అంతా మాయ…!!

ప్రత్యేక హోదాపై ఫల్టీ కూడబలుక్కున్న బీజేపీ, టీడీపీ అదే స్క్రిప్ట్…. అవే మాటలు నాయుడు ధ్వయం నాటకం Advertisement ఎన్నికల ముందు ఓడ మల్లయ్య,.. గెలిచాక బోడి మల్లయ్య. ఇదీ విభజన తరువాత  పదమూడు…

ప్రత్యేక హోదాపై ఫల్టీ
కూడబలుక్కున్న బీజేపీ, టీడీపీ
అదే స్క్రిప్ట్…. అవే మాటలు
నాయుడు ధ్వయం నాటకం

ఎన్నికల ముందు ఓడ మల్లయ్య,.. గెలిచాక బోడి మల్లయ్య. ఇదీ విభజన తరువాత  పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఏపీ విషయంలో యూపీఏ చేసిన మోసం ఒక ఎత్తు అయితే, గత ఏడాది మేలో అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ, టీడీపీ చేస్తున్న మోసం మరో ఎత్తు. యూపీఏ పదేళ్ల పాలనకు విసిగి జనం బీజేపీకి పూర్త మెజారిటీతో పట్టం కట్టారు, ఇక్కడ టీడీపీని కూడా దశాబ్దం తరువాత అందలం ఎక్కించారు. ఈ రెండు పార్టీలు కలసి కట్టుగా పోటీ చేశాయి, హామీలను గుప్పించాయి, చివరికి వాటిని నీటి మూటలు చేశాయి. ఇదంతా తెలిసే చేస్తున్న వ్యవహారం కూడబలుక్కుని రంజుగా ఆడుతున్న నాటకం. చివరికి బలి అవుతోంది విభజన గాయంతో కునారిల్లిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. 

మడతేసిన వెంకయ్య

ఏపీకి ప్రత్యేక హోదాపై లెక్చర్లు దంచిన వెంకయ్యనాయుడు ఇపుడు కేంద్రంలో కీలకమైన రెండు శాఖలు నిర్వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితంగా సన్నిహితంగా మెలుగుతున్న నాయకుడు. గత ఏడాది మార్చిలో ఉద్విగ్నపూరిత వాతావరణంలో విభజన బిల్లు ఎగువసభలో ప్రవేశపెట్టారు. నాడు దేశమంతా కళ్లూ, చెవులు అప్పగించి టీవీలకు అతుక్కుపోయింది, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తమ బతుకు ఏమవుతుందోనన్న బెంగతో నాటి ప్రత్యక్ష ప్రసారాన్ని ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసింది. ప్రత్యేక హోదాపై నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ నోటి మాటగా ప్రకటన చేయడాన్ని ప్రధాన ప్రతిపక్ష బీజేపీ రాజ్యసభలో నిగ్గదీసింది. అపుడే ఆవేశపూరితుడైన వెంకయ్యనాయుడు అయిదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఏమిటి, కనీసంగా పదేళ్ల పాటు చేయాలని డిమాండు చేశారు. అంతటితో ఆగకుండా తమ సర్కార్ రాబోతోందని, తాము పదేళ్ల పాటు హోదా ఇస్తామని కూడా హామీ ఇచ్చేశారు. ఇదంతా కళ్ల ముందే జరిగింది. 

ఎన్నికల అనంతరం అధికార మార్పిడి జరిగి కుర్చీలలో సుఖాసీనులైన బీజేపీ మహాశయులు ఇపుడు మడమ తిప్పుతున్నారు. మడత పేచీ పెడుతున్నారు. నిన్న కాక మొన్న విజయవాడలో వెంకయ్యనాయుడు  ప్రత్యేక హోదాపై తన స్వరం మార్చారు. అది కష్టసాధ్యమని ప్రకటించేశారు. ఇతర రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలని షరతు పెడుతున్నారు. ఇది అయ్యే పనేలా అన్నట్లుగా ఉంది నాయుడు గారి మాట తీరు. నిజానికి ఇతర రాష్ట్రాలు ఎందుకు ఒప్పుకుంటాయి, ససేమిరా అని అంటాయి. ఆ సంగతి తెలియదా రాజకీయాలలో కాకలు తీరిన వెంకయ్య ప్రభృతులకు. ఇపుడు ఎన్నికల గండం గట్టెక్కేశారు కాబట్టి ఏమైనా చెప్పవచ్చు గాక. నిజానికి రాజధాని లేకుండా ఓ రాష్ట్రాన్ని విడదీశారు. అదీ ఏటా పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్‌తో. ఎటువంటి ఆసరా లేకుండా ఏపీ ఎలా నెట్టుకువస్తుందని అనుకున్నారో కేంద్రం వారికే తెలియాలి మరి. ఇపుడు ఘన ఉపన్యాసకర్త వెంకయ్య కేంద్రం కూడా ఆర్ధికంగా ఇబ్బందులలో ఉందని సెలవిస్తున్నారు. నిజమే. ఇవన్నీ తెలియని విషయాలా. మరి, తెలిస్తే నాడే ఎందుకు చెప్పలేదన్నది కదా ప్రజల బాధ. ఎన్నికల ముందు ఓట్ల కోసం చెప్పాల్సింది చెప్పేసి ఇపుడు తప్పుకుంటామంటే ఎలా.

ఏపీ వైపు కన్నెత్తి చూడని మోడీ సర్కార్

ఏపీని ఘోరంగా విభజించారని గత ఎన్నికల ముందు ఊరూరా తిరిగి ప్రసంగాలు చేసిన నాటి బీజేపీ నాయకుడే ఇపుడు ప్రధాన మంత్రిగా ఉన్నారు. తిరుపతి సభలో మోడీ చేసిన ప్రసంగం ఇంకా ప్రజల చెవులలోనే మార్మోగుతోంది. ఢిల్లీని మించిన బ్రహ్మాండమైన రాజధానిని మీకు కట్టించి ఇస్తామని మోడీ స్వయంగా చెప్పారు. కేంద్రంలో తాము, ఇక్కడ టీడీపీ అధికారంలోకి రాబోతున్నాయని, ఈ రెండు పార్టీలూ కలసి ఏపీకి బంగారు భవిష్యత్తును ఇస్తాయని మోడీ ప్రకటించారు. మరి, మోడీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటుతోంది. ఏపీకి ఇంతవరకూ అందించిన సాయం చూస్తే అరకొరగానే ఉంది. హుధ్‌హుధ్ తుపానుకు విశాఖ కకావికలమైపోతే ఆరు వందల కోట్లు మించి విదిల్చింది లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు కలిసి వెనుకబడిన జిల్లాలగా ప్రకటించి నిధులు భారీగా ఇస్తామన్న మాట అంతకంటే లేదు. రాజధాని కోసం లక్ష కోట్లు అవుతుందని ఏపీ సీఎం బాబు అంచనా వేస్తే అందులో వందవ వంతు అంటే వేయి కోట్లు కూడా ఇప్పటికి విదిల్చిందీ లేదు. ఇక, అభివృద్ధికి సంబంధించి చూస్తే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అతీ గతీ లేదు. జాతీయ విద్యా సంస్ధలు మాటలేక పరిమితమయ్యాయి. ఇపుడు నిధులు లేవంటున్నారు. సమగ్రమైన నివేదిక ప్రతీ శాఖ నుంచి వస్తే రాజధాని నిధుల విషయంలో ఆలోచన చేస్తామని అంటున్నారు. అది కూడా ఎంత ఇస్తారో తెలియదు. వెనుకబడిన జిల్లాలకు రాయితీలు ఇస్తే భారీగా పరిశ్రమలు తరలివస్తాయని, అభివృద్ధి ఊపందుకుంటుంది అనుకుంటే అదీ వట్టిమాటే అవుతోంది. ఏదో పిల్లికి బిచ్చం వేసినట్లుగా ఏటా అరవై నుంచి డెబ్బయి కోట్లు  ఒక్కో జిల్లాకూ ఇస్తామని అంటున్నారుట. ఇది ఏ మూలకు సరిపోతుంది అన్నది వారికే తెలియాలి..

పసుపు పార్టీదీ అదే స్వరం

కలసి పోటీ చేశారు, కేంద్రంలో రెండు మంత్రి పదవులు అనుభవిస్తున్న టీడీపీకి ఎక్కువ బాధ్యత ఉంది అనుకుంటే ఆ పార్టీ నాయకులు, ఎంపీలు, మంత్రులే కాళ్లు జాపేస్తున్న స్థితి ఉంది. కేంద్రం నుంచి సాయం దండిగా వస్తుందని పల్లె పల్లెనా కబుర్లు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇపుడు కేంద్ర సాయంపై పెదవి విరుస్తున్నారు. మాట్లాడితే సింగపూర్, జపాన్, దావోస్ అంటున్నారు. ముప్పయి వేల ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించే కార్యక్రమాన్ని మాత్రం చేపట్టారు. అందులో నుంచి మూడు వేల ఎకరాల భూమిని అమ్మేస్తారుట. ఆ సొమ్ముతో రాజధాని కడతారట. అంటే పూర్తిగా ప్రజల భూమి, ప్రజల నిధులు మరిందులో సర్కార్ పాత్ర ఏముందని ఎవరైనా నిలదీస్తే సమాధానం ఎదురు దాడే. ఇతర దేశాల వారిని ఆహ్వానించి వారి అండ కోరుతున్న చంద్రబాబు రాజధాని విషయంలో, ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో, రాయితీల విషయంలో కేంద్రాన్ని ఎన్ని సార్లు నిలదీశారన్న దానికి కూడా సమాధానం సులువే. కేంద్రంలో మోడీతో బాబుకు చక్కని సాన్నిహిత్యం ఉంది, అంతేనా ఏపీకి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అండదండలు కూడా ఉన్నాయి. మరి, ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అయినా యూపీఏ హయాంలాగానే ఆర్ధిక సాయం వస్తూంటే మాత్రం టీడీపీ కిమ్మనడంలేదు. పైగా, టీడీపీ నాయకులే ప్రత్యేక ప్రతిపత్తి అంటే కుదిరే వ్యవహారం కాదని తేల్చేస్తున్నారు. రాజమండ్రి ఎంపి మురళీమోహన్ ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసి ఇక రాదని కూడా స్పష్టం చేశారు. అలాగే, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అలాగే మాట్లాడుతున్నారు. చూడబోతే బీజేపీ, టీడీపీ కూడబలుక్కుని ఒకే స్ప్రిప్ట్‌ను చదువుతున్నట్లుగా అనిపిస్తోంది. ఒకే ప్రకటన, పార్టీలు, నాయకులు మారుతారు. అంతే అనిపిస్తోంది.

ఖజానా ఖాళీ.. విదేశీయానం మాత్రం ఆపరు

ఇక, ఏపీ సర్కార్ తీరు కూడా వింతగా ఉంటోంది. వచ్చే నెలలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించడం కష్టమని ఓ వైపు చెబుతూ విదేశీ యానాలు మాత్రం బాగా చేస్తున్నారు. జపాన్, సింగపూర్, దావోస్ ఇలా వరుస పర్యటనలు చేస్తూ అడుగంటిన ఖజానాకు కొత్త చిల్లు పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇంకో వైపు అతి ముఖ్యమైన వ్యవహారాలు తప్పించి ఖజనా నుంచి చెల్లింపులు దాదాపుగా నిలిపివేశారు. ఇలా డబ్బులు లేవంటూనే విహార యాత్రలు చేయడం పై ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం అభివృద్ధి వారికి పట్టదన్నట్లుగా మాట్లాడుతారు. ఇంతలా ఖజనాకు చిల్లు పడితే కేంద్రం వద్దకు పోయి నిధుల కోసం పోరాడాలన్న ఆసక్తి కానీ, అభిప్రాయం కానీ ఎక్కడా కనిపించడంలేదు. పైగా, ఏ అమెరికా పెట్టుబడిదారో, జపాన్, సింగపూర్ కంపెనీలో సాయం చేయాలన్నట్లుగా ఏపీ సర్కార్ ధోరణి ఉంది. ఎన్నుకున్న కేంద్ర ప్రభుత్వం ఉంది, హామీలు ఇచ్చిన నాయకులు ఉన్నారు, కానీ, రాజధానికి భూములు రైతులే ఇవ్వాలి, వారి భూములే అమ్మి ఆ నిధులతో రాజధాని కట్టాలి. ఇక, ఖజనా నింపాలంటే పెట్టుబడిదారులే రావాలి. అంతే తప్ప, బాధ్యత కలిగిన బీజేపీ, టీడీపీ సర్కార్ లు మాత్రం ఏమీ చేయవన్నమాట.  ఈ నిజం చెప్పడానికి వారికి ఏడు నెలల సమయం పట్టిందేమో కానీ, ఈ నసుగుడు, బెసుగుడు ధోరణిని చూసిన ఏపీ జనానికి మాత్రం ప్రమాణ స్వీకారం తరువాత నుంచే అనుమానాలు మొదలయ్యాయి. అవి ఇపుడు నిజమయ్యాయి. అంతే…

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం.