ఎమ్బీయస్‌ : రాజమహల్‌పై పగా?

రాజస్థాన్‌ ముఖ్యమంత్రిణి వసుంధరా రాజేకు, ఆమె ఒకప్పటి స్నేహితురాలు, జయపూర్‌ రాజమాత ఐన పద్మినీదేవికి మధ్య ఓ రాజమహల్‌ విషయంలో గొడవ నడుస్తోంది. 1729లో మహారాజా జయ్‌ సింగ్‌ తనకై, తన రాణులకై జయపూర్‌లో…

రాజస్థాన్‌ ముఖ్యమంత్రిణి వసుంధరా రాజేకు, ఆమె ఒకప్పటి స్నేహితురాలు, జయపూర్‌ రాజమాత ఐన పద్మినీదేవికి మధ్య ఓ రాజమహల్‌ విషయంలో గొడవ నడుస్తోంది. 1729లో మహారాజా జయ్‌ సింగ్‌ తనకై, తన రాణులకై జయపూర్‌లో పెద్ద మహల్‌ కట్టిస్తూండగా అతని రాణుల్లో ఒకరైన చంద్రా కఁవర్‌ రణావత్‌ అనే ఆవిడ తను అందరితో కలిసి వుండనని చెప్పి తనకై ఆ మహల్‌కు 10 కి.మీ. దూరంగా రాజమహల్‌ ప్యాలెస్‌ కట్టించమని కోరింది. కట్టక తప్పలేదు రాజుగారికి. మూడు శతాబ్దాలు గడిచాక దాని విలువ రూ.5 వేల కోట్లయింది. ఆ కుటుంబానికి చెందిన పద్మినీదేవి ఆ ఆస్థికి అధిపతి. జయపూర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (జెడిఎ) కమిషనర్‌ రోడ్డు విస్తరణకు అడ్డుగా వుందన్న మిషతో ఆగస్టు 24న ఆ మహల్‌పై దాడికి వెళ్లడంతో కథ రచ్చకెక్కింది. అంతకు కితం వారం యీ విషయంపై పద్మిని వసుంధర వద్దకు వెళ్లి చర్చలు జరిపింది. ఆగస్టు 24 న కమిషనర్‌ కూల్చివేతలు తలపెట్టారని తెలిసి 22న పద్మిని ఫోన్‌ చేస్తే వసుంధర 'మహల్‌ ముందు రోడ్డు విస్తరణ చేసుకుంటారు తప్ప మరేమీ జరగద'ని హామీ యిచ్చింది. పద్మిని కుమార్తె, బిజెపి పక్షాన సవాయ్‌ మాధోపూర్‌ ఎమ్మెల్యే ఐన దియా కుమార్‌ అగర్వాల్‌తో మాట్లాడింది – 'మా కుటుంబం వాదనలన్నీ విన్నాకనే ఏదైనా తలపెట్టండి.' అని. ఆయన సరే అన్నాడు కానీ 24 న పోలీసులతో సహా 600 మందిని, బుల్‌డోజర్లను వెంటేసుకుని మహల్‌ ప్రవేశద్వారం ముందున్న ప్రాంతానంతటినీ చుట్టుముట్టి గేటు మూసేసి, సీలు వేసి, అక్కడున్న పురాతన భవనాన్ని కూల్చివేశాడు. ఇదంతా మీడియా ముందే జరిగింది. విధ్వంసం ఆపమని కోరుతూ దియా అక్కడకు వచ్చి కమిషనర్‌ను ప్రాధేయపడడం కూడా మీడియా కవర్‌ చేసింది. దియా అడగ్గాఅడగ్గా చివరకు కమిషనర్‌ కూలుద్దామనుకున్న మరో బిల్డింగును అలాగే వదిలేసి, ముఖద్వారానికున్న గేట్లకు తాళం వేసి మరీ వెనుదిరిగారు. 

దియా పేరు మీద వున్న ఆ మహల్‌ను ఢిల్లీకి చెందిన జైసాల్‌ సింగ్‌ గారి సుజన్‌ గ్రూపుకి 2014లో 10 సం||రాల లీజుకి యిచ్చారు. తక్కినది పద్మిని కుటుంబం అజమాయిషీలో వుంది. దానిలో 2700 చ.గ.ల భూమిని, సింహద్వారాన్ని తీసుకుందామని జెడిఏ చూస్తోంది. స్వాతంత్య్రానంతరం మహారాజాకు, భారత ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ప్రకారం 34 వేల చ.గ.లు ప్రభుత్వానికి వచ్చింది. అది యిప్పుడు జెడిఎ అజమాయిషీలో వుంది. తక్కిన 2700 చ.గ.ల స్థలం కూడా తీసుకుందామని జెడిఎ ప్రయత్నిస్తే పద్మిని కుటుంబం కోర్టుకి వెళ్లింది. 2011లో తీసుకోవడానికి వీల్లేదంటూ కోర్టు ఆర్డరిచ్చింది. ఇప్పుడా కార్నర్‌ ప్లాట్‌ రూ.వెయ్యి కోట్ల విలువ చేస్తుంది. దాన్ని స్వాధీనం చేసుకుందామని జెడిఎ ప్రయత్నం. దానికోసం మొరటు పద్ధతులు వుపయోగించింది. ఈ చేష్టకు వ్యతిరేకంగా రాజకుటుంబం ప్రజల మద్దతు కోరింది. రాజకుటుంబంపై గౌరవం కలిగిన ప్రజలు, ముఖ్యంగా రాజపుత్రులు, వారికి అండగా నిలిచారు. 'మాకు ఆరెస్సెస్‌తో చాలాకాలంగా సత్సంబంధాలున్నాయి. మా అమ్మాయి బిజెపి ఎమ్మెల్యే. అయినా మాకిలా జరిగిందంటే దానికి అర్థం ఏమిటి? ముఖ్యమంత్రికి తెలియకుండానే యింత పెద్ద పని జరుగుతుందా? నేను వసుంధర దగ్గరకి వెళ్లి దేబిరించను. న్యాయం ఎవరి పక్షాన వుందో ప్రజలిచ్చే తీర్పే నాకు ముఖ్యం.'' అంది పద్మిని. కోర్టులో కేసు కూడా పెట్టింది. 

తర్వాత బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా దృష్టికి వివాదాన్ని తీసుకెళ్లింది. అమిత్‌ వెంటనే వసుంధరకు ఫోన్‌ చేసి రాచకుటుంబాన్ని యిలా వీధిలోకి యీడిస్తే ఎలా అని మందలించి, బిజెపి నేషనల్‌ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ సౌదన్‌ సింగ్‌ను రాయబారానికై జయపూర్‌ పంపాడు. అతను వసుంధరకు, పద్మినికి మధ్య సమావేశం ఏర్పాటు చేశాడు. తర్వాత సెప్టెంబరు 4న ప్రధానద్వారం వద్ద గేటుకి తాళం తీసేశారు. రెండు రోజుల తర్వాత స్థానిక కోర్టు జెడిఎను తప్పుపట్టి, యథాతథ పరిస్థితి నెలకొల్పమంది. పడగొట్టినవాటిని సొంత ఖర్చుతో నిర్మించి యివ్వమంది. జెడిఎ హైకోర్టుకి అప్పీలుకై వెళ్లింది. హైకోర్టు గేటు తెరవండి కానీ మళ్లీ కట్టాలా లేదా అన్నదానిపై ఆలోచించి చెప్తామంది. 

ఉద్రిక్తత చల్లబడింది అనుకుంటూండగా జెడిఎ కమిషనర్‌ అగర్వాల్‌ అక్టోబరు 28 రాత్రి తన డిప్యూటీ కమిషనర్‌ను, కొందరు అసిస్టెంట్లను పంపించి జెడిఏ ఆస్తి ఎంతవరకు వుందో మార్కింగ్‌ చేసి రమ్మన్నాడు. వాళ్లు ఆ పని చేస్తూండగానే పద్మిని అల్లుడు నరేంద్ర సింగ్‌ మెయిన్‌డోరు గేట్లు మూసేసి తాళం వేసేశాడు. అధికారులు లోపల యిరుక్కుపోయారు. వాళ్ల వాహనాల్లో గాలి తీయించేశాడు నరేంద్ర. అధికారులను రక్షించడానికి పోలీసులు కూడా భయపడ్డారు. చివరకు బిజెపి నాయకులు రాజీ చేసి మర్నాడు ఉదయం అధికారులను విడిపించారు. పద్మినికి వసుంధర పట్ల కోపం పోలేదు. జయపూర్‌లో మెట్రో నిర్మాణ సందర్భంగా కొన్ని పాత గుళ్లు పడగొడుతున్నారు. కొందరు ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తూ నవంబరు 15 న బంద్‌ ప్రకటించారు. పద్మిని దానికి తన మద్దతు ప్రకటించింది. 

ఇద్దరు పెద్ద కుటుంబాల మధ్య తగవులో యిరుక్కున్న కమిషనర్‌ అగర్వాల్‌కు, జెడిఎ సెక్రటరీ పవన్‌ అరోడాకు నవంబరు 3 న స్థానచలనం జరిగింది. ఇంతలో ఆగస్టు 24 నాటి ఘటనపై వేసిన కేసులో ఒక మేజిస్ట్రేటు అగర్వాల్‌, అరోడా, మరో ముగ్గురు కమిషనర్‌ ఆఫీసు ఉద్యోగులపై బెయిలబుల్‌ అరెస్టు వారంటు జారీ చేశాడు. నవంబరు 25 న కోర్టుకి హాజరు కావాలన్నాడు. ఈ లోగా నవంబరు 9 న నిందితులు, రాజస్థాన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముకేశ్‌ శర్మ హైకోర్టులో హాజరై సంఘటనల క్రమాన్ని వివరించారు. కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అసలు ఆగస్టు 24 న అంత దూకుడుగా ఎందుకు వెళ్లావని అగర్వాల్‌ని అడిగితే ''రాజమహల్‌ ప్యాలెస్‌ పక్కనే ఆ 2700 చ.గ.ల స్థలంలో పద్మిని గారు రెసిడెన్షియల్‌ ఫ్లాట్స్‌ కట్టడానికి  జయపూర్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు. రాజమహల్‌ దియా పేరు మీద వుంది కానీ పక్కనున్న యావత్తు స్థలం జెడిఏదే. ఫ్లాట్స్‌ కట్టడానికి అనుమతి కోరడం ద్వారా వీళ్లు జెడిఏ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారని అర్థమైంది.' అన్నాడు. ''వసుంధర స్వయంగా అడిగి వుంటే ఆ స్థలాన్ని ఉత్తినే, ఏ పరిహారం కోరకుండా యిచ్చేసి వుండేవాళ్లం'' అంటాడు పద్మిని అల్లుడు. దాని నిజమైన హక్కుదారులు ఎవరో తేలేదాకా కమిషనర్‌ చేసినది తప్పని కాని, ఒప్పని కాని అనలేం. (ఫోటో – కూల్చివేత దృశ్యం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2016) 

[email protected]