ఎమ్బీయస్‌ : రాజీవ్‌ హంతకులను వదలడం సబబేనా?-1

రాజీవ్‌ గాంధీ హత్య అతి పకడ్బందీగా జరిపిన కుట్ర. జరిపినది అత్యంత క్రూరమైన టెర్రరిస్టు సంస్థ. సాటి మనుష్యుల పట్ల ఏ మాత్రం జాలి, కరుణ చూపని సంస్థ అది. సాటి శ్రీలంక తమిళులు…

రాజీవ్‌ గాంధీ హత్య అతి పకడ్బందీగా జరిపిన కుట్ర. జరిపినది అత్యంత క్రూరమైన టెర్రరిస్టు సంస్థ. సాటి మనుష్యుల పట్ల ఏ మాత్రం జాలి, కరుణ చూపని సంస్థ అది. సాటి శ్రీలంక తమిళులు కానీ, సింహళీయులు కానీ, భారతీయలు తమిళులు కానీ తమ దారికి అడ్డువస్తే ఎవరినైనా చంపడానికి ఏ మాత్రం సంకోచించనివారు. రాజీవ్‌ గాంధీని హత్య చేసే క్రమంలో ఆయనను ఒక్కణ్నే చంపలేదు. తోడుగా 16 మందిని చంపారు. వారిలో తొమ్మిదిమంది పోలీసు ఆఫీసర్లు. నళినికి క్షమాభిక్ష ప్రసాదించిన సోనియా ఈ 17 మంది మృతుల కుటుంబసభ్యులతో సంప్రదించి ఆ పని చేయలేదు. రాజీవ్‌ గాంధీ మాజీ ప్రధాని కావచ్చు (వాళ్లబ్బాయి దృష్టిలో అతను అప్పటి 'ప్రధాని') కానీ యితరుల ప్రాణాలు కూడా వారి కుటుంబసభ్యులకు విలువైనవే. రాజీవ్‌ భార్య చెప్పింది కదాని నళినికి శిక్ష తగ్గించడమేమిటో తెలియదు. వారిలో మృత్యుదండన పడిన ముగ్గురికి క్షమాభిక్ష తిరస్కరించడం లేటయిందట, అందువలన సుప్రీం కోర్టు వారికి జీవిత ఖైదు చాలంది. అది కూడా ఎందుకు, విడిచిపెట్టేస్తే మరీ మంచిది అని నిర్ణయించింది జయలలిత. భేషుగ్గా వుంది యీ నిర్ణయం అంటూ తమిళనాడు పార్టీలన్నీ తాళం వేస్తున్నాయి – బిజెపి తప్ప, కొంతమేరకు కాంగ్రెసు తప్ప!

హత్య చేసినవారికి మరణశిక్ష పడకపోవడం కొన్ని సందర్భాల్లో తప్పనిపించదు. క్షణికావేశంలో హత్య చేసినవారుంటారు. సమాజంలో అట్టడుగు వర్గాల వారు తాము పెరిగిన వాతావరణం వలన తప్పుదారిలో పడిపోయి, మంచేదో, చెడేదో విచక్షణ లేక ప్రవర్తించిన కేసులు కూడా వుంటాయి. వీటిలో కోర్టులే కాస్త ఉదారంగా వ్యవహరిస్తాయి. అవి కఠినంగా వున్నచోట రాష్ట్రపతి వంటివారు ఔదార్యం కనబరుస్తూ వుంటారు. రాజీవ్‌ హంతకులు సమాజం చేత అణచబడినవారు కారు, క్షణికావేశంలో చేయలేదు. ఎన్నో నెలలుగా ప్లాన్‌ చేసి మరీ చంపారు. చిన్న వయసులోనే యింత క్రౌర్యం నింపుకున్న వీళ్లని జైల్లో పెట్టకుండా వుంటే యింకో పదిమంది నాయకులను, వారి చుట్టూ వున్న వేలాది మందిని చంపగల సమర్థులు. వీళ్లకు తమిళనాడులో కొన్ని పార్టీల మద్దతు ఎప్పుడూ వుంది. తమిళులు కాబట్టి వీళ్లు ఏం చేసినా వాళ్లకి మహబాగే. నిర్భయ కేసులో నిందితుల గురించి ఆలోచించండి. వాళ్లకు చదువు లేదు, సంస్కారం లేదు, కుటుంబ వాతావరణం లేదు, ఊరొదిలి పారిపోయి వచ్చి మురికి వాడల్లో పెరుగుతూ, మురికి ఆలోచనలతో తేలియాడుతూ, తాగిన మైకంలో నిర్భయపై అత్యాచారం జరిపారు. వాళ్లు అజ్ఞానులు పాపం వదిలేయండి అంటున్నామా? మరి అలాటప్పుడు వీళ్లనెందుకు క్షమించాలి? వాళ్లందరూ కలిసి చంపినది ఒక్క ఆడపిల్లను. మరి వీళ్లు రాజీవ్‌నే కాదు, పక్కనున్న 16 మంది సాటి తమిళులను కూడా చంపారే, వాళ్లు చేసిన పాపం ఏమిటి అని ఒక్క నిమిషమైనా వీళ్లు ఆలోచించారా? అలాటి వాళ్ల గురించి మనం జాలిపడాలా? 

వాళ్లు హత్య చేయడంలో కిరాతకులే కాదు, పోలీసులకు పట్టుబడిన తర్వాత కూడా భారతీయ చట్టాలతో ఆటలాడుకున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేసిన జిత్తులమారులు. అవి తెలియకుండా 23 ఏళ్లగా వాళ్లు జైల్లో మగ్గుతున్నారు పాపం, యిన్నాళ్లు విచారణ ఆలస్యం చేయడం ప్రభుత్వం తప్పే కదా అంటున్నారు కొందరు. దానికి కారణం ఎవరో ఎవరైనా ఆలోచించారా? హత్య జరిగిన ఎనిమిదేళ్లకు సుప్రీం కోర్టు తీర్పు 1998 జనవరిలో వచ్చింది. ముద్దాయిలు అప్పీలు కెళ్లారు. 1999 మేలో తుది తీర్పు వచ్చింది. 1991 మే 21 న రాజీవ్‌ హత్య జరిగితే  సరిగ్గా ఏడాదికి సిట్‌ వాళ్లు స్పెషల్‌ కోర్టులో  చార్జిషీటు దాఖలు చేశారు. నిజానికి ఇది ఒక రికార్డు. ఆ చార్జిషీటు వేసే లోపునే యీ నిందితులు 112 పిటీషన్లు వేశారు. చాలావరకు ప్రత్యేక కోర్టులో వేశారు. కొంతమంది చెన్నయ్‌ హైకోర్టులో వేశారు. ఇంకొందరు సుప్రీం కోర్టుకి కూడా వెళ్లారు. వీటిలో చాలాభాగం బెయిల్‌ కోరుతూ, రాజీవ్‌ హత్య కేసులో టాడా చట్టం వుపయోగించడాన్ని సవాలు చేస్తూ వేసినవి. ఇక ముద్దాయిలను చెంగల్పట్టు జైలులో వేర్వేరు గదుల్లో పెడితే 'అలా పెట్టడం అన్యాయం' అంటూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ముందు కేసు వేశారు. చూడండి వాళ్ల రుబాబు. జైల్లో అందరినీ ఒకే గదిలో వుంచితే మరొక నాయకుణ్ని హత్య చేయడానికి ప్లాను వేద్దామనా?

సిట్‌ వేసిన చార్జిషీటుకి 10 వేల పేజీల నోట్సు జతపరిచారు. 26 మంది నిందితులున్నారని 26 సెట్లు తయారుచేసి వాళ్లకు యిస్తే వాళ్లు 'వాటిలో చాలాభాగం ఇంగ్లీషులో వున్నాయి, మాకు తమిళంలోకి అనువదించి యివ్వాలి' అని కోర్టుకి అర్జీ పెట్టుకున్నారు. శవపరీక్షలకు సంబంధించిన పదాలు, అనేక సాంకేతిక పదాలు ఇంగ్లీషు నుండి తమిళంలోకి అనువదించడం కష్టం. నిపుణులు కావాలి. చాలా కష్టపడి చేయించారు. విచారణ ప్రారంభమయ్యేసరికి పైన చెప్పిన 112 పిటిషన్లు వేసిన లాయర్లు ముద్దాయిలకు విచారణ జాప్యం చేసే ఉపాయాలు చెప్పారు. వాటి ప్రకారం యీ ముద్దాయిలు 'మాకు అండగా ఎవరూ లేరు, రాం జెఠ్మలానీ, శాంతిభూషణ్‌ వంటి పెద్ద లాయర్లను మా తరఫున వాదించవలసినదిగా మీరు కోరండి' అని ప్రత్యేక కోర్టుకు అర్జీ పెట్టుకున్నారు. రూలు ప్రకారం కోర్టు వాళ్లు ఆ లాయర్లకు రాయాలి. వాళ్లు కుదరదు అని జవాబు రాయాలి. అప్పుడు కానీ విచారణ ప్రారంభించడానికి లేదు. ఇలా కొన్ని నెలలు గడిపారు. చివరకు 25 మంది ముద్దాయిలకు వకాల్తా తీసుకునేందుకు కోర్టు 10 మంది న్యాయవాదులను నియమించింది.  ఇలా విచారణ ఒక ఏడాది ఆలస్యమై 1993 మేలో ప్రారంభమైంది. ఇక డిఫెన్సు న్యాయవాదుల తమాషా ప్రారంభమైంది. అందరికీ యింగ్లీషు వచ్చినా ప్రాసిక్యూషన్‌ వాళ్లు చేసిన ప్రకటనలకు తమిళ అనువాదాలు కావాలంటూ పట్టుబట్టారు. అలా ఆలస్యం చేశారు. 

ఎల్‌టిటిఇ వారు సైనైడ్‌ మింగుతారని అందరికీ తెలుసు. జైల్లో పెట్టినవారిని పలకరించడానికి వచ్చినవారు సైనైడ్‌ గొట్టాలు అందిస్తే వీళ్లు అవి మింగేసి చచ్చిపోతే కేసు దెబ్బ తినిపోతుంది. అందుకని ముద్దాయిలకు, విజిటర్స్‌కు మధ్య అద్దాల గోడ పెట్టి మైకులూ, స్పీకర్లూ అమర్చారు. అది ముద్దాయిలకు నచ్చలేదు. మమ్మల్ని అధికారులు వేధిస్తున్నారు, నిరసనగా మేం కోర్టులకు రాం అని భీష్మించారు. అందరూ కలిసి హైకోర్టులో ఉమ్మడి పిటిషన్‌ పెట్టుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు స్వయంగా వచ్చి పరిస్థితి చూసి వాళ్ల పిటిషన్‌ కొట్టివేసేదాకా స్పెషల్‌ కోర్టులో విచారణ ఆగిపోయింది.  చివరకు స్పెషల్‌ కోర్టు ముద్దాయిలపై 251 అభియోగాలు మోపేసరికి 1993 డిసెంబరు వచ్చింది. 1994 జనవరి నుండి వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి.  288 మంది సాకక్షులు. వారి సాక్ష్యాలు నమోదుచేయడం, క్రాస్‌ పరీక్ష యివన్నీ నాలుగేళ్లలో 600 పనిరోజుల పాటు సాగింది. దీనికి కారణం ముద్దాయిలు, వాళ్ల తరఫున న్యాయవాదులు అడుగడుగునా అడ్డు తగలడం. ఇది జరుగుతూండగానే 432 పిటిషన్లు దాఖలయ్యాయి. అదీ వేర్వేరు కోర్టులలో, వేర్వేరు ఊళ్లల్లో. సిట్‌ సిబ్బంది అన్ని చోట్లకు వెళ్లి కోర్టులకు హాజరవుతూ వాటిని ఎదుర్కుంటూ రావలసి వచ్చింది. ఎక్కడ ఏది హాజరు కాకపోయినా ఆ కోర్టు స్టే యిచ్చిందంటే యిక్కడ పని ఆగిపోతుంది. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2014)

[email protected]