ఎమ్బీయస్‌: స్పార్టకస్‌ – 4/5

స్పార్టకస్‌ విప్లవం ఎలా విఫలమయిందో నవలా రచయిత రాయలేదు కాబట్టి చరిత్ర యేం చెప్తోందో కాస్త చెప్తాను. క్రీ.పూ.73లో 700 మంది అనుచరులతో స్పార్టకస్‌ విప్లవం లేవదీశాడు. బానిసలు వెసూవియస్‌ పర్వతానికి పారిపోయారు. వాళ్ల…

స్పార్టకస్‌ విప్లవం ఎలా విఫలమయిందో నవలా రచయిత రాయలేదు కాబట్టి చరిత్ర యేం చెప్తోందో కాస్త చెప్తాను. క్రీ.పూ.73లో 700 మంది అనుచరులతో స్పార్టకస్‌ విప్లవం లేవదీశాడు. బానిసలు వెసూవియస్‌ పర్వతానికి పారిపోయారు. వాళ్ల సైన్యం 70 వేలకు చేరుకుంది. అయితే అందులో చాలామంది స్త్రీలు, పిల్లలు. వసంతకాలం వచ్చేనాటికి గాల్‌ దేశం వైపుకి సాగింది స్పార్టకస్‌ సేన. అక్కడ సెర్టోరియస్‌ సాగిస్తున్న తిరుగుబాటుకి సహాయంగా నిలుద్దామనుకున్నాడు. కానీ అతని అనుచరులు అతనితో కలిసి రాలేదు. బానిసల్లో క్రమశిక్షణ లేకపోయింది. పగ, ప్రతీకారంతో స్పార్టకస్‌ వద్దన్నా వినక దోపిడీలు సాగించారు. స్పార్టకస్‌ అనుచరుల ఒత్తిడికి లొంగాడు. అదే అతని తప్పిదం. క్రమంగా గాల్స్‌, జర్మన్స్‌ స్పార్టకస్‌నుండి విడిపోయారు. విజయాలతో అందరికీ ధైర్యాలు పెరిగాయి. ఎప్పుడు కావాలంటే అప్పడు దేశం విడిచి వెళ్లవచ్చు, ఈ లోపుగా యజమానుల ఐశ్వర్యాలు దోచుకుందామనుకున్నారు. యుద్ధాల్లో పాల్గొనని 10 వేల మంది బానిసలు మాత్రం ఆల్‌ప్స్‌ పర్వతాలు దాటారట. 

క్రాసస్‌ను ఓ సారి ఓడించిన స్పార్టకస్‌ క్రీ.పూ. 71 లో అతని చేతిలో ఓడిపోయాడు. బ్రిందిసీ వైపుకి పారిపోతూండగా స్పార్టకస్‌ పట్టుబడ్డాడు. సిలారస్‌ నది వద్ద స్పార్టకస్‌ చంపబడ్డాడు. అతను మరణించాక అతని ఖైదీలుగా దొరికిన రోమన్‌ సైనికుల సంఖ్య 3 వేలు. వాళ్లకు అతను ఏ హానీ చేయలేదు. కానీ స్పార్టకస్‌ అనుచరులుగా దొరికిన 6 వేల పై చిలుకు బానిసలను క్రాసస్‌ కొరత వేయించాడు. వాళ్ల ప్రాణాలు పోయినా వాటిని కిందకు దింపనివ్వలేదు. ఏళ్ల తరబడి అవి కొయ్యలకు వేళ్లాడుతూనే వున్నాయి. అదన్నమాట నాగరికుల లక్షణం! ఉత్తర దిక్కుకు పారిపోయిన 5 వేల మంది బానిసలను యుద్ధం నుండి తిరిగి వస్తున్న పాంపీ అనే సేనాని పట్టుకుని నాశనం చేశాడు. దాంతో బానిసల యుద్ధం క్రెడిటంతా పాంపీకు పోయింది. 

కానీ స్పార్టకస్‌ కథను చరిత్రలోంచి ఎవరూ తుడిపి వేయలేకపోయారు. ప్లూటార్కుతో సహా  ఐదుగురు చరిత్రకారులు అతని గురించి చెప్పారు. ఆధునిక యుగంలో స్పార్టకస్‌ అనేకమంది విప్లవకారుల మన్ననలు పొందాడు. కార్ల్‌ మార్క్‌స్‌ అతను తన హీరో అన్నాడు. షె గువేరా కూడా. అమెరికాలో బానిసత్వాన్ని రూపుమాపడానికి స్పార్టకస్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు. కథల్లో, సినిమాల్లో, మ్యూజికల్స్‌లో స్పార్టకస్‌ నిలిచిపోయాడు. నేనిప్పుడు చెబుతున్న ఈ నవలను 1960లో సినిమాగా తీశారన్నాను కదూ. 2004లో టీవీ సినిమాగా కూడా తీశారు. 'గ్లాడియేటర్స్‌' అనే పేర ఆర్థర్‌ కోష్లర్‌ ఓ నవల రాశాడు. గిబ్బన్‌ కూడా ఓ నవల రాశాడు. దాని పేరు స్పార్టకస్సే! గియో వాగ్నొలీ అనే ఇటాలియన్‌ రచయిత 1874లోనే స్పార్టకస్‌ అనే చారిత్రాత్మక నవల రాశాడు. వాటిలో కొన్నిటిని మ్యూజికల్స్‌గా మలిచారు. చరిత్రలో యుద్ధం 3 సంవత్సరాలు జరిగినట్టుంది కానీ ఈ నవలలో నాలుగేళ్లు యుద్ధం జరిగిందన్నాడు హోవర్డ్‌ ఫాస్ట్‌. అలాగే అతని వెనుక వున్నవాళ్లు 45 వేల బానిసలు మాత్రమే నన్నాడు. ఆయనకు ఆధారాలేమున్నాయో మరి. 

ఇప్పుడు మళ్లీ కథలోకి వద్దాం – 

స్పార్టకస్‌ చేతికి ఇద్దరు రోమన్‌ సైన్యాధికారులు చిక్కినపుడు వాళ్లను ఏం చెయ్యాలా అన్న ప్రశ్న వచ్చింది. డేవిడ్‌ అనే యూదుడు వీళ్లిద్దరిమధ్యా ద్వంద్వయుద్ధం పెట్టి యిద్దరినీ చంపాలని సూచించాడు. స్పార్టకస్‌కి అది యిష్టం లేకపోయినా ఆ శిక్ష అమలు చేశాడు. రోమన్‌ సేనాపతులను అలా అవమానించినందుకు క్రాసస్‌ పగ తీర్చుకున్నాడు. స్పార్టకస్‌ ఓడిపోయాక దొరికిన వారిలో 100 మంది మల్లులను శిలువ వేయకుండా వుంచి మళ్లీ వాళ్ల మధ్య ద్వంద్వయుద్ధాలు ఏర్పాటు చేయించాడు. ఇద్దరిలో ఒకళ్లు చచ్చేదాకా అవి సాగాలి. బతికినవాడితో మరో మల్లుడు యుద్ధం చేయాలి. అది చూసి రోమన్లు కేరింతలు కొట్టాలి. అవి నిర్వహించడానికి బేటియాటస్‌ మాత్రం లేడు. విప్లవం చెలరేగాక అతని గ్రీకు బానిస అతని పీక కోసి చంపేశాడు. మూడు నెలలపాటు మల్లయుద్ధాలు సాగాక చివరికి ఒక్క మల్లుడు మిగిలాడు. యాదృచ్ఛికంగా అతను యూదుడే. అతనే ఆ డేవిడా? అని తెలుసుకుందామంటే అతను నోరు విప్పలేదు. అతన్ని శిలువ వేశారు. ఆ వేడుక చూడడానికి క్రాసస్‌ స్వయంగా అక్కడికి విచ్చేశాడు. 

ఈ క్రాసస్‌కు స్పార్టకస్‌ భార్య మీద మోహం పుట్టింది. అంతటి మహావీరుడు వరించిన స్త్రీని అనుభవించాలని అతని కోరిక. ఆమె కూడా భర్తతో బాటు భుజం కలిపి పోట్లాడింది కదా, అందుకని గ్లామర్‌ కూడా తోడయింది. స్పార్టకస్‌ చనిపోగానే క్రాసస్‌ బానిస స్త్రీల వద్దకు వెళ్లాడు. వారిలో వరీనియాను గుర్తుపట్టాడు. అప్పుడే పుట్టిన ఆమె బిడ్డను ఓ సైనికుడు చంపేయబోతూంటే వారించాడు. ఆమెను తన భవంతికి తరలించాడు. వరీనియాను క్రాసస్‌ శ్రద్ధగా చూసుకుంటూ ఆమె ప్రేమను గెలుచుకోవాలని ప్రయత్నించాడు. అయితే ఆ విషయాన్ని రహస్యంగా వుంచాడు. బయటి ప్రపంచానికి వరీనియా ఏమయిందో తెలియదు. బానిసయుద్ధంలో 22 వేల మంది స్త్రీలను పట్టుకున్నారు. అందులో 12 వేల మందిని సైన్యమే కొట్టేసింది. ఈ అపఖ్యాతి పోగొట్టుకోవడానికి దోపిడిలో తనకు వచ్చిన భాగాన్ని క్రాసస్‌ ప్రభుత్వానికే యిచ్చేశాడు. దానివల్ల అతను ఉదారంగా వ్యవహరించినట్టు పేరు వచ్చింది. నిజానికి అప్పట్లో అతను రోమ్‌లో కెల్లా భాగ్యవంతుడు. 

ఈ వరీనియాగురించి గ్రాఛూస్‌కి కూడా ఆసక్తి వుంది. గ్రాఛూస్‌ గురించి చెప్పాను కదా. కింది స్థాయినుండి పైకి ఎదిగిన రాజకీయ నాయకుడు అతను. స్పార్టకస్‌పై ౖక్రాసస్‌ ప్రత్యక్ష యుద్ధం చేస్తే అతను పరోక్ష యుద్ధం చేశాడు. సెనేట్‌కు నాయకత్వం వహించి, క్రాసస్‌కు ఆదేశాలిచ్చినవాడు అతనే. వరీనియా అదృశ్యంపై అతను ఆరాలు తీస్తున్నాడు. చివరికి తనకు తెలిసిన ఓ ఛోటా నాయకుణ్ని ఆ పనిపై నియోగించాడు. ఆ నాయకుడి పేరు ఫ్లేవియస్‌. బానిసలను శిలువ వేసినచోట కూచుని వచ్చేపోయేవారికి టూరిస్టు గైడ్‌లా వాళ్ల గురించి కథలు చెప్పి పొట్ట పోసుకుంటున్నాడు. మూడువారాలు తిరక్కుండా ఫ్లేవియస్‌ కబురు మోసుకొచ్చాడు – వరీనియా క్రాసస్‌ యింట్లోనే వుందని! గ్రాఛూస్‌ ఆమెను క్రాసస్‌నుండి కొనేద్దామనుకున్నాడు. అతను సామూహిక స్నానశాలకు వెళ్లే సమయం చూసి తనూ అదే సమయానికి వెళ్లి క్రాసస్‌తో మాట కలిపాడు. 'నీ దగ్గిరున్న వరీనియాను నా కమ్మేయ్‌. నేను పదిలక్షలు యిస్తాను.' అన్నాడు.

క్రాసస్‌ తన దగ్గిర వరీనియా వుందని ఒప్పుకోలేదు. గ్రాఛూస్‌ ఇరవై లక్షలిస్తానన్నాడు. 'నీతో మాట్లాడను' అంటూ వెళ్లిపోయాడు క్రాసస్‌. నిజం చెప్పాలంటే క్రాసస్‌ను వరీనియాను బాగానే చూసుకుంటున్నాడు. ఆమెను బలాత్కారం చేయలేదు. నన్ను ప్రేమించు ఆమెను బతిమాలాడు. కానీ 'నేను స్పార్టకస్‌ను తప్ప వేరెవరినీ ప్రేమించలేదు, ప్రేమించను' అని స్పష్టంగా చెప్పేసింది వరీనియా. 'ఏమిటి అతనిలో గొప్పతనం? రోమ్‌ను సర్వనాశనం చేయ సమకట్టినవాడిపట్ల ఇంత ప్రేమా?' అంటాడు క్రాసస్‌. 

'మమ్మల్ని బానిసలు చేసిన రోమ్‌పై నాకే ప్రేమా లేదు. స్పార్టకస్‌ ఆధ్వర్యంలో వెలిసిన ఆ బానిసల రాజ్యంలో ఆ నాలుగేళ్లలో సమిష్టి గోదాములుండేవి. వాటికి తాళాలుండేవి కావు. స్వంత ఆస్తి అంటూ వుండేది కాదు. పేదరికం అంటే, భవిష్యత్తు అంటే భయం వుండేది కాదు. మీరు చెప్పుకునే ఈ రోమ్‌ వైభవం మానవుల్లో అసమానత్వంపైనే వర్ధిల్లుతోంది. దానిలో భాగమైన నిన్ను నేను ప్రేమించలేను.' అంది వరీనియా. (సశేషం) (ఫోటో – గ్లాడియేటర్ల యుద్ధాన్ని రోమన్లు ఆనందించే చిత్రం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2016)

[email protected]

Click Here For Archives