ఎమ్బీయస్‌: రేవంత్‌ అంశం ఎంతదూరం వెళుతుంది? – 1

టిడిపికి రేవంత్‌ పెద్ద చిక్కే తెచ్చిపెట్టారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఫిరాయింపులు చాలాకాలంగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన దగ్గర్నుంచి పెద్ద పెద్ద నాయకులు కూడా పార్టీలు మారిపోవడం ప్రారంభించారు.…

టిడిపికి రేవంత్‌ పెద్ద చిక్కే తెచ్చిపెట్టారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఫిరాయింపులు చాలాకాలంగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన దగ్గర్నుంచి పెద్ద పెద్ద నాయకులు కూడా పార్టీలు మారిపోవడం ప్రారంభించారు. కొందరు ఎన్నికల ముందు మారితే, కొందరు ఎన్నికల తర్వాత మారారు. రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారడం ఎప్పణ్నుంచో వుంది కానీ యీ ఫిరాయింపుల్లో బెదిరింపులు, లాలింపులు, వూరింపులు కూడా వుంటున్నాయని తోస్తూంది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల గురించి గట్టిగా మాట్లాడే టిడిపి, ఆంధ్రలో ఫిరాయింపులను సమర్థించుకుంటూ వచ్చింది. తమ పార్టీనుంచి టిడిపికి ఫిరాయించినవారిని విమర్శిస్తున్న వైకాపా అసలు తమ పార్టీయే ఫిరాయింపుదార్లతో ప్రారంభమైన మాట మర్చిపోతూ వచ్చింది. రాజకీయాలకు కొత్తవారిని,  విద్యాధికులను, యువకులను రాజకీయాల్లోకి ఆకర్షించి వారిని క్యాడర్‌గా మలుచుకుందామనే ఓపిక ఎన్టీయార్‌ తర్వాత వేరెవ్వరికీ కనబడటం లేదు. పార్టీ పెట్టగానే యిప్పటికే  ఫిరాయింపుల్లో, రాజకీయ క్రీడల్లో ఆరితేరినవారిని అనుభవం పేర తీసుకోవడం, ఆ తర్వాత వాళ్లు తమ నుంచి వెళ్లిపోయినపుడు వారికి స్థిరత్వం లేదని తిట్టుకోవడం జరుగుతోంది. 

ఫిరాయింపుల్లో కాంట్రాక్టులో, డబ్బులో ప్రధాన భూమిక పోషిస్తున్నాయని తెలుసు కానీ రుజువులు దొరకవు. సిద్ధాంతాలు నచ్చి అనో, నా ప్రయోజనాలు కాదు,  నా నియోజకవర్గం ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరుతున్నాను అనో పైకి చెప్తారు. నమ్మితే నమ్మవచ్చు, మీరు నమ్మకపోయినా వాళ్లకు పోయేది ఏమీ లేదు. తెలంగాణలో కెసియార్‌ బాహాటంగా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు. నియమాలకు విరుద్ధంగా కౌన్సిల్‌లో టిడిపిని స్వాహా చేయడానికి పూనుకున్నారు. కెసియార్‌ చేష్టలను వ్యతిరేకించే సత్తా తెలంగాణలో ఎవరికీ కనబడటం లేదు. మీడియా భయంతోనో, భక్తితోనో అణిగి వుంది. మేధావులు నోటికి తాళం వేసుకున్నారు. 

కాంగ్రెసు చేష్టలుడిగి కూర్చుంది. టిడిపిలో కొందరు మాత్రమే గొంతు విప్పుతున్నారు కానీ ఎవరు ఎప్పుడు గోడ దూకుతారో తెలియదు కాబట్టి తన సహచరుల పట్ల ప్రతీ నాయకుడు అనుమానంగా చూస్తున్నాడు. ఇక వారిలో ప్రతిఘటించే శక్తి ఎలా వస్తుంది? తను ఏం చేసినా చెల్లిపోతుందనే ధైర్యంతో కెసియార్‌ ముందుకు దూసుకుపోతున్నారు. టిడిపిలో ఎర్రబెల్లి దయాకరరావు ఆయనను సమర్థవంతంగా ఎదుర్కోవటం లేదు. చేతకాకనో, మనసు రాకనో తెలియదు. అందువలన తను తెలంగాణలో ఏకైక టిడిపి నాయకుడిగా ఎదిగే అవకాశం వుందని రేవంత్‌ రెడ్డి అంచనా వేసుకున్నారు. అసెంబ్లీలో భీకరంగా పోరాడుతున్నారు. నిజానికి తెలంగాణలో ఏకైక ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్‌ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అతన్ని చూసి తెరాస నాయకత్వం భయపడుతోందని, ఎలాగైనా అతని గొంతు నొక్కాలని చూస్తోందని అందరికీ తెలిసిన విషయమే. కెసియార్‌ వ్యతిరేకులందరూ యిష్టం వున్నా, లేకపోయినా రేవంత్‌ వెనక్కాల చేరి, అతనికి దన్నుగా నిలబడక తప్పని పరిస్థితి వస్తోందని అనుకుంటూండగా రేవంత్‌ యీ దుస్సాహసం చేశారు.

రేవంత్‌ చేసినది దుస్సాహసమా? పట్టుబడ్డాడు కాబట్టి అలా అనిపిస్తోంది. ప్లాను వేసి పట్టుకున్నారు కాబట్టి యిది బయటకు వచ్చింది. బయటకు రానివి ఎన్నో! ఇలా పట్టుకుంటారన్న భయం రేవంత్‌కు లేదా? వీడియో టేపులో అతను మాట్లాడే ధోరణి చూస్తే యిలాటివి సర్వసాధారణమే అనిపిస్తోంది. ఇక్కడ టిడిపి ఎమ్మెల్యే ఓటును కొంటోంది. తెరాస కూడా యిదే రీతిలో కొని వుంటుంది. ఆ మాటే చంద్రబాబు అన్నారు. ఉన్న ఓట్లకు మించి వాళ్లకు ఎక్కువగా ఎలా వచ్చాయి, కొనకపోతే..? అని! దాదాపు మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో వున్న ఆయనకు యీ విషయాలు బాగా తెలుస్తాయి. సినిమాల్లో స్మగ్లర్లలా ఎక్కడో రహస్యప్రదేశంలో కలవడం, కోడ్‌లో మాట్లాడుకోవడం అలాటివి ఏమీ లేవు. ఎమ్మెల్యే ఆత్మీయుల యిళ్లకే వచ్చి బ్యాగులో డబ్బు తెచ్చి టేబుల్‌ మీద సర్దేసి ఫ్రీగా మాట్లాడేసుకోవడమే. ఆ సమయంలో ఆ యింటికి అతిథులెవరైనా వస్తే ఏం బాగుంటుంది అన్న జంకేనా లేదు. ఎమ్మేల్యే కూడా  తను అప్పుల్లో వున్నాననీ, తన ఓటు అమ్మకానికి వుందని క్వికర్‌లో పెట్టలేదు కానీ తన ఆత్మీయులతో అన్నాడట. ఆయన కాంగ్రెసు నడిగితే మాకు యింట్రస్టు లేదన్నారట, మాకుంది అంటూ రేవంత్‌ ముందుకు వచ్చారట. వీళ్లంతా కలిసి మనకు ప్రజాస్వామ్య విలువల గురించి, రాజకీయాల్లో అవినీతి నిర్మూలన గురించి ఉపన్యాసాలు దంచుతూ వుంటారు. మనం వింటూ వుంటాం. 

ఈ పని రేవంతే ఎందుకు చేపట్టారు? దయాకర రావు కంటె తనే లీడరుగా ఎదగాలన్న తపనతోనా? ఈ స్టీఫెన్‌సన్‌ రేవంత్‌ జిల్లా ఆయన కాడు, ఆయన కమ్యూనిటీకి చెందినవాడు కాడు. టిడిపి తరఫున ఎవరైనా వెళ్లి వుండవచ్చు. టెర్మ్‌స్‌ గురించి రేవంత్‌ వేరే వాళ్ల చేత ఫోన్లో మాట్లాడించి, ఎవరైనా నమ్మకస్తుల చేత డబ్బు పంపించేసి వుండవచ్చు. పీతల సుజాత గారు మా యింట్లో మతిమరుపు మనిషి పది లక్షలు వదిలేసి వెళ్లింది అన్నట్లు (అదేమిటో అలాటి మనుషులెవరూ మన యింటికి రారు, మంత్రుల యిళ్లకే వెళతారు, మెథడ్‌ యిన్‌ మ్యాడ్‌నెస్‌ అన్నట్టు మతిమరుపులో మంత్రిమరుపు వుంటుందన్నమాట – మంత్రి యింట్లో వుండగానే మరుపు కమ్ముతుంది, మంత్రులు వాగ్దానాలు చేసి మర్చిపోతారు, వీళ్లు డబ్బులు తెచ్చి మర్చిపోతారు) 'మా డ్రైవరును 50 లక్షలు పార్టీ ఫండ్‌కి కట్టేసి రమ్మంటే మతిమరుపు చేత దార్లో కనబడిన ఎమ్మేల్యే యింట్లో పడేసి వచ్చాడు' అని రేవంత్‌ చెప్పే అవకాశం వుండేది. కానీ యీయన స్వయంగా వెళ్లాడు. పని సాధించుకుని వచ్చి చంద్రబాబు గారి చేత 'శభాష్‌, ఎర్రబెల్లి కంటె నువ్వే బెటరు, ఘటనాఘటన సమర్థుడివి, రేపు 2019 ఎన్నికలలో 40 సీట్లు గెలిచినా తక్కినవి కొనుగోలు చేయగలనని నిరూపించుకున్నావ్‌, కాబోయే సిఎం నువ్వే' అనిపించుకోవాలనా? తను తెలంగాణ సిఎం కావడానికి వుండే అవకాశాల గురించి రేవంత్‌ చాలా లాజికల్‌గా మాట్లాడారు. అలా జరగడానికి ఎంతైనా అవకాశం వుంది. 

ఇంత లాజికల్‌గా మాట్లాడినాయన బాబు గురించి చెప్పినది మాత్రం అబద్ధమవుతుందా? స్టీఫెన్‌సన్‌ ఓటు గొడవ పసిగట్టి తెరాస ఆయనపై చర్య తీసుకుంటే ఆదుకుని ఆంధ్రలో ఏదోలా కాంపెన్సేట్‌ చేయగలిగినది బాబు ఒక్కరే కదా. ఆ హామీ బాబు యివ్వనిదే రేవంత్‌ తనంతట తాను పక్క రాష్ట్రంలో పదవి గురించి ధీమాగా మాట్లాడగలరా? రెండున్నర కోట్ల వరకు తనకు లిమిట్‌ వుందని, ఆ పైన అయితే బాస్‌ను అడగాలని అనడం కూడా రీజనబుల్‌గానే తోస్తోంది. ఆ రేటుకు బాస్‌ ఒప్పుకోకపోయినా, తను ఒప్పించి సాధించానని మధ్యవర్తులు చెప్పుకుంటూ వుంటారు. రేవంత్‌ అదే విధంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీ సీటు గురించి కాదనీ, యిది బాబు వెర్శస్‌ కెసియార్‌ ప్రిస్టేజి క్వశ్చన్‌ అనీ ఆయన అన్నది నూటికి నూరు శాతం సత్యం. రేవంత్‌ ఏజంటుగా వచ్చారు తప్ప ప్రిన్సిపల్‌గా రాలేదని ఆయన సంభాషణ స్పష్టంగా తెలుపుతోంది. రేవంత్‌ స్వలాభం గురించో, తన సీటు నిలుపుకోవడానికో యీ పని చేయడం లేదు, తమ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికే యీ అకృత్యానికి ఒడిగట్టారు. పార్టీ అధ్యక్షుడికి దీనిలో ఏ మేరకు ప్రమేయం వుంది అన్నదే చర్చనీయాంశం. 

అధ్యక్షుడికి తెలియకుండా రేవంతే యీ పని చేసి వుంటే..? చేసి వుంటారా? దేనికోసం? ఎవరి కోసం? తన సొంత డబ్బు 5 కోట్లు ఖర్చు పెట్టి టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిస్తే రేవంత్‌కు కలిగే లాభం ఏమిటి? ఆ ఎమ్మెల్సీ యీయన ముఖ్యమంత్రి కావడానికి ఓటేస్తాడా? ఈయనకు కాంట్రాక్టులు యిప్పిస్తాడా? ఏదైనా హత్య జరిగినపుడు దీనివలన ప్రయోజనం కలిగేది ఎవరికి? ఈ హత్య చేయడానికి అవకాశం వున్నది ఎవరికి? అనే కోణాలతో పరిశోధన ప్రారంభిస్తారు. ఆ విధంగా చూస్తే యీ లంచపు వ్యవహారంలో రేవంత్‌కు కలిగే ప్రయోజనం ఏమీ కనబడటం లేదు. 'ఏదో ఒకటి చేసి కెసియార్‌ కాండిడేటును ఓడించగలిగావు' అని బాబు మెప్పు పొందడం తప్ప! దానికోసం 5 కోట్లు స్వార్జితం ఖర్చు పెడతారా రేవంత్‌? ఆయన అధికార పార్టీలో లేడు, యిప్పట్లో ఎన్నికలు లేవు, అధికార పార్టీకి కంటిలో నలుసుగా వున్నందువలన మిషన్‌ కాకతీయ వంటి పనుల్లో తన వాళ్లకు కాంట్రాక్టులు యిప్పించి సంపాదించడం మహా కష్టం. ఇప్పుడు యిచ్చినది మళ్లీ సంపాదించుకునే అవకాశాలు తక్కువ. రేవంత్‌ తనకోసం కాకపోతే వేరే ఎవరికోసం యీ పని చేసినట్లు? (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2015)

[email protected]