తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన సర్వే పూర్తయింది. సూపర్ సక్సెస్, ఇప్పటికే 80% అయింది, కాస్సేపటిలో 100% అయిపోతుంది, ప్రపంచంలో ఎక్కడా జరగనంత గొప్పగా జరిగింది అంటూ కెసియార్ 19 సాయంత్రానికే ప్రకటన యిచ్చేశారు.అలా చెప్పి మూడు రోజులైనా సర్వే పూర్తి కాలేదు. తగినన్ని ఫారాలు లేవు, చాలినంతమంది ఎన్యూమరేటర్లు లేరు, వారికి సరైన శిక్షణ లేదు, సాయపడతానన్న విద్యార్థుల్లో కొందరు వెళ్లలేదు.. యిలా సవాలక్ష కారణాలతో అరకొరగానే పూర్తయింది. దానిలోని సమాచారాన్ని డిజిటలైజ్ చేయడానికి పూనుకున్నపుడు యింకెన్ని లొసుగులు బయట పడతాయో తెలియదు. అప్పటిదాకా సర్వే విజయంపై వ్యాఖ్యానించడం కష్టమే. అయితే యిప్పటిదాకా వున్న సమాచారం, సర్వే జరిగిన విధానం మాత్రం కొన్ని సూచనలు యిస్తోంది.
సర్వే రహస్యలక్ష్యం నెరవేరిందా?
తెలంగాణలో ఎంతమందిని బయటివాళ్లగా ముద్ర వేయవచ్చనేది తేల్చుకోవడానికి సర్వేను రూపొందించారనేది అందరికీ తెలిసిన సత్యం. ఈ రోజు ఫాస్ట్ పథకంతో మొదలుపెట్టి తర్వాతి రోజుల్లో ఎన్నో పథకాలు, పన్నులు విషయంలో యీ వివక్షత పాటిద్దామన్న ఆలోచన వుండి వుంటుంది. అందుకే 1956 రూలు పూర్తిగా రూపు దిద్దుకోవడానికి ముందే అడావుడిగా యీ సర్వే రూపొందించారు. ప్రభుత్వం తన ఉద్దేశాన్ని రహస్యంగా వుంచదలచలేదు. కావలసినన్ని సంకేతాలు యిచ్చి ఆంధ్రమూలాలున్నవారిలో భయాందోళనలు కలిగించాలనే సంకల్పించింది. కెసియార్ చెప్పినది యిదీ అంటూ రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిన ఆడియో నిజమైనదే అని నేను నమ్ముతున్నాను. కెసియార్‌కు యీ గుజరాతీ వ్యామోహం ఎందుకో తెలియదు. గతంలో నాకు మెయిల్స్ రాసిన ఒకరిద్దరు కూడా 'గుజరాతీవాళ్లు మాతో కలిసిపోతారు, ఆంధ్రోళ్లు కలవరు' అంటూ రాశారు. కాంప్లెక్సులో బతకమ్మ ఆడదామని పిలిస్తే ఆంధ్రావాళ్లు రాలేదట, గుజరాతీవాళ్లు వచ్చారట. అందుకని యీ తీర్పు. డాన్సు మాట సరే, గుజరాతీ వాళ్లు ఎంతమంది తెలంగాణ వాళ్లను పెళ్లి చేసుకున్నారు? ఆంధ్రావాళ్లు ఎంతమంది చేసుకున్నారు? ఆ విషయం గమనించారా అని అడిగాను. అది అనవసరంట. తన వంశాన్ని వృద్ధి చేసే కోడలును, లేదా కాళ్లు కడగవలసిన అల్లుణ్ని తెలంగాణనుండి సెలక్టు చేసుకున్నారు కదా వాళ్లని గౌరవించినట్లు కాదా అంటే కాదుట. వాదించలేక దణ్ణం పెట్టి వూరుకున్నాను. 'మా మరదల్ని కాకినాడ వాళ్లకిచ్చాం' అని కెసియార్ చెప్తూండేవారు. గుజరాతీవాళ్లను బంధువులుగా చేసుకుని వుంటే ఆ ముక్క యింకా చెప్పలేదు.
చూస్తే తేడా తెలిసిపోతుందా?
కోర్టు దగ్గర కెళ్లేసరికి ప్లేటు ఫిరాయించారు. అబ్బే, ఏమీ అడగం, యిష్టం వుంటే చెప్పవచ్చు లేకపోతే లేదు అని చెప్పి తప్పించుకున్నారు. సర్వే ఫారంలో ముందు పెట్టిన ఆ కాలం తీసేయాల్సి వచ్చింది. దానిలో ఏమీ లేకపోయినా, వాళ్లు ఏమీ చెప్పకపోయినా ఎన్యూమరేటరు అంతర్నేత్రంతో వాళ్ల యింటిని కక్షుణ్ణంగా పరిశీలించి, వాళ్లు ఎక్కడివాళ్లో కనిపెట్టేస్తాడు అంటూ కెసియార్ చెప్పారు – సర్వే చేసి బయటకు వచ్చాక ఆ ఫారం మీద సీక్రెట్‌గా ఎ అనో, టి అనో వేస్తారన్నమాట అనుకునేట్లా! చూడగానే ఆంధ్రో, తెలంగాణాయో ఎవరైనా చెప్పగలరా? తెలుగువాళ్లందరూ యించుమించు ఒకేలా వుంటారు. పంజాబీయో, మలయాళీయో అయితే రూపురేఖల్లో తేడా తెలుస్తుంది కానీ ఒకే జాతివారిలో రూపురేఖావిలాసాల్లో, కట్టుబొట్టూలో, యింటిపేర్లలో, మనిషి పేర్లలో తేడాలు కొట్టవచ్చినట్లుగా ఏముంటాయి? ఇంట్లో చంద్రబాబు ఫోటో వుంటే ఆంధ్రా, కెసియార్ ఫోటో వుంటే తెలంగాణ అనుకుందామంటే, రాజకీయ నాయకుల ఫోటోలు యింట్లో తగిలించుకునే రోజులు కావివి. నమస్తే తెలంగాణ పేపరు టీ పాయ్మీద వుంటే టి అని వేస్తారు అనుకుంటే సెలూనులోంచి పాత పేపర్లు నాలుగు తెచ్చి పడేస్తే…?
ఇక మాట బట్టి నిర్ణయించాలి అంటే.. అది కూడా కష్టమే. గ్రామీణప్రాంతాల్లో, పేదవర్గాలలోనే యాస స్వచ్ఛంగా నిలుస్తుంది. పట్టణ ప్రాంతాల వాళ్లూ, చదువుకున్నవాళ్లూ యించుమించు ఒకలాటి మాటే మాట్లాడతారు. కొన్ని కొన్ని పదాలు మాత్రమే తేడాగా వుంటాయి. కానీ ఆ పదాలు ఏ జిల్లావి అని కనుక్కోవడం కూడా అంత సులభం కాదు. భాషాధ్యయనం చేసినవారికే అది సాధ్యం. మామూలు జనాభా అంతా పత్రికల వలన, సినిమాల వలన ప్రభావితమై ఒకేలాటి తెలుగు మాట్లాడుతూంటాం, రాస్తూ వుంటాం. టి – ఛానెల్లో తెలంగాణ యాసలోనే మాట్లాడాలని పట్టుబట్టి ప్రయత్నిస్తూ మధ్యమధ్యలో మామూలు భాషలోకి స్లిప్ అయిపోవడం చూస్తూ వుంటాం. ఆంధ్రమూలాలు వున్న వారి యిళ్లల్లో తలిదండ్రులు ఆంధ్ర యాసలో మాట్లాడినా, పిల్లలు తెలంగాణ యాసలో మాట్లాడడమూ చూస్తాం. కొంతమంది పిల్లలు బయట తెలంగాణ యాస, యింట్లో ఆంధ్ర యాస కూడా మాట్లాడుతూంటారు. ఇలాటి పరిస్థితుల్లో ఎన్యూమరేటర్ ఒక పక్క వివరాలు ఒక చెవితో వింటూ మరో చెవి రిక్కించి అవతలివాడి మాటలో యాసకై వెతకడం, దాన్ని విశ్లేషించడం మాటలా? ఇంతా చేసి ఆయన ఇంగ్లీషులో మాట్లాడితే..?
అంచనాలన్నీ గల్లంతు, సర్వే అసమగ్రం
ఎన్యూమరేటరుని ఆ రోజు ఉదయం 7 నుంచి రాత్రి 8 వరకు పనిచేయమన్నారు. మధ్యలో ఒక గంట భోజనానికి, టీలకు పోయినా 12 గంటలు పని చేయాలి. కుటుంబానికి సుమారుగా అరగంట చొప్పున మొత్తం 25 మందిని సర్వే చేయగలడు. ఈ అంచనాతో 25-30 మందిని సర్వే చేస్తాడు అని ప్రకటించారు. ఆ ప్రకారం ప్రాథమికంగా ఎన్యూమరేటర్లను ఎలాట్ చేశారు. తీరా చూస్తే వాళ్లు అనుకున్నదాని కంటె ఎక్కువ కుటుంబాలు, యిళ్లు తేలాయి. 2011లో హైదరాబాదులో 15 లక్షల కుటుంబాలుంటే మూడేళ్లలో అవి 7 లక్షలు పెరిగాయట. మూడేళ్లలో 50% పెరుగుదల సాధ్యమా? పైగా యితర గ్రామాల వారందరూ స్వగ్రామాలకు వెళ్లిపోగా..? 60 వేల యిళ్లకు తాళాలు వేయగా..? మొన్ననే మూడు నెలల క్రితమే కదా ఎన్నికలు జరిగాయి. వయోజనులందరికీ ఓటరు స్లిప్పులు పంచారు. ఈ లోపునే జనాభా పెరిగిపోయారా? తెలంగాణ ఏర్పడ్డాక ఆంధ్రావాళ్లను భగాయించి, ఉన్న ఉద్యోగాలన్నీ తెలంగాణ వాళ్లకే వచ్చేట్లు చేస్తామన్నారు కెసియార్. ఆంధ్రవాళ్లు పారిపోయారో లేదో తెలియదు. వారి కంటె ఎక్కువగా యితర రాష్ట్రాల వాళ్లు, దేశాల వాళ్లు వచ్చేశారేమో తెలియదు. ఇలా అయితే స్థానికులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఒంటరిగా వుండే బ్రహ్మచారులను కూడా కుటుంబంగా లెక్క వేయడం వలన కుటుంబాల సంఖ్య పెరిగింది అంటున్నారు. ఇక యిళ్ల విషయానికి వస్తే ఒక నెంబరుంటే ఒక యిల్లు అనుకున్నారు. దానిలో వాటాలుంటాయని తోచలేదు. వాటికి సర్వే ఫారాలు సిద్ధం చేయలేదు. అసలు యిళ్లే ఒక వరుసలో లేవు, నెంబర్లు సరిగ్గా లేవు. ముందు యివన్నీ సవరించి 'సమగ్ర'సర్వేకు ఉపక్రమించాలి. కానీ ఏం చేశారు? అడావుడి, అడావుడిగా సర్వేకు దిగిపోయారు.
చివర్లో కెసియారే చెప్పారు – హైదరాబాదులో 1.20 కోట్లు జనాభా వుంటుందనుకోలేదు, అనుకున్నదాని కంటె చాలా ఎక్కువమంది వున్నారు…అని. హైదరాబాదు జనాభా లెక్క ఎలా వేశారు? 22 లక్షల కుటుంబాలు, సరాసరిన యింటికి 5 మంది అనా? మరి ఒకే సభ్యుడున్న కుటుంబాల సంగతేమిటి? రెండు రోజులు సర్వే చేసినా రాష్ట్రం మొత్తం మీద 1.50 లక్షల కుటుంబాలను సర్వే చేయలేకపోయారు. కొన్ని కాలనీల్లో 30% కూడా నమోదు కాలేదు. ఈ సమస్యలన్నీ అధికారులు ముందుగా వూహించి చెప్పలేదా? వాళ్లు చెప్పటం లేదు, మీడియా ఎత్తి చూపటం లేదు. కెసియార్ ఏం చెప్పినా వహ్వా వహ్వా అనడం తప్ప, అది ఎంత యింప్రాక్టికలో ఎవరూ వివరించడం లేదు. చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సుల్లాగే, కెసియార్వి కూడా ఒన్వేగానే వుంటున్నాయన్నమాట. ఎవరైనా 'సార్ యిది జరగడం కష్టం' అని నిజాయితీగా చెప్పబోతే 'మనం కష్టపడి పని చేయాలి. నేను చూడు చేయడం లేదా? గత ప్రభుత్వంలా కాదు మాది, మీరంతా ఒళ్లు వంచి పనిచేయాలి. ఇలాటి సోమరితనం, నెగటివ్ థాట్స్ నాకు నచ్చవ్' అంటూ ఉపన్యాసాలు వినాల్సి వస్తోందేమో. చివరకు ఏమైంది?
గణకుల సామర్థ్యం
ఏ పని చేయాలన్నా తర్ఫీదు వుండాలి. ఒకే పని రోజూ చేసేవాళ్లలో ఒడుపు, తద్వారా వేగం వచ్చిచేరతాయి. తక్కినవాళ్లను కొత్తగా పిలుచుకు వస్తే తబ్బిబ్బు పడతారు. తప్పులు చేస్తారు. నెమ్మదిగా చేస్తారు. క్యాషియర్లు నోట్లు త్వరగా లెక్కపెడతారు. 'ఈ రోజు నోట్ల వర్షం కురిసింది, సాయంత్రానికల్లా లెక్క తేలిపోవాలి, కనబడిన వాళ్లనల్లా పట్టుకుని రా' అని గుమాస్తాలను, విద్యార్థులను పిలుచుకుని వస్తే వాళ్లు క్యాషియర్లంత వేగంగా లెక్కించగలరా? ఒక క్యాషియర్ వేగం బట్టి లెక్కవేసి ప్రతీ వ్యక్తీ యిన్ని నోట్ల కట్టల చొప్పున వెయ్యిమంది యిన్ని లెక్కించగలరు అని అంచనా వేస్తే తప్పదా? ప్రభుత్వాఫీసుల్లో డెస్క్‌పై పనిచేసేవారికి రాయడంలో ఒడుపు వుంటుంది. బ్యాంకు క్లర్కులకు అంకెలు వేయడంలో ఒడుపు వుంటుంది. అందరికీ ఒకలాటి పని అప్పచెప్పి సాయంత్రానికల్లా పూర్తి చేయాలంటే ఏమవుతుంది? ఇక విద్యార్థుల సంగతికి వస్తే – వాళ్లు ప్రతీదీ చేయడానికి ఉత్సాహపడతారు. కానీ అది ఎంతసేపు వుంటుందో, మధ్యలో ఎప్పుడు విసుగు పుట్టి మానేస్తారో ఎవరికీ తెలియదు. ఎన్టీయార్ ప్రభుత్వంలోకి వచ్చిన కొత్త రోజుల్లో యిలాగే 'బోగస్ రేషన్ కార్డులు ఏరేస్తాం, ప్రభుత్వోద్యోగుల నిజాయితీని నమ్మలేం కాబట్టి, విద్యార్థులను జాతినిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నాం' అంటూ రేషన్ కార్డుల వెరిఫికేషన్, కొత్తవాటి రిజిస్ట్రేషన్ అంటూ స్టూడెంట్స్‌ను పంపించారు. అంతా అస్తవ్యస్తంగా తయారై మళ్లీ ఉద్యోగుల చేత చేయించవలసి వచ్చింది. నిజాయితీగా చేద్దామనుకున్న విద్యార్థికి నేర్పు లేకపోయేది. పైగా వాడిని తక్కిన కుర్రాళ్లు 'ఏమిట్రా యీ చాదస్తం, కాలేజీ ఎలాగూ ఎగ్గొట్టాం కదా, మ్యేట్నీకి పోదాం రా' అంటూ డిస్కరేజ్ చేసేవాళ్లు. ఈసారి సర్వేలో కూడా చాలామంది విద్యార్థులు వస్తామని చెప్పి ఎగ్గొట్టారట. ఆ భారం ఉద్యోగులపై పడిందట.
రకరకాల ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీ వేసినపుడు థరోగా శిక్షణ యిస్తారు. ఏళ్ల తరబడి చేస్తూ వస్తున్నారు కాబట్టి కొంతమందికి ప్రాక్టీసు అయిపోయి వుంటుంది. పైగా వాళ్లు ఒక్కరే కాదు, బూత్‌లో కనీసం నలుగురైదుగురు వుంటారు. ఎవర్ని అడిగినా, ఆఖరికి పోలింగు ఏజంటును అడిగినా ప్రొసీజరు చెప్తారు. ఈ సర్వేలో గణకుడు ఒంటరిగా వెళ్లవలసి వచ్చింది. పైగా యీ ప్రాసెస్ కొత్త. జనాభా సేకరణలా కాదిది. అన్నిటికీ మించి ఫార్మాట్‌ను మారుస్తూ పోయారు. అందువలన ఎన్యూమరేటర్లు గందరగోళంగానే వున్నారు. ఏరియా కొత్త కాబట్టి ఇళ్ల నెంబర్లు కనుక్కోవడం వారి తరం కాలేదు. అంతర్జాతీయ నగరం అంటూంటారు, గ్రౌండ్ రియాలిటీ చూస్తే యిదీ వరస. ఇళ్ల నెంబరింగ్ వంటివి సవరించి సర్వేలు చేపడితే అదో అందం. అది లేకుండానే తొందరపడ్డారు.
సమయం చాలలేదు
ఎన్యూమరేటర్లు చాలామంది యింటింటికీ వెళ్లే సమయం, సౌకర్యం లేకపోయింది. ఎందుకంటే ఒక్కో ఎన్యూమరేటరుకి కనీసం 50 యిళ్లను సర్వే చేయవలసి వచ్చింది. కొందరికి యింకా ఎక్కువగా 70, 100 కూడా పడ్డాయి. ఎందుకంటే ఇళ్ల సంఖ్య గురించి తప్పుడు అంచనాలు. తగినంతమంది సిబ్బందిని యివ్వలేకపోయారు. ఉర్దూ మాట్లాడే చోట ఆ భాష రాక మరో సమస్య. ఫారాలు ఉర్దూ లేవని పాతబస్తీలో రగడ. దాంతో వాళ్లు కాలనీకి వెళ్లి చెట్టుకింద బల్ల, కుర్చీ వేసుకుని, అవి లేనిచోట బాసింపట్టు వేసుకుని పుస్తకాలు ముందేసుకుని ఎవరు వచ్చి ఏం చెపితే అదే రాసుకున్నారు. ఇంటింటికి తిరిగి వాళ్ల యింటి కప్పు రకమేమిటో, మరుగుదొడ్డి వుందో లేదో, ఇల్లు బాగా వుందో, పాయిందో, గ్యాస్ బండలు ఎన్ని వున్నాయో కనిపెట్టేసేటంత అవకాశం వారికి కలగలేదు. డబ్బుందని తెలిస్తే ముప్పు అనుకున్నవాళ్లు ఖరీదైన టీవీలపై దుప్పట్లు కప్పేశారట. నగలు తీసి లోపల పెట్టారట. తీరా చూస్తే ఎన్యూమరేటర్లకు యిళ్లకు వచ్చే టైమే లేకపోయింది.
మొదట్లో యింట్లో సభ్యులందరూ వుండి తీరాలి అన్నవారు కుటుంబ పెద్ద ఒక్కడూ వుంటే చాలన్నారు. చివరకు తన బల్ల దగ్గరకు వచ్చి వివరాలు యిచ్చి సంతకం పెట్టినవాడు కుటుంబ పెద్దో, కుటుంబస్నేహితుడో చెక్ చేసుకునే సౌకర్యం ఎన్యూమరేటర్‌కు లేకుండా పోయింది. ఆధార్ కార్డుపై వున్న ఫోటోతో పోల్చి చూసేటంత టైమే లేదు. ఎవడో ఒకడు, ఏదో ఒకటి, చెపితే కాలమ్‌లు నిండిపోతాయి కదాన్న విసుగుతో వున్నారు ఎన్యూమరేటర్లు. ఈ సర్వేలోంచి మాకు రావలసినది మేం పిండుకుంటాం అంటున్నారు కెసియార్ – అసలు సరిగ్గా ఫిలప్ చేశారో లేదో కూడా చూసుకోకుండానే!
ఫారాల్లో చోటూ చాలలేదు
ఆస్తి కొన్న డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు కూడా దగ్గర పెట్టుకోమన్నారు మొదట్లో. కొన్నాళ్లకు జిరాక్సులు యివ్వక్కరలేదు, చూపితే చాలన్నారు. వాటిని చూడడానికి కూడా ఎన్యూమరేటర్లకు సమయం లేదు. ఫారం ముందే నింపి యిచ్చేస్తే చాలు, సంతోషంగా చూసి రాసేసుకున్నారు. ఎందుకంటే కాల్‌గ్యాస్ అయితే ఒకటి, ఇండియన్ గ్యాస్ అయితే రెండు, మగ అయితే రెండు, ఆడ అయితే ఒకటి – యిలా కోడ్‌లో పూరించడంలో వాళ్లు చాలా యిబ్బంది పడ్డారు. అంతకంటె పొడి అక్షరాలు (మేల్ అయితే ఎమ్, ఫిమేల్ అయితే ఎఫ్..) రాయించేసి, కంప్యూటరైజ్ చేసేటప్పుడు యీ 1, 2 కోడింగ్ చేసేపని డాటా ఎంట్రీ ఆపరేటర్లకు పెట్టి వుంటే బాగుండేది. అవన్నీ వీళ్ల నెత్తిన రుద్దడంతో ఓపిక హరించి, యింట్లో ఎందరున్నారు, వాళ్లందరినీ కనబడమనండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు చూపమనండి అనేటంత ఓపిక ఎవరికీ లేకపోయింది. మొదట్లో అయితే అవి చెక్ చేసేసి, పుట్టిన వూరు గుర్తు పెట్టేసుకుని వాళ్లు తెలంగాణలో పుట్టారో, లేదో గమనించి రాసేస్తారని అన్నారు. చివరకు అదేమీ జరగలేదు. అసలు ఆ కాలమ్సే చిన్నగా వున్నాయి. మన తెలుగువాళ్ల పేర్లు రాయాలంటే చోటు సరిపోవడం లేదు. ఇక స్థలాల వివరాలు రాయాలంటే చచ్చే చావు. 'ఇవన్నీ రాయటం కష్టమండీ, వదిలేయమంటారా? మీరు చెప్పకపోయినా ఏమీ కాదు, అంతా ఐచ్ఛికం అని కోర్టు చెప్పిందిగా' అని ఎన్యూమరేటర్లే సూచించిన సందర్భాలున్నాయి. కోళ్లు, పందుల లెక్కలో మరీ గందరగోళం. మధ్యాహ్నం సర్వేలో కోడి లెక్కకు వచ్చిందట, ఆ రాత్రే కుటుంబసభ్యులందరం యీ పేరున కలిశాం కదా అన్న సంతోషంలో ఆ కోడిని కోసుకుని విందు చేసేసుకున్నారట. ఇంక కోళ్ల లెక్క తప్పినట్లే కదా! కాకుల లెక్క అంటే యిలాటిదే కాబోలు!
ఒకే రోజు వ్యామోహం
ఈ గందరగోళానికి కారణం – రాష్ట్రమంతా ఒకే రోజు సర్వే జరపాలని నిశ్చయించుకోవడం! ఎన్నికలే థలవారీగా జరుపుతున్నారు. సర్వే థలవారీగా చేస్తే నష్టమేమిటి అంటే బోగస్ కార్డులు ఏరివేయడానికి అన్నారు. చాలామంది సొంతగ్రామాల్లోనూ, నగరాల్లోనూ రెండు చోట్లా నమోదు చేయించుకుని ప్రభుత్వ పథకాల బెనిఫిట్స్ పొందుతున్నారు. ఈ ఒక్కరోజు సర్వే వలన వాళ్లు అక్కడో, యిక్కడో ఒకే చోట వుండవలసి వస్తుంది, రెండో చోట రద్దయిపోతుంది అని చెప్పారు. థియరీ బాగానే వుంది, ప్రాక్టికల్‌గా చీదేసింది. ఎన్యూమరేటర్లను అలవికాని సంఖ్యలో సర్వే చేయమనడంతో వాళ్లు ఫారాలు ముందే యిచ్చేస్తే 2, 3 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఎన్నికలలో అయితే బ్యాలట్ పేపర్లు అవాళే యిస్తారు కాబట్టి వాటిని మిస్యూజ్ చేయడం కష్టం. దీనిలో ఫారాలు ముందే యివ్వడంతో ఎన్యూమరేటర్లు 17, 18ల నుంచి ఫారాలు నింపడం మొదలుపెట్టారు. ఇక్కడ ఫారం నింపేశాక వెంటనే స్వగ్రామం వెళ్లి అక్కడ మళ్లీ నమోదై వుంటారు కొందరు. 19 న కూడా హైదరాబాదులో చప్పున సర్వే చేయించుకుని స్వగ్రామం వెళ్లడానికి సొంత వాహనాలను, కిరాయి లారీలను సిద్ధం చేసుకున్నారు కొందరు. (కొంతమంది అటు నుంచి యిటు వచ్చారు) అందుకే సర్వేయర్లు రావడం ఆలస్యమైతే గాబరాపడి ఫోన్లు కొట్టారు. ఫిర్యాదులు హ్యేండిల్ చేయలేక కాల్ సెంటర్ చతికిలపడింది.
మామూలుగా అయితే సర్వేయర్లు రాకపోతే ఎవరూ చింతించం. కానీ యీ సందర్భంలో రండి, రండి అని తొందరపెట్టడానికి కారణం – సర్వేలో పాల్గొనాలనే ఉత్సాహం కాదు, అక్కడ మిస్ అయిపోతామేనన్న అలజడి. ఎన్యూమరేటర్లు రాగానే తమ వివరాల కాగితం వారి మొహాన కొట్టి వారి పుస్తకంలో సంతకం పెట్టి ఉడాయించారు. కొందరు ప్రయివేటు లారీల్లో వూళ్లు వెళుతూంటే పోలీసులు పట్టుకుని దించేశారు. ఆ ముచ్చట అవేళ మాత్రమే జరిగింది. సర్వే బుధవారం కూడా జరిగింది. ఇంకా లక్షన్నర కుటుంబాలు మిగిలిపోయాయి కాబట్టి కొన్నాళ్ల తర్వాత మళ్లీ చేస్తారట. ఇక డూప్లికేషన్ ఎలా అరికట్టగలరు? అసలు డూప్లికేట్ కార్డులు తీసేయాలనుకుంటే ఆధార్ కార్డులను డిజిటల్‌గా వెరిఫై చేస్తే పోయేది కదా! వయసు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన సంవత్సరం కామన్‌గా వున్నవారి పేర్లు ఆధార్ కార్డుల్లోంచి డిజిటల్‌గా ఏరి, వాళ్ల డాక్యుమెంట్లు మళ్లీ వెరిఫై చేయించి బయోమెట్రిక్‌గా చెక్ చేస్తే బోగస్‌వి బయటపడిపోతాయి. ఇంత కసరత్తు అక్కరలేదు.
సర్వే వలన తేలేదేమిటి?
అయినా ఏదో జరిగిపోతోంది, మన కెసియార్ ఆంధ్రోళ్ల తాట తీస్తున్నాడు, వాళ్లు భయపడి పారిపోతున్నారు అనే యింప్రెషన్ కలిగించడానికి మాత్రమే యీ సర్వే పనికి వచ్చింది. ఎన్నో వ్యక్తిగత వివరాలు సేకరించాలని తలపెట్టి చివరకు తూతూమంత్రంగా తేల్చేశారు. దీనివలన ఒక్క సంగతి మాత్రం బయటపడుతుంది. జనాభాలో మైనారిటీల శాతం, బిసిల శాతం ఎంతో కరక్టుగా తేలుతుంది. జనాభాలో యింతున్నాం, అంతున్నాం అంటూ వాళ్లు చాలా క్లెయిమ్స్ చేస్తున్నారు. ఉద్యోగాల్లో కోటా అడుగుతున్నారు. వాళ్లకు యిస్తున్నది ఎక్కువో, తక్కువో తేలిపోతుంది. ఇంకో కాలమ్ కులం పేరు చెప్పమంది. బిసి, ఎస్సీ కేటగిరీ అయితే కులం పేరు చెప్పినా అర్థముంది. ఏదైనా కులాన్ని డీక్లాసిఫై చేస్తే ఎంతమంది తగ్గుతారో తెలుస్తుంది. ఒసిలు తమ కులం చెప్పవలసిన పనేముంది? దానికి ఏ జస్టిఫికేషన్ యివ్వలేదు. కులాంతరవివాహం వలన పుట్టినవాళ్లు ఏ కులం అని రాసుకుంటారు? కులవ్యవస్థలో నమ్మనివాళ్లు ఏం రాయాలి? కులాంతర వివాహం చేసుకున్నా 'కాపునాడు' పార్టీ పెట్టిన దాసరి నారాయణరావుగారు తన కులం చెప్పలేదని ప్రకటించారు. ఇక యీ సర్వేలో పాల్గొనకపోతే, వివరాలు చెప్పకపోతే భవిష్యత్తులో ఆస్తిపాస్తులు అమ్మడానికి యిబ్బంది పడతారని కలక్టర్ల పేర నోటీసులు పంచి, భయోత్పాతాలు సృష్టించారు. పౌరుని ప్రాథమిక హక్కులు హరించే సర్వే యిప్పటివరకు జరగలేదు, జరగబోదు. సర్వే గణాంకాల వివరణ కోసమే. ( ఈ సర్వే వలన గణాంకాలలో గందరగోళం ఎక్కువైంది) అయితే యీ బెదిరింపుల వలన జనం యిళ్లకు వచ్చి కూర్చున్నారు. అదేదో తమ ప్రతిభ అనుకుంటోంది ప్రభుత. ఇలాటివి రెండు మూడు జరిగితే 'నాన్నా, పులి' కథలా అవుతుంది.
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)