తెలంగాణవాసి అన్న పదానికి నిర్వచనం చెప్పకుండానే పుష్కరంపాటు ఉద్యమం నడిపించారు. సీమాంధ్ర నుండి ఎప్పుడో వచ్చి స్థిరపడినవారిని, వారి పిల్లల్ని, మనుమల్ని సీమాంధ్రులుగా వ్యవహరిస్తూ రావడం వలన చాలా గందరగోళం ఏర్పడింది. సాంకేతికంగా చూస్తే వాళ్లు స్థానికులే అవుతారు. ఇప్పుడున్న నియమాల ప్రకారం వరుసగా వరుసగా నాలుగేళ్ల చదువు చాలు. అక్కడే చాలామందికి అర్హత వచ్చేస్తుంది. లేనివాళ్లు కూడా దొంగ సర్టిఫికెట్లతో తయారవుతారు. గతంలో ముల్కీ నిబంధనలు వున్నపుడు దొంగ ముల్కీ సర్టిఫికెట్లు పుట్టించేవారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ వుంది కాబట్టి దొంగ సర్టిఫికెట్లు ద్వారా సంపాదించేవారు ఎందరో! ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అయిపోతూంటారు. వాళ్లపై ప్రత్యర్థులు కేసులు పెడుతూ వుంటారు. రేపణ్నుంచి ఉద్యోగాల్లోకూడా వీళ్లు బోగస్ తెలంగాణవాళ్లన్న కేసులు రావచ్చు. పదేళ్లపాటు హైదరాబాదులో విద్యావకాశాలు యథాతథంగా వుంటాయనడంతోనే తెలంగాణ అభ్యర్థుల్లో నిరాశ కలుగుతుంది. ప్రతిభ వున్నవాడికి ఎప్పుడూ చిక్కు లేదు. లేనివాళ్లే స్థానికత పేరుతో, కులం పేరుతో రిజర్వేషన్ల కోసం వెంపర్లాడతారు. సెక్రటేరియట్‌లోని తెలంగాణ ఉద్యోగి సంఘాల నేతలను అడిగారు – మీరు 90% మంది సీమాంధ్రులే అంటున్నారు కదా, వాళ్లంతా ఓపెన్ క్యాటగిరీలో సెలక్టయినపుడు ఎలా తప్పుపట్టగలరు? అని. ఆ నాయకుడు 'అంతా బోగస్. వాళ్లకు లీవులెటరు రాయడం కూడా రాదు.' అనేశారు. ఈ మాట ఎవరైనా ఎవరి గురించైనా అనవచ్చు.
ఓపెన్ క్యాటగిరీ ఉద్యోగాల గురించి కూడా యిలాటి ఆరోపణలు చేసినవాళ్లు కేంద్రప్రభుత్వ ఉద్యోగాల గురించి యిలాగే మాట్లాడవచ్చు. ప్రయివేటు ఉద్యోగాల గురించీ మాట్లాడవచ్చు. నియమవిరుద్ధంగా జరిగిన నియామకాలను ఎవరూ సమర్థించరు. వాళ్లందరూ వెళ్లిపోవలసినదే. నియమాల ప్రకారం జరిగిన నియామకాల విషయంలో కూడా గత మూడు నాలుగేళ్లగా పదవి చేపట్టబోతూ వుంటే అడ్డుకున్న సంఘటనలు జరిగాయి. సీమాంధ్రులన్న అనుమానం వస్తే చాలు, వెళ్లి గొడవ చేయవచ్చు. ఎవరు సీమాంధ్రులో, ఎవరు తెలంగాణ వారో తేల్చడం ఎలా? ఒకటే భాష, ఒకటే పోలికలు, ఇంటి పేర్లూ ఒకలాటివే. వేర్వేరు జాతుల వారయితే తెలిసిపోతారు. వీళ్లు తెలియరు. డాక్యుమెంట్ల బట్టి మాత్రమే యీ విషయం తేల్చాలి. అవి బోగస్ అయితే, నికార్సయినవైనా బోగస్ అని ఆరోపిస్తే…? అంతా వివాదమే. టి-బిల్లు ప్రకారం 84 వేల మంది ఉద్యోగుల ఎలాట్‌మెంట్ తేల్చడానికి ఓ కమిటీ వేస్తారు. అది ఏం నిశ్చయిస్తే అదే ఫైనల్. ఆ కమిటీ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించడం అతి సులభం. పైగా దాని నిర్ణయంపై ఎందరు కోర్టుకి వెళ్లి స్టేలు తెచ్చుకుంటారో తెలియదు.
ప్రయివేటు ఉద్యోగాలలో కూడా స్థానికులకు 80% ఉద్యోగాలు రిజర్వ్ చేస్తామని కెసియార్ వాగ్దానం చేశారు. యువత ఓట్లకోసం దాన్ని అన్ని పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టవచ్చు. పెట్టుబడి పెట్టినవాడు ప్రతిభ ఆధారంగా ఉద్యోగం యిద్దామనుకుంటాడు కానీ ప్రాంతం ఆధారంగా యిద్దామని అనుకోడు. ఇప్పటికే నాలుగైదేళ్లగా టి-ఉద్యమకారులు బిజినెస్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ వద్దకు వెళ్లి 'మీ వద్ద తెలంగాణ వాళ్లు ఎంతమంది వున్నారు? ఇంతమందే వున్నారేం?' అని గణాంకాలు అడుగుతున్నారు. వాళ్లు చెప్పిన అంకెలు వీళ్లు నమ్మాలని లేదు. సీమాంధ్రులను కూడా కలిపి చెప్తున్నారని పేచీ పెట్టుకోవచ్చు. పైన చెప్పిన ప్రకారం ఎవరు అవునో, కాదో తేల్చడం ఒక పట్టాన సాధ్యం కాదు. తెలంగాణలో వున్న పరిశ్రమలు, వ్యాపారసంస్థలు యీ యిబ్బంది ఎదుర్కోవలసి వస్తుందని ఎప్పణ్నుంచో భయపడుతున్నాయి. కెసియార్, హరీష్ యిలాటి బెదిరింపులకు పాల్పడతారని నేను అనడం లేదు. వాళ్లే అక్కరలేదు, ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమం పేరుతో బెదిరించవచ్చు. టి-ఉద్యమం ధర్మమాని అనేకమంది నాయకులు పుట్టుకుని వచ్చారు. పుంఖానపుంఖాల జాక్‌లున్నాయి. తమ వలనే తెలంగాణ వచ్చిందన్న నమ్మకం ప్రతి జాక్ నాయకుడిలోనూ వుంది. అందరూ టిక్కెట్లు అడుగుతారు, నామినేటెడ్ పదవులు కోరతారు. వీరికి తోడు యిన్నాళ్లూ తెలంగాణ ఉద్యమానికి విదేశాల నుండి ఆర్థిక, హార్దిక సహకారాలు అందించిన ఎన్నారైలు కూడా యిలాటివి కోరతారు. ఎంతమందికని సర్దగలరు?
అసంతృప్తులు ఒకరిపై మరొకరు బురద చల్లుకుంటారు. అవతలివాళ్లు అసలు తెలంగాణా వాళ్లే కాదంటారు. వారి సీమాంధ్ర మూలాలు వెతికే పనిలో పడతారు. అవి దొరక్కపోతే సీమాంధ్రులకు అమ్ముడు పోయారంటారు. సీమాంధ్రుల ఏజంట్లంటారు. నిరుద్యోగులను, యువతను వాళ్లపై ఉసికొల్పుతారు. అధికారంలో వున్నవాళ్లు ప్రశాంత పరిస్థితులు నెలకొని తమకు యిబ్బందులు లేకుండా వుండాలని చూసినా, వీళ్లు అశాంతి రేకెత్తించడానికి చూస్తారు. దీని ప్రభావం ఎక్కువగా పడేది వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలపైనే! తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడడం ఖాయం. ఇక్కడ విద్యుత్ ప్రాజెక్టులు వచ్చి ఉత్పత్తి ప్రారంభించేదాకా కొరత తీరదు. అప్పటిదాకా ఏదో ఒక రేటుకి బయటనుండి కొనాలి. తెలంగాణ రైతులు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని అనుభవిస్తూ వచ్చారు. కోస్తా రైతులకు నీరు కాలువల్లో లభిస్తుంది కాబట్టి, అక్కడ బోరు మోటర్ల అవసరం లేదు కాబట్టి అక్కడ మిగిలిన విద్యుత్‌ను యిలా యివ్వగలిగారు. (జాయింటు ఫ్యామిలీలో యిలాటి సౌకర్యాలుంటాయి). రాష్ట్రం విడిపోయాక ఉచిత విద్యుత్ పెనుభారమౌతుంది. కొత్త పాలకులు దాన్ని ఆపేయగలరా? లేరు. రైతులకు యిచ్చి పరిశ్రమలను ఎండగడతారు. అంతేకాదు మధ్యతరగతివాసులుండే నగరానికి, పట్టణాలకు విద్యుత్ యిచ్చి పరిశ్రమలకు తగ్గిస్తారు. ఎందుకంటే రైతులు, మధ్యతరగతివాళ్లు నోరున్నవాళ్లు, ఓటున్నవాళ్లు. విద్యుత్ కొరతతో బాటు పరిశ్రమలు ఎదుర్కునే మరో సమస్య వయబిలిటీ. రాష్ట్రం విడిపోతుందన్న వూహ ఎప్పుడూ రాక హైదరాబాదులో పెద్దపెద్ద ఎస్టాబ్లిష్‌మెంట్స్ పెట్టేశారు. రాష్ట్రంలోని ప్రజలంతా వైద్యం కోసం, విలాసం కోసం, షాపింగు కోసం, అనేకానేక పనులకోసం హైదరాబాదు వస్తారని భావించి ఆ కెపాసిటీ మేరకు పెట్టుబడి పెట్టి పెద్దపెద్ద అద్దాల మహళ్లు కట్టారు.
ఇప్పుడు విభజన తర్వాత ఎక్కడి కక్కడ చిన్న స్థాయిలో యిలాటివి వెలుస్తాయి. నా చిన్నపుడు మంచి హోటల్స్ కావాలంటే చిక్కడపల్లి వెళ్లేవాళ్లం, చిల్లరమల్లర షాపింగంటే సుల్తాన్ బజార్, ఖరీదైన షాపింగంటే ఆబిడ్స్, గాజు, పింగాణీ, లెదర్ సామాన్లంటే మదీనాకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో షాపింగు సెంటర్లు వచ్చేశాయి. నగరం నలుమూలలా అలాటివి వచ్చేయడంతో జనాలు అంతదూరం వెళ్లడం మానేశారు. కోఠీ, ఆబిడ్స్ వెలవెలపోతున్నాయి. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)