లవ్‌ లెటర్‌ : బాపూ… తిరస్కరించు!

మరో వారం రోజులు గడిస్తే.. 78 పుట్టినరోజుల పండగ చేసుకోబోతున్న బాపూ… ముందుగా నా హృదయపూర్వక నమస్కారం.  Advertisement మీ ఆరోగ్యం కుదురుగా లేదని, నలతకు చికిత్స చేయించుకుంటున్నారని విన్నాను. రాముడి దయతో మీరు…

మరో వారం రోజులు గడిస్తే.. 78 పుట్టినరోజుల పండగ చేసుకోబోతున్న బాపూ… ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. 

మీ ఆరోగ్యం కుదురుగా లేదని, నలతకు చికిత్స చేయించుకుంటున్నారని విన్నాను. రాముడి దయతో మీరు చల్లగా ఉండాలని, ఎలాంటి ఆరోగ్యాందోళన (అనగా కో.కొ.: ‘ఆరోగ్యము మరియు ఆందోళన’ అని కాదు. ‘ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళన’ అని భావం)  లేకుండా కుదురుగా ఉండాలని ఆశిస్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా.. ప్రతి పుట్టిన రోజున మీరు వచ్చి తన దర్శనం చేసుకుంటూ ఉంటే.. మీరు చేసే సేవల్తో మురిసిపోవడం అలవాటు చేసుకున్న భద్రాచలం రామయ్య తండ్రి.. ఈ ఏడాది కూడా మిమ్మల్ని ఆ సమయానికి తన వద్దకు రప్పించుకునే పాటి ఆరోగ్యపుష్టిని మీకు అందించాలని కూడా ఆయనను అడుగుతున్నాను. 

ఇప్పుడు విషయానికి వస్తాను…

బాపూ.. తమరు పట్టించుకుంటారని నేను అనుకోను గానీ.. కనీసం వినబడ్డారో లేదోననే ఉద్దేశంతో చెబుతున్నాను. వారం రోజుల కిందట ఒక ఉపద్రవం జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తమ పేరు మీద పద్మభూషణ్‌ అవార్డు ప్రదానం చేయాల్సిందిగా కేంద్ర సర్కారుకు సిఫారసు చేసిపడేసినట్లుగా వార్తలు వొచ్చాయి. మన ఫ్రెండు బుడుగుతో కూడా ఈ విషయం పంచుకున్నాను. వాడు తనదైన మాటల్తో ‘ఈ సర్కారుకు ఎ్యంత ఫొగరు.. య్యెంత ఖండకావరం… హన్నా… మా వాడికి నోట్లో నాలిక లేదు కదాని.. ఏం చేసినా పట్టించుకోడు లెమ్మని య్యింత ధారుణంగా అవమానిస్తుందా? అదే అనుమానిస్తుందా…??’ అంటూ తెగ ఖోప్ఫడిపోయేశాడు. నాక్కూడా అదే బాధగా ఉందన్నాను. ఈ సర్కారోళ్ల తోలు తీస్తానంటూ కొరడా పట్రాడానికి జెటకా వాడి దగ్గరకు వెళ్లాడు. ఈలోగా నేను తమరికి ఈ ఉత్తరం రాస్తున్నాను. దయచేసి చదవండి…

బాపూ… ఇన్నాళ్లూ మీకు ఒక్క పద్మ అవార్డు కూడా రాలేదని మేం ఎంత గర్వంగా ఉన్నాం. ఎంతగా ఉప్పొంగిపోతున్నాం. పద్మ అవార్డులు ప్రకటించిన ప్రతిసారీ మేం రొమ్ము విరుచుకుని తిరిగేవాళ్లం. ‘చూశారా.. ఈ పద్మ అవార్డులకు మా బాపు పాదాలు ముట్టుకోడానికి కూడా జడుపే’ అంటూ డాబుగా చెప్పుకునే వాళ్లం. ఈ ధూర్త సర్కారు ఈ సారి మీ పేరును సిఫారసు చేసేసిందని పేపర్లో చూడగానే.. మాకు బుస్సున  గాలి తీసేసినట్లుగా అయిపోయింది. ఇన్నాళ్లూ తమరంటూ ఒకరున్నారని పద్మ అవార్డులకు నాలుగు పేర్లు పురమాయించే ఈ సర్కారుకు తెలియదు. తమరి అస్తిత్వం వీరికి ఎరిక లేదు. తమరెరిగిన సృజన విద్యల పరంగా ఇది మరుగుజ్జు ప్రభుత్వం. తమరేమో మేరునగం ఎత్తుకు ఎదిగి విలాసంగా అక్కడ కుంచె ఊపుకుంటూ ఈజిల్‌ ఎదురుగా కూర్చున్నారు. దిగువన పారేసిన పెయింటు ట్యూబుల మధ్యన దిక్కుతోచకుండా తిరుక్కుంటూ… పద్మ సిఫారసులకు ఎవరు దొరుక్కుంటారో వెతుక్కుంటూ దేవులాడిరది ఇన్నాళ్లూ ఈ ప్రభుత్వం. తమవి పాదాలో పర్వతాలో తెలియని మరుగుజ్జుతనం వారికి విధివశంగా ప్రాప్తించిన శాపమే తప్ప.. ఏమని తప్పుపట్టగలం. అందువల్ల తమ పేరు వారికి ఇన్నాళ్లూ స్ఫురించలేదు గనుక మనం.. మన గౌరవానికి, గర్వానికి భంగం వాటిల్లకుండా ఉన్నాం. ఇప్పుడు
.. మీ ప్రేమకు నోచుకున్న కొందరు.. ఈ మరుగుజ్జు ప్రభుత్వాల పెద్దలను కలిసి.. స్వయంగా పిలుచుకొచ్చి.. నిచ్చెనలు వేసి.. ఎక్కించి.. మీ మూర్తిమత్వాన్ని చూపించిన తర్వాత.. ఈ సర్కారు వారికి తెలివొచ్చింది. ఇన్నాళ్లూ ఈ దాపుల్లోనే దేబిరించామే.. అనుకుని తత్తరపడి, నాలిక్కరుచుకుని హడావిడిగా మీ పేరును పద్మశ్రీ గట్టు దాటి, ఏకంగా పద్మభూషణే ఇచ్చేయమంటూ సిఫారసు చేసి పంపేశారు. 

బాపూ.. ఇంత పరాభవం నేనోర్వలేను. తమర్ని తాకడానికి పద్మం జంకుతోంది… ఎంతైనా పంకిలం నుంచి పుట్టిన దాని జన్మత: సిద్ధించిన బుద్ధి వెనక్కు లాగుతోంది… అనుకుంటూ ఇంత లావు ఘనులం మనం మాత్రమే అనుకుంటూ ఉంటే… ఇప్పుడు ఆ పద్మ అవార్డుకు ఎంత దైర్నం. ‘భూషణం’గా తమకు అమరగల తాహతు తనకున్నదని.. సాహసిస్తుందా? అ…క్కడ ఉన్న నిన్ను లా..క్కొచ్చి… అందరు పద్మాల మధ్యలో పడేయాలని చూస్తుందా? చెప్పాకదా.. బాపూ! ఇంత పరాభవం నేనోర్వలేను. 

బాపు అంటే తెలిసిన జగతికి బాపు అంటే సగమే అని తెలుసు. బాపు రమణ అంటే ఆ మూర్తిత్వానికి పూర్తిత్వం ఒనగూరుతుందని కూడా తెలుసు. అలాంటిది.. ఆ పెద్దాయిన తన సుఖం తను చూసుకునే దాకా.. తోపులమ్మటా.. చెరువు గట్లమ్మటా… చెడ తిరుగుళ్లూ తిరిగి ఇప్పుడు బాపు సగమై కూర్చున్నాక మన వాకిట్లోకి వస్తుందా…? ఎంత దైర్నం…?

అందుకే బాపూ.. నా మాట విను. ‘తూచ్‌.. తూచ్‌.. తూచ్‌.. ఈ పద్మం నాకొద్దు’ అనేయ్‌. ఇష్టం లేని పనిచేయమంటే కత్తితో తెగనరికేంత కటుత్వం దాచి మెత్తగా ‘నాకు చేతకాదండీ’ అంటావే.. అలాగ ‘నేను తగనండీ’ అని మోడెస్టీతో సెలవిస్తావో… ‘ఇవాళ కొంచెం తలనొప్పిగా ఉందండీ.. బజార్లో అమృతాంజనం సీసా దొరకలేదు.. పంతులు గారికి పురమాయించాను.. అది దొరికే దాకా తాళలేను.. నేను రాలేను గానీ.. ఈసారికి మీ వేడుక కానిచ్చేయండి..’ అంటూ వ్యంగ్య విన్యాసం ప్రదర్శిస్తావో… ‘మీరు అనుకునే బాపు నేను కాదండీ.. ఆ రమణ లేకుండా నేనెక్కడ ఉన్నానూ.. మీరు నేను అనుకుంటున్నది మీ చిత్తభ్రమ.. కనక మరోచోట మరొకరిని వెతుక్కోండి..’ అంటూ మాటలతో ఓ టెంకిజెల్ల కొఠేస్తావో.. నీ ఇష్టం.

కానీ బాపూ… నువ్వు మాత్రం తిరస్కరించు. 

మమ్మల్ని బజారుకీడ్చకు. మా గౌరవాన్ని, గర్వాన్ని కాపాడు. ప్లీజ్‌.

– ప్రేమతో

కపిలముని