌వాది ఐన కుముద్‌బెన్‌గారి మాట చెన్నారెడ్డిగారు కాదనకపోవచ్చని కొందరు అనడంతో చెన్నారెడ్డిగారిని కలిసి ఆ పదవిపై నా విముఖత మళ్లీ తెలుపాలని అనుకున్నాను. కృష్ణా జిల్లా కలక్టరుగా వుండగా ఆయనతో ప్రత్యక్ష పరిచయం వుంది. ఆయన వద్దకు వెళ్లి ఎన్నికలలో నెగ్గినందుకు అభినందిస్తూనే కుముద్‌బెన్ గారి ప్రతిపాదన, నా నిరాసక్తత రెండూ చెప్పాను.
''నేను చూసుకుంటానులే'' అన్నారాయన.
నేను ఆయనను కలవడం ''హిందూ'' ఆంగ్లదినపత్రికలో ఫోటో వచ్చింది. ఇక దానిపై చర్చ ప్రారంభమైంది.
''మోహన్ ఎన్టీయార్‌కు ఎంత ఆత్మీయంగా వుండేవాడు ! ప్రభుత్వం మారుతూండగానే తన విధేయత మార్చేసుకున్నాడు చూడు. చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రిగా యింకా ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. ఈ ఘడియకు ఆయన ఒట్టి రాజకీయ నాయకుడు మాత్రమే. ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా వుండగానే సీనియర్ అధికారి అయివుండి మోహన్ యిలా చెన్నారెడ్డిగారిని కలవడం.. హవ్వ..'' అని ప్రచారం మొదలుపెట్టారు.
మా వంటి ప్రభుత్వాధికారులు గాలికోడి వంటి వాళ్లమా? ఏ ఎండకా గొడుగు పడతామా?
ప్రభుత్వాధినేత మారినప్పుడల్లా మా విధేయతా రంగులు మార్చేసుకుంటుందా?
xxxxxx
'మా బ్యూరాక్రాట్స్‌కు ఎఱ్ఱాప్రగడే ఆదర్శం' అని నేనంటే మీరు ఆశ్చర్యపడతారని నాకు తెలుసు. ఎందుకంటే 'కవిత్రయం అనగా ఎవరు?' అన్న బిట్ క్వశ్చన్‌కు ఆన్సర్‌గా రాసేటప్పుడు తప్ప ఎఱ్ఱాప్రగడ మనకు ఎక్కడా తగలడు.
పౌరాణిక సినిమాలలో పద్యాలు ఉపయోగించుకున్నపుడు సినిమా టైటిల్స్‌లో పాటల రచయితల పేర్ల కింద నన్నయ, తిక్కన పేర్లు కనబడతాయి తప్ప ఎఱ్ఱాప్రగడ పేరు వుండదు. పద్యాల సంగతి తెలియకపోయినా ఆదికవి అన్న బిరుదు, రాజరాజనరేంద్రుడు వంటి రాజుచేత భారత ఆంధ్రీకరణ గురించి అడిగించుకోవడం, ఈ మధ్యే ఆయనపేర వెలసిన యూనివర్సిటీ వంటి వాటివలన నన్నయ్య గుర్తుంటాడు. ఖడ్గతిక్కన, కవితిక్కన ఒకరా? వేర్వేరా? వంటి చర్చల వలన తిక్కనా గుర్తుంటాడు. ఏ గ్లేమరూ లేనిది పాపం ఎఱ్ఱాప్రగడ ఒక్కడే!
గ్లేమరు లేకపోవడం అనే సామాన్యాంశం (కామన్ ఫ్యాక్టర్) వలన బ్యూరోక్రాట్స్‌తో పోలిక తెస్తున్నానని తీర్మానించేయవద్దు. అంతకంటె పెద్ద కారణమే వుంది. ఎఱ్ఱాప్రగడ గురించి మనకు తెలిసినదేమిటి? క్రీ.శ. 1055 ప్రాంతంలో నన్నయ్య భారతం ఆంధ్రీకరణ మొదలుపెట్టి మొదటి రెండు పర్వాలూ పూర్తిగా రాసి, మూడోదైన ఆరణ్యకపర్వం రాస్తూండగా మధ్యలో చనిపోయాడు. తర్వాత 200 ఏళ్లకు తిక్కన ఆరణ్యకపర్వాన్ని అర్ధాంతరంగా అడవుల్లోనే వదిలేసి తక్కిన 15 పర్వాలూ తెనిగీకరించాడు. ఆ తర్వాత మరో శతాబ్దానికి ఎఱ్ఱన యీ యిద్దరి మధ్యా మిగిలిన భాగాన్ని పూరించాడు. ఆ పూరించే ప్రజ్ఞ గురించే మనం మెచ్చుకోవాలి.
నన్నయ్య శైలి వేరు. సంస్కృతభూయిష్టం. 11 వ శతాబ్దం నాటి తెలుగు. తిక్కన శైలిలో తెలుగుతనం హెచ్చు. 13 వ శతాబ్దం నాటి తెలుగు. 14 వ శతాబ్దానికి చెందిన ఎఱ్ఱన గొప్ప మిమిక్రీ (లు) చేశాడు. నన్నయ్య పద్యాలకు కొనసాగింపుగా రాసినవాటిలో నన్నయ్య శైలి కనబరుస్తూ, క్రమంగా దాన్ని తిక్కన శైలిలోకి మారుస్తూ, తిక్కన రాసిన భాగాలకు ముందు కనబడే పద్యాలను అచ్చం తిక్కనే రాసేడేమోనన్న భ్రమింపచేసేలా రాశాడు. అతుకు ఎక్కడా తెలియకుండా సాఫీగా పట్టుదారంపై మంచిముత్యపుపూసలా భారతరచన సాగిపోయేట్లా చేశాడు.
ఇటువంటి విశేషాలు మా నాన్నగారు చెప్పి ఉత్సుకత రేపి పద్యాలు నేర్చుకునేలా ప్రోత్సహించేవారు. (ఆయనా, దామోదరం సంజీవయ్య గారూ కూర్చుని గజేంద్రమోక్షంలోని పద్యాలన్నీ వంతులవారీగా – అంటే ఈయనొహటి చెప్తే ఆయనొహటి – చెప్పుకుంటూ ఉండేవారట.) నన్నయ్య రాసిన ఆఖరి పద్యం ''శారద రాత్రులుజ్వల..పూరితంబులై'' శైలిలోనే ఎఱ్ఱన తన మొదటి పద్యం ''స్ఫురదరుణాంశురాగరుచి..శారదవేళ జూడగన్'' రాశాడు. తిక్కన మొదటిపద్యం ''శ్రీయన గౌరినాబరగు చెల్వకు జిత్తము సల్లివింప…గొల్చెద నిష్టసిద్ధికిన్'' కాగా దానికి ముందు వచ్చే ఎఱ్ఱన ఆఖరిపద్యం ''అమితవైభవ! లోభమోహమదాది దుర్లభ…నిర్జిత పంకజా!''
xxxxxx
మా నాన్నగారు నాకీ సాహిత్య విశేషాలు చెప్పేటప్పుడు నేను కూడా కొద్ది కాలంలో ఎఱ్ఱనలా కాబోతానని వూహించి వుండరు. నేనే కాదు ఉన్నతస్థానంలో వుండే ప్రభుత్వాధికారులందరూ ఎఱ్ఱనలే. నన్నయ్య గ్రాంధికంలా వుంటారు ఒక ముఖ్యమంత్రి. తిక్కన వ్యావహారికంలా వుంటారు ఆయన వారసుడు. ఇద్దరి మధ్యా జరిగే ట్రాన్సిషన్ స్మూత్‌గా వుండేట్లా, అధికార బదిలీ కుదుపుల్లేని ప్రయాణంలా ఉండేట్లా చూసేవాళ్లం మేమే. వరుసగా వచ్చే యిద్దరు ముఖ్యమంత్రుల మధ్య పార్టీలు వేరే వుండవచ్చు, సిద్ధాంతాలు తేడాగా వుండవచ్చు, వయోభేదం వుండవచ్చు, వేగంలో వ్యత్యాసం వుండవచ్చు, విద్యాధిక్యతలో, అవగాహనలో, ప్రవర్తనలో, నైతికతలో – ఎన్నోరకాల భేదాలు వుండవచ్చు.
ఎన్ని వున్నా పరిపాలించబడే ప్రజలకు మాత్రం తేడా తెలియకూడదు. ఒకే ప్రభుత్వం అనూచానంగా నడుస్తున్నట్టు అనిపించాలి. ముఖ్యమంత్రి ఎవరైతేనేం, ఏ పార్టీ అధికారంలో వుంటేనేం, మనం నిత్యం చూసే ఆర్‌డీఓగారు మారలేదు, ఆయన పనితీరూ మారలేదు అనిపించాలి. నిజానికి మార్పు వుంటుంది. కానీ అది మార్పులా అనిపించకుండా చూడడమే బ్యూరాక్రసీ లక్షణం. ఈ క్రమంలో బ్యూరాక్రసీ చాలా అవస్థే పడుతుంది. ఎఱ్ఱాప్రగడను పట్టుకుని నువ్వు నన్నయకు విధేయుడవని తిక్కనా, తిక్కనకు విధేయుడవని నన్నయా శంకించలేదు కానీ బ్యూరాక్రసీకి మాత్రం పాతవ్యవస్థకు విధేయులనే నింద మోయక తప్పదు.
xxxxxx
పైన చెప్పిన వ్యవహారంలో నా స్వభావం అందరికీ తెలుసు కాబట్టి దాని ప్రభావం ఏమీ లేకపోయింది కానీ…
నాకే బాధ వేసింది – మన గురించి కూడా యిలా అనుకునేవాళ్లున్నారా అని.
రామారావుగారితో ''నేను వెళ్లి కలిసిన సంగతి యిదండీ'' అని చెప్పాను.
''అదేంటి బ్రదర్, ఆ ఫైల్ సంగతీ, నీ అయిష్టత సంగతీ నాకు తెలుసు కదా!'' అన్నాడాయన చాలా సాధారణంగా, ఎలాటి అపార్థాలకు చోటివ్వకుండా.
xxxxxx
కానీ తర్వాతి అధికారమార్పిడి సమయంలో చెన్నారెడ్డిగారు మాత్రం యింత సహనంగా వుండలేదు.
అది చెప్పేందుకు ముందు నా నియామకం గురించి చెప్పాలి. నన్ను గవర్నర్ కార్యాలయంలో వేయటం లేదు కానీ సెక్రటరీ, ఎనర్జీ ఎన్వైర్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీగా వేద్దామని అనుకుంటున్నారని తెలిసింది. అది చాలా ముఖ్యమైన శాఖే కానీ నా కెందుకోగాని ఆ రంగంలో ఆసక్తి లేదు. వెళ్లి ప్రిన్సిపల్ సెక్రటరీ టు సిఎంగా వున్న ఎస్.ఆర్.రామ్మూర్తిగారిని కలిసి చెప్పాను, ''వీలుంటే నన్ను వ్యవసాయ శాఖలో వేయండి. అది నాకు జీవితంలో పెద్ద ఆశయం'' అని.
దానికి రామ్మూర్తిగారు ''దానికేం, అక్కడ భండార్కర్‌గారున్నారు. ఆయన ఎనర్జీకి రావాలని చూస్తున్నారు'' అంటూ నా కోరిక మన్నించారు.
అక్కడ మాకు మంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డిగారు. నేను కృష్ణాజిల్లాలో వున్నపుడు ఆయన రెవెన్యూ మంత్రి. ఓ కథానాయకుణ్ని చూసినట్టు వుండేది. ముఖ్యమంత్రి చెన్నారెడ్డిగారికి కుడిభుజంలా వుండేవారు. హుషారుగా పనిచేసేవారు, మాతో పనులు చేయించేవారు. అందరినీ సంప్రదిస్తూ, అందరినీ కలుపుకుపోతూ వెళ్లే నైజం ఆయనది.
జనార్దనరెడ్డిగారు మా శాఖ మంత్రి కావడంతో మరింత సాన్నిహిత్యం పెరిగింది. అది చెన్నారెడ్డిగారిలో అపోహ కలిగించింది. అప్పటికే ఆయనకూ జనార్దనరెడ్డిగారికీ రాజకీయంగా విభేదాలు వచ్చాయి.
ఓ రోజు ముఖ్యమంత్రిపై అసెంబ్లీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి.జనార్దనరెడ్డిగారు డెయిరీ ఫెడరేషన్ గురించి ఏవేవో ఆరోపణలు చేశారు. ఆయనా అధికారపార్టీ సభ్యుడైనా ప్రభుత్వాన్ని కించపరిచేట్లు మాట్లాడి, తన వద్ద ఏవో రహస్యపత్రాలు ఉన్నాయంటూ గాలిలో కాగితాలు వూపుతూ ఉపన్యసిస్తున్నారు.
డెయిరీ ఫెడరేషన్ నా శాఖ కిందే వస్తుంది. ముఖ్యమంత్రిగారికి జవాబిచ్చేందుకు సహాయపడడానికి అఫీషియల్ బాక్స్‌లో కూర్చుని వున్నాను.
చెన్నారెడ్డిగారు నా వైపుకి తిరిగి ''ఏమయ్యా, ఆయన తడబడుతున్నాడు. నువ్వు సరిగ్గా అర్థమయ్యేట్లు చెప్పలేదా?'' అన్నారు.
పి.జనార్దనరెడ్డిగారు నేదురుమల్లికి దగ్గరివాడని ప్రతీతి. అందువలన నేనూ జనార్దనరెడ్డిగారితో కుమ్మక్కయి ఈ ఆరోపణలు చేయించానన్న ధ్వని నాకు తోచి జవాబు చెప్పబోతూ వుంటే అంతలోనే చెన్నారెడ్డిగారు లేచి వెళ్లిపోయారు.
నేను ఆయన వెనుకనే అసెంబ్లీలోంచి ఆయన రూములోకి గబగబా వెళ్లాను. నన్ను చూస్తూనే ''నాకిప్పుడు టైం లేదు'' అంటూ లోపలికి వెళ్లిపోయారు.
నేను ఆగలేదు. యాంటీ- రూంలోకి వెళ్లిపోయి ''మీ మనసులో ఏదో వున్నట్టుంది. సమస్యేమిటో సరిగ్గా చెప్పండి.'' అన్నాను.
''ఇక్కడేం జరుగుతోందో నాకు తెలుసు. సమాంతరప్రభుత్వం (పారలల్ గవర్నమెంట్) నడుస్తోంది.'' అన్నాడాయన కోపంగా.
నాకు మొదట్లో ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత పుంజుకుని చెప్పాను ''సర్, మీకేదో దురభిప్రాయం కలిగినట్టుంది. ఎవరేం చెప్పారో నాకేమీ తెలియదు. ఒకటి మాత్రం క్లియర్. నేను ఏదైనా తప్పు చేస్తున్నానని గాని, చేయాల్సిన విధంగా పనులు చెయ్యటం లేదని కానీ అనిపిస్తే చెప్పండి, వెంటనే నేను వెళ్లిపోతాను. ఒక్క నిమిషం కూడా యీ ఉద్యోగంలో కొనసాగను.'' అని.
ఇది ఆయన అసహనాన్ని మరింత పెంచింది. ''నన్ను బెదిరిస్తున్నావా? (ఆర్ యూ థ్రెటనింగ్ మీ?) నేను నీకంటె గొప్ప గొప్ప వాళ్లని (మచ్ గ్రేటర్ ఫెలోస్) చూశాను'' అన్నారు నిష్ఠూరంగా.
''మీకు నామీద నమ్మకం వుంటే మంచిది. లేకపోతే మాత్రం నేను యిక్కడ పనిచేయలేను.'' అని చెప్పి నేను రుసరుసలాడుతూ చీఫ్ సెక్రటరీ వి.పి.రామారావుగారి వద్దకు వెళ్లి ''అయ్యా, యిదిగో నా లీవ్ లెటర్'' అని అందులో రాసి యిచ్చాను – 'కారణాలు తెలియవు కానీ ఇవాళ ముఖ్యమంత్రిగారి వైఖరి చూస్తే ఆయనకు నా మీద విశ్వాసం వున్నట్టు లేదు. ఈ పరిస్థితుల్లో నేను యిక్కడ కొనసాగడం బాగుండదు' అని.
అవేళ శుక్రవారం. చిత్రంగా ఆ వారాంతంలోనే ప్రభుత్వం పడిపోయింది.
xxxxxx
మా శాఖ మంత్రిగారైన జనార్దనరెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నాకు కబురు పెట్టి ''నా ఆఫీసులో పనిచేయి'' అన్నారు.
''అదేమిటండీ, మాధవరావుగారిని ప్రిన్సిపల్ సెక్రటరీగా వేసుకున్నారు కదా, నేను వచ్చి సిఎం ఆఫీసులో ఏం చేస్తానండి?'' అన్నాను.
''అబ్బ నువ్వే సిఎం అనుకోవయ్యా'' అని జోక్ చేసి, 'డెవలప్‌మెంటల్ కో ఆర్డినేషన్ సెక్రటరీ టు సిఎం' అనే కొత్త పదవి సృష్టించి ప్లానింగ్ డిపార్టుమెంటులో నన్ను సెక్రటరీగా వేసి ఈ రెండూ కలిపి చూడమన్నారు.
ఆయన ఏదైనా జిల్లా టూరుకి వెళ్లబోయేందుకు ఓ పదిరోజుల ముందర నన్ను అక్కడికి పంపించేవారు. అక్కడి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మిగతా అఫీ¦ిషియల్, నాన్ అఫీషియల్స్ అందరితోనూ కలిపి కూర్చుని, అభివృద్ధి పథకాలలో ఎక్కడెక్కడ సమన్వయలోపాలు (గ్యాప్స్) వున్నాయో చర్చించేవాణ్ని. ఆ మండలంలో ఏ పని చేయిస్తే ప్రజలు ఎక్కువ సంతోషిస్తారో, 'ఎన్నో రోజులనుండి ఎదురుచూస్తున్న పథకం యిది, యిన్నాళ్లకు ఆ కొరత తీరింది' అని వాళ్లు అనుకునే పనులు ఐదారు గుర్తించి వెనక్కి వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీతో కూర్చుని అవి జరగాలంటే కావలసిన ఏన్యువల్ ప్లాన్, బజెట్ ఎలాకేషన్ అవీ చూసుకుని ముఖ్యమంత్రిగారు వెళ్లినపుడు వాటిని ప్రకటించేట్లా చూసేవాణ్ని.
ఈ విధంగా పదిజిల్లాలలో సుమారు రెండువందల ఎనభై పనులు – రోడ్లు, వంతెనలు, చెరువులు, స్కూళ్లు, ఆసుపత్రులు – చేయించడం జరిగింది.
ఈ కారణంగా నేను జనార్దనరెడ్డిగారికి బాగా సన్నిహితుడనన్న అభిప్రాయం కలిగింది – ఆయన తర్వాత పదవిలోకి వచ్చిన కోట్ల విజయభాస్కరరెడ్డిగారికి !
ఆయన వచ్చిన మొదటిరోజే సిఎం మీటింగ్‌లో వున్న నన్ను చూసి ''నువ్వు యీ మీటింగులో ఎందుకు వున్నావ్?'' అని అడిగారు.
''నేను ప్లానింగ్‌లో సెక్రటరీగానే కాక సిఎం ఆఫీసులో కోఆర్డినేషన్ సెక్రటరీగా కూడా పని చేస్తున్నాను. నా హోదా మారుస్తూ యింకా ఆదేశాలేవీ రాలేదు. రమ్మంటే వచ్చాను.'' అని చెప్పాను.
అంతటితో ఆగలేదు. వెంటనే చీఫ్ సెక్రటరీగారికి చెప్పాను. ''ఈయనకేదో మనసులో అనుమానంగా వున్నట్టుంది. వద్దవద్దంటే జనార్దనరెడ్డిగారు యీ పోస్టు సృష్టించి యిచ్చారు. నన్ను ప్లానింగ్‌లోనే వుంచుతూ ఆదేశాలివ్వండి.''అని.
''ముందు ప్లానింగ్‌లో వేస్తాను కానీ తర్వాత ఎక్కడ వేయమంటావ్ చెప్పు'' అన్నారాయన.
''ఎప్పుడూ వున్నదే కదా, అగ్రికల్చరే యివ్వండి'' అన్నాను. మళ్లీ అగ్రికల్చర్ సెక్రటరీగా వెళ్లాను.
xxxxxx
నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంటుగా వుండేవాణ్ని. ఓ మ్యాచ్‌కు ముఖ్యమంత్రిగా వున్న విజయభాస్కరరెడ్డిగారిని ఆహ్వానించాను. మైకు తీసుకుని ''లేడీస్ అండ్ జెంటిల్‌మెన్..''అనగానే కరెంటు పోయి మాటలు వినబడడం మానేశాయి. 'ఆయనకసలే నామీద అనుమానం. పిలిచి కావాలని యిలా చేశానని అనుకుని పోతారేమోన'ని భయపడుతూండగానే కరంటు తిరిగి వచ్చి హమ్మయ్య అని వూపిరి పీల్చుకున్నాను !
ఇందరు ముఖ్యమంత్రుల గురించి చెప్పి చంద్రబాబు, వైయస్ గార్ల గురించి చెప్పకపోతే యిది అసమగ్రంగా మిగిలిపోతుంది. ఇద్దరి వద్దా నేను చీఫ్ సెక్రటరీగా పనిచేశాను.
ఏదైనా ఆయన దృష్టికి తేకపోతే ''ఇది నాకు ఎందుకు చెప్పలేదు?'' అని అడిగేవారు బాబు!
అదే వైయస్సార్ అయితే ''ఇది నాకెందుకు చెప్తున్నారు?'' అని అడిగేవారు.
ఇద్దరికీ అన్ని విషయాలూ తెలుసు. ఇద్దరూ వర్క్‌హాలిక్సే!
ఇదే నేను చెప్పిన నన్నయ్య, తిక్కనల శైలీభేదం. మధ్యలో ఎఱ్ఱాప్రగడ వంటి వారధులం మేం!
xxxxxx
కొసమెరుపు – హైదరాబాదులో నాగఫణిశర్మగారు సహస్రావధానంగారు చేస్తున్నపుడు నన్ను పృచ్ఛకుడిగా పిలిచారు. 'నన్నయ కవితాస్థాయిని, తిక్కన కవితాస్థాయిని సమన్వయం చేస్తూ మధ్యేమణిన్యాయంగా సమతౌల్యంగా సాగిన ఎఱ్ఱన రచనావైశిష్ట్యం ఏమిటని' అవధాని గారిని అడిగాను. నా ప్రశ్నకు సమాధానంగా ఆయన ఒక పద్యం చెప్పి సభను పులకింపజేశారు.
''ఆ నన్నయ్యయు చన్నదారి కవితోద్యచ్చేముషీవైఖరిన్
పూసన్ తిక్కన తెల్గుపల్కు బడులన్ వ్యూహంబుగా దీర్చుచున్
తానై ఎఱ్ఱన స్వీయమార్గమున తత్త్వానంద సంధాతయై
ఈ నవ్యాంధ్ర కవిత్వ భారతిని సంధించెన్ సదాచారతన్''
మీ సూచనలు [email protected] కి ఈమెయిల్ చేయండి.
excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version