ఎమ్బీయస్‌: ర్యాగింగ్‌ అరికట్టేందుకు సినీయాక్టర్ల ప్రచారమా?

రుషితేశ్వరి ఆత్మహత్యపై నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడుతూ గంటా శ్రీనివాస్‌ గారు ర్యాగింగ్‌ అరికట్టడానికి తీసుకునే చర్యలలో భాగంగా సినిమా యాక్టర్ల చేత ప్రచారం చేయిస్తామని సెలవిచ్చారు. ర్యాగింగ్‌ గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది.…

రుషితేశ్వరి ఆత్మహత్యపై నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడుతూ గంటా శ్రీనివాస్‌ గారు ర్యాగింగ్‌ అరికట్టడానికి తీసుకునే చర్యలలో భాగంగా సినిమా యాక్టర్ల చేత ప్రచారం చేయిస్తామని సెలవిచ్చారు. ర్యాగింగ్‌ గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. చాలా సూచనలు వచ్చాయి. అవేమీ యిన్నాళ్లూ అమలు చేయలేదు. ఇన్నాళ్లకు దానిపై బాగా ఫోకస్‌ పడింది. వెంటనే మంత్రిగారికి తోచిన ఆలోచన ఏమిటంటే – ప్రచారం చేయించడం! కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నట్టయిపోయింది. మామూలుగా మరో రాష్ట్రంలో అయితే రాష్ట్ర రాజధాని నిర్మాణం అంటే ఆఫీసులూ అవీ నెమ్మదిగా, చప్పుడు లేకుండా కట్టుకుపోతారు. ఆంధ్రలో అయితే దానికి పెద్ద ప్రచారం. అలా కట్టబోతున్నాం, యిలా కట్టబోతున్నాం అంటూ ఫోటోలు, బ్లూ ప్రింటులు, మంత్రుల విదేశీ పర్యటనలు, విదేశీయులు ప్లాను తయారు చేసి పట్టుకుని  వస్తే అది కూడా పెద్ద ఆర్భాటమే. రాజధానికి నిధుల సేకరణా అంతే. పుష్కరాల సంగతి చెప్పనే అక్కరలేదు. ఆంధ్రకు వస్తున్న ఆదాయమంతా ప్రచారానికే పోతున్నట్టు అనిపిస్తుంది. 

ఆంధ్రప్రదేశ్‌ అని 23 జిల్లాల రాష్ట్రానికై ఒక మాసపత్రిక వెలువడేది. ప్రభుత్వాఫీసులకు, స్కూలు లైబ్రరీలకు వెళుతుంది. బయట కనడడం తక్కువే. దాని ధర రూ.5. సంసారపక్షంగానే కొన్ని పేజీలు మాత్రం కలర్‌లో వేసుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక దానికి మాత్రమే అది పరిమితమైంది. 13 జిల్లాలకే కాబట్టి బజెట్‌ తగ్గి వుంటుంది, గతంలో వేసినన్ని కలరు పేజీలు వేసి వుండరు అనుకుంటున్నారా? అబ్బే, 80 పేజీలు వేస్తే అన్నీ కలరు, ఆర్టు పేపరే. తెలుగు ఇండియా టుడేని తలదన్నేట్లా తయారు చేస్తున్నారు. అదే మూతపడింది. ఇది మన డబ్బుతో నడుస్తోంది కాబట్టి యాడ్‌ రెవెన్యూ ఏమీ లేకపోయినా మూతపడదు. కానీ ప్రచారానికై ఎంత అలవి మీరి ఖర్చుపెడుతున్నార్రా అనిపిస్తుంది చూడంగానే. ఇప్పుడు ర్యాగింగ్‌ అనగానే సినిమా యాక్టర్ల చేత ప్రచారమంటూ చెప్పి టీవీ యాడ్స్‌, హోర్డింగులు మొదలుపెడతారు కాబోలు. ఎన్ని యాడ్‌ కంపెనీలు బాగు పడతాయో చూడాలి. 

దాని సంగతి తర్వాత చూడవచ్చు కానీ ముందు దీనికై ప్రచారం చేసే అర్హత వున్న నటుడు, నటీమణి ఎవరో చెప్పండి చూదాం. టీజింగ్‌ ముదిరితే ర్యాగింగ్‌ కదా. సినిమాల్లో టీజ్‌, ర్యాగ్‌ చేయని హీరో వున్నాడా? టీజింగ్‌ అర్థం కూడా మారుతూ వచ్చింది. ఇదివరకు ఓ మాదిరి టీజింగు వుంటే యిప్పట్లో తను వలచిన దాన్ని ఒసే, ఏమే అనడం, బహిరంగంగా ముద్దు పెట్టుకుంటానని ఛాలెంజ్‌ చేయడం, తాగి యింటిమీదో, హాస్టల్‌ మీదో పడి అల్లరి చేయడం, వద్దురా యీ అల్లరి పనులు అనే కన్నతండ్రిని, చదువు చెప్పే గురువును వెక్కిరించడం, సెటైర్లు వేయడం, వారితో కలిసి మందు కొట్టడం, హీరోయిన్లతో బూతులాడడం – యివీ యీ నాటి హీరో లక్షణాలు. ఇక హీరోయిన్లు కూడా గతంలోలా ఆత్మాభిమానంతో వుండే రోజులు పోయాయి. హీరో మీద పడిపోయి 'శోభనం ఎప్పుడురా, నన్ను తల్లిని ఎప్పుడు చేస్తావురా' అడిగేస్తున్నారు. మందు కొడుతున్నారు. డిసిప్లిన్‌ నేర్పే తండ్రిని ఎదిరిస్తున్నారు. తక్కిన అమ్మాయిలతో కలిసి హీరోని ర్యాగ్‌ చేద్దామని చూస్తున్నారు, ఫోన్‌ చేసి హాస్టళ్లకు అబ్బాయిలను రప్పించి వార్డెన్‌ గదిలోకి తోసేసి నెట్టేస్తున్నారు. ఇలాటి పాత్రలు ధరించి తెరపై ఒక యిమేజిని తెచ్చుకున్న తారలు టీవీల్లో కనబడి 'ర్యాగింగ్‌ తప్పమ్మా' అని చెప్తే ఎంత హాస్యాస్పదంగా వుంటుంది? 

అసలు తారల చేత ప్రచారమెందుకు? యూనివర్శిటీలో ర్యాగింగ్‌ సంఘటన బయటపడిన తర్వాత ప్రభుత్వం తీరు ఎలా వుంది? నివేదిక వచ్చేదాకా ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేయలేదు. ఆయన స్టూడెంట్స్‌తో కలిసి డాన్సు చేస్తున్న వీడియో బయటకు రాగానే సస్పెండ్‌ చేసి వుంటే ప్రజాగ్రహం కొంతైనా చల్లారేది. న్యాయం జరుగుతుందనే ఆశ కలిగేది. అలా చేయకపోవడానికి కారణాలు తెలియక రకరకాల ఊహలు పుట్టుకుని వచ్చాయి. డైరీలో పేర్లు కొట్టివేయడం దగ్గర్నుంచి అన్నీ అనుమానాస్పదంగానే వున్నాయి. ఫైనల్‌గా ఆమె మానసిక స్థితి బాగాలేదని తోచేట్లా, ప్రచారం అందుకున్నారు. మామూలు సంఘటనలకే తీవ్రంగా స్పందించే సెన్సిటివిటీ కలిగివుండడం ఆమె తప్పుగా చూపిస్తున్నారు. ఏది మామూలో, ఏది కాదో వారినే అడగాలి. నాగార్జున యూనివర్శిటీలో కులసంఘాల గురించి, హాస్టల్లో వున్న విద్యార్థుల ప్రవర్తన గురించి, ఫిర్యాదు చేసే విద్యార్థినుల పట్ల టీచర్ల నిర్లక్ష్యం గురించి అనేక కథనాలు బయటకు వచ్చాయి.   కాలేజీలోనే ఆడిటోరియం వుండగా ఫ్రెషర్స్‌ డే లాటి దాన్ని హాయ్‌లాండ్‌లో ఎందుకు చేయాలి, రాత్రి ఎందుకు చేయాలి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలా చేయడం, యీనాటి కాలేజీలన్నిటికీ పరిపాటి అయిందని, ప్రిస్టేజి సింబల్‌ అయిందని కొందరు వివరిస్తున్నారు. నాగార్జున యూనివర్శిటీలో యీ సంఘటన జరిగింది కాబట్టి యివన్నీ చర్చకు వచ్చాయని, తక్కిన వాటిల్లో కూడా యిలాటి పరిస్థితే యించుమించుగా వుందని కొందరి వ్యాఖ్యలు. అక్కడున్న వారికే నిజానిజాలు తెలుస్తాయి. 

తెలంగాణ ఉద్యమసందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీని మూసివేయాలని లగడపాటి రాజగోపాల్‌ ప్రకటన చేసినపుడు నేను దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన్ను దుయ్యబట్టాను. చదువుకోవడానికి కాస్తయినా అవకాశమివ్వండి మహాప్రభో అన్నాను. ఉస్మానియా గురించి అలా మాట్లాడిన రాజగోపాల్‌ గారికి తన ముక్కు కింద వున్న నాగార్జునలో ఏం జరుగుతోందో తెలియదనుకోవాలా? ఉస్మానియా కూడా అలా తయారవాలనుకున్నారా? ఆంధ్ర రాజధాని అక్కడే రాబోతోంది. ఆంధ్రుల ఆర్థిక, సాంస్కృతిక, పారిశ్రామిక, న్యాయవ్యవహారాల, అంతెందుకు అన్ని రకాల కార్యకలాపాలకు రాజధాని అదే. అక్కడ వున్న యూనివర్శిటీలో వ్యవహారాలు యింత కంపు కొడుతున్నాయి. కంపు బయటకు వచ్చాక కూడా తక్షణ చర్యలు చేపట్టలేదు. ఇప్పుడీ నివేదికను అమలు చేస్తారో, నీరు కారుస్తారో రెండు, మూడేళ్ల తర్వాతే తెలుస్తుంది. అమ్మాయి సున్నితత్వమే ఆమె చావుకి కారణం అని ఎప్పుడైతే పల్లవి అందుకున్నారో, అప్పటి నుంచే సందేహాలు మొదలయ్యాయి. చిన్నపిల్లలు తెలియక చేశారు, ఇప్పుడు కఠినమైన శిక్ష వేసి వాళ్ల కెరియర్‌ నాశనం చేస్తే మాత్రం రిషితేశ్వరి మళ్లీ బతికి వస్తుందా అనే వాదనలు తప్పక వస్తాయి. రిషితేశ్వరి కుటుంబానికి 10 లక్షలిచ్చాం. కావాలంటే తన పేర ఒక ఎవార్డు పెడదాం అంటూ పరిష్కార మార్గాలు (?) చూపిస్తారు. ఈలోగా యింకో అమ్మాయి గొడవ వస్తుంది. మనం మర్చిపోతాం. ఇప్పటికైనా దీన్ని అరికట్టడం, పోనీ అది కుదరకపోతే హద్దుల్లో వుంచడం జరగాలంటే వ్యవస్థను క్షాళన చేయాలి. ఎలా అనే దాని గురించి ఇప్పటికే అనేకమంది నిపుణులు నివేదికలు యిచ్చి వుంటారు. చిత్తశుద్ధితో వాటిని అమలు చేస్తే చాలు. నిపుణులెవ్వరూ సినిమా యాక్టర్ల చేత టీవీల్లో ప్రచారం చేయించమని చెప్పి వుంటారనుకోను. జనాభాలో కాలేజీ విద్యార్థుల శాతం 1% కూడా వుండదు. ర్యాగింగ్‌ చేయవద్దని తక్కిన 99%కు సుత్తి దేనికి? వాళ్లని యిప్పటికే ప్రభుత్వమూ, పార్టీలు ర్యాగ్‌ చేస్తున్నాయి. హితవు చెప్పవలసిన వాళ్లకు చెప్తే చాలు. హితోక్తులు వినకపోతే కఠినంగా శిక్షించడం మొదలుపెడితే ర్యాగింగ్‌ దానంతట అదే ఆగుతుంది. ర్యాగ్‌ చేస్తున్నవారి ఫోటోలు, వివరాలు మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తే వారి బంధుమిత్రులు సంఘంలో తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. ఆ భయం చేత ర్యాగ్‌ చేయడం మానేస్తారు. అందువలన ప్రచారానికి ఉపయోగిస్తే వారి ఫోటోలు వుపయోగించండి, తప్ప సినిమా యాక్టర్లవి అక్కరలేదు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2015)

[email protected]