హైద్రాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌస్‌లో ఓ యువతిపై కొందరు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారన్న వార్త అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఘటన కలకలం సృష్టించింది. ఆ ఘటన మరువకముందే మరో హేయమైన ఘటన వెలుగు చూసింది. ఈసారి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని విజయవాడలో చోటుచేసుకుంది.
కొందరు యువకులు ప్రేమ పేరుతో యువతుల్ని నమ్మించి, వారికి మత్తు మందిచ్చి వారితో బ్లూ ఫిలింస్ రూపొందించి అమ్ముకుంటున్నారు. బాధితురాలైన ఓ యువతి కుటుంబ సభ్యులు విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో, పోలీసులు ‘ఆపరేషన్’ చేపట్టారు. ఆపరేషన్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు ‘రాకెట్’ నిర్వహిస్తోన్న యువకులు.
బ్లూ ఫిలిం రాకెట్ నిర్వహిస్తోన్న యువకుల్ని పట్టుకున్న పోలీసులు, వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. తల్లిదండ్రులు ఇస్తోన్న స్వేచ్ఛను పిల్లలు దుర్వినియోగం చేస్తున్నారనీ, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండాలని నిందితుల్ని మీడియా ముందు ప్రవేశ పెట్టిన అనంతరం విజయవాడ సీపీ మీడియా ద్వారా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
రాకెట్ నిర్వహిస్తోన్న యువకులు తాము రూపొందించిన నీలి చిత్రాల్ని ఇంటర్నెట్లో విక్రమిస్తుండడం ఇంకా హేయమైన విషయం. ఇదేదో అచ్చం సినిమా స్టోరీలా వున్నా.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే వ్యవహారమిది.