2012 లో రమేశ్‌భాయ్ డి. నాయికా వెర్సస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో తీర్పు చెపుతూ సుప్రీం కోర్టు, సాధారణంగా బిడ్డలు తండ్రి కులాన్నే స్వీకరిస్తారనే వాదనను ఒప్పుకుంటూనే తన తల్లి కులం కారణంగా 'జీవితమంతా అవమానాలకు, తలవంపులకు, తిరస్కారాలకు, అడ్డంకులకు, దోచివేతకు (డిప్రైవేషన్స్, ఇన్‌డిగ్నిటీస్, హ్యుమిలిటీస్, హేండికాప్స్) గురి అయిన పక్షంలో అతన్ని దళితజాతికి చెందినవాడిగా గుర్తించవచ్చు అంది. రోహిత్ విషయంలో యిలాటివి జరిగాయా అని ఆలోచిస్తే అవేమీ కనబడటం లేదు. అతను పేదవాడు, తల్లిదండ్రులు విడిపోయారు అంతే కానీ సామాజికంగా వెనకబడి వున్న దాఖలాలు ఏమీ లేవు. ఎమ్మెస్సీలో ఆరో ర్యాంక్ వచ్చింది. రెండు సార్లు సిఎస్‌ఆర్‌ఐకి క్వాలిఫై అయ్యాడు, మెరిట్‌పైనే పిఎచ్‌డి ఫ్రీ సీటు సంపాదించాడని అతని తమ్ముడు చెప్తున్నాడు. అతని ప్రతిభను అణచి వేసినవారెవరూ లేరు. ఇక కార్యకలాపాల పరంగా అంటారా? అతను ఎఎస్‌ఏ సభ్యుడిగా వుంటూ హిందూత్వ భావజాలాన్ని, వివేకానందుడి బోధనలను, వామపక్షాల ద్వంద్వప్రమాణాలను విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టాడు. వాటి కారణంగా అతనిపై దాడులేమీ జరగనప్పుడు అతను అణచివేతకు గురయ్యాడని ఎలా అనగలం? పైగా అతనే ఈనాడు అతి బలమైన స్టూడెంటు యూనియన్ అయిన ఎబివిపికి వాళ్ల బ్యానర్లు చింపివేసి, 'కాషాయరంగు కనబడింది, కోపమొచ్చింది, చింపా' అని వాళ్ల ప్రత్యక్షంలోనే హుంకరించ గలిగాడు. వాళ్ల నాయకుడిపై దాడి చేయగల లెవెలుకి చేరాడు. తనకు శిక్ష పడితే వైస్ ఛాన్సెలర్ ఎపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లి బతిమాలుకోలేదు. ఆయనకు డిసెంబరులో దళిత విద్యార్థులకు ఉరితాళ్లు, విషం, కారుణ్యమరణం యిమ్మనమని వెక్కిరిస్తూ వుత్తరం రాశాడు. నాలుగు నెలల క్రితం యూనివర్శిటీలో డిప్రెషన్‌లో వున్న విద్యార్థుల కోసం కౌన్సిలర్‌ను పెట్టారు. 20 మంది ఆయన వద్దకు వెళ్లారు కూడా. రోహిత్ అటువైపు తొంగి చూడలేదు. ఇలా షంషేర్‌గా బతికినవాడు పీడనకు గురయ్యాడంటే ఒప్పుతుందా?
ఒప్పించడానికి అతనిపై తీసుకున్న క్రమశిక్షణ చర్యకు 'సాంఘిక బహిష్కారం' అని పేరు పెట్టారు సీతారాం ఏచూరి నుంచి జగన్ వరకు. అలాటి శిక్షలు ఆ యూనివర్శిటీలో 15 ఏళ్లలో 30 మందిపై విధించారు. అప్పుడెప్పుడూ సాంఘిక బహిష్కారం అనలేదే! దీక్షా శిబిరానికి 'వెలివాడ' అని పేరు పెట్టుకున్నారు సస్పెన్షన్‌కు గురైనవాళ్లు. కాలేజీకి రానిస్తామంటే, సాటి విద్యార్థులతో కలిపి కూర్చోబెట్టి పాఠాలు చెపుతానంటే వెలి వేసినట్లు ఎలా అయింది? హాస్టలుకు రావద్దు అన్నారు. అన్నా వీళ్లు ఆగారా? రోహిత్ హాస్టలు గదిలోనే కదా ఆత్మహత్య చేసుకున్నది! ఆ గదిలోకి వెళుతూంటే ఎవరైనా వెళ్లి అడ్డుపడి, వెలివేశాం, రాకూడదు అన్నారా? ఇతరుల హాస్టలు గదిలోకి వెళ్లి అవతలివాళ్లను ఉతికినందుకు ఒక సెమిస్టర్ (ఆర్నెల్ల) పాటు హాస్టలు నుంచి పంపించివేశారు. విద్యార్థులు సాధారణంగా గుమిగూడే లైబ్రరీ, మెస్‌లకు కూడా రావద్ద్దన్నారు. ఆ పాటి శిక్ష కూడా వేయలేకపోతే యూనివర్శిటీ యాజమాన్యం వున్నదెందుకు? చేతకానిది అనరా? దానికి సాంఘిక బహిష్కారం, వెలి పేరు పెట్టడమేమిటి వీళ్లు? పెట్టాలి, ఎందుకంటే దానికి దళిత కలర్ యివ్వాలి కదా! ఇంత కలరు యిచ్చి, అవతలివాళ్లు కులం గురించి విచారించబోతే కులం ప్రస్తావన ఎందుకు అని అడుగుతున్నారు జగన్. ఎందుకు కాదు? దళిత బ్రాండ్ కాకపోతే దేశమంతా అగ్గి రగిలేదా?
జగన్ చేతిలో పేపరుంది, టీవీ వుంది, కప్పేసిన నిజాలు తవ్విపోసే వందలాది రిపోర్టర్లు వున్నారు, తలచుకుంటే రోహిత్ తండ్రి ఏ కులమో తెలుసుకోలేరా? కానీ ఆయన 'మీసేవ'లో యిచ్చిన కులధృవీకరణ పత్రం మీదే ఆధారపడుతున్నారు. ఇక్కడో చిన్న సమాచారం వుంది. రోహిత్ అసలు పేరు మల్లిక్ చక్రవర్తి అనీ, 2005లో తల్లీ తండ్రీ విడిపోయాక అతను క్రైస్తవం తీసుకుని తన పేరును రోహిత్ చక్రవర్తిగా మార్చుకున్నాడని అతని పితామహుడు అంటున్నాడట. ఆ లెక్కన చూస్తే రోహిత్ క్రైస్తవ మైనారిటీ అవుతాడు. ఆ విషయం ప్రస్తావిస్తే సాటి క్రైస్తవుడు కదాని జగన్ రంగంలోకి దిగాడన్న ఆలోచన వస్తుంది. అందువలననే కాబోలు ఆయన 'మనిషి చనిపోయాక కులం పేరుతో రాద్ధాంతం ఎందుకు?' అని కొట్టి పారేయాలని చూస్తున్నాడు. టిడిపి నాయకుడు జూపూడి ప్రభాకరరావు కూడా 'సామాజిక మాధ్యమాల్లో రోహిత్ దళితుడే కాదని కులరాద్ధాంతం చేస్తున్నారని' దుయ్యబట్టారు. రోహిత్ ఆత్మహత్య లేఖలోనే రాశాడు – 'మనిషిని కులంతోనే అంచనా వేస్తున్నారు' అంటూ. నిజానికి రిజర్వేషన్ సౌకర్యం దక్కని అగ్రవర్ణాలవారూ అదే మాట చెప్పి వాపోతారు. చనిపోయాక అయితే మాత్రం కులప్రస్తావన ఆగుతోందా? అగ్రవర్ణుడు ఆత్మహత్య చేసుకుంటే యూనివర్శిటీలో స్మారకస్తంభాలు వెలుస్తున్నాయా? రూ. 5 కోట్ల పరిహారం అడుగుతారా?
దళిత కోణం లేకపోతే నిన్న యూనివర్శిటీలోని 13 మంది దళిత ప్రొఫెసర్లు తమ కార్యనిర్వాహక పదవుల నుంచి ఎందుకు తప్పుకోవాలి? నిజానికి వీళ్లు అయిదుగురు విద్యార్థుల సస్పెన్షన్‌కు మౌలికంగా వ్యతిరేకమా? వ్యతిరేకమైతే అప్పుడే నిరసన తెలపాలిగా! దీక్ష చేసే విద్యార్థులు తాము 15 రోజుల పాటు ''వెలివాడ' నిర్వహించినప్పుడు యూనివర్శిటీలోని 60 మంది దళిత ప్రొఫెసర్లతో సహా ఏ ప్రొఫెసరూ, ఏ రాజకీయనాయకుడూ తమవైపు తొంగి చూడలేదని, క్లాస్‌మేట్స్ కూడా పట్టించుకోలేదని' ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజకీయనాయకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ముసురుతున్నారు. దళితులై వుండి యిప్పటికైనా సానుభూతి వ్యక్తం చేయరా అని దళిత సంఘాల నుంచి ఒత్తిళ్లు వచ్చి వుంటాయి కాబట్టే యిప్పుడు యీ 13 మంది రాజీనామాలు చేశారనుకోవాలి. ఇలాటి ఒత్తిళ్ల వలననే, రాజకీయంగా ప్రమాదకరమౌతుందనే భయంతోనే యిప్పుడు సస్పెన్షన్ ఎత్తివేయాలని యాజమాన్యం నిర్ణయించి వుంటుంది. రోహిత్ దళితుడు కాదు, మైనారిటీ అనే కోణం బయటకు వస్తే దేశవ్యాప్తంగా సానుభూతి తగ్గే ప్రమాదం వుంది.
దీనితో బాటు వివాదానికి మూలకారణమైన యాకూబ్ మేమన్ ఉరితీత సంబంధిత ప్రస్తావన అంశాన్ని పక్కకు తప్పిస్తున్నారు కొందరు కాలమిస్టులు. ముజఫర్‌పూర్ అల్లర్ల గురించి వచ్చిన ''ముజఫర్ నగర్ బాకీ హై' డాక్యుమెంటరీ ప్రదర్శనను ఢిల్లీలో అడ్డుకున్న ఎబివిపికి వ్యతిరేకంగా ఏఎస్‌ఏ ప్రదర్శన చేస్తే ఎబివిపి గొడవ చేసిందని రాస్తున్నారు. అది జరిగినది ఆగస్టు 3న. కానీ ఎబివిపి జులై 30 న జరిగిన యాకూబ్ ప్రదర్శన గురించే గొడవ వచ్చిందంటోంది. ఎందుకంటే యాకూబ్‌్ ఉరితీతకు వ్యతిరేకంగా చేసిన ప్రదర్శనలో రోహిత్ తదితరులు చేసిన నినాదాలు దేశంలో అత్యధికులకు సమర్థనీయంగా లేవు. యాకూబ్‌నే కాదు, మనిషనేవాణ్ని ఎవర్నీ ఉరి తీయకూడదు అని వాదించే వారు కొందరున్నారు. వారి వాదన వినిపించే హక్కు వారి కుంది. కొందరిని ఉరి తీయవచ్చు కానీ మేమన్ నిర్దోషి, అసలువాణ్ని వదిలివేసి కొసరు మనిషైన యాకూబ్‌ను ఉరితీయడం తప్పు అని వాదించినవారున్నారు. వారికీ ఆ హక్కు వుంది. యాకూబ్ మరణించినందుకు అతని అంత్యక్రియల్లో భాగంగా నమాజ్ చేసినా సరే కానీలే అనుకోవచ్చు. 'ఒక యాకూబ్‌ను ఉరితీస్తే యింటింటికి ఒక్కో యాకూబ్ పుట్టుకొస్తాడు' అనే నినాదం మాత్రం మింగుడు పడని వాళ్లం చాలామంది వున్నాం. ఆ విషయం ప్రస్తావించిన కొద్దీ రోహిత్‌పై జాలి తగ్గిపోతుంది. అందుకని దాన్ని అండర్‌ప్లే చేస్తున్నారు వ్యాఖ్యాతలు. వ్యాఖ్యలు నచ్చని వారిలో సుశీల్ కుమార్ ఒకడు. అతని అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు అతనికి వుంది. లేదని ఎవరైనా అనగలరా? భావప్రకటన చేసే హక్కు వుందని ఒప్పుకుంటే అతనిపై దాడిని ఖండించాలి. రోహిత్ గురించి యింత మాట్లాడేవారు సుశీల్ కుమార్ గురించి ఎందుకు ఆలోచించటం లేదు?
ఏఎస్‌ఏవారు తమ కార్యక్రమం గురించి ఫేస్‌బుక్‌లో పెట్టుకోగా లేనిది, హిందూత్వ భావజాలాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, వివేకానందుణ్ని తిరస్కరిస్తూ రోహిత్ ఫేస్‌బుక్‌లో పెట్టుకోగా లేనిది, ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో ఎవరికి కావలసిన కామెంట్స్ వాళ్లు పెట్టేసుకుంటున్నారు యీ రోజుల్లో సుశీల్ కుమార్ వీళ్ల గురించి 'ఐయస్‌ఐ గూన్స్' అనడంలో ఆక్షేపణ ఏముంది? కానీ ఏఎస్‌ఏ వాళ్లకు యిది నచ్చలేదు. ఓకే, వెళ్లి చెప్పవచ్చు, వాదించవచ్చు. 30 మంది అర్ధరాత్రి సుశీల్ హాస్టల్ రూముకి అతని చావగొట్టడమేమిటి? 'అతను క్షమాపణ చెప్పాడు' అని ఏఎస్‌ఏ వాళ్లు అంటున్నారు. అంతటి ఎబివిపి నాయకుడు ఊరికే చెప్తాడా? తన్ని మరీ చెప్పించి వుంటారని సులభంగా వూహించవచ్చు. 'గూన్స్' అనే పదం వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నాను అని సుశీల్ అంటున్నాడు. గూన్స్ అనే పదం అంత బాధిస్తే మరి యిప్పుడు ఏఎస్‌ఏ వారు తనను 'మనుస్మృతి ఇరానీ' అనడాన్ని స్మృతి ఇరానీ ఎలా తీసుకోవాలి? ఆమె మనుస్మృతిని అవలంబిస్తోందా? ఆమె నటీమణి. మనువు ఆడవాళ్లకు ఆ స్వేచ్ఛ నిచ్చాడా? నీకు నచ్చకపోతే మనువాది, బ్రాహ్మణవాది అనేస్తావు. అలాగే అవతలివాళ్లు వాళ్ల భాష వాళ్లు వుపయోగిస్తారు. విద్యార్థుల మధ్య యిలాటి కొట్లాటలు సహజం. కానీ అర్ధరాత్రి అంతమంది వెళ్లడం దేన్ని సూచిస్తోంది? గూండాగిరీని కాదా? (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)