‘మా బాధ్యతలు.. హీరోలకుండవ్‌ కదా..’

‘‘హీరోయిన్లుగా మాకెంత పేరు ప్రఖ్యాతులున్నా.. హీరోలకున్నంత వెసులుబాటు మాకుండదు.. అందుకే హీరోలకు వయసు మీదపడ్డా వారింకా హీరోలుగా చెలామణీ అవుతారు.. మేమేమో క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా మారిపోవాలి.. బాధ్యతల కారణంగా సినిమాలకూ దూరమవ్వాల్సి వస్తుంది..’’ ఇదీ…

‘‘హీరోయిన్లుగా మాకెంత పేరు ప్రఖ్యాతులున్నా.. హీరోలకున్నంత వెసులుబాటు మాకుండదు.. అందుకే హీరోలకు వయసు మీదపడ్డా వారింకా హీరోలుగా చెలామణీ అవుతారు.. మేమేమో క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా మారిపోవాలి.. బాధ్యతల కారణంగా సినిమాలకూ దూరమవ్వాల్సి వస్తుంది..’’ ఇదీ బాలీవుడ్‌ బ్యూటీ మాధురీ దీక్షిత్‌ మనసులో మాట. ఒకప్పుడు బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా చెలామణీ అయిన మాధురీ దీక్షిత్‌, కొన్నాళ్ళపాటు సినిమాల్ని వదిలేసుకుంది, మళ్ళీ ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. మునుపటిలా హీరోలతో కలిసి గ్లామరస్‌గా స్టెప్పులేయడం తమకు కుదరదని నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది మాధురీ దీక్షిత్‌. హీరోలకైతే యాభయ్యేళ్ళొచ్చినా.. పాతికేళ్ళ కుర్రాడిలా.. ఇరవయ్యేళ్ళ అమ్మాయిలతో ఎంచక్కా తెరపై రొమాన్స్‌ చేసెయ్యొచ్చని అంటోన్న మాధురి, కెరీర్‌ గురించీ.. ఫ్యామిల లైఫ్‌ గురించీ చాలా విషయాల్ని మీడియాతో పంచుకుంది. అవేంటో చూద్దాం.

ఫ్యామిలీ లైప్‌.. ఫుల్‌ ఎంజాయ్‌మెంట్‌

కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అందుకున్నా, ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చెయ్యకపోతే జీవితానికి విలువే వుండదంటోంది మాధురి. తనవరకూ తాను సినిమాల్లోనూ, ఫ్యామిలీ లైఫ్‌లోనూ సక్సెస్‌ అయ్యానని చెప్పిందామె. ఫ్యామిలీ కోసం కెరీర్‌ని వదులుకోవడం త్యాగం కాదు, బాధ్యత అని చెప్పే మాధురి, మంచి భార్యగా.. మంచి తల్లిగా పేరు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయమనీ, ఆ ఘనత దక్కించుకున్నందుకు చాలా ఆనందంగా వుందని వ్యాఖ్యానించింది. అర్థం చేసుకునే భర్త, అంతమైన కుటుంబం.. ఏ స్త్రీకి అయినా కావాల్సిందేముంటుందని అంటోంది మాధురి.

పిల్లలతో కలిసి టైక్వాండో నేర్చుకున్నా

ప్రస్తుతం మాధురీ దీక్షిత్‌, ‘గులాబ్‌ గ్యాంగ్‌’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్సెస్‌ తనంతట తానే ప్రిపేర్‌ చేసుకుంది మాధురి. అదెలా సాధ్యం.? అని ప్రశ్నిస్తే, పిల్లలకి తైక్వాండోలో కోచింగ్‌ ఇప్పించినప్పుడు, తానూ దగ్గరుండి అబ్జర్వ్‌ చేసేదాన్నననీ, అలా దానిపై ఆసక్తి పెరిగిందనీ, ఇంటికి ట్రెయినర్‌ని రప్పించుకుని కుటుంబమంతా టైక్వాండోలో కోచింగ్‌ తీసుకున్నామని చెప్పింది మాధురి. అయితే బ్లాక్‌ బెల్ట్‌కి కాస్త దగ్గరలో కోచింగ్‌ నుంచి తాను తప్పుకున్నట్లు ఆమె వెల్లడించింది. అలా టైక్వాండో నేర్చుకోవడం ‘గులాబ్‌ గ్యాంగ్‌’ సినిమాకి ఉపయోగపడిందని మాధురి చెబుతోంది.

నెగెటివ్‌ పాత్రలనేవి వుండవు

‘గులాబ్‌ గ్యాంగ్‌’లో మరో బాలీవుడ్‌ బ్యూటీ జూహీచావ్లా నెగెటివ్‌ రోల్‌లో కన్పించింది. అలాంటి పాత్రలు మీరూ చేస్తారా? అని మాధురిని ప్రశ్నిస్తే, ‘అవి నెగెటివ్‌ పాత్రలెలా అవుతాయి.. దర్శకుడు కథ రాసుకున్నాక ఒక్కో పాత్ర తీరు తెన్నులు ఒక్కోలా వుంటాయి. అలా కొన్ని పాత్రలకు నెగెటివ్‌ షేడ్స్‌ వుంటాయి తప్ప, ఆ పాత్రలను నెగెటివ్‌ అని ఎలా అనగలం.?’ అని ఎదురు ప్రశ్నించింది మాధురీ దీక్షిత్‌. తాను కూడా ‘పుకార్‌’ సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ వున్న పాత్రలో కన్పించాననీ, భవిష్యత్తులో తన మనసకు నచ్చేలా నెగెటివ్‌ షేడ్స్‌ వున్న పాత్రలో నటించే అవకాశం వస్తే వదులుకోంటోంఆమె.

ఆడ, మగ.. అదే తేడా

‘కుటుంబ బాధ్యతల విషయంలో మహిళది ప్రత్యేకమైన పాత్ర. అలాగని భర్తకు బాధ్యతలుండవని కావు. కుటుంబం కోసం హీరోలు కెరీర్‌ని పక్కన పెట్టాల్సిన అవసరం వుండదు. కానీ, హీరోయిన్ల పరిస్థితి అది కాదు. కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి.. అందుకే నేను కెరీర్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాల్సి వచ్చింది. అదొక్కటి తప్ప, తెరపై ఆడ – మగ పాత్రధారులకు పెద్దగా తేడాలుండవు’ అంటోంది మాధురీ దీక్షిత్‌. హీరోతో సమానంగా పాపులారిటీ దక్కించుకున్న తాను, హీరోల్లా కెరీర్‌ని కొనసాగించలేకపోయాననీ, తనతో వర్క్‌ చేసిన హీరోలు మాత్రం ఇంకా యంగ్‌ హీరోయిన్లతో రొమాన్స్‌ చేస్తున్నారంటూ నవ్వేసింది.

ఇప్పుడున్న హీరో హీరోయిన్లలో మంచి డాన్సర్స్‌ ఎవరంటే…

మాధురీ అంటేనే డాన్సులు గుర్తుకొస్తాయి. ఆమె మంచి డాన్సర్‌. డాన్సర్‌గా పలు వేదికలపై ఆమె ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఆమె దృష్టిలో మంచి డాన్సర్‌ ఎవరంటే, ఠక్కున ఆమె నుంచి వచ్చే సమాధానం హృతిక్‌ రోషన్‌. ఎలాగూ ప్రభుదేవా కొరియోగ్రాఫరే.. ఆయన్ని పక్కన పెడితే, హృతిక్‌, షాహిద్‌కపూర్‌, రణ్‌వీర్‌సింగ్‌, రణ్‌బీర్‌కపూర్‌.. వంటి యంగ్‌స్టర్స్‌ మంచి డాన్సర్లుగా బాలీవుడ్‌లో తమ సత్తా చాటుకుంటున్నారని మాధురి అభిప్రాయపడింది. హీరోయిన్ల విషయానికొస్తే ఆమెకి దీపికా పడుకొనే డాన్సులంటే ఇష్టమట. కత్రినా, కరీనా, ప్రియాంక డాన్సుల్ని కూడా ఎంజాయ్‌ చేస్తుందట మాధరి. ప్రత్యేకించి డాన్సుల్లో రాణించడానికి కత్రినా పడే శ్రమ తనకు బాగా నచ్చిందని అభిప్రాయపడింది మాధురి.

రజనీకాంత్‌ చెల్లెలిగా.. అందుకే తిరస్కరించా

సోనమ్‌కపూర్‌కి తల్లిగా ఓ సినిమాలో మాధురికి అవకాశమొస్తే ఆమె తిరస్కరించింది. రజనీకాంత్‌ చెల్లెలిగానూ అవకాశమొచ్చినా మాధురి కాదనేసింది. కారణమేంటని ప్రశ్నిస్తే, ‘ఆ పాత్రలు చేయకూడదని కాదు, నాకు ఆ పాత్ర తీరు తెన్నులు నచ్చాలి కదా..’ అని సమాధానమిచ్చిన మాధురి, భవిష్యత్తులో మంచి పాత్రలొస్తే, అక్క, చెల్లి, తల్లి వంటి పాత్రల్లో ఒదిగిపోవడానికి ఇబ్బందేమీ తనకు లేదని స్పష్టం చేసింది.

ఆమెతో నాకు గొడవలేం లేవు

90లలో మాధురీ దీక్షిత్‌కీ, జూహీ చావ్లాకీ మధ్య ఆధిపత్య పోరు వుండేది. అందుకనే ‘గులాబ్‌ గ్యాంగ్‌’ సినిమా విషయంలో వీరిద్దరిపైనా చాలా అనుమానాలొచ్చాయి. తొలుత దర్శకుడు కథ చెప్పేటప్పుడు, ఇద్దర్నీ ఓ గదిలో వుంచేసి, దర్శకుడు సహా మిగతావారంతా బయటకు వెళ్ళిపోయారట. ‘లోపల మేమిద్దరం ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకుంటాం అనుకున్నారు.. కానీ, చాలా ఫ్రెండ్లీగా వున్నాం.. కథను అర్థం చేసుకున్నాం, ఆయా పాత్రల్లో ఒదిగిపోయి.. సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నాం..’ అని చెప్పింది మాధురి. ఎప్పుడూ తాను ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదనీ, జూహీ తనకు మంచి స్నేహితురాలని మాధురి చెప్పుకొచ్చింది.

అప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలున్నాయ్‌

‘‘అప్పట్లో షూటింగ్‌ అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వుండేవి. ఇప్పుడు సకల సౌకర్యాలతో కూడిన ‘కార్‌వ్యాన్‌’లు అందుబాటులోకి వచ్చేశాయి. ఎండలో గొడుగులు వేసుకుని, ఆపసోపాలు పడే పరిస్థితులు కావిప్పుడు. ఎంచక్కా ఏసీ కార్‌వ్యాన్‌లో రెస్ట్‌ తీసుకోవచ్చు. గ్రాఫిక్స్‌ ఎంట్రీ ఇచ్చాక, నటీనటుల పని ఇంకా సులువయ్యింది. కానీ, కొందరు సహజత్వం కోసం కష్టపడుతున్నారు, దాన్ని అభినందించి తీరాల్సిందే. రెమ్యునరేషన్స్‌ అయినా, సౌకర్యాలు అయినా.. అన్నీ ఇప్పుడు బావున్నాయి. మహిళలకు సినీ పరిశ్రమలో ఒకప్పుడు పెద్దగా చోటుండేది కాదు, కానీ ఇప్పుడు టెక్నికల్‌ టీమ్స్‌లోనూ మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయి. అది ఆహ్వానించదగ్గ పరిణామం. మహిళగా నాకు గర్వంగా వుంది మహిళలు సినిమాల్లో అన్ని రంగాల్లోనూ రాణిస్తుండడం పట్ల..’’ అని ఒకప్పటి సినిమాలకీ, ఇప్పుడు సినిమాలకీ, తేడాల్ని సినీ రంగంలో వస్తోన్న మార్పులనూ వివరించింది మాధురీ దీక్షిత్‌.