బోనీ కపూర్ అనగానే శ్రీదేవి భర్తేగా అంటాం తెలుగువాళ్లం. శ్రీదేవి సినిమారంగంలోకి రావడానికి ముందు నుంచే అతని కుటుంబం సినిమాల్లో వుంది. ఇటీవలే గుణశేఖర్ ''ఒక్కడు'' సినిమాను ''తేవర్''ను పునర్నిర్మించి మిశ్రమ ఫలితాలను రుచి చూస్తున్న బోనీ కెరియర్ రీమేక్స్‌తోనే ప్రారంభమైంది. అతని తండ్రి సురేందర్ కపూర్ షమ్మీ కపూర్, అతని భార్య గీతా బాలికి మేనేజర్‌గా వుండేవాడు. పృథ్వీరాజ్ కపూర్ కుటుంబంలాగే వాళ్లదీ పెషావరే. బొంబాయి చిత్రసీమలోకి వచ్చిపడ్డారు. బోనీ తల్లి వంటలు బాగా చేసేవారట. అవి తినడానికి రాజ్ కపూర్, షమ్మీ కపూర్, ధర్మేంద్ర అందరూ వస్తూండేవారు. వారి ప్రోత్సాహంతో సురేందర్ నిర్మాతగా మారి సినిమాలు తీశాడు. ''పోంగా పండిట్'' సినిమాలో రణధీర్ కపూర్‌ను హీరోగా పెట్టి తీశాడు. కొన్ని సినిమాలు ఆడినా కొన్ని ఆడలేదు. బోనీ యువకుడయ్యేసరికి సురేందర్ నిర్మాతగా రిషి కపూర్ హీరోగా ''ఫూల్ ఖిలే హైఁ గుల్షన్ గుల్షన్'' (1978) సినిమా తీస్తున్నాడు. డైరక్టరు కావాలన్న లక్ష్యంతో శక్తి సామంతా వద్ద తర్ఫీదు పొందిన బోనీ తండ్రి సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. సినిమా తీస్తూండగానే డైరక్టర్ సికందర్ ఖన్నా చనిపోయాడు. కొత్త డైరక్టర్ సహాయంతో సినిమా పూర్తి చేశారు. సినిమాకు పేరు వచ్చింది కానీ డబ్బు రాలేదు. కుటుంబం చిక్కుల్లో పడింది. ఇక సొంతంగా డైరక్టరు అయ్యే ఆశ వదిలేసి తండ్రి స్థానంలో చిత్రనిర్మాణం చేపడితే మంచిదనుకున్నాడు బోనీ. అప్పుడు ఉత్తరాది సినిమాలను, దక్షిణాది సినిమాలను బేరీజు వేసి చూశాడు.
బొంబాయిలో పెద్ద ప్రొడ్యూసర్లందరూ స్వయంగా డైరక్టర్లే. రాజ్ కపూర్, మనోజ్ కుమార్, దేవ్ ఆనంద్ వంటి వారైతే స్వయంగా హీరోలు కూడా. దీనితో సినిమాపై వ్యామోహం పెంచుకుని అవసరానికి మించి ఖర్చు పెట్టి దెబ్బ తింటున్నారు. అదే హిందీ సినిమాలు తీసే ఎవిఎం, జెమిని, ప్రసాద్ ప్రొడక్షన్స్, విజయా వంటి దక్షిణాది నిర్మాతలు దర్శకత్వం జోలికి పోకుండా నిర్మాణంపైనే దృష్టి పెట్టి, ఖర్చుని నియంత్రించుకుంటూ తక్కువ బజెట్‌లో సినిమా తీసి 80-90% విజయం సాధిస్తున్నారు. పైగా కథల ఎంపికలో వాళ్లు రీమేక్స్ను ఎక్కువగా నమ్ముకుంటున్నారు. దక్షిణాది భాషల్లో ఒక భాషలో హిట్ అయినదాన్ని మరో దక్షిణాది భాషలో తీస్తూ, బాగా నమ్మకం కుదిరితే హిందీలో తీస్తూ సక్సెస్ గ్యారంటీ పెంచుకుంటున్నారు. తన తండ్రి సురేందర్ తీసిన సినిమాల్లో ఆఖరి హిట్ ''షెహజాదా'' (1972) తమిళ దర్శకుడు కె. శంకర్ దర్శకత్వంలో తీసిన తమిళ సినిమా రీమేకే అని బోనీకి గుర్తు వచ్చింది. స్వతంత్రంగా సినిమాలు తీస్తే రిస్కే అని గ్రహించాక 1979లో మద్రాసుకి వచ్చి చేరాడు. నెల్లాళ్లు మకాం పెట్టి ఏకధాటీగా 40 తెలుగు సినిమాలు చూశాడు. 29 వ రోజున ''మనవూరి పాండవులు'' చూశాడు. తెగ నచ్చేసింది. వివరాలు అడిగితే ''దీనికి మూలం కన్నడ సినిమా వుంది. బెంగుళూరు వెళ్లి హక్కులు తీసుకో'' అని సలహా చెప్పారు.
బోనీ కార్యకలాపాలపై నిఘా పెట్టిన నిర్మాత-దర్శకుడు మోహన్ సెహగల్, నిర్మాతగా మారిన హేమమాలిని తల్లి జయా చక్రవర్తి యితని కంటె ముందు బెంగుళూరు చేరి హక్కులు కొనేద్దామనుకున్నారు. వాళ్ల కంటె ముందు చేరాలి, విమానం టిక్కెట్టు దొరకలేదు, రైలూ దొరకలేదు. బస్సెక్కి, సగం దూరం నిలబడి ప్రయాణం చేసి బెంగుళూరు చేరాడు. కన్నడ సినిమా చూశాక తెలుగు సినిమాయే బాగుందనిపించింది. (కన్నడ మూలంలో కృష్ణంరాజు పాత్ర లేదు). బాపు-రమణలు యింకా బాగా నచ్చేశారు. బాపు దర్శకత్వంలోనే ''హమ్ పాంచ్'' (1981) తీశాడు. హిట్టయింది. ఇక అప్పణ్నుంచి రీమేకుల్ని నమ్ముకున్నాడు. భాగ్యరాజా దర్శకత్వం వహించిన ''అంద ఏళ్ నాటకళ్''ను తెలుగులో బాపు ''రాధాకళ్యాణం''గా తీయగా, బోనీ దాన్ని హిందీలో బాపు దర్శకత్వంలోనే ''వో సాత్ దిన్'' (1983) తీశాడు. తన తమ్ముడు అనిల్ కపూర్‌నే హీరోగా పెట్టుకుని ఖర్చు మిగుల్చుకున్నాడు. ఓ సారి షబానా ఆజ్మీతో కలిసి శేఖర్ కపూర్‌ను చూడడానికి వెళితే అతను ఆమెకు ''మాసూమ్'' సినిమాలో సీన్లు వివరించాడు. అతని క్రియేటివిటీ చూసి ముచ్చటపడిన బోనీ ''నా తదుపరి సినిమా డైరక్షన్ నీదే. జీతం 75 వేలు. ఇదిగో 10 వేలు అడ్వాన్సు'' అని చేతిలో పెట్టాడు. అలా తయారైనదే ''మిస్టర్ ఇండియా'' (1987)! తీయడంలో చాలా లేటైనా సూపర్ హిట్టయ్యి బోనీని పెద్ద నిర్మాతగా నిలబెట్టింది. ఆ సినిమా యిచ్చిన వూపుతో ''రూప్‌కీ రాణీ చోరోంకా రాజా'' (1993) తీస్తే అది ఘోరంగా ఫ్లాపయింది. మధ్యలో రామ్ గోపాల్ వర్మతో సినిమాలు తీసి మిగుల్చుకున్నదీ పోయింది. మళ్లీ రీమేక్‌లను నమ్ముకుని తెలుగు సినిమా ''అసెంబ్లీ రౌడీ'' ని ''లోఫర్'' (1996)గా, ''శుభలగ్నం''ను ''జుదాయీ'' (1997) గా తీసి నిలదొక్కుకున్నాడు. అదే అలవాటుతో యిప్పుడు ''ఒక్కడు''ను రీమేక్ చేశాడు. కలక్షన్లు గొప్పగా లేకపోయినా సొంత కొడుకు అర్జున్ కపూర్‌ని హీరోగా పెట్టి తీశాడు కాబట్టి నష్టపోడని అంటున్నారు.
ఎమ్బీయస్ ప్రసాద్