‘భయో’ డేటా: ‘నరేంద్ర’ ఒబామా

పేరు : బరాక్ ఒబామా Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: శాశ్వత భారత సందర్శకుడు (అమెరికా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన తర్వాత, తిరిగి తిరిగి భారత సందర్శనం చెయ్యాలని వుంది. మా పిల్లలకు…

పేరు : బరాక్ ఒబామా

దరఖాస్తు చేయు ఉద్యోగం: శాశ్వత భారత సందర్శకుడు (అమెరికా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన తర్వాత, తిరిగి తిరిగి భారత సందర్శనం చెయ్యాలని వుంది. మా పిల్లలకు కూడా చూపించాలని వుంది. ఈ దేశంలో వింత లెక్కువ.)

ముద్దు పేర్లు  : నరేంద్ర ఒబామా( అవును. ఇక నుంచి మీ దేశంలో నన్ను అలాగే పిలవవచ్చు. ఇప్పుడు మీ దేశ ప్రధాని ముద్దు పేరు కూడా మారిపోతోంది. ఆయన్ని ‘బరాక్ మోడీ’ అని పిలుచుకోవచ్చు.  మా ఇద్దరి మధ్యా అంతటి అనుబంధం ఏర్పడిపోయింది.)

‘విద్యార్హతలు : బ్యాచిలర్ ఫ్లాష్ బాక్స్. (గత సృ్మతులను నెమరు వేసుకోవటంలో పట్ట భద్రుణ్ణి). అయితే ఈ విషయంలో నరేంద్రమోడీ నన్ను మించి పోయారు. ఆయన ‘మాస్టర్ ఫ్లాష్ బ్యాక్స్’ఎటొచ్చీ, నా జ్ఞాపకాలతో నేను పుస్తకాలు రాశాను. ఆయన రాయలేదు. 

గుర్తింపు చిహ్నాలు :

  • ఒకటి: నావీ, మోడీవి ఒక్కటే గుర్తింపు చిహ్నాలు. ‘ఛాయ్’వాలాలు దేశాధినేతలుగా మారటం ఇద్దరిలోని సారూప్యం. ఆయన ‘ఛాయ్’ అమ్మి ‘ఛాయ్‌వాలా’ అయ్యారు. నేను నల్ల ‘ఛాయ’ కలిగి వున్న తొలి అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర కెక్కాను. 
  • రెండు: నేనూ, మోడీ శ్వేత సౌధాన్ని(వైట్ హౌస్‌ను) వెలుపలనుంచే చూసి, ఇందులోకి ప్రవేశించగలమా అని అనుకున్నాం. ఇద్దరమూ ప్రవేశించాం.. నేను ఆ గృహానికి అధిపతిగా, ఆయన అతిథిగా…!

సిధ్ధాంతం : ‘ఏదేశమేగినా, ఎందు కాలిడినా’ ఆదేశాన్ని పొగిడి పారెయ్యటం. అందుకే ఇండియాను అంతగా పొగిడాను. 

వృత్తి : ప్రపంచాన్ని పాలించటం. (అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా అంతే. అమెరికాను పరిపాలించటం మరచిపోయినా, నా దేశపు బహుళజాతి సంస్థలు క్షమిస్తారు కానీ, ప్రపంచాన్ని పాలించక పోతే ఊరుకోరు. 

హాబీలు :

  1. గాంధీని ఆరాధించటం. (కానీ ఇండియాలో ఆయన్ని చంపిన గాడ్సేకు గుడి కడుతున్నారని తెలిసి ఆశ్చర్య పోయాను.)
  2. మత స్వేఛ్చను గౌరవించటం. ( కానీ ఇండియాలో మతాంతీకరణకు వ్యతిరేకంగా బిల్లు తెస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను.)

అనుభవం : అమెరికాలో నల్లజాతీయుడినయిన నేను అధ్యక్షుణ్ణయ్యాను. ఇండియాలో అట్టడుగు వర్ణాన్నించి వచ్చిన కె.ఆర్.నారాయణన్ రాష్ర్టపతి అయ్యారు. (కానీ నా దేశంలో వర్ణ వివక్షా, ఇక్కడ కుల వివక్షా సజీవంగానే వున్నాయి.)

మిత్రులు : బహుళ జాతిసంస్థలకు ఎవరు మిత్రులో, వారూ నాకు మిత్రులే.

శత్రువులు : వారికి ఎవరు శత్రువులో, వారూ నాకు శత్రువులే.

మిత్రశత్రువులు : మా దేశ రహస్యాలను వెల్లడించే అస్సాంజీ, స్నోడెన్‌లు.

వేదాంతం : మోడీలు ఒబాలవుతాయి. ఒబామాలు మోడీలవుతాయి. (వీసా అర్హుడు కానన్న వ్యక్తిని రాచమర్యాదలతో మా దేశానికి ఆహ్వానించుకున్నామా? లేదా?)

జీవిత ధ్యేయం : అన్నీకోరికలూ తీరిపోయిన తర్వాత జీవితం బోరుకొడుతుంది. అమెరికా అధ్యక్ష పదవీ, నోబెల్ బహుమానం వచ్చేశాక, ఇంకా తీరటానికి ఏముంటుంది? అందుకే ‘మాజీ’లది మరీ అంత ‘ఈజీ’ లైఫ్ కాదు. అందుకే ఇండియా తరచు వస్తుంటాను.

సతీష్ చందర్