సీబీఎఫ్ సీ సభ్యురాలిగా జీవితా రాజశేఖర్ కు అవకాశం ఇచ్చారు భారతీయ జనతా పార్టీ వాళ్లు. ఒక సినిమా వివాదంపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా సీబీఎఫ్ సీ సభ్యులందరూ ఒకేసారి రాజీనామా చేయడంతో బీజేపీ వాళ్లు తమ సానుభూతి పరులుకు, తమ పార్టీ వాళ్లకు అవకాశం ఇచ్చారు. పోయిన వారిని వదిలేసి.. వీళ్లందరికీ సీబీఎఫ్ సీ సభ్యులుగా అవకాశం ఇచ్చారు. ఏ మాత్రం మొహమాటం లేకుండా కమలనాథులు తమ పార్టీ వాళ్లను నియమించేసుకొన్నారు.
అయితే ఇలా వ్యవహరించినప్పటికీ.. తమ పార్టీ సానుభూతి పరులకు అవకాశం ఇచ్చినప్పటికీ.. సదరు అవకాశం పొందిన వాళ్లు ఎగిరిగంతేసేదేమీ లేదట! ఎందుకంటే ఈ సెన్సార్ బోర్డు సభ్యులకు అంతగా గిట్టుబాటు అయ్యేదేమీ లేదని తెలుస్తోంది. ప్రత్యేకంగా కనీసం శాలరీ కూడా ఉండదట. ఏదైనా సినిమా సెన్సార్ కు వస్తే.. ఆ సినిమా ప్రొడ్యూసర్ పై పడే చార్జ్ లో కొంత మొత్తాన్ని ఆ సినిమాను వీక్షించి, సెన్సార్ చేసిన సభ్యులకు చెల్లిస్తారు. అదే వీళ్లకు దక్కే జీతం.
ఎన్ని సినిమాలు చూస్తే అంత డబ్బు అనమాట. వెనుకటికి ఇలాంటి రాష్ట్ర స్థాయి సెన్సార్ బోర్డులో అప్పటికి చిరంజీవి అల్లుడి హోదాలో ఉండిన శిరీష్ భరద్వాజ్ కు కూడా స్థానం దక్కింది. దానిపై విమర్శలు కూడా వచ్చాయి. ఏం అర్హత ఉందని శిరష్ ను సెన్సార్ బోర్డు సభ్యుడిగా చేశారు? అని కొంతమంది ప్రశ్నించారు. అది వేరే వివాదం.
స్థూలంగా సీబీఎఫ్ సీ సభ్యులకు ప్రత్యేక జీతభత్యాలేమీ ఉండవు… ఎన్ని సినిమాల సెన్సార్ లో పాలు పంచుకొన్నారనేదాన్ని బట్టే రాబడి ఉంటుందనేది ఇక్కడ విషయం. మరి ఏదో హోదాగా చెప్పుకోవడమే బీజేపీ నేత జీవితకు ఇది అంత లాభదాయక పదవేమీ కాదనమాట!