విశాఖకు రైల్వే జోన్ హుళేక్క…

ఈస్ట్‌కోస్ట్ జోన్ వత్తిడికి తలొగ్గిన బోర్డు మెగాసిటీకి మరో అన్యాయం Advertisement మెగాసిటీ, నంబర్ వన్ సిటీ అంటూ ఎన్ని ముద్దు పేర్లు పెట్టి పిలిచినా విశాఖపట్నానికి అన్యాయం మాత్రం చేస్తూనే ఉన్నారు. ఆర్ధిక…

ఈస్ట్‌కోస్ట్ జోన్ వత్తిడికి తలొగ్గిన బోర్డు
మెగాసిటీకి మరో అన్యాయం

మెగాసిటీ, నంబర్ వన్ సిటీ అంటూ ఎన్ని ముద్దు పేర్లు పెట్టి పిలిచినా విశాఖపట్నానికి అన్యాయం మాత్రం చేస్తూనే ఉన్నారు. ఆర్ధిక రాజధాని, సాంస్కృతిక రాజధాని అంటూ ఎంతగా పొగిడినా ఈ నగరానికి హక్కుగా రావాల్సినవి కూడా రాకుండా పోతున్నాయి. ఇందుకు స్ధానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం, అసమర్థతలనే ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులతో మెజారిటీ ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు కావడం వల్ల వారు స్దానికంగా ఉన్న సమస్యలపై మనస్పూర్తిగా పోరాటం చేయలేకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వారు పుట్టిన ప్రాంతాలకు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నారన్న నిందలూ ఉన్నాయి. అవి నిజాలుగా జరుగుతున్న పరిణామాలు తెలియచేస్తున్నాయి. 

విషయానికి వస్తే, విశాఖ రైల్వే జోన్ సమస్య ఈనాటికి కాదు, దశాబ్దాల నాటిది. రైల్వే జోన్ ఏర్పాటుచేయాలని ఎంతగానో డిమాండు ఉంది. దానికి తగిన వనరులు కూడా విశాఖపట్నానికి ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ తరువాత మరో మహా పట్టణంగా ఉన్న విశాఖలోనే రెండవ జోన్ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన కూడా చాన్నాళ్లుగా ఉంది. అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మరో జోన్ అవసరం కూడా ఉందన్న వాదనలూ గతంలో గట్టిగా వినిపించారు. అయితే, అది ఎక్కడపడేసిన గొంగళి అన్నట్లుగా ఆగిపోయింది. విభజన తరువాతనైనా విశాఖపట్నానికి మోక్షం లభిస్తుందని, న్యాయంగా రావాల్సిన జోన్ వస్తుందని అంతా భావించారు. 

కొత్త ప్రభుత్వాలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కొలువుతీరి అపుడే ఆరు నెలల కాలం ముగిసింది. అయినా కూడా విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించి అతీ గతీ లేకుండా పోయింది. ఇపుడు ఏకంగా రైల్వే జోన్ విశాఖకు రాకుండా కూడా రైల్వే బోర్డు కొర్రీలు వేస్తూ నివేదిక తాజాగా సమర్పించేసింది. అంటే, విశాఖకు రైల్వే జోన్ ఉత్త మాట అన్నది ఆచరణలో తేలిన వాస్తవమన్నమాట.  విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుచేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. రాజధానిని విజయవాడలో ఏర్పాటుచేస్తూ ప్రకటన చేసిన సందర్బంగా విశాఖకు వరాల జల్లు కురిపించిన సీఎం ఈ మేరకు ఈ హామీ ఇచ్చారు. ఇది జరిగి కూడా నాలుగు నెలలు గడచిపోయింది. ఇక, విశాఖ ఎంపీగా గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె హరిబాబు కూడా రైల్వే జోన్ విశాఖకు కచ్చితంగా వస్తుందని ఎంతో నమ్మకంగా చెప్పారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. 

విశాఖతో విద్యార్ధిగా ఉన్నప్పటి నుంచి సంబంధ బాంధవ్యాలను పెనవేసుకున్న కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు కూడా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుచేయాలని కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పడిన తొలి నాళ్లలో ఏకంగా అప్పటి రైల్వే మంత్రి సదానందగౌడను తన ఛాంబర్‌కు పిలిపించుకుని మరీ గట్టిగా చెప్పారు. ఇలా బాధ్యత గలిగిన సీఎం, కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ తలో విధంగా ప్రయత్నాలు చేసినప్పటికీ, రైల్వే బోర్డు ఎందుకు అటువంటి నివేదిక ఇచ్చిందన్న దానిపై సమాధానం లేకుండా పోయింది. రైల్వే మంత్రి నాయకత్వం కింద పనిచేసే రైల్వే బోర్డు నివేదికను ఏ విధంగా వ్యతిరేకంగా ఇస్తుంది, అసలు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన రైల్వే మంత్రిత్వ శాఖేక ఇష్టం లేదా, లేక ఇతర రాష్ట్రాల వత్తిడికి రైల్వే శాఖ లోనై ఇలా చేస్తోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

 ప్రస్తుతం విశాఖలోని వాల్తేరు డివిజన్ ఈస్టు కోస్టు రైల్వే జోన్ పరిథిలో ఉంది. ఆ జోన్ పరిథిలో ఉన్న నాలుగు డివిజన్లలో అత్యధిక ఆదాయాన్ని తెచ్చే జోన్‌గా ఉంది. ఏటా దాదాపుగా ఏడు వేల కోట్ల పై చిలుకు ఆదాయం ఒక్క వాల్తేరు జోన్ నుంచే వస్తోంది. దేశంలో కూడా అత్యధిక ఆదాయాలు తెచ్చే డివిజన్లలో వాల్తేరు రెండవ, మూడవ స్ధానంలో ఉంది. ఈ విధంగా చూసుకుంటే వాల్తేరు డివిజన్‌ను వదులుకోవడం ఈస్టు కోస్టు రైల్వే జోన్‌కు ఎంతమాత్రం ఇష్టంలేదన్నది స్పష్టమవుతోంది. ఎందుచేతనంటే బంగారు బాతుగుడ్డు లాంటి వాల్తేరు డివిజన్ లేకుండా ఈస్ట్‌కోస్టు జోన్ నడవడం చాలా కష్టం. ఇది తప్పితే మిగిలిన మూడు డివిజన్లు కూడా జోన్‌లో నష్టాలే చూపిస్తున్నాయి. 

ఈ కారణంగా ఏకంగా ఒడిషా సర్కారే రైల్వే బోర్డుపై వత్తిడి తీసుకువచ్చి మరీ వాల్తేరు డివిజన్‌ను  ఈస్టుకోస్టు రైల్వే జోన్ నుంచి తప్పించవద్దని శత విధాలుగా ప్రయత్నాలను చేసింది. ఇక, హైదరాబాద్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విషయానికి వస్తే అక్కడ అధికారులకు కూడా విశాఖను రైల్వే జోన్‌గా ప్రకటించడం ఇష్టంలేనట్లుగా తెలుస్తోంది. పైగా, సౌత్ సెంట్రల్ జోన్‌లో ప్రస్తుతం ఉన్న గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లను వేరు చేసుకోవడం కూడా వారికి నచ్చడంలేదని తెలుస్తోంది. అందువల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే విభజన తరువాత కూడా ఆయా డివిజన్లను తమ జోన్‌లోనే ఉండేలా చూసుకుంటున్నారు. ఇపుడు ఒడిషా రాష్ట్రంలో వాల్తేరు డివిజన్ ఉండగా లేనిది మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉంటే తప్పేమిటన్న వాదన కూడా వారి నుంచి ఉంది. 

దీంతో, ఎంతో శక్తిమంతులైన ఒడిషా ప్రజా ప్రతినిధులు, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అధికారులు రైల్వే బోర్డుపై వత్తిడి తీసుకురావడం వల్లనే విశాఖ రైల్వే జోన్ వెనక్కు పోయిందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరి, పొరుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, అధికారులు చేసిన వత్తిళ్లను అడ్డుకుని విశాఖకు రైల్వే జోన్‌ను తీసుకురావడంలో స్ధానిక ప్రజా ప్రతినిధులు ఘోరంగా విఫలమయ్యారని కూడా విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఢిల్లీలోని కేంద్ర సర్కార్‌లో అపరిమితమైన పలుకుబడి ఉంది. ప్రధాని మోడీకి ఇష్టం లేకపోయినా తాను అనుకున్నట్లుగా సుజనా చౌదరిని కేంద్ర మంత్రిని చేశారు. మరి, తాను విశాఖకు ఇచ్చిన హామీ మేరకు రైల్వే జోన్ కావాలని పట్టుపడితే  అది క్షణాలలో అమలు జరిగితీరదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. 

అంతే కాదు, కేంద్రంలోని మోడీ సర్కార్‌లో కీలక స్ధానంలో ఉన్న వెంకయ్యనాయుడు సైతం డిమాండు చేస్తే రైల్వే జోన్ ఎపుడో వచ్చేసేదని అంటున్నారు. ఇక, విశాఖ నుంచి బీజేపీ తరఫున గెలిపిన ఎంపీ, ఆయన ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు కూడా అటువంటి హరిబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్ధానంలో రైల్వే జోన్ ఏర్పాటుచేస్తే ఆ ఘనత ఎన్‌డిఎ సర్కార్‌కే కదా దక్కుతుంది, ఆ విధంగా రాజకీయ మైలేజేని చూసుకున్నా కూడా క్షణం కూడా ఆలస్యం కాకుండా ప్రకటన వచ్చి తీరాల్సి ఉంది. మరి, ఇన్ని రకాలుగా అనుకూలతలు ఉన్నా కూడా రైల్వే బోర్డు తన నివేదికలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిందంటే ఇది కావాలని చేసిందా లేక, అందరికీ తెలిసి జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కాగా, దీనిపై స్ధానికంగా ఉద్యమాలు చేసేందుకు కూడా పలు సంఘాలు సిద్ధమవుతున్నాయి. విభజన తరువాత అన్ని విధాలుగా నష్టపోయిన విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటుతోనే న్యాయం జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉదాశీనత విడనాడి ఇప్పటి నుంచే గట్టిగా యత్నిస్తే వచ్చే బడ్దెట్ సమావేశాలలో రైల్వే జోన్ ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. లేకపోతే మెద్యమం చేసైనా సాధించుకుంటామని హెచ్చరిస్తున్నారు.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం,