లవ్‌లెటర్‌ : చిరూ, చూసి నేర్చుకోండి!

మెగాస్టార్‌ చిరంజీవి గారూ..  Advertisement తమరు ఒక విషయం నేర్చుకోవాలి. తమరికి ఉన్న రాజకీయ అనుభవం తక్కువే అయినా.. ఇంత తక్కువ అనుభవంతో అరుదుగా వరించే కేంద్ర మంత్రి పదవిని అందుకున్నారు. మంచిది మా…

మెగాస్టార్‌ చిరంజీవి గారూ.. 

తమరు ఒక విషయం నేర్చుకోవాలి. తమరికి ఉన్న రాజకీయ అనుభవం తక్కువే అయినా.. ఇంత తక్కువ అనుభవంతో అరుదుగా వరించే కేంద్ర మంత్రి పదవిని అందుకున్నారు. మంచిది మా అభినందనలు కూడా మీకుంటాయి. ఒక రంగంలో సెలబ్రిటీలుగా ఎదిగిన తర్వాత.. ఆ రంగంనుంచి రాజకీయాల్లోకి జంప్‌ చేసే తమబోటి వాళ్లకు ఇలాంటి అరుదైన అవకాశాలు తప్పక తగులుతుంటాయి. అయితే అవకాశం వచ్చిన తర్వాత దానికి తగ్గట్లుగా మిమ్మల్ని మీరు ఎంత త్వరగా మలచుకుంటారనేదానిమీదే.. తర్వాతి కాలంలో మీ భవిష్యత్తు, మీ గౌరవం ఆధారపడి ఉంటాయన్నది నిజం. ఎన్టీఆర్‌, ఎమ్జీఆర్‌ వంటి వారు కూడా మీలాగా హటాత్తుగా రాజకీయ అధికారం అనుభవించిన వారే.. అలాంటి వారు త్వరగా వాటికి ‘అడాప్ట్‌’ అయి నిలదొక్కుకున్నారు. కానీ మీరేం చేస్తున్నారు. 

అక్కడ ఢల్లీిలో కీలకమైన పార్లమెంటు సమావేశాలు జరుగుతోంటే.. ఇక్కడ మీరు రాష్ట్రంలో అటూ ఇటూ తిరుగుతూ అసెంబ్లీలో అనువుగాని సమయాల్లో ప్రెస్‌మీట్‌లు పెడుతూ, గాంధీభవన్‌లో శాలువాలు కప్పించుకుంటూ కాలం గడుపుతున్నారు. మీ హోదా ఇక్కడ చక్కర్లు కొట్టడంతో పరిమితం అయ్యేది కాదు. తమరు కేంద్రమంత్రి. అక్కడ కేంద్రంలో కొలువు జరుగుతోంది. ఆ సంగతి తమరు గుర్తెరగాలి. 

ఇక్కడ తమరు గతంలో ఉన్న అసెంబ్లీలోనూ, గాంధీభవన్‌లోనూ, రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లోనూ ప్రజలంతా తమను కేంద్రమంత్రిగా గుర్తించారో లేదోననే అస్తిత్వ భయాలతో.. అందరికీ ఓసారి ఈ హోదాలో కనిపించి వెళ్దామని తమరు హడావిడిగా తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. పర్లేదు ఇప్పటికి… తొలుత తమని గెలిపించి.. తరవాత, తమ పరువును ఓడిరచిన తిరుపతి నియోజకవర్గంలో తప్ప రాష్ట్రమంతా తాము తిరిగినట్లే లెక్క తేలుతోంది. 

ఇక ఇప్పుడు విషయానికి వద్దాం. 

కేంద్రమంత్రిగా మీరు చేయాల్సిన పనులు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు మాత్రమే .. అనగా ఆ హోదాలో ఉన్న వారు మాత్రమే చేయదగిన పనులు అవి. మీరు అలాంటి వాటిని గాలికి వదిలేయడం తగదు. నిజానికి మీకు అనాయాసంగా ప్రాప్తించిన ఆ హోదానుంచి జనం ఏం కోరుకుంటున్నారో మీకు అర్థమయ్యే అవకాశం లేదు. అయితే నేర్చుకోవడం తప్పు కాదు. నేర్చుకునే ఉద్దేశం లేకపోవడం చాలా పెద్ద తప్పు. ప్రస్తుతం తెలుగు ప్రజలు పడుతున్న అంతర్జాతీయ ఇబ్బందులేంటో చూడండి. ఈ విషయంలో తమ సహచర కేంద్రమంత్రులు చేస్తున్న పనులేమిటో గమనించండి. అలాంటి పని తమరెందుకు చేయలేకపోతున్నారో తర్కించుకోండి. 

సమస్యలుచూద్దాం.. ఇప్పుడు గల్ఫ్‌లో వేలాది మంది తెలుగువాళ్లు చిక్కుబడి పోయి ఉన్నారు. దిక్కూమొక్కూ లేక సతమతం అవుతున్నారు. కేంద్రం చొరవ చూపిస్తే తప్ప తెగే సమస్య కాదిది. తమ సహచర తమిళ మంత్రి వయలార్‌ రవి తమ తమిళ తంబీలను మాత్రం గల్ఫ్‌ ఉచ్చునుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వయలార్‌ గతంలో ప్రవచించిన మాటల ప్రనకారం తమ మెగాస్టారిజానికి ఆయన ఫ్యాను కూడా. మరి మన తెలుగువాళ్లు అన్నివేల మంది అక్కడ అవస్థలు పడుతోంటే కేంద్రమంత్రిగా తమరేం చేస్తున్నారు. కేంద్రం చొరవ చూపిస్తే తప్ప చక్కబడని ఈ వ్యవహారంలో తమ పాత్ర ఏం నడుస్తోంది.

నార్వేలో తెలుగు దంపతులకు అన్యాయంగా జైలుశిక్ష పడిరది. బిడ్డను దార్లో పెట్టుకునే భావనతో సాంప్రదాయంగా మనమెరిగిన బిడ్డల శిక్షణ పద్దతులనే వారు కూడా అనుసరించారు. ఆ మాట పట్టుకుని అక్కడ చట్టం ఏదో మహాద్భుతం అన్నట్లుగా.. పసిపిల్లలకు తల్లిదండ్రులను దూరంచేసింది అక్కడి సర్కారు. ఆ పిల్లలు ఇప్పుడు అనాథలైనట్లే. ఇది మానవీయ కోణంలో చూడాల్సిన అంశం. చిన్న చిన్న మానవీయ అంశాలకు కన్నీళ్లతో స్పందించే తమలోని మానవతావాది ఏమైనట్లు? కేంద్రం చొరవచూపించి.. అక్కడి రాయబార కార్యాలయం ద్వారా సీరియస్‌గా యాక్షన్‌ తీసుకుంటే గనుక.. ఆ శిక్షనుంచి మన తెలుగు దంపతుల్ని తిరిగి ఇంటికి తీసుకురావడం కుదురుతుందా? ఇదే అన్యాయం ఓ తమిళ జంటకు జరిగి ఉంటే ఆ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు మీలాగే (మీ 9మంది సహచరుల్ని కూడా కలుపుకుని) నిర్లిప్తంగా వ్యవహరించేవారేనా.. ఒక్కసారి ఊహించుకోండి. ఆ విధంగా కేంద్రమంత్రి హోదాలో  ఉన్న వారు మాత్రమే చేయగల, అంటే మీరు స్పందించాల్సి ఉన్న అంశాలు అనేకం ఉన్నాయి. వాటి మీద శ్రద్ధ పెట్టండి. మీక్కూడా గౌరవం పెరుగుతుంది. 

చిరంజీవిగారూ! రాష్ట్రంనుంచి పది మంది కేంద్రమంత్రులు ఉంటే నన్నొక్కడినే ఎందుకు ఎత్తిపొడుస్తున్నారని తప్పు పట్టుకోవద్దు. తమరు రేప్పొద్దున్న ముఖ్యమంత్రి కుర్చీమీద కన్నేసిన నాయకులు. పైగా రాష్ట్రంలో ప్రజలకు ఆ తొమ్మిది మంది కంటె తమరే చిరపరిచితులు. తమమీదే ఆశలుండడం వారి తప్పు కాదు. గుర్తుంచుకోండి. 

` కపిలముని