విభజన బిల్లు లోకసభలో పాస్ కాగానే చిరంజీవి కిరణ్‌పై విరుచుకుపడ్డారు. పాస్ చేసినది – సోనియా ప్లస్ సుష్మా. తెలంగాణలో విగ్రహాలు యిద్దరివీ వెలుస్తాయో లేదో తెలియదు కానీ, సీమాంధ్రలో దిష్టిబొమ్మలు మాత్రం యిద్దరివీ తగలబడతాయి. సమైక్యవాదాన్ని బొంద పెట్టినది వాళ్లిద్దరూ. చిరంజీవి నికార్సయిన సమైక్యవాది అయితే, తెరమీద కనబరిచే హీరోయిజంలో వందో వంతు ఒంట్లో వుంటే సోనియాను తిట్టాలి. కనీసం తప్పుపట్టాలి. అధమపక్షం అన్యాయం చేసిందని వాపోవాలి. అబ్బే అదేమీ చేయలేదు – కిరణ్‌ను తిట్టాడు. మధ్యలో కిరణ్ ఏం చేశాడట? అతని పరమశత్రువులు చేయగల అతి తీవ్ర ఆరోపణ ఏమిటంటే – 'అతను సోనియా చెప్పినట్లు ఆడి విభజనకు దారి సుగమం చేశాడు' అని. అలాటప్పుడు కిరణ్ చేష్టలకు సోనియాను తప్పుపట్టాలి కదా! చిరంజీవి సోనియాను నిందించకుండా కిరణ్‌ను తిట్టడమేమిటి, అర్థంపర్థం లేకుండా!
చిరంజీవి అంటున్నదేమిటి – రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచుతానని కిరణ్ హామీ యిచ్చాడట, అది నమ్మేసి యీయన కాళ్లు చాపుకుని కూర్చున్నాడట. తీరా చూస్తే విభజన జరిగిపోయిందట! అసలు అంత హామీ యివ్వడానికి కిరణ్ ఎవరు అని ఆలోచించవద్దా? దేశప్రధానే సోనియా కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిలబడుతున్నాడు. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒక ముఖ్యమంత్రి – కిరణ్! తక్కిన ముఖ్యమంత్రుల మాట ఏమో కానీ యీ ముఖ్యమంత్రి మాట ఉప ముఖ్యమంత్రితో సహా సహం కాబినెట్ వినదు. పిసిసి అధ్యకక్షుడు యీయనను దింపేసి ఎప్పుడు గద్దె నెక్కుదామా అని చూస్తున్నాడు. అసలు యీయన రావడమే సర్‌ప్రైజ్ కాండిడేట్‌గా వచ్చాడు. ఈయన సిఎం ఏమిటి నాన్సెన్స్ అని జగన్ పార్టీలోంచి బయటకు వెళ్లి కాంగ్రెసును బలహీనపరిచాడు. చాలామంది మంత్రులు చాలా నెలలపాటు సెక్రటేరియట్‌కే రాలేదు. ఈయన ఎవరిమీదా యాక్షన్ తీసుకోలేకపోయాడు. డిఎల్, శంకర్రావు లాటి వాళ్లు యిష్టం వచ్చినట్లు మాట్లాడినా వాళ్లపై చర్య తీసుకోవడానికి ఏళ్లూ పూళ్లూ పట్టింది. హై కమాండ్ అంతగా చేతులు కట్టేసింది. అనేక నియామకాల్లో కూడా కిరణ్ మాట చెల్లలేదు. తెలంగాణ విషయంలో యీయన యిచ్చిన పవర్ పాయింటు ప్రెజంటేషన్ పక్కన పడేసి డిప్యూటీ సిఎం పాయింటులోనే 'పవర్' చూసింది హై కమాండ్.
ఈయన ఏడ్చిమొత్తుకున్నా హై కమాండ్ జులై 30 ప్రకటన వెలువరించింది. అప్పణ్నుంచి యిద్దరికీ చెడింది. నెలల తరబడి కిరణ్‌ను ఢిల్లీ పిలవడం మానేశారు. తక్కినవాళ్లే వెళ్లి సోనియాతో స్వేచ్ఛగా మాట్లాడి వస్తున్నారు. పాతబస్తీకి పరిమితమైన్ మజ్లిస్ నాయకులకు యిచ్చిన ప్రాధాన్యత కూడా కిరణ్‌కు యివ్వలేదు సోనియా. కాబినెట్‌లో సహచర మంత్రులందరూ కిరణ్‌ను ఖాతరు చేయమని చెప్తున్నా, అవినీతి ఆరోపణలు చేస్తున్నా సోనియా అదుపు చేయలేదు. పొత్తు లేక విలీనం చేసుకుందామనుకుంటున్న తెరాస నాయకులు తెగబడి అమ్మాఆలీ బూతులు తిడుతున్నా, వారిని వారించలేదు. దిగ్విజయ్ సింగ్ మరీ ఆట లాడుకున్నాడు. బిల్లు రెండుసార్లు వస్తుందని బ్లఫ్ చేసి కిరణ్‌ను బోల్తా కొట్టించాడు. అది నమ్మి దాని ప్రకారం ప్రకటన చేసి నాలిక కరచుకోవడం వలన కిరణ్ యిమేజి మరింత దిగజారింది. బిల్లు ఎలా తయారవుతోందో, దాని టైమ్ టేబుల్ ఏమిటో సిఎంకు ఏమీ తెలియకుండా చేశారు. అన్నీ సర్‌ప్రైజ్‌లే. చివరకు అసలు బిల్లు బదులు, డ్రాఫ్టు బిల్లు పంపించి, మీ అసెంబ్లీ మొహానికి యిది చాల్లే అన్నారు. దీనితో బాటు వుండవలసిన ఆర్థికసమాచారం వగైరా యివ్వండి అంటే అవన్నీ మేం చూసుకుంటాం, మీకు అనవసరం అని తీసిపారేశారు. చివరకు డిప్యూటీ స్పీకరు, శాసనసభా వ్యవహారాల మంత్రి కలిసి బిల్లు ప్రవేశపెట్టేశాం అని బుకాయించేశారు. వారిని సిఎం ఏమీ చేయలేకపోయాడు.
కిరణ్ ఏం చెప్పాడు? ఆశ కోల్పోకుండా చివరిదాకా పోరాడతానన్నాడు. (లాస్ట్ బాల్ సామెత చెప్పినందుకు కూడా కొందరు సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు తప్పుపడుతున్నారిప్పుడు – పవిత్రమైన రాజకీయాలను క్రికెట్ స్థాయికి దిగజార్చాడట) రాష్ట్రం విడిపోయే రోజు వచ్చినపుడు తను పదవిలో వుండనన్నాడు. అధిష్టానానికి ఎంత మొత్తుకున్నా లాభం లేకుండా వుందన్నాడు. కలిసి పోరాడి మన అసమ్మతిని గట్టిగా తెలుపుదామని సూచిస్తూ వచ్చాడు. స్టార్ బ్యాట్స్‌మన్, బ్రహ్మాస్త్రం వంటి మాటలు పక్కవాయిద్యంవాళ్లు అన్నారు. కిరణ్ ఎప్పుడూ సంయమనంతోనే మాట్లాడాడు. తెలంగాణకే ఎక్కువ నష్టమని గణాంకాలు యిస్తూ వాళ్లని కూడా కన్విన్స్ చేయడానికి చూశాడు. జులై 30 తర్వాత కాంగ్రెసు అధిష్టానం దూకుడు, రెండు నెలల పాటు సీమాంధ్ర మొత్తం రగిలినా వాళ్లు పట్టించుకోకపోవడం… యివన్నీ చూస్తే అధిష్టానం ఏం చేయదలచుకుందో అందరికీ అర్థమైంది. సమయం దాటి పోయిందనీ తెలిసింది. సరైన సమయంలో మౌనం పాటించినందుకు ప్రాయశ్చిత్తంగా యిప్పుడైనా పోరాటం చేయాలని నిశ్చయించుకుని సీమాంధ్రులు ఉద్యమించారు. ఇదంతా మన కంటికి కనబడుతూనే వుంది. కిరణ్ సర్వశక్తిమంతుడనీ, ఆయన విభజన ఆపేస్తానని చెపితే ఆగిపోతుందనీ మనం ఎవరైనా అనుకున్నామా? చిరంజీవిగారు అనుకున్నారట, అలా అనేసుకుని చిరంజీవిగారు మోసపోయారట. అది మనం నమ్మాలట.
మరి కిరణ్ సమైక్యంగా వుంటుందని చెపితే నమ్మిన పెద్దమనిషి 'హైదరాబాదు యూటీ చేయమని' వెళ్లి ఎందుకడిగాడట? విభజన జరిగితేనే కద, యూటీ మాట వచ్చేది. దాని అర్థం కిరణ్ సమైక్యం అన్నా ఆ మాటలు నమ్మకుండా విభజన జరిగితీరుతుంది అని చిరంజీవి అనుకుని యూటీ కోసం పట్టుబట్టాడన్నమాట! ఇప్పుడు నేను కిరణ్‌ను నమ్మి మోసపోయాను అనడమేమిటి? అంత నమ్మకం వున్నవాడు సోనియా చుట్టూ తిరగడం దేనికి? కిరణ్ చుట్టూ తిరిగితే సరిపోయేది కదా. అయినా కిరణ్ కంటె చిరంజీవే ఢిల్లీ నాయకులను పూసుకు తిరిగారు. వాళ్ల మనసు ఆయనకే తెలియాలి. జులై 30 ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలు అధిష్టానం వద్ద మొత్తుకుంటే 'అదేమిటి, మీ మంత్రులకు ఎప్పుడో చెప్పాంగా' అన్నారు వాళ్లు. అంటే వాళ్లు కాన్ఫిడెన్సులోకి తీసుకున్న మంత్రుల్లో చిరంజీవికూడా వున్నారన్నమాటేగా. అప్పణ్నుంచి యిప్పటిదాకా ఆయన చేసినదేమిటి? సీమాంధ్రకు అన్యాయం చేసిన వారిలో సీమాంధ్ర కేంద్రమంత్రులదే పెద్ద పాత్ర అని లోకవిదితమై పోయింది. కావూరి, పళ్లంరాజు, పురంధరేశ్వరి, కిశ్‌రో చంద్రదేవ్, పనబాక లక్ష్మి.. అందరూ నిందితులే. వీళ్లకు అధిష్టానం తప్ప ప్రజలకు కనబడటం లేదు. ఆ లిస్టులో చిరంజీవి కూడా వున్నారు.
విభజన తర్వాత పురంధరేశ్వరి రాజీనామా చేశారు. చిరంజీవి అది కూడా చేయకుండా పదవి పట్టుకుని వేళ్లాడుతున్నారు. పైగా కాంగ్రెసు పార్టీ విడిచినందుకు కిరణ్‌ను తప్పుపడుతున్నారు. పాలు తాగిన తల్లి రొమ్ము గుద్దినట్టుట! తండ్రి కాలం నుండి కాంగ్రెసు పార్టీలో మునిగి తేలిన కిరణ్ తన పార్టీ పోకడతో విసుగెత్తి పార్టీ విడిచి వెళుతూ కూడా కాంగ్రెసుకు కృతజ్ఞతలు చెపుతూ, యీ విషయంలో మాత్రమే తప్పుపడుతూ హుందాగా వెళ్లారు. నిన్నకాక మొన్న పార్టీలో చేరిన చిరంజీవికి కాంగ్రెసుపై యింత వల్లమాలిన ప్రేమ ఎందుకో! విశ్వాసఘాతుకత్వం గురించి మాట్లాడే అర్హత ఆయనకుందా? కాంగ్రెసును చెడతిట్టి, కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా నిలబడతానని ఆశలు కల్పించి, ఓట్లు వేయించుకుని వాళ్లందరినీ నిట్టనిలువునా ముంచి, పదవుల కోసం పార్టీ మొత్తాన్ని కాంగ్రెసులో కలిపేసిన చిరంజీవికి ఆనాడు ప్రజల రొమ్ము గుద్దినట్టు తోచలేదా? దమ్ముంటే కాంగ్రెసు టిక్కెట్టుపై, వాళ్ల మ్యానిఫెస్టో చూపించి, మళ్లీ గెలిచి అప్పుడు పార్టీలోకి వెళ్లాల్సింది. 2009లో తన సొంత జిల్లాలో, పూర్వప్రఖ్యాతి లేని ఒక మహిళ చేతిలో ఓడిపోయారు. కాంగ్రెసులో చేరాక లోకసభ సీటుకి పోటీ చేసే ధైర్యం చేయలేక పార్లమెంటుకి రాజ్యసభ ద్వారా దొడ్డిదారి ప్రవేశం చేశారు. తను ఖాళీ చేసిన తిరుపతి ఎసెంబ్లీ స్థానాన్ని కూడా గెలిపించుకోలేక పోయారంటేనే తెలిసింది – ఆయనకు ప్రజల్లో వున్న పరపతి ఎంతో! ఆయన ప్రచారం చేసిన ప్రతీ రాష్ట్రంలోను కాంగ్రెసు ఓడిపోయింది. ప్రజాభిప్రాయం ఆయనకు ఎంత వ్యతిరేకంగా వుందో తెలియటం లేదు. డొక్కావారు కిరణ్ పోతే ఎంత చిరంజీవి వున్నాడుగా అంటే విని కిరణ్ కంటె నేను గొప్ప అనుకోకూడదు.
2009 ఎన్నికలలో యీయన సామాజిక తెలంగాణ అనే నినాదం ఎత్తుకున్నాడు. డిసెంబరు 9 ప్రకటన తర్వాత దాన్ని గంగలో కలిపేసి సమైక్యనినాదం ఎత్తుకున్నాడు. ఆ తర్వాత దాన్నీ గంగలో కలిపేసి సోనియా ఏం చెపితే అదే అనసాగాడు. ఇప్పుడు విభజన చేయాలి, హైదరాబాదు యుటీ చేయాలి అని దంపుళ్లపాట మొదలుపెట్టాడు. యూటీ చేయం ఫో అని సోనియా చెప్తే ఏం చేశాడు? కిరణ్‌లా నిరసన తెలుపుతూ రాజీనామా చేశాడా? లేదే! పైగా తన అనుంగు సహచరుడు రామచంద్రయ్య చేత కిరణ్‌ను తిట్టిస్తున్నాడు.బొత్స, రామచంద్రయ్య, డొక్కా అందరూ కలిసి కిరణ్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు రాజీనామా చేస్తే ఏముంది, అప్పుడే చేయాల్సింది అని. ఆయన ఎప్పటికో అప్పటికి చేశాడు. వీళ్లు యిప్పటికైనా చేశారా? లేదే! సీమాంధ్రకు యింత అన్యాయం జరుగుతున్నా, అదేమి పట్టనట్టు తమ స్వప్రయోజనాల కోసం గోతికాడ నక్కల్లా కాసుకుని కూర్చున్నారు. అసెంబ్లీలో కిరణ్ ఉపన్యాసం యిస్తూ వుంటే 'విభజన వలన నష్టం ఏమిటో కిరణ్ యిప్పుడు చెప్తున్నాడేమిటి? ఇవన్నీ అప్పుడే హై కమాండ్‌కు చెప్పాల్సింది' అన్నారు టి-వాదులు. వాళ్లు ప్రజంటేషన్ యిమ్మన్నప్పుడు చెప్పాడని అందరికీ తెలుసు. ప్రెస్‌కు కూడా రిలీజ్ చేశారు. అయినా యీయన చెప్పడానికి ముందే శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా చెప్పింది. సోనియా ముఠా వినదలచుకోనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? పోనీ కిరణ్ సమైక్యవాదం మాట వదిలేయండి, సీమాంధ్ర మంత్రులు ఓ మెట్టు దిగి 'విభజనకు ఒప్పుకుంటాం కానీ సీమాంధ్రకు ఫలానా ఫలానా చేయండి' అని అడిగితే అవి మాత్రం విన్నారా? అందువలన కిరణ్ చెప్పకపోవడం వలననే విభజన యిలా జరిగిందన్నది అర్థరహితం.
జులై 30 న చేసి వుంటే ఏం జరిగేది? రాష్ట్రంలో అధికాంశం ప్రజలు విభజన వ్యతిరేకిస్తున్నారన్న విషయం చరిత్రలో రికార్డయ్యేదా? ఎన్‌జిఓల సమ్మె కానీ, సీమాంధ్రలో నిరసన కార్యక్రమాలు కానీ విధ్వంసం లేకుండా, పోలీసుల తీవ్రచర్యలు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగాయంటే దానికి కారణం – కిరణ్‌కు ఆ ఉద్యమం పట్ల వున్న సానుభూతి వలననే! కిరణ్ అప్పుడే దిగిపోయి వుంటే రాజ్యాంగసంక్షోభం వచ్చి వుండేది కాదు. మరొకర్ని కూర్చోబెట్టి వుండేవారు. ఇప్పటి పదవి రెండు, మూడు నెలలు మాత్రమే అని తెలిసినా నలుగురు సీమాంధ్ర నాయకులు గవర్నరు దగ్గర క్యూ కట్టారు. తెలంగాణ నాయకులు పధ్నాలుగు మంది కడతారు. ఏడు నెలల క్రితం అంటే యింతకు రెట్టింపు మంది తయారయ్యేవారు. 'మాకు సిఎం పదవి యిస్తే సీమాంధ్రులను కుక్కిన పేనుల్లా పడి వుండేట్లు చేస్తాం' అని ఢిల్లీకి హామీ యిచ్చి దాన్ని అమలు చేసి వుండేవారు. వారు ఉద్యమం పట్ల కిరణ్ అంత సానుభూతితో వ్యవహరించాలని ఏముంది? అసెంబ్లీకి బిల్లు వచ్చిన తర్వాత వైకాపా ఒక గేమ్ ఆడింది, టిడిపి మరో గేమ్ ఆడింది. తెలంగాణవాదులంతా కలిసి యింకో గేమ్ ఆడారు. అన్ని రకాలూ అయ్యాక 'పంపినది బిల్లు కాదు, డ్రాఫ్టు బిల్లు' అని బయటపెట్టినది కిరణే కదా. ఇంకో సిఎం అయితే దాన్ని హైలైట్ చేసేవాడు కాదు. అంతేకాదు, బిల్లును తిరస్కరించి పంపే పరిస్థితి తెచ్చేవాడు కాదు.
ఏం చేసినా ఏం లాభం, పార్లమెంటులో ఏం చేద్దామనుకుంటే అదే చేశారు కదా అనవచ్చు. ఇలా మొత్తమంతా అడ్డగోలుగా జరిగింది అనే విషయాన్ని లోకం గమనించేట్లు చేస్తే దాని వలన ఎంతో కొంత ప్రభావం వుండి తీరుతుంది. జాతీయ మీడియాను ఎవరు మేనేజ్ చేస్తున్నారో తెలియదు కానీ విభజనను పెద్దగా వాళ్లు పట్టించుకోలేదు. సిఎం పదవిలో వుండి కిరణ్ ఢిల్లీలో మౌనదీక్ష చేయడంతో అప్పుడు జాతీయ మీడియాలో వార్త అయింది. రాజీనామా చేయడం కూడా ప్రభావం కలిగించింది. ఈ రోజు బిజెపి రాజ్యసభలో సవరణల కోసం పట్టుబడుతోందంటే దానికి మూలం – సమైక్య ఉద్యమానికి కిరణ్ ప్రాచుర్యం కలిగించడం! అడ్డగోలుగా జరుగుతోంది బాబోయ్ అని అన్ని వేదికలపై గగ్గోలు పెట్టడం వలననే సీమాంధ్ర ప్రయోజనాల గురించి కాస్తయినా చర్చ జరుగుతోంది. అంతిమంగా సుప్రీం కోర్టు తన తీర్పు యిచ్చేటప్పుడు యివన్నీ పరిగణనలోకి తీసుకుంటుంది. వాటికి మనం యిచ్చేటంత వెయిటేజి యిస్తుందా లేదా అన్నది వేరే విషయం. కానీ నోరు మూసుకుని కూర్చుంటే ఏమీ జరిగి వుండేది కాదు. సమైక్యం కోసం చిరంజీవి తను ఏదైనా కృషి చేసి వుంటే చెప్పుకోవచ్చు. అభ్యంతరం లేదు. రాజ్యసభలో కెవిపి నిలబడ్డట్టుగా ఫ్లెక్సి పట్టుకునైనా నిలబడని చిరంజీవి కిరణ్‌ను నమ్మి మోసపోయానని, కిరణ్ కాంగ్రెసు విడిచి వెళ్లడం ద్రోహమనీ అంటే అది నిశ్చయంగా ఓవరాక్షనే. తెరమీదే కాదు, నిజజీవితంలోనూ ఓవరాక్షన్ మొహం మొత్తిస్తుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)