ముద్దాయిల తరఫున న్యాయవాదులు ప్రాసిక్యూషన్ న్యాయవాదులతో సమానంగా తమకు ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తూ న్యాయవిచారణను బహిష్కరించారు. ఆ ఫీజును చెన్నయ్ హైకోర్టు నిర్ణయిస్తుంది. దానికి ఒడంబడే వీళ్లు కేసు ఒప్పుకుని మధ్యలో పేచీ పెట్టారు. అంతేకాదు, కోర్టు ఆవరణలో గస్తీ టవర్లమీద సెంట్రల్ రిజర్వ్ పోలీసు సిబ్బంది వుండడాన్ని కూడా వాళ్లు అభ్యంతరపెట్టారు. ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టే ప్రతి సాక్షిని ముద్దాయి తరఫు న్యాయవాదులందరూ విడివిడిగా పిలిపించి విచారించే హక్కు వుంది. ఆ హక్కుని ప్రతి న్యాయవాదీ ఉపయోగించుకుంటూ మూడుంపావు సంవత్సరాలు కేసు డేకించారు. ముద్దాయిల్లో మురుగన్ మహా కిలాడీ. వాడికి దాసు/ఇందుమాస్టరు/శ్రీహరన్ అనే మారుపేర్లున్నాయి. సూత్రధారి శివరాజన్ సహాయకుడు, రాజీవ్ హత్యకు భూమిక ఏర్పరచడానికి ముందే వచ్చాడు. నళిని ప్రియుడు, మొగుడు, బేబి సుబ్రమణియం ద్వారా భాగ్యనాథన్ యింట్లో చోటు సంపాదించుకున్నాడు. అతని అక్క నళినిని ప్రేమలో ముంచి, ఆమెను హత్యలో భాగస్తురాలిగా చేశాడు. పేలుడు సాధనాల నిపుణుడు.
నిందితులందరూ న్యాయవాదులను పెట్టుకుంటే మురుగన్ మాత్రం తనకు తానే వాదించుకుంటానన్నాడు. 1994 అక్టోబరు నుండి ఎనిమిది మాసాలపాటు ఏదో ఒక వంక మీద న్యాయవిచారణ బహిష్కరిస్తూ వచ్చాడు. వాడి ఐడియా ఏమిటంటే – ఇన్ని నెలల్లో సాకక్షులుగా వచ్చిన వారందరినీ వాడు క్రాస్ ఎగ్జామిన్ చేయాలి పిలిపించండి అని తర్వాత పట్టుబట్టవచ్చు. వాళ్లలో కొంతమంది ఎల్‌టిటిఇ భయంతో రెండో సారి రాకపోవచ్చు. అలా యింకా ఆలస్యం చేయవచ్చు. ఇది పసిగట్టిన సిట్ మురుగన్ తక్కిన నిందితులతో బాటు కోర్టుకు వచ్చి తీరాలి అని స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు. మురుగన్‌ను హాజరు పరచండి అని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. వాడు సహకరించకపోతే మేం తీసుకురాలేం అని జైలు అధికారులు చేతులెత్తేశారు. అప్పుడు సిట్ హైకోర్టు పిటిషన్ వేసింది. హైకోర్టు డివిజన్ బెంచి మురుగన్‌ను పిలిపించి హితవు చెప్పినా వాడు వినలేదు. దాంతో వాళ్లు 'ఇప్పుడు యితను రాకపోతే తర్వాత సాకక్షులను మళ్లీ పిలిపించే హక్కు కోల్పోతాడు' అని ఉత్తర్వు వేసింది. అప్పుడు గతిలేక మురుగన్ కోర్టు విచారణకు రాసాగాడు. అప్పటికే 85 మంది సాకక్షుల విచారణ పూర్తయింది. మురుగన్ వచ్చి '20 మంది సాకక్షుల్ని మళ్లీ పిలిపించండి, నేను క్రాస్ ఎగ్జామిన్ చేయాలి' అన్నాడు. సిట్ హైకోర్టు ఉత్తర్వు చూపించింది. స్పెషల్ కోర్టు మురుగన్ పిటిషన్‌ను కొట్టి వేసింది. మురుగన్ అప్పుడు దీనిపై సుప్రీం కోర్టుకి వెళ్లాడు. వాళ్లూ కొట్టేశారు. ఇలా జాప్యం చేస్తూనే 'విచారణలో విపరీతమైన జాప్యం జరుగుతోంది కాబట్టి మాకు బెయిల్ యిప్పించాలి' అని అర్జీ పెట్టుకున్నాడు. ఇదీ వాడి తెలివితేటలు! వీడు అమాయకుడా?
ఇక వీడితో బాటు సుప్రీం కోర్టు ఉరి శిక్ష వేసిన వాళ్లు – 1) సుధేంద్ర రాజా అలియాస్ శాంతన్ – శ్రీలంకవాడు. శివరాజన్ కుడిభుజం. అంతకుముందు శ్రీలంక తమిళ నాయకుడు పద్మనాభ హత్యకేసులో ప్రధాన పాత్ర వీడిదే. 2) అరివు ఎలియాస్ పెరరివాళన్ – భారతీయుడు. పేలుడు సాధనాల నిపుణుడు. రాజీవ్‌ను చంపిన బాంబు డిజైన్ చేసినది వీడే. శివరాజన్‌కు విహెచ్‌ఎఫ్ పరికరాలు అమర్చిపెట్టాడు. 3) నళిని భారతీయురాలే. మురుగన్ మాటల్లో పడి హత్యలో పాలు పంచుకుంది.
మానవబాంబును దగ్గరుండి తీసుకెళ్లింది. హత్య జరిగాక ఉత్సాహంతో తిరుపతి వెళ్లి మురుగన్‌ను పెళ్లాడింది. ఈమెకు సోనియా క్షమాభిక్ష ప్రసాదించింది. వీళ్లందరితో బాటు జయలలిత విడిచిపెట్టేస్తున్న నేరస్తులు కూడా తక్కువవాళ్లు కాదు. రాబర్ట్ పయాస్ – అరివు స్నేహితుడు, పోరూరులో ఎల్‌టిటిఇ ప్రథమస్థావరం నడిపాడు. జయకుమార్ – రాబర్ట్ పయాస్ బావ, శివరాజన్‌కు స్థావరంగా పనికి వచ్చిన కొడుంగయూర్‌లోని ముత్తమిల్ నగర్‌లో స్థావరం నడిపినవాడు వీడే. 4) రవిచంద్రన్ ఎలియాస్ ప్రకాశం టిఎన్‌ఆర్‌టి నాయకుడు. పొట్టు అమ్మన్ దళానికి చెందిన భారతీయుడు. ఎల్‌టిటిఈ కోసం ఇండియన్స్‌ను జాఫ్నా తీసుకెళ్లి తర్ఫీదు యిప్పించేవాడు. హత్యకి ముందు తరు”వాత అన్నిరకాల వస్తుసహాయాన్ని అందించినవాడు. శివరాజన్ హత్య తర్వాత కార్తికేయన్‌ను చంపమని అమ్మన్ యితన్ని ఆదేశించాడు.
సుప్రీంకోర్టు మురుగన్, శాంతన్, అరివులను విడిచిపెట్టడానికి ప్రస్తుతానికి ఒప్పుకోలేదు. వీళ్లని వదిలిపెట్టేయడమంటే విచారణ జరిపిన పోలీసు అధికారులు, విచారించిన న్యాయవాదులు, ఆ నాటి ఘటనలో హతులైన వారి కుటుంబసభ్యులే కాదు, సభ్యసమాజంలో అందరూ ఘొల్లుమని ఏడవాలి. రాబోయే ఎన్నికలలో తమిళ ఫీలింగుతో ఓట్లు రాలతాయన్న దృక్పథమొక్కటే యింతటి అన్యాయానికి మూలకారణమౌతోంది. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)