ఆగస్టు 19 – 'శివరాజన్ దొరికాడు కానీ శవంగా..' అన్న వాస్తవం సిట్‌ను క్రుంగతీసింది. సమాచారం తెలిసిన వెంటనే కార్యాచరణలోకి దిగకుండా తాత్సారం చేసి, కీలకమైన నిందితుణ్ని చేజార్చుకున్నారని అందరూ దుమ్మెత్తి పోశారు. దీనిపై సిట్ యిచ్చే సమాధానం ఏమిటి? కార్తికేయన్ రాసిన పుస్తకంలో ఆయన వివరణ యిది – 'ఆగస్టు 18 రాత్రే శివరాజన్ ముఠా వున్న శిబిరాన్ని ముట్టడించి వుండేవాళ్లం. కాని, అలా జరగలేదు. అందుకు ప్రధాన కారణం – అర్థంపర్థం లేని విమర్శలు మా వ్యూహాలకి, కార్యాచరణకి అడ్డం పడుతూ వుండడం. సమయం వృథా చేయకుండా ఇందిరా నగర్ రహస్య శిబిరాన్ని ముట్టడించినప్పుడూ మమ్మల్ని విమర్శించారు – తొందరపడ్డామని. సమయం తీసుకుని ముట్టడిస్తే – ఇప్పుడూ మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇందిరా నగర్ దాడిని మెరుపువేగంతో నిర్వహించి, సైనైడ్ మింగిన టైగర్లకు సైనైడ్ విరుగుడు మందు యిప్పించినా వాళ్లు చనిపోయారు. ఇప్పుడు కూడా 'అనవసరంగా తొందర పడ్డారు' అంటూ మామీద విమర్శల వర్షం కురిసింది. ఒక పత్రిక ''రాజీవ్‌కి ఆయన్ని హత్య చేసిన వారి శవాలను పుట్టినరోజు బహుమతిగా యివ్వడం కోసమే సిట్ దళాలు యీ దాడిని జాప్యం చేశాయా?' అంటూ ప్రశ్నించింది కూడా..! పార్లమెంటులో విమర్శలు సరేసరి..' అంటూ వాపోయారు.
ఆ విమర్శల్లో ఏ మేరకు సబబు అనేది 23 ఏళ్లు గడిచాక యిప్పుడు సమీక్షించి చూద్దాం. శివరాజన్ ముఠాపై దాడి ఎందుకు ఆలస్యమైంది? సైనైడ్ విరుగుడు మందులు అందుబాటులో లేకపోవడం చేత! అందుబాటులో వున్నవి ప్రభావవంతమైనవి కావు అని నిపుణుడు ఫీలవడం వలన. అవి ప్రభావవంతమైనవి కావు అనే సంగతి ఇందిరా నగర్ దాడి సమయంలోనే తెలిసిపోయింది కదా, అవి యిచ్చినా అరసన్, కులతన్ చనిపోయారు. వెంటనే గ్వాలియర్ నుంచి కొత్త బ్యాచ్‌వి తెప్పించి పెట్టుకుని వుండవచ్చు కదా! శివరాజన్ ముఠా స్థావరం తెలిసిన తర్వాతనే తెప్పించకోవడం వింతగా లేదూ! ఏ క్షణంలో నైనా వాళ్ల స్థావరం కనిపెట్టేస్తామని ఆగస్టు 3 నుండి సిట్ అనుకుంటోంది కదా! ఎప్పటికప్పుడు శివరాజన్ ముఠా వెంట్రుకవాసిలో తప్పించుకుంటోంది. ఒకవేళ దొరికితే ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి అన్న యాక్షన్ ప్లాన్ వేసుకోలేదా? కోననకుంటెలో వున్నారని నిర్ధారణగా తెలిసిన తర్వాత అప్పుడు ఢిల్లీ నుంచి విజయ్ కరణ్ వచ్చి ఏం చేయాలా అని చర్చించడం ఏమంత తెలివైన పని? అంతసేపు మాటు వేసి వుంటే ఏదైనా జరగవచ్చు అన్న యింగితం లేదా? లారీ అడుసులో కూరుకుపోవడం, యింజను పెద్ద శబ్దం చేయడం వలన యింత అనర్థం జరిగింది, అది దురదృష్టం అనుకుందామంటే యిలాటి దురదృష్టాలను, అనుకోని సంఘటనలను కూడా ముందే వూహించవద్దా? రాజీవ్ హత్యాస్థలం వద్ద అనుకోకుండా కెమెరా దొరికి ఎల్‌టిటిఇ లింకు బయటపడడం సిట్ అదృష్టం అని అందరికీ తెలుసు. అన్ని సార్లూ అదృష్టం కలుగుతుందని చెప్పగలమా? దురదృష్టవశాత్తూ ఏమైనా జరిగితే, ఏ పోలీసైనా తొందరపడి కాలిస్తే…? అనేది లెక్కలో వేసుకోనక్కరలేదా?
నిజానికి బ్యాంకు దోపిడీలు అవీ జరిగినపుడు ప్రొఫెషనల్స్ తొందరపడి తుపాకీ కాల్చరు. వారి గ్రూపులో సహాయకుడిగా వచ్చిన ఎమెచ్యూర్ ఎవడో తొందరపాటుతో, తత్తరపాటుతో కాల్చి నేరం పెద్దది కావడానికి, చివర్లో పట్టుబడడానికి కారణభూతుడవుతాడు. శివరాజన్ శిబిరం ముందు వందలాది మంది గుమిగూడి నపుడు ఆ ప్రజల్లో రాజీవ్ అభిమానో, టైగర్ల వ్యతిరేకో ఎవడో కసి కొద్దీ శిబిరంపై రాయో, రప్పో విసిరి వుంటే వాళ్లు ఎలర్ట్ అయ్యేవారు కారా? టైగర్ల అభిమాని కూడా రాజీవ్ అభిమానిగా నటిస్తూ రాళ్లేసి, కేకలేసి వాళ్లను ఎలర్ట్ చేయవచ్చు కదా! సీక్రెట్ ఆపరేషన్ జరగాల్సిన స్థలం చుట్టూ వందలాది మంది జనం పోగుపడితే ఎంత అస్తవ్యస్తంగా తయారవుతుంది? కార్తికేయన్ ఏం చెప్పినా, మరొకరు ఏం చెప్పినా చివర్లో మాత్రం భశుం అయ్యింది. శివరాజన్, శుభ చచ్చిపోయారు కదా అనవచ్చు. అతను సజీవంగా దొరికి వుంటే ఎల్‌టిటిఇ పాత్రను సులభంగా నిర్ధారించేవారు. దొరక్కపోవడం వలన యితర సాక్ష్యాలను చూపవలసి వచ్చింది. శివరాజన్ రాసిన కవితతో పాటు శుభ చేతికి వున్న ఎచ్‌ఎంటి వాచ్‌ను కూడా సాక్ష్యంగా చూపారు. మే చివరి వారంలో రవి, సుశీంద్రన్‌లు పొల్లాచిలోని సుశీంద్రన్ స్నేహితుడొకడి యింట్లో శుభను దాచినప్పుడు అతను ఆమెకు బహుమతిగా యిచ్చాడని సిట్ నిర్ధారించుకుంది. సజీవంగా దొరికి వుంటే యిలాటి చిల్లర సాక్ష్యాల అవసరం పడి వుండేది కాదు.
xxxxxxxxxxxxxxx
రాజీవ్ హంతకుల్లో సూత్రధారి మరణంతో యీ కథ ముగిసిపోయింది అనుకోకూడదు. నేరాన్ని, నేరస్థుల్ని నిర్ధారించడానికి, కుట్ర కోణం గురించి కోర్టును, ప్రపంచాన్ని నమ్మించడానికి అవసరమైన సాక్ష్యాధారాల్ని సేకరించ వలసిన పని వుంది. శివరాజన్‌ను బెంగుళూరు తరలించిన తిరుచ్చి శంతన్‌ను పట్టుకోవాల్సి వుంది… తరలించిన రంగన్‌ను కూడా! సిట్ ఆ పని మీదే వుంది.
xxxxxxxxxxxxxxx
శివరాజన్ చావుతో ఎల్‌టిటిఇ నిర్ఘాంతపోయింది. ఇదెలా జరిగిందో నిర్ధారించుకోవడానికి ఎల్‌టిటిఇ ఇంటెలిజెన్సు విభాగం అధిపతి పొట్టు అమ్మన్ రవి, తిరుచ్చి శంతన్, రమణన్‌లను జాఫ్నా రప్పించదలుచుకున్నాడు. రవి పూర్తి పేరు రవిచంద్రన్, ప్రకాశం అనే మారుపేరు కూడా వుంది. ఇతను పొట్టు అమ్మన్ దళానికి చెందిన భారతీయుడు. టిఎన్‌ఆర్‌టి (తమిళ జాతీయ పునరుద్ధరణ దళం) అని నడుపుతూ ఎల్‌టిటిఈ కోసం టైగర్లపై సానుభూతి గల భారతీయ తమిళులను జాఫ్నా తీసుకెళ్లి తర్ఫీదు యిప్పిస్తాడు, ఇక రమణన్ కాంతన్ వద్ద వైర్‌లెస్ ఆపరేటర్. ''నేను ఆగస్టు 27న ఒక బోటును రహస్యంగా పంపుతాను. జాఫ్నా రండి'' అని కబురు పంపాడు.
ఆగస్టు 27 – ఆ రోజున బోటు వచ్చింది. ముగ్గురూ జాఫ్నా వెళ్లి పొట్టు అమ్మన్‌కు జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పారు. తమిళనాడులో పరిస్థితి తమకు పూర్తిగా వ్యతిరేకంగా మారిందని రవి అమ్మన్‌కు వివరించాడు. అమ్మన్ కోపంతో రగిలిపోయాడు. వెంటనే కొన్ని అదేశాలు యిచ్చాడు –
– ఒక రాజకీయ ప్రముఖుణ్ని చంపేయండి
– భద్రత/పోలీసు దళాల్లో ముఖ్యులైన అధికారుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసి, ఆ దళాల నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీయండి
– ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు వీలైతే అప్పుడు బీభత్సాన్ని సృష్టించి తమిళనాడులో భయాన్ని వ్యాప్తి చేయండి
దీనితో బాటు తీరప్రాంతాల నుంచి కమ్యూనికేషన్ నిరాటంకంగా సాగేలా చూడమనీ, జాఫ్నాకు మందులు, పెట్రోలు పంపమనీ, అంతరాయం కలిగించే కోస్తా భద్రతాదళాల్ని మట్టుపెట్టమని, భారతీయ తమిళ యువకులను యింకా ఎక్కువగా పంపి తర్ఫీదు యిప్పించమని చెప్పాడు.
ఈ ఆదేశాలతో బాటు మారణాయుధాల్ని తీసుకుని వెళ్లమన్నాడు.
శివరాజన్ మరణంతో ఎల్‌టిటిఇ కృంగిపోలేదని, పగతో రగులుతోందని, మరిన్ని ఘాతుకాలు చేయడానికి సిద్ధమవుతోందని ఆ ముగ్గురికి అర్థమైంది.
ఆగస్టు 29 – కోననకుంటె శిబిరం చుట్టూ పోలీసుల పహరా చూసి భయపడిన రంగన్ పారిపోయి, చెన్నయ్‌లోని ఆవడిలో తలదాచుకున్నాడు. పది రోజులయింది కాబట్టి సద్దు మణిగి వుంటుంది కాబట్టి యికనైనా రొటీన్‌లో పడాలనుకుని అడయార్‌లో వున్న తన ట్రావెల్ ఏజన్సీ ఆఫీస్‌కు వెళ్లాడు. అప్పటికే అక్కడ సిట్ గూఢచారులున్నారు. వెంటనే సమాచారం వెళ్లడం, సిట్ దళాలు ఆఫీసు వున్న కాంప్లెక్సును చుట్టుముట్టడం జరిగింది. రంగన్ యిది పసిగట్టాడు. బయటకు దూకి పరిగెత్తాడు. సినిమాల్లో లాగ ఛేజింగ్ సీను చాలా సేపు నడిచి, చివరకు రంగన్ పట్టుబడ్డాడు. అతను వెంటనే సైనైడ్ మింగబోయాడు. సిట్ వాళ్లు చేతిలోంచి దాన్ని లాగేసి ఆరెస్టు చేశారు. అతని మారుతీ జిప్సీని ఆ సాయంత్రమే ఒక వర్క్‌షాపు నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఆగస్టు 30 – ఆ వాహనంలో దొరికిన డాక్యుమెంట్ల ప్రకారం, మెట్టూరులోని ధనశేఖరన్ (ఇతని మారు పేరు రాజు) అనే వ్యక్తి ఒకేసారి నాలుగు మారుతి జిప్సీలు కొన్నట్టు తెలిసింది. వాటిల్లో కొన్నిటిని అప్పటికే పోలీసులు పట్టుకున్నారు. వాటిల్లో టైగర్లు కూడా దొరికారు. అంటే ధనశేఖరన్ కూడా ఎల్‌టిటిఇ మద్దతుదారే అన్న విషయం నిర్ధారణ అయింది.
విచారణలో రంగన్ తాము తిరుచ్చి శంతన్ ఉపాయం ప్రకారం శివరాజన్, శుభ, నెహ్రూలను ట్యాంకర్‌లో బెంగుళూరుకు చేర్చామని, దానిలో తన సహచరుడు విక్కీ కూడా వున్నాడనీ చెప్పాడు. వెంటనే చెన్నయ్ సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో వున్న విక్కీని పిలిచి యీ విషయం చెప్పలేదేం? అని సిట్‌వారు నిలదీశారు. నిజానికి విక్కీ పోలీసులకు చాలా సమాచారమే యిచ్చి సాయపడ్డాడు. అయినా యీ సమాచారం తెలిసి కూడా దాచినందుకు నిందితుడయ్యాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2015)