ఎమ్బీయస్: రెండు, మూడు ఆప్షన్లు…

హైదరాబాదు గురించి రెండు, మూడు ఆప్షన్లు వున్నాయి అన్నారు షిండే. రెండో, మూడో స్పష్టంగా చెప్పలేదు. హైదరాబాదును యూటీ చేస్తారా? అని ఒక విలేకరి అడిగితే ‘అదొక్కటే ప్రతిపాదన కాదు, యింకా రెండు, మూడు…

హైదరాబాదు గురించి రెండు, మూడు ఆప్షన్లు వున్నాయి అన్నారు షిండే. రెండో, మూడో స్పష్టంగా చెప్పలేదు. హైదరాబాదును యూటీ చేస్తారా? అని ఒక విలేకరి అడిగితే ‘అదొక్కటే ప్రతిపాదన కాదు, యింకా రెండు, మూడు వున్నాయి’ అని యాథాలాపంగా చెప్పినట్టు చెప్పారు. హస్తినవాసుల పరిహాసాలు యిలాగే వుంటాయి. ఇలా మాట్లాడితే వాళ్లు పెద్ద సీరియస్‌గా లేరని మనం అనుకుంటాం. ఠపీమని ఓ బాంబు విసురుతారు. తెలంగాణానా? అంటే ఏమిటి? దోశెయా? ఇన్‌స్టంట్ కాఫీయా? అని జోకులు వేస్తూ వుంటే సీమాంధ్రులు నవ్వుకుని బబ్బున్నారు. హఠాత్తుగా జులై 30 ప్రకటన విడుదల చేసి, యిప్పుడు నవ్వండి చూదాం అన్నారు. అప్పణ్నుంచి వాళ్లు వీధులెక్కి భోరున ఏడుస్తూనే వున్నారు. గతంలో డిసెంబరు 9 న యిలాగే ప్రకటన చేసి జర్కు యిచ్చారు. రెండు వారాలు తిరక్కుండా తూనాబొడ్డు అన్నారు. అదే పని యిప్పుడూ చేస్తారేమోనని విభజనవాదులు లోలోపల గుబులు పెట్టుకున్నారు. పిల్లికి.. సామెత కాస్త మార్చి ‘ఢిల్లీకి చెలగాటం, ఏపీకి ప్రాణసంకటం’ అనుకోవాలి. 

షిండే మాటను కాజువల్‌గా తీసుకోకుండా లోతుగా ఆలోచించాల్సిందే. హైదరాబాదుపై మూడు ఆప్షన్లు. వాటిలో ఒకటి యుటి చేయడం. తక్కిన రెండూ – ఒకటి ఢిల్లీ తరహాలో నగర రాష్ట్రం చేయడం. మూడు – మొదట్లో చెప్పినట్టు పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని. శాంతిభద్రతలు, రెవెన్యూ వగైరా కేంద్రం చేతిలో..! యుటి చేసినా, ఢిల్లీ తరహా నగరరాష్ట్రం చేసినా రెండు రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా వుంటుందని అనుకోవాలి.  శాశ్వత ఉమ్మడి రాజధాని అనగానే – తెలంగాణ నడిబొడ్డులో వున్నదాన్ని ఆంధ్రకు రాజధానిగా ఎలా చేస్తారన్న ప్రశ్న గబుక్కున నోటికి వస్తుంది. కానీ గట్టిగా ఆలోచిస్తే ఒక సామాన్యుడికి తన జీవితంలో ఎన్నిసార్లు సెక్రటేరియట్‌తో పని బడి, రాజధానికి వెళతాడు? నేను మూడు రాష్ట్రాలలో, వాటి రాజధానుల్లో నివసించాను. ఎక్కడా సెక్రటేరియట్‌కు వెళ్లే పని పడలేదు. పన్ను వ్యవహారాల్లో (మునిసిపల్) కార్పోరేషన్ ఆఫీసుకు వెళితే సరిపోయింది. ఆ మాటకొస్తే బ్యాంక్‌లో పని చేసినపుడు హెడాఫీసుకి వెళ్లే పనీ పడలేదు – ఇంటర్వ్యూలు జరిగినపుడు తప్ప! అవి రీజనల్ ఆఫీసులో జరిగి వుంటే అక్కడకు వెళ్లి వుండేవాణ్ని. స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్ ఏ వూళ్లో పెడితే అక్కడికే వెళతాం. 

సెక్రటేరియట్‌తో పనిబడేది ఎవరికి? పర్మిట్‌లు, లైసెన్సులు తెచ్చుకునేవారికి! వ్యాపారస్తులు వాటికోసం హైదరాబాదే కాదు, ఢిల్లీ కూడా వెళ్లవలసి వస్తే వెళతారు. వాళ్ల ఖర్చుల గురించి మనం వర్రీ అవడం అనవసరం. విద్య కోసం, వైద్యం కోసం రాజధానికి వస్తారనుకోవడమూ తప్పే! ఏ కాలేజీలో సీటు వస్తే ఆ వూరు వెళతారు. అనేకమంది హైదరాబాదు వాసులు తమ బిడ్డలకు మంచి వ్రిద్యాబుద్ధులు నేర్పించాలని విజయవాడ, గుంటూరు, నెల్లూరు పంపుతున్నారు. ఇక వైద్యం – మనకు వచ్చిన రోగానికి ఎక్కడ చికిత్స బాగా జరుగుతుందనుకుంటే ఆ వూరికి వెళతారు. హృద్రోగులైన ఒడిశా వారనేకమంది, వాళ్ల రాజధాని కదాని భువనేశ్వర్ వెళ్లడం లేదు, హైదరాబాదులో హాస్పటల్స్ బాగుంటాయని యిక్కడకు వస్తున్నారు. ఢిల్లీ నుండి, అరబ్బు దేశాల నుండి.. చాలామంది  వస్తున్నారు. ఏం వాళ్లకు రాజధానులు లేవా? వాళ్లు యిక్కడకు వస్తూంటే మనవాళ్లు యిక్కడ రోగం నయం కాకపోతే ముంబయి, చెన్నయ్ వెళుతున్నారు. వెల్లూరు హాస్పటల్‌కు కూడా వెళతారు. వెల్లూరు తమిళనాడు రాష్ట్ర రాజధాని కాదుగా! 

అందువలన తెలుసుకోవలసిన దేమిటంటే – విద్య, వైద్య సౌకర్యాలు ఎక్కడ మెరుగుపరిస్తే అక్కడకు వెళ్లే అవసరం పడుతుంది తప్ప రాజధానితో సామాన్యుడికి పనిబడదు. ఉద్యోగి, వ్యాపారి, కళాకారుడు కూడా రాజధానికి రావలసిన పని లేదు. పోస్టింగ్ యిచ్చిన చోటికి ఉద్యోగి వెళతాడు. చేపలు ఎగుమతి చేసేవాడు వైజాగ్‌లో పెడతాడు తప్ప, హైదరాబాదులో పెట్టడు. కళాకారుడు ఎక్కడ ఆదరణ వుంటే అక్కడకు వెళతాడు. కర్ణాటక సంగీత విద్వాంసుడైతే చెన్నయ్‌కు, కన్నడ సినిమాల్లో నటుడిగా ప్రయత్నిద్దామనుకుంటే బెంగుళూరుకు వెళతాడు. అయినా రాజ్యమూ, రాజధానీ కలిసి వుంటే బాగుంటుందనుకున్న కృష్ణ కమిటీ, అలా కలపాలంటే కొంత ఏరియాను తెలంగాణనుండి ఆంధ్రలో కలిపి కారిడార్ చేయమంది. అదో పెద్ద విశేషం కాదు. భద్రాచలం గురించి వివాదం ఎలాగూ వుంది. దానికి బదులు యిది అనవచ్చు. ఏవో కొన్ని యిచ్చిపుచ్చుకోవడాలు వుంటాయి. 

హైదరాబాదు నగరరాష్ట్రం అంటే – తెలంగాణ ఉద్యమం వ్యర్థమయినట్లే ! చేతిలో వున్న హైదరాబాదును పోగొట్టుకోవడానికే యిన్నాళ్లూ ఉద్యమించామా? అనుకోవాల్సివస్తుంది. వేరే రాష్ట్రం అయ్యాక దానిలో దేశంలోని అన్ని జాతుల వారూ వచ్చి పడతారు. ఢిల్లీ ఎవరిది అంటే ఎలా చెప్పలేమో, రేపు హైదరాబాదు సంగతీ అంతే అవుతుంది. హైదరాబాదు యుటీ అంటే – విడిరాష్ట్రం కంటె కాస్త దిగి వచ్చినట్లు. అది కూడా తెలంగాణ ఉద్యమకారులకు సమ్మతి కాదు. కానీ ఉమ్మడి రాజధాని అనగానే యుటి అని పేరు పెట్టకుండానే యుటిలా నడిపి తీరాలని అందరూ చెప్తున్నారు.

ఇక ఉమ్మడి రాజధాని అనుకుంటే – అది పదేళ్లయినా, ఐదేళ్లయినా, పాతికేళ్లయినా, శాశ్వతమైనా…- ఉమ్మడిగా వున్నంతకాలం దానిపై హక్కు ఎవరిది అనే ప్రశ్న వచ్చి తీరుతుంది. హక్కు తెలంగాణేక వుండాలి అని కెసియార్ అంటున్నా, కేంద్రం మాదే ఆ హక్కు అంటోంది. సీమాంధ్రులకు రక్షణ కల్పించాలి అనే నెపంపై శాంతిభద్రతలు  మా చేతిలో పెట్టుకుంటాం అంటోంది. ఇక్కడ ఒక విషయం గమనించండి. రాష్ట్రం విడిపోతే నదీజలాల సమస్య, ఆదాయవ్యయాల పంపకాల సమస్య, వెనకబడిన ప్రాంతాల సమస్య … అంటూ సమైక్యవాదులు జాబితా చదువుతూ వుంటే ఆంటోనీ కమిటీ అవేమీ పట్టనట్టు కేవలం హైదరాబాదు గురించే మాట్లాడుతోంది. హైదరాబాదు గురించి తేల్చేస్తే అన్ని సమస్యలూ తేలిపోయినట్టే అన్నట్టు ప్రవర్తిస్తోంది. ఎందుకు? ఏదో ఒకటి చెప్పి హైదరాబాదుని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని కేంద్రం భావిస్తోంది కాబట్టి! ఇది సారంగధర కథలాటిది అని యిదివరేక చెప్పాను. హైదరాబాదు విడిరాష్ట్రంగా చేస్తే తెలంగాణ వాదులు ఒప్పుకోరు అని ఆంటోనీ నివేదికలో వున్నట్టు కొన్ని పేపర్లు రాశాయి. ఉమ్మడి రాజధాని పేరుతో  ప్రత్యక్ష, పరోక్ష యుటీ అన్నా ఒప్పుకోరు. అలా అని ఆ ప్రతిపాదనా విరమించుకుంటారా? …కోరు. 

హైదరాబాదును ఏదో ఒక పేరుతో కేంద్రం తన అధీనంలోకి తెచ్చుకోవాలంటే దాన్ని ఉమ్మడి రాజధాని అని తీరాలి. వెంటనే ఎంతకాలం? అనే ప్రశ్న వస్తుంది. పదేళ్లు అని జులై 30 ప్రకటనలో చెప్పారు. దానిమీద ఎంతోకొంత యింప్రొవైజ్ చేయకపోతే సీమాంధ్రలో ఆందోళన చల్లారదు. అసలు అక్కడ ఉద్యమమో, ఉన్మాదమో ఏదో ఒకటి జరుగుతున్నట్టు గుర్తించడానికి కేంద్రం నిరాకరిస్తోంది. కానీ ఎప్పటికో అప్పటికి గుర్తించక తప్పదు. అందువలన పదేళ్లకు బదులు పదిహేడేళ్లు చేస్తారని ఒక పత్రిక రాసింది. పైన ఏడేళ్లు ఎందుకో నాకు అర్థం కాలేదు. సిబిఐటీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ హైదరాబాదులోనే వున్నాయి. ఎమ్‌సెట్‌లో ఎంత ర్యాంకు తెచ్చుకుని ఆంధ్రులకు ఏం లాభం? అని అశోక్‌బాబు పాయింటు లాగారు కాబట్టి ఉమ్మడి రాజధానిగా వున్నంతకాలం రాష్ట్రవాసులందరినీ హైదరాబాదులో స్థానికులుగా గుర్తిస్తారని మరొక పత్రిక వూహిస్తోంది. అందరూ స్థానికులే అయితే హైదరాబాదు వాళ్ల గతి ఏమిటి? మరి హైదరాబాదు వాళ్లని కూడా యితర ప్రాంతాల్లో స్థానికులుగా గుర్తిస్తారా? జోనల్ సిస్టమ్ ఎత్తేస్తారా? ఇలా అందరూ స్థానికులే అంటే రాష్ట్రాన్ని విడగొట్టి ఏం సాధించినట్టు? 

ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసి వుంటుంది. ఏం చెప్పినా దానికి అవతలివాళ్లు అడ్డు చెప్పడానికి రెడీగా వున్నారు. పైగా యిరు ప్రాంతాల నుండి నాయకులు అనేవారు లేరు. సీమాంధ్రుల తరఫున శైలజానాథ్ మాట్లాడితే చాలు, ఆయన ఏం ఒప్పుకుంటే దాన్ని మేం శిరసావహిస్తాం అంటారా? టిడిపి, వైకాపాయే కాదు, కాంగ్రెసు వాళ్లే ఆ మాట అనరు. అలాగే తెలంగాణ తరఫున జానారెడ్డో, జయపాల్ రెడ్డో పెద్ద దిక్కు, ఆయన మాటే ఆఖరి మాట అని బిజెపి, తెరాస వాళ్లు క్లీన్ చిట్ యిస్తారా? గతంలో ప్రకాశం, బూర్గుల వంటి దిగ్గజాలు వుండేవారు. వారి మాటను అందరూ మన్నించేవారు. ఇప్పుడు అలాటి పరిస్థితే లేదు. ఏ ఫార్ములా వర్కవుట్ చేసినా ఒక్కోర్నీ పిలిచి బతిమాలో, బామాలో, ఆశపెట్టో, భయపెట్టో ఒప్పించుకుంటూ రావాలి. ఎవరికి అసంతృప్తి కలిగినా బయటకు వచ్చేసి ‘ఒప్పుకున్నవాళ్లు అమ్ముడుపోయారు, ఆంధ్ర/తెలంగాణ ద్రోహి’ అని ప్రచారం చేయగలరు. 

ఇలా ఒప్పించడం మామూలుగానే కష్టం, ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ మరీ కష్టం. ఇదంతా చేయడానికి చాలా టైము పడుతుంది. అయితే చేతిలో టైము లేదు. మొత్తం 170 రోజుల్లో ప్రక్రియ అంతా పూర్తి చేయాలట, లేకపోతే బ్రేక్ పడుతుంది. ఆ లోపున పూర్తి చేయాలంటే కొన్ని దశలు ఎత్తేయాలి, మరి కొన్ని దశల గడువును కుదించాలి. అంటే తెలంగాణ నోట్‌ను రేసు గుఱ్ఱంలా పరుగులు పెట్టించాలి. ఇలా పరుగులు పెట్టేటప్పుడు అంతా న్యాయబద్ధంగా, క్రమపద్ధతిలో జరిగిందని ప్రజలకు విశ్వాసం కలిగించడం కుదురుతుందా? ‘న్యాయం జరగడమే కాదు, న్యాయంగా జరిగిందని కనిపించాలి కూడా’ అని సామెత. రాష్ట్ర అసెంబ్లీని విస్మరించి, అసెంబ్లీలో తీర్మానం వీగిపోయినా తను అనుకున్న ప్రకారం చేసేసి, ఆంధ్ర కాంగ్రెసు ఎంపీల నోరు నొక్కేసి  పార్లమెంటు శీతాకాల సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టారే అనుకుందాం. దానికి బిజెపి వెంటనే ఓఖే అనేస్తుందా? 

రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికే యింత తతంగం జరుగుతోందని ఆబాలగోపాలం అనుకుంటూ వుంటే బిజెపి దానికి ఎందుకు సహకరిస్తుంది? తెలంగాణకు మేం అనుకూలం అని నొక్కి చెపుతూనే ‘ఇన్నాళ్లూ తాత్సారం చేసి ఎందుకింత తొడతొక్కిడిగా చేస్తున్నారో సంజాయిషీ చెప్పండి ముందు’ అని అడుగుతుంది. మోదీ గారు అప్పుడే ‘మేం రాష్ట్రాలు చీల్చినపుడు యిరు ప్రాంతాల వాళ్లూ మిఠాయిలు పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో యిప్పుడు కాంగ్రెసు చేసినదానికి మిరపకాయలు చూపుకుంటున్నారు.’ అని మొదలుపెట్టారు. ‘స్టేక్ హోల్డర్స్ అందరినీ తృప్తి పరచాకనే బిల్లు పెట్టండి. అయినా మీకు అది చేతకాదు లెండి, మేం అధికారంలోకి వచ్చి సవ్యంగా చేసి చూపిస్తాం’ అని బిజెపి వాదిస్తుంది. రాష్ట్రపతి కూడా ‘అసెంబ్లీని రద్దు చేసి/అక్కడి తీర్మానాన్ని తుంగలో తొక్కి/ అసెంబ్లీకి పంపకుండా బిల్లు నాకు పంపితే ఎలా? అసెంబ్లీ లేకపోయినా అన్ని ప్రాంతాల వారితో చర్చించి సవరణలు చేసి బిల్లు మళ్లీ పంపండి’ అని వెనక్కి పంపే సందర్భమూ వుండవచ్చు. 

ఇలాటిది జరిగితే కాంగ్రెసు  ‘మేం తెలంగాణ యివ్వబోతే బిజెపి ఏవో అడ్డదిడ్డ ఆర్గ్యుమెంట్లతో అడ్డుకుంది’ అని వారిని నిందిస్తూ ఎన్నికలలో ప్రచారం చేసుకుంటుంది. దీన్నే బిజెపి ఆంధ్రలో తనకు అనువుగా చెప్పుకుంటుంది – ‘మేం లేకపోతే కాంగ్రెసు మీకు అన్యాయం చేసేసి వుండును’ అని. ఈ ఆప్షన్లు, యిన్ని చిక్కుముళ్లు ఫటఫటా విప్పేసి 170 రోజుల్లోనే తెలంగాణ బిల్లు పాస్ చేయించగలిగితే కాంగ్రెసు ఘనకార్యం చేసినట్టే ఒప్పుకుని తీరాలి. ఏం సాధించామో చెప్పుకోవడానికి యుపిఏ2 కు వేరే ఏమీ లేకపోయినా కనీసం యిదైనా మిగులుతుంది. 

ఎమ్బీయస్ ప్రసాద్