భారతీయసంప్రదాయం ప్రకారం సత్యాన్వేషణే జీవితలక్ష్యం. సత్యమే బ్రహ్మం. సత్యాన్ని కనుగొనడం ఆషామాషీ వ్యవహారం కాదు. తెలియవచ్చిన ప్రతీ అంశాన్ని యిది సత్యమేమో అని పరిశీలిస్తూ 'న యితి, న యితి' (ఇది కాదు, యిది కాదు) అని తిరస్కరిస్తూ పోతే (దీన్నే నేతినేతి (గుణసంధి) వాదం అంటారు) అప్పుడు నికరమైన, నిశ్చలమైన సత్యం ఏదో తెలుస్తుంది. సత్యార్థి అనే పేరున్న కైలాస్ సత్యార్థి నిజరూపమేమిటో నాకు గోచరించకుండా పోయింది. ఒక భారతీయుడి నోబెల్ బహుమతి దక్కడం నిశ్చయంగా ఆనందదాయకం. నోబెల్ బహుమతి ప్రదానంలో జరిగే పథకాలు, పన్నాగాలు ఇర్వింగ్ వాలెస్ బృహన్నవల ''ప్రైజ్''లో ఉదాహరణలతో సహా యిచ్చాడు. అయినా అంతర్జాతీయ బహుమతి బహుమతే. సత్యార్థిగారు చేసిన సంఘసేవ కనబడుతూనే వుంది. మరి యింకా ఎందుకు సందేహం? అంటే అక్కడే వుంది తిరకాసు.
సత్యార్థికి బహుమతి రాగానే ''ద హిందూ''లో అభిమన్యు సింగ్ అని ఒకాయన, యనెస్కోలో తూర్పు ఏసియా వ్యవహారాలు చూసే మాజీ డైరక్టర్‌ట 'ఈ రోజు ఆకాశానికి ఎత్తేస్తున్న కైలాశ్ ఒకప్పుడు మీకు పనికిరాకుండా పోయాడు' అంటూ భారత ప్రభుత్వానికి అక్షింతలు వేస్తూ వ్యాసం రాశాడు. '30 ఏళ్లగా బాలకార్మికుల విముక్తికి శ్రమిస్తున్న అతని కృషి దేశంలో కంటె బయటే బాగా తెలుసు. మా యునెస్కోలో గ్లోబల్ కాంపెయన్ ఫర్ ఎడ్యుకేషన్ ఉద్యమంలో భాగంగా 'ఎడ్యుకేషన్ ఫర్ ఆల్' (ఇఎఫ్‌ఏ) సంస్థకు అతన్ని అధ్యకక్షుణ్ని చేశాం. అతను కొన్ని సమావేశాలు హాజరయ్యాక భారత హ్యూమన్ రిసోర్సెస్ మంత్రిత్వశాఖకు చెందిన సెక్రటరీ స్థాయి అధికారి కైలాశ్‌ను యికపై పిలవద్దని చెప్పినప్పుడు ఆశ్చర్యపడ్డాం. 'అతను ఏ దేశస్తుడన్నది మాకు అనవసరం. అతను చైర్మన్, పిలవక తప్పదు' అని చెప్పాం. కానీ భారతప్రభుత్వం వినలేదు.
'దీనికి కారణం ఏమిటంటే – తమ దేశంలో బాలకార్మికులు వున్నారని ఇండియా ఒప్పుకోవటం లేదు. సత్యార్థి కారణంగా బాలకార్మికులున్నారని ప్రపంచానికి తెలిసిపోతోందని బెంగ. ప్రభుత్వం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాలకార్మికుల సంఖ్య విపరీతంగా వున్న దేశాలలో భారత్ ఒకటని ఐఎల్‌ఓ (ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్) ఎప్పుడో చాటి చెప్పింది. 1991లోనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్టు మైరాన్ వెయినర్ ''ద చైల్డ్ అండ్ ద స్టేట్ ఆఫ్ ఇండియా' అనే తన పుస్తకంలో భారతీయ అధికారగణాన్ని అవహించిన కులజాడ్యం వలననే బాలకార్మిక వ్యవస్థ వర్ధిల్లుతోందని రాశాడు. తివాచీ, బాణసంచా వంటి పరిశ్రమలలో బాలకార్మికుల అవసరం ఎక్కువగా వుందని వాదిస్తూ అధికారులు నిర్బంధ విద్యను అమలు చేయడం లేదని రాశాడు. 2002లో రాజ్యాంగ సవరణ, 2009 నాటి విద్యాహక్కు చట్టం పార్లమెంటు ఆమోదం పొందినా విఫలమవుతున్నాయి. దారిద్య్రం, అధికసంతానం, విద్యాహీనత వంటి కారణాల చేత బాలకార్మిక వ్యవస్థ కొనసాగుతోందన్న వాదనలు ఖండిస్తూ సత్యార్థి 'నిరుద్యోగులు యిందరుండగా బాలకార్మికులను ఎందుకు పెట్టుకోవాలి? తక్కువ జీతాలతో పని చేయించుకోవడానికి కొన్ని స్వార్థశక్తులు చేస్తున్న శుష్కవాదనలివి.' అంటారు. ఆయన మాటలను యునెస్కోలో మేమంతా శ్రద్ధగా విని గౌరవిస్తాం. కానీ దేశంలో ఆయన మాటలకు గౌరవం లేదు.' అని రాశాడు అభిమన్యు.
ఇది చదివాక మన ప్రభుత్వధోరణిపై బాధపడ్డాను. ఆ అమెరికన్ ఎనలిస్టు భారతీయ అధికారులకున్న కులతత్వం చేతనే బాలకార్మిక వ్యవస్థ కొనసాగుతోందన్నా, సత్యార్థి తక్కువ జీతాలకోసమే నడుస్తోందన్నా నేను ఒప్పుకోను. ఆ వ్యవస్థకు గల కారణాలు అనేకం. జీవనప్రమాణాలు పెరిగితే తప్ప ఆ దుర్మార్గపు వ్యవస్థ పోదు. అది సులభంగా జరిగేది కాదు. సత్యార్థి ఆలోచనలు ఎలా వున్నా ఆయన ఆ వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేస్తూంటే సహకరించవలసినది పోయి, ప్రభుత్వం అతన్ని దుష్టుడి కిందో, దుర్మార్గుడి కిందో చూసి యునెస్కోకు పంపకపోవడం అన్యాయం కదా అనుకున్నాను. ఇది చదివిన నెల్లాళ్లకు ఆంధ్రభూమిలో చలసాని నరేంద్ర అనే జర్నలిస్టు 'నోబెల్ బహుమతి రాజకీయ అస్త్రమా?' పేర ఒక వ్యాసం రాసి బహుమతిప్రదానంలో గతంలో జరిగిన మతలబుల గురించి రాశారు. సత్యార్థి గురించి రాస్తూ భారతదేశంలో కార్మికచట్టాలను కఠినతరం చేసి, అమెరికా కంపెనీలకు మన దేశంలోని ఉత్పత్తులు పోటీ కాకుండా చేయడం కోసం అమెరికా చేసిన ప్రయత్నాలకు సత్యార్థి బాసటగా నిలిచినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
అమెరికా ఆమోదించిన బాలకార్మిక నిరోధక చట్టం, 1992ను తయారు చేయడానికి సత్యార్థి సమాచారం అందజేశాడు. 'భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాలకార్మికుల వినియోగం వలన సరుకులు తక్కువ ధరకు ఉత్పత్తి అవుతున్నాయని, వాటిని అమెరికా వంటి ధనికదేశాలు దిగుమతి చేసుకుంటే అక్కడ మాంద్యం ఏర్పడి నిరుద్యోగులు పెరుగాతరని' ఆ చట్టం రెండవ అధికరణలో వుందట. దాన్ని నివారించడానికి ఇండియాలో పరిశ్రమలు తనిఖీ చేసి, అక్కడ బాలకార్మికులు లేరని నిర్ధారణ చేసే అధికారాన్ని ఎన్‌జిఓ (స్వచ్ఛంద సంస్థ)లకు ఆ చట్టం ప్రకారం కట్టబెడుతోంది. అంతే 1994లో సత్యార్థి రుగ్మార్క్ అనే ఎన్‌జిఓ ఏర్పాటు చేసి పాశ్చాత్య కంపెనీల తరఫున అటువంటి తనిఖీలు చేస్తూండేవాడు. ఈ రుగ్మార్క్‌కు జర్మన్ ప్రొటెస్టెంట్‌లు పెట్టిన 'బ్రెడ్ ఆఫ్ ద వరల్డ్' ఆర్థిక వనరులు యిచ్చింది. తన వెబ్‌సైట్‌లో 'పేదలకు అనుకూలంగా రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయడం మా లక్ష్యం' అని పేర్కొన్న ఆ సంస్థ నిధులతో పలుదేశాలలో చర్చిలు రాజకీయ సమస్యలు సృష్టించినట్లు విక్లీక్స్ వెబ్‌సైట్ తెలిపిందట. సత్యార్థి తన ఎన్‌జిఓకు రుగ్మార్క్ నుండి గుడ్‌వేవ్ ఇంటర్నేషనల్‌గా పేరు మార్చారట. ఎగ్జిక్యూటివ్ బోర్డులో అత్యధికులు క్రైస్తవులే, కనీసం యిద్దరు ఫారినర్స్‌ట. సత్యార్థికి వచ్చిన అనేక అవార్డులు అమెరికా, ఐరోపా దేశాలకు చెందినవే. రాబర్డ్ ఎఫ్. కెనడీ అవార్డు, డిఫెండర్ ఆఫ్ డెమోక్రసీ అవార్డు అమెరికా యిచ్చింది. 1992 నాటి చట్టం రూపకర్త టామ్ హర్కిన్ డెమోక్రాటిక్ పార్టీ వాడు. అతను సత్యార్థి అమెరికాకు చేసిన మేలు గురించి ఒబామాకు చెప్పి సత్యార్థి పేరును నోబెల్ బహుమతికి సిఫార్సు చేశాడట. సత్యార్థి 50 వేలమంది బాలకార్మికులకు విముక్తి కలిగించానని చెప్పుకుంటాడు కానీ వారి వివరాలు యివ్వలేదని విక్లీక్స్ వార్త.
భారత ఆర్థిక ప్రయోజనాలను దెబ్బ తీయడానికై బాలకార్మికుల పేర పాశ్చాత్య కంపెనీలు ఆడుతున్న నాటకంలో సత్యార్థి ఒక పాత్రధారి అని ఆ వ్యాసం చదివితే నాకు అర్థమైంది. నిజానిజాలు నాకు తెలియవు కానీ సత్యార్థిపై నాకు ఆసక్తి నశించింది. అందుకే గతవారం ఆయన నోబెల్ పుచ్చుకుంటుంటే నాకు న్యూస్ చూడాలనిగాని, ఏం మాట్లాడాడో వినాలనిగాని అనిపించలేదు. అందుకే అభినందించాలని తోచటం లేదు. ఆయన నిజంగా మంచివాడుగా తేలితే అప్పుడు చూసుకోవచ్చు, ప్రస్తుతానికి ఫింగర్స్ క్రాస్‌డ్.
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)