ఎమ్బీయస్‌ : రెండు రాష్ట్రాల భవిష్యత్తు ఏమిటి? – 2

అయితే యిక్కడో విషయం గమనించాలి. మహానగరం వుండగానే సరిపోదు. అది పెరగాలంటే, పెరుగుదల నిలబడాలంటే అనేక అంశాలు జతపడాలి. శతాబ్దాల క్రితమే కలకత్తా మహానగరం. ఇటీవలి కాలంలో ఏమంత డెవలప్‌ అయింది? ఢిల్లీ మహానగరం…

అయితే యిక్కడో విషయం గమనించాలి. మహానగరం వుండగానే సరిపోదు. అది పెరగాలంటే, పెరుగుదల నిలబడాలంటే అనేక అంశాలు జతపడాలి. శతాబ్దాల క్రితమే కలకత్తా మహానగరం. ఇటీవలి కాలంలో ఏమంత డెవలప్‌ అయింది? ఢిల్లీ మహానగరం కాదా? అక్కడ ఎన్ని పరిశ్రమలున్నాయి? నగరంలో యిన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో బాటు నగరవాసుల్లో చొరవ వుండాలి. ఇన్నాళ్లవరకు సీమాంధ్ర, తెలంగాణ ఒకదాని కొకటి కాంప్లిమెంటరీగా (పూరకాలు)గా పనిచేశాయి. సీమాంధ్రులకు చొరవ, వ్యాపారధోరణి ఎక్కువ. తెలంగాణలో ఆతిథ్యగుణం, చూసి నేర్చుకునే తెలివి ఎక్కువ. కొత్తవారిని ఆదరించారు కాబట్టే త్వరగా ఎదిగారు. రాయలసీమలో అది జరగలేదు. 1956 తర్వాత తెలంగాణ ప్రజల్లో కానీ, తెలంగాణ ఆర్థికపరిస్థితిలో గాని ఎంతో మార్పు వచ్చింది. సీమాంధ్రులతో చేతులు కలిపి అభివృద్ధి ఫలాలను అందిపుచ్చుకున్నారు. విద్యావకాశాలను సద్వినియోగం చేసుకుని ఎంతో ఎత్తులకు ఎదిగారు. ఇకపై యీ ఏర్పాటు కొనసాగుతుందా లేదా అన్నది అనుమానం. ఇప్పటిదాకా భాగస్తులుగా వున్నవారు విడివిడిగా బాగుపడతారా లేదా అన్నది సందేహాస్పదం.

తెలంగాణ గురించి మొదటగా ఆలోచిద్దాం. 

ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు పెరగాలి. అవి నిలబడతాయా? పెరుగుతాయా? కొత్తవి వస్తాయా? ఇది వూహించడం కష్టమే. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చే ప్రభుత్వంతో బాటు, ప్రజల్లో వుండే మూడ్‌ బట్టి వుంటుంది. నాయకుల సంగతి వేరు. వాళ్లు ఏం కావాలంటే అది మాట్లాడతారు. పెట్టుబడిదారులను కాస్సేపు దోపిడీదొంగలంటారు, కాస్సేపు ఎఱ్ఱతివాచీ వేసి పిలుస్తామంటారు. కానీ సామాన్యప్రజలు అలా కాదు, భావోద్వేగాలకు లోనవుతారు. ద్వేషాలను పెంచుకుంటారు. దేశవిభజన సమయంలో పాకిస్తాన్‌లో హిందువులను చంపమని, తరిమివేయమని అక్కడి నాయకులు కానీ, భారత్‌లోని ముస్లిములను చంపమని, తరిమివేయమని యిక్కడి నాయకులు కానీ పురికొల్పలేదు. తను అనుకున్న ప్రకారం దేశవిభజన జరిగిపోయాక జిన్నా కూడా హిందు-ముస్లిములు సోదరులని, సెక్యులరిజం పాటిస్తామని ప్రకటనలు చేశాడు. కానీ అప్పటిదాకా వాళ్లు రగిలించిన ద్వేషాగ్ని ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. అందుకే మారణకాండ జరిగింది. 

ఇక్కడ అలాటి ఘోరాలు జరగవు కానీ వైషమ్యం మాత్రం వుండి తీరుతుంది. కెసియార్‌ ఆంధ్రులపై ద్వేషాన్ని రగిల్చారు. వాళ్లని నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఎత్తుకుపోయే దోపిడీదొంగలుగా, తెలంగాణ సహజవనరులను కొల్లగొట్టిన పిండారీలుగా చిత్రీకరించారు. అక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు రాక్షసులన్నారు. మద్రాసు నుండి తెలుగువాళ్లు విడిపోయినపుడు తమిళులు తెలుగువారిని యిలాటి మాటలనలేదు. అందుకే ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలుగువారు మద్రాసు రాష్ట్రంలో ధారాళంగా పెట్టుబడులు పెడుతూ వచ్చారు. బొంబాయి రాష్ట్రం నుండి గుజరాతీలు విడిపోయినపుడు మహారాష్ట్రులు గుజరాతీలను ఏమీ అనలేదు. వాళ్లు బొంబాయి తమకు కావాలని అడిగినపుడు మాత్రమే అది ఒప్పుకోమంటూ ఉద్యమాలు జరిగాయి. గుజరాతీలు మహారాష్ట్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేయలేదు. అందువలన గుజరాతీలు యిప్పటికీ బొంబాయిలో పెట్టుబడులు పెడుతున్నారు. తెలంగాణ విషయంలో సీమాంధ్రుల పరిస్థితి యిది కాదు. సామాన్యుడి దృష్టిలో వాళ్లు ఎక్కణ్నుంచో యిక్కడకి వచ్చి యిన్నాళ్లూ దోచుకున్నారు. ఇకనైనా వెళ్లిపోవలసినవారు. 'మీ రాష్ట్రం ఏర్పడ్డాక యింకా యిక్కడెందుకు వున్నారు?' అనే ప్రశ్న తెలంగాణలోని సీమాంధ్రుడు ఎదుర్కుంటాడు – కనీసం కొన్నేళ్లపాటు. 'పాకిస్తాన్‌ ఏర్పడ్డాక మీరింకా యిక్కడెందుకు, కావాలంటే అక్కడికి పొండి?' అని ముస్లిములను కవ్విస్తూ వుంటారు. 

సీమాంధ్రులదీ అదే పరిస్థితి. 

తెలంగాణలోని సామాన్యపౌరుడు యిన్నాళ్లూ యీ విధంగా ఆలోచించలేదు. కాబట్టే అందరూ రాగలిగారు. అయితే తెలంగాణ వచ్చాక అతడి దృక్పథం మారబోతోంది. ఆంధ్రులు వెళ్లిపోతారు కాబట్టి యిళ్లు ఉచితంగానో, చౌకగానో దొరుకుతాయని గ్రామాల్లో, పట్టణాల్లో ప్రచారం చేసినది ఊరికే పోదు. విభజన తర్వాత తెలంగాణకు తరలి వచ్చేవాళ్లు బాగా తగ్గిపోవచ్చు కానీ వున్నవాళ్లలో చాలా తక్కువమంది వెనక్కి వెళతారు. ఎక్కడుంటే అక్కడే అలవాటు పడతారు కాబట్టి సర్దుకుపోతారు – మరీ గొడవలైతే తప్ప! గొడవలయ్యే సూచనలు యిప్పటికైతే కనబడటం లేదు. ఎవరింట్లో వారుంటే వచ్చి వెళ్లిపోండి అని ఎవరంటారు? సీమాంధ్ర కస్టమరు వచ్చి సరుకు అమ్మమంటే తెలంగాణ దుకాణదారు అమ్మను పొమ్మంటాడా? అవేమీ జరగవు కానీ ఉద్యోగుల్లో, నిరుద్యోగుల్లో మాత్రం ఆందోళన వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఆ వర్గాల్లో వారికి తెలంగాణ రాష్ట్రంపై విపరీతంగా ఆశలు కల్పించారు. కెసియార్‌ ఎడాపెడా వాగ్దానాలు గుప్పించి అరచేతిలో స్వర్గం చూపించారు. అవి నెరవేర్చడం ఆయన వల్ల కాదు కదా, హెర్క్యులస్‌ వలన కూడా కాదు. 

ఇంటింటికి ఉద్యోగం వంటివి మాటలా? ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగులందరూ తెలంగాణ విడిచి వెళ్లిపోతారని, వాళ్ల స్థానంలో వీళ్లకు ప్రమోషన్లు వచ్చేస్తాయనీ తెలంగాణ వుద్యోగులకు చెప్పి వుంచారు. 610 జీవో అమలు కాలేదని, పదేళ్ల క్రితం అంకెలు చెప్పి లక్షలాది ఉద్యోగాల్లో అక్రమంగా ఆంధ్రులున్నారనీ నమ్మించారు. నిజానికి గిర్‌గ్లానీ కమిషన్‌ తర్వాత చాలామందిని బదిలీ చేశారట. ఇప్పుడు వెళ్లవలసిన వారు ఐదువేలుంటారో, పదివేలుంటారో త్వరలో తేలిపోతుంది. వారికి కూడా ఆప్షన్‌ యిస్తారని టి-బిల్లు చెపుతోంది. సర్వీసు పదేళ్లు మాత్రమే మిగిలినవారు యిక్కడ వుండిపోవడానికి నిశ్చయించుకుంటే ఆ సీటు ఖాళీ అవదు. వారి స్థానంలో తెలంగాణ వారికి ప్రమోషనూ రాదు.(సశేషం)

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2014)

[email protected]

Click Here For Part-1