తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం రెండు ముక్కలయింది. ఎటువంటి హామీలు, ఎటువంటి నిర్దిష్ట ప్రతిపాదనలు లేకుండానే, నిరంకుశంగా, ప్రజాస్వామ్యాన్ని నాలుగు గోడల నడుమ బందీ చేసి మరీ, తామనుకున్న బిల్లును గట్టెక్కించేసుకుంది కాంగ్రెస్ పార్టీ. రాజధాని ప్రకటన లేదు. ఆర్థిక అండతదండల ఊసు లేదు, ప్యాకేజీల ప్రస్తావన లేనే లేదు. కేవలం విభజిస్తున్నాం. పదేళ్లు ఉమ్మడి రాజధాని. శాంతి భద్రతల అధికారాలు గవర్నర్ కు. ఈ మూడే ముక్కలు. ఇంతటి నికృష్ట వ్యవహారం ఎందుకు సంభవించింది. తెలుగువాడి గోడు ఎందుకు గోడుగానే మిగిలిపోయింది. విభజన వేళ సీమాంధ్ర యావత్తూ ఎందుకింత నిర్లిప్తంగా వుండిపోయింది. తెలుగునేలపై పౌరుషాన్ని రగిలించగలవాడు, తెలుగుజాతికేసి ఎవరూ కన్నెత్తి చూడకుండా కట్టడి చేయగలిగినవాడు, సీమ పౌరుషం పుణికి పుచ్చుకున్నవారు, పల్నాటి పట్టుదల నరనరాన నింపుకున్నవారు, తెలుగు నేల తెగువ చాటి చెప్పగలిగినవారు, యావత్తు సీమాంద్రను ఒక్క తాటిపై నడిపించగలిగిన వాడు ఒక్కడంటే ఒక్కడు లేడా? తెలుగుతల్లి ఒక్కసారిగా ఎందుకిలా గొడ్రాలయిపోయింది? అసలేం జరగాలి? ఏం జరిగింది? ఎందుకిలా? ఎవరిపాపం ఇది? సీమాంధ్ర జన శోకంగా మిగిలింది?
తెలుగునేలపై ఎందరో నాయకులు పుట్టారు..గిట్టారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. రాజకీయాల్లో ఉద్దండులే. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ చక్రం తిప్పిన వారే. కానీ గడచిన మూడు దశాబ్ధాల కాలంలో తెలుగునేల అంటే పరిపూర్ణ అభిమానం నిండిన నాయకులు ముగ్గురే ముగ్గురు.
ఎన్‌టి రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు.
ఎన్టీఆర్‌కు ఈ నేల అంటే ఎంతో ఇష్టం. తెలుగువాడి పేరును ఉత్తరాదిలో మద్రాసీ నుంచి ఆంధ్రా వాలాగా మార్చినవాడు. తెలుగువాడి రాజకీయాలకు కూడా విలువ వుందని నిరూపించినవాడు. కానీ ఆయన తన దైన ముద్ర వేసే లోగానే అనుకోని అవాంతరాలు. ఒకసారి కాంగ్రెస రూపంలో, మరొసారి స్వంత ఇంటివ్యవహారాలతో మిగిలింది ఇద్దరు. వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు. ఇద్దరూ ఇద్దరే. ఇద్దరికీ ఓ విజన్ వుంది. దారులు వేరైనా, పాలనాశైలి వేరైనా, రాజకీయం వేరైనా లక్ష్యం ఒక్కటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది. ఈ విషయంలో ఇద్దరి చిత్తశుద్ధిని శంకించడానికి ఏ మాత్రం అవకాశం లేదు. ఇద్దరూ పాలనా దక్షులే. అధికారంలో వున్నా ప్రతి పక్షంలో వున్నా వారి స్థాయి వారిదే. రాజకీయాల్లో వారిపై కొన్ని అభియోగాలు వుంటే వుండొచ్చు. కానీ తమ రాజకీయం తాము చేసుకుంటూనే, తమ స్వంత వ్యవహారాలు తాము చక్కదిద్దుకుంటూనే, రాష్ట్రాన్ని కూడా ప్రగతి పథంలోకి నడపాలని చూసారు ఇద్దరూ.
బాబు అధికారంలో వున్నపుడు సాధించిన విజయాలు కళ్ల ముందే వున్నాయి.తన విజన్‌తో రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పెంచడంలో, వివిద కంపెనీలను ఆకట్టుకుని ఇక్కడకు రప్పించడంలో ఆయన కృషి కాదనలేనిది. అసలు ఈ రోజు హైదరాబాద్ ప్రపంచపటంలో కీలక స్థానంలో వుందంటే దానికి కారణం బాబే. నవతరానికి కావాల్సినవేవో తెలుసుకుని ఆ దిశగా పాలనను నడిపినవాడు చంద్రబాబు. కేంద్రంలో ప్రభుత్వాలను తాను శాసించి, తనకు కావాల్సిన పనలు జరిపించుకోవడంలో ఘనుడిగా నిలిచాడు.
బాబు ప్రతిపక్షంలోకి వెళ్లాక అధికారంలొకి వచ్చినవాడు వైఎస్. విపక్షాల ఆరోపణలు ఎలా వున్నా, రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తొ శాసించగలిగాడు. ఎవరినీ మారుమాట్లాడకుండా చేయగలిగాడు. అధిష్టానం అనే పదానికి మారుపేరయిన కాంగ్రెస్‌ను కనుచూపుతొనే కట్టడి చేసి, రాష్ట్రంలో తన స్వంత పాలన అంటూ సాగించగలిగాడు. రాష్ట్రానికి కావాల్సిన నిధులు రాబట్టడంలో, ప్రాజెక్టుల నిర్మాణంలో, ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన శైలి ఆయనదే. మరోసారి మొగ్గతొడిగిన తెలంగాణ ఉద్యమాన్ని అలా నొక్కిపెట్టి వుంచగలిగాడు. తనను కాదని ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలోకి కాంగ్రెస్‌ను నెట్టి, కాలం నెట్టకొచ్చాడు.
అలాంటి రెడ్డిగారు పోయారు..నాయుడు గారు మిగిలారు. మరి ఇప్పుడేం జరిగింది. నాయుడుగారు ఎందుకు చక్రం తిప్పలేదు. తన చాణక్యం ప్రదర్శించలేదు. తన రాష్ట్రాన్ని తాను ఎందుకు కాపాడుకోలేకపోయారు.
ఇక్కడ చంద్రబాబును విమర్శించాలన్న లక్ష్యం కాదు. చేయగలిగీ చేయలేకపోయాడే అన్న ఆవేదన. చంద్రబాబే కాదు, కేంద్రంలో చక్రం తిప్పగల పెద్దలెందరో సీమాంధ్రలో వున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, మీడియా టైకూన్లు, ఇంకా ఎందరో. వీరందరి భరోసా చూసుకుని సీమాంధ్రులు నిశ్చింతగా వున్నది.వీరంతా ఏదో ఒకటి చేయకపోతారా అని అనుకున్నది. కానీ అలా జరగలేదు. ఎందుకు జరగలేదు. అసలు మిగిలిన వారి సంగతి పక్కన పెడితే చంద్రబాబు ఎందుకిలా చేసారు?
ఇక్కడ రెండు వాదనలున్నాయి. కెసిఆర్‌ను, జగన్‌ను గెలిపించడం కోసం కాంగ్రెస్ ఇలా చేస్తే చంద్రబాబు ఏం చేయగలడు? అని అనుకోవాలా లేక, కేవలం జగన్‌ను తనకు అడ్డు లేకుండా చేసుకుని, ఆపై మిగిలిన పనులు చూద్దామని బాబు అనుకోవడం వల్లనే ఈ పరిణామం సంబవించింది అని అనుకోవాలా?
ఇలా ప్రశ్నించుకుంటే, చంద్రబాబు తన శక్తి యుక్తులు అన్నీ జగన్‌ను కట్టడి చేయడానికే వినియోగించినట్లు కనిపిస్తుంది. ఆది నుంచి విభజన వ్యవహారాన్ని, కాంగ్రెస్ ఎత్తుగడలను తేలిగ్గా తీసుకుని, దాన్ని పడగొట్టే అవకాశాలను వదిలేసుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, కేవలం తెలంగాణలో పార్టీని బతికించుకోవడం కోసం, జగన్ విజయావకాశాల తగ్గేదాకా వేచివుండడం కోసం చంద్రబాబు కాంగ్రెస్‌ను ఉపేక్షించిన ఫలితమే ఇది అన్నది చేదు వాస్తవం.
అసలు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటే, కాంగ్రెస్ ఇన్ని తలకాయనొప్పలు తెచ్చుకోవాలా? వైఎస్ పోయినవెంటనే చేయలేదు సరే, కేసులు పెట్టి, జైల్లోపెట్టింది..కేసులు పెట్టలేదు అని ఎవరూ అనడానికి లేదు. ఎందుకంటే, కాంగ్రెస్ కేసులు పెట్టలేదంటే, బెయిల్‌తో కూడా సంబంధం లేదని అంగీకరించాలి. బెయిల్ కాంగ్రెస్ ఇప్పించిందని అంటే, కేసులు కూడా కాంగ్రెస్ పెట్టించిందని ఒప్పుకోవాలి. సరే, ఈ వాదన అలా వుంచితే, జగన్ జైలు నుంచి వచ్చిన తరువాత కూడా అతగాడిని పార్టీలోకి తీసుకుని ముఖ్యమంత్రిని చేస్తే కాదనేవారులేరు. అవిశ్వాసం పెట్టినపుడు అది నెగ్గి వుంటే, జగన్ ముఖ్యమంత్రి కావడానికి మార్గం ఏర్పడేది. కానీ ఈ అవకాశాలు అన్నీ వదిలి. గ్యారంటీ లేని, ఎన్నికల మార్గంలోకి కాంగ్రెస్ జగన్‌ను ఎందుకు నడిపిస్తుంది? పైగా జగన్‌కు మెజార్టీ సాధించిపెట్టడం కోసం తనను తాను ఎందుకు బలిచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఇంతకన్నా సులువుగా జగన్‌ను గద్దెనెక్కిస్తే, తెలంగాణ ఉద్యమం ఆసరగా కెసిఆర్, ఇక్కడ జగన్ స్థానాలు గెలిపించి ఇచ్చేవారు కదా? అలా చేయక ఇంత గందరగోళం కోరి తెచ్చుకుని ఎంపీ స్థానాలు వస్తాయో రావో తెలియని స్థితిని ఎందుకు తెచ్చుకుంటుంది?
ఇది ఎంతవరకు వాస్తవం లేదా సత్య దూరం అన్నది చూసే ముందు, అసలు చంద్రబాబు కెపాసిటీ ఏమిటన్నది చూడాలి. చంద్రబాబుకు జాతీయ స్థాయిలో వున్న పలుకుబడి ఇంతా అంతాకాదు. దాన్ని ఎవరూ కాదనలేరు. చివరి దశలో ఆయన రాష్ట్రాలు తిరిగితేనే బిల్లుపై భాజపా ముందు వెనుకలాడింది. అదే కనుక ఆయన ముందుగా కార్యాచరణలోకి దిగి వుంటే. ఇంకా స్పష్టంగా విభజనపై ముందుకు అడుగు వేసి వుంటే? ఎలా వుండేది? కానీ చంద్రబాబు అలా ఆలోచించలేదు. ఆయన దృష్టి అంతా జగన్‌పై కేంద్రీకరించారు. ఆయన శక్తులన్నీ మరోసారి అధికారంలోకి ఎలా రావాలన్నవాటి కోసం ప్రయోగించారు. తొలిసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గద్దె దింపే అవకాశం వచ్చిన నాటికి జగన్ మాంచి ఫోర్సుతో వున్నారు. ఎక్కడ ఎన్నికలు వస్తాయో, ఎక్కడ జగన్ అధికారం ఎగరేసుకుపోతాడో అని బాబు భయపడ్డారు.
ముందు జగన్‌ను ఇరుకున పెట్టడం, జగన్ బలాన్ని తగ్గించడం, జగన్ విజయావకాశాలను దెబ్బతీయడం ఇవే లక్ష్యాలుగా పెట్టుకున్నారు. నిజానికి బాబు ఆరోజే అయితే అయిందని కాంగ్రెస్‌ను దెబ్బ తీసి వుంటే ఏమయ్యేది. మహా అయితే జగన్ ముఖ్యమంత్రి అయివుండేవాడు. తన అనుభవ రాహిత్యంతో ఈ పాటికి తన పరువు తానే తగ్గించుకుని వుండేవాడు. ఎన్నికల వేళకు బాబుకు ఎదురులేకుండా వుండి వుండేది. జగన్ ప్లస్ కాంగ్రెస్‌తో జరిగే ముఖాముఖి పోరులో బాబు విజేతగా నిలిచేవాడు.
అయితే అంతటి ధైర్యం బాబు చేయలేకపోయారు. అందుకు కూడా కారణం వుంది. గడచిన అయిదేళ్లలో జరిగిన అనేకానేక ఉపఎన్నికల్లో తొంభై తొమ్మిది శాతం బాబుకు పరాజయాలే. గుర్తులు లేకుండా జరిగిన పంచాయతీ ఎన్నికలు ఒక్కటే ఆయనకు ఊరట. దాంతో ఆయనలో జగన్ అంటే ఫస్ట్ టార్గెట్ అయింది. విభజన బూచిని చూపిస్తున్న కాంగ్రెస్ రెండో టార్గెట్ అయింది. అందుకే ఆయన తన సర్వ శక్తులు ఇటు కేంద్రీకరించారు. అదే సమయంలో తెలంగాణ విభజన వ్యవహారం నెత్తిమీదకు వచ్చినపుడు జగన్ వెనకడుగు వేసి, తాను తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన సంగతిని కూడా పక్కన పెట్టి సమైక్య వాదన అందుకున్నారు. దీంతో తెలంగాణలో అతగాడి పార్టీ ఖాళీ అయింది. ఇది చూసిన తరువాత బాబు రెండురకాల ఆలోచించి ఒకటే నిర్ణయం తీసుకున్నారు. జగన్‌లా కాకుండా తాను డిఫరెంట్ అనిపించుకోవాలి. మడమ తిప్పను. మాట ఇచ్చాను అనుకున్నారు. అదే సమయంలో తను సమైక్య దిశగా తిరిగితే ఎక్కడ పార్టీ తెలంగాణలో ఖాళీ అవుతుందో అని భయపడ్డారు. అప్పటి నుంచి ఆయన రాజకీయం అంతా స్పష్టత కరువైన చందమైంది. ఎవరెంతగా చెప్పినా, విమర్శించినా ఆయన తన దైన రెండు కళ్ల సిద్ధాంతంతోనే ముందుకు వెళ్లారు. ఆఖరికి చివరి రోజు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడానికి ముందు తెలుగుదేశానికి చెందిన సభ్యులు చేరో వైపు చేరి, చెరో విధమైన అభిప్రాయాలు ప్రకటించారు. ఇది కేంద్రం దృష్టిలో కేవలం నవ్వులాటగా తప్ప, సీరియస్ అభిప్రాయంగా ఎలా రూపుదిద్దుకుంటుంది? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో బాబు గెలవచ్చు లేదా ఓడొచ్చు అది వేరే సంగతి. కానీ రాష్ట్రం మాత్రం ఓడిపోయింది. ఇక్కడి జనం ఓడిపోయారు. చేయగలిగి, చేవగలగి, కేంద్రంలో చక్రం తిప్పగలిగిన నేత చంద్రబాబు వుండి కూడా ఓటమి చవిచూసారు.
బాబు ఇలా చేయడం వెనుక జగన్ ఒక్కటే కారణం కాదు. కాంగ్రెస్ ఎప్పటికీ విభజన చేయదన్న ధీమా కూడా దాగి వుంది. నిజానికి ఈ ధీమా ఈ నాటిది కాదు. చిరకాలంగా దాదాపు కాంగ్రెసేతర పక్షాలు అన్నింటికీ వున్నదే. తెలంగాణ సమస్యను కాంగ్రెస్ నాన్చుతూ వుంటుంది తప్ప తేల్చదు అన్నదే అన్ని పార్టీల నిశ్చితాభిప్రాయంగా వుండేది. అందుకే దాదాపు అన్ని పార్టీలు ధైర్యంగా లేఖలు ఇచ్చాయి. చంద్రబాబు లేఖ ఇచ్చిన నేపధ్యం వేరు. నిజానికి చంద్రబాబుకు అలా లేఖ ఇవ్వడం సుతరామూ ఇష్టం లేదు. కానీ పార్టీ పరిస్థితులు అలా తోసుకువచ్చాయి. కానీ ఇక్కడ బాబు చిన్న లాజిక్ ఆలోచించి వుంటే లేఖ ఇచ్చేవారు కాదు. లేఖ ఇవ్వకుంటే పార్టీ తెలంగాణలో మాయమవుతుంది. లేఖ ఇచ్చి విభజన అనివార్యమయిన తరువాత మాత్రం తెలంగాణలో తేదేపా వుంటుందా? అంత సీన్ లేదు కదా? అటువంటప్పుడు రాష్ట్రం సమైక్యంగా వుంచడం కోసం తెలంగాణలో పార్టీని బాబు త్యాగం చేయలేరా?
పోనీ ఇప్పుడు వ్రతం చెడింది, పోనీ బాబుకు ఫలితం అన్నా దక్కుతుందా అంటే అనుమానమే. తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా చేయడం, తెలంగాణలో ఎవర్నో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వుంచి పార్టీని నడిపించడం అంత సులువు కాదు. పైగా ఇప్పటి ఎన్నికల్లో అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు. మరో అయిదేళ్లు వేచి వుండాలి. ఇప్పటికే పార్టీలో జనం అంతగా మిగిలి లేరు. మరి అయిదేళ్ల తరువాత పరిస్థితి ఏమిటి అన్నది అనుమానం. మరి ఈ విషయాలు ఆలోచించకుండా, కేవలం పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచే అమూల్య అవకాశాన్ని పోగొట్టారు నాయుడుగారు అన్నది కఠోర వాస్తవం.
అలా చేయకుండా ప్రారంభంలోనే శాసనసభలో కాంగ్రెస్‌ను పడగొట్టి, ఎన్నికలకు దారి తీసి వుంటే జగన్ గెలిచి వుండొచ్చు. కానీ తన అనుభవ రాహిత్యంతో జగన్ చేసే తప్పిదాలు, అతగాడి వ్యవహారాలు చూసిన, జనం ఈ సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి బంగారు పళ్లెంలొ పెట్టి అధికారం బాబుకు అందించేవారు. మందు చెప్పుకున్నది ఎంత వాస్తవమో, ఇది కూడా అంతే వాస్తవం.
మొదటగా బాబు చేసిన తప్పు తెలంగాణ విషయంలో కాంగ్రెస్ వ్యవహారాన్ని తక్కువ అంచనా వేయడం.
రెండవది ఆపై ఇదిగో లేఖ ఇస్తున్నాం దమ్ముంటే విభజించమని కాలు దువ్వడం.
మూడవది క్లారిటీ లేని సమన్యాయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం
నాల్గవది కేవలం జగన్‌ను, తన అధికార సాధనను టార్గెట్ చేసుకుని, కాంగ్రెస్‌కు రోశయ్య నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు కొమ్ము కాయడం
ఇలా ఆయన చేసిన తప్పిదాలు సీమాంధ్ర పాలిట శాపాలయ్యాయి. కానీ ఇక్కడ ఎవరైనా ఓ ప్రశ్న అడగొచ్చు. బాబునే ఎందుకు నిలదీస్తున్నారు. చిరంజీవి, కిరణ్ వగైరా నాయకులకు బాధ్యత లేదా అని.
వెనకటికి సామెత వుంది..ఆయనే వుంటే…అని. వారికే ఆ సామర్థ్యం వుంటే పరిస్థితి ఇంతవరకు ఎలా వస్తుంది. వెంకయ్యనాయుడు లాంటి సమైక్య వాది, పార్టీలో కీలక పాత్ర పోషించేవాడు వుండి కూడా భాజపా మనసు మార్చలేకపోయారు. ఇక వెన్నెముక లేని రాజకీయ నాయకుల వల్ల ఏమవుతుంది. ఏమయినా చేయగలిగిన సత్తా ఇద్దరికే వుంది. ఒకటి రెడ్డిగారు. ఆయన పోయారు. రెండవది ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముంచారు.
చాణక్య