రోజుల్లో ఎయిర్‌లైన్సు వ్యాపారమే నష్టదాయకంగా వుంది. 'జెట్' ఎయిర్‌లైన్సు ప్రమోటర్, 51% వాటాదారు, చైర్మన్ అయిన నరేష్ గోయల్ తన వాటాను పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.2000 కోట్లకు తనఖా పెట్టాడు. కింగ్‌ఫిషర్ సంగతి చెప్పనే అక్కరలేదు. స్పైస్‌జెట్ కూడా అంతే. ప్రజాధనం వెచ్చించి ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్లు అడుగుతున్నారు. అంత చేటుగా డిస్కౌంట్లు యివ్వనేల? యిప్పుడీ ఆర్తనాదాలేల? కిట్టుబాటుకాని చౌకధరలు ప్రకటిస్తూన్నపుడు ఋణదాతలు అభ్యంతరం తెలిపి వుంటే యీ పరిస్థితి వచ్చేది కాదేమో! స్పైస్ జెట్ ఎయిర్‌లైన్సు విషయానికి వస్తే అది ఆర్థికపరమైన కష్టాల్లో యీదుతోంది. బ్యాంకులు, ఆయిల్ కంపెనీలు, ఎయిర్‌పోర్టు ఆపరేటర్లు యికపై అప్పులు, అరువులు యివ్వమనడంతో ఫ్లయిట్లు కాన్సిల్ చేయకతప్పని పరిస్థితి వచ్చింది. 57 విమానాలతో 230 షెడ్యూల్డ్ రూట్లలో నడుపుతూ వస్తున్న స్పైస్‌జెట్ నవంబరు మధ్య నుండి సుమారు 2000 ఫ్లయిట్లు కాన్సిల్ చేసింది. దాంతో ప్రయాణీకులకు ఆ ఎయిర్‌లైన్సుపై నమ్మకం పోయింది. ఆ కంపెనీ అధినేత కళానిధి మారన్ దాన్ని కష్టాల్లోంచి బయట పడేస్తాడా లేదా అన్నదే ఎవరికీ తెలియటం లేదు. అజయ్ సింగ్ అనే అతను స్థాపించి, చైర్మన్‌గా వున్న కంపెనీలో అది ఆర్జిస్తున్న లాభాలు చూసి 2010లో మారన్ సన్ గ్రూపు ద్వారా రూ. 940 కోట్లు పెట్టుబడి పెట్టాడు.
2011 మార్చి నాటికి రూ.101 కోట్లు లాభంలో వున్న కంపెనీ మారన్ రూ. 800 కోట్లు ఖర్చు పెట్టి అనవసరంగా విస్తరించడంతో ఏడాది తిరిగేసరికి రూ.606 కోట్లు నష్టం మూటగట్టుకుంది. అయినా 2012లో అతను 27 బంబార్డియర్ క్యూ-400 ఎయిర్‌క్రాప్టులు కొని, వీటితో చిన్న పట్టణాలకు కూడా సర్వీసులు విస్తరిస్తాం అని చెప్పుకున్నాడు. తక్కువ రేట్లతో నడిపే ఎయిర్‌లైన్సు పరిమితమైన రూట్లలో ఎక్కువ సర్వీసులు నడిపితేనే కిట్టుబాటు అవుతుంది. రూట్లు పెంచుకుంటే వాటికి సరిపోయినంత డిమాండ్ లేక కొన్ని సీట్లు ఖాళీగా వుండిపోతాయి. మారన్ దూకుడు వలన 2014 మార్చి నాటికి కంపెనీ రూ.1003 కోట్ల నష్టానికి చేరుకుంది. స్వదేశీ, విదేశీ ఋణదాతలకు రూ. 2000 కోట్లు బాకీ వుంది. బ్యాంకులకు, ఆయిల్ కంపెనీలకు, ఎయిర్‌పోర్టు ఆపరేటర్లకు కలిపి రూ.1700 కోట్లు బాకీ పడింది. వడ్డీ రేట్లు తక్కువగానే వున్నా కంపెనీ వడ్డీ కూడా కట్టలేని పరిస్థితికి వచ్చింది.
భారతదేశంలో అత్యంత ధనికుల జాబితాలో 38 వ పేరు కళానిధి మారన్‌ది. అతని పేరు మీదే రూ.14500 కోట్ల ఆస్తి వుంది. అతని సన్ టివికి టీవీ మార్కెట్లో 69% వాటా వుంది. అదే గ్రూపుకి చెందిన జెమిని (తెలుగు) టివికి 44%, ఉదయ (కన్నడ)కు 40% వాటా వుంది. సన్ టివి విలువ రూ.10000 కోట్లు వుంటుంది. మారన్, అతని భార్య కావేరీ జీతాల రూపేణా 2013-14లో రూ. 60 కోట్లు ఆర్జించారు. ఇంత డబ్బున్నవాడు తన కంపెనీని మునిగిపోనిస్తాడా అని కొందరనుకుంటున్నారు కానీ అతని వరస చూస్తే పట్టించుకునేట్లు లేడు. 2014 ఆగస్టు నుండి యితరులను పెట్టుబడి పెట్టమని అడుగుతున్నాడు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు 1.6% వాటాను రూ.13.41 కోట్లకు అమ్మచూపాడు. రాకేశ్ రూ. 11 కోట్లు యిచ్చి సరిపెట్టాడు. ఎందుకంటే స్పైస్‌జెట్ మార్కెట్ కాపిటలైజేషన్ 2008లో రూ.2500 కోట్లు వుండగా 2014 నవంబరు నాటికి అది రూ.710 కోట్లకు పడిపోయింది. క్రికెట్ టీముల విషయంలో మారన్ ఘోరంగా నష్టపోయాడు. సిబిఐ చీఫ్ పదవి నుండి రంజిత్ సిన్హా తప్పుకున్నాడు కాబట్టి, యుపిఏ ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి ఎయిర్‌సెల్-మాక్సిల్ కేసుల్లో కళానిధి, దయానిధి జైలుకి వెళ్లే ప్రమాదం వుందన్న భయంతో ఫైనాన్షియర్లు ఋణం యివ్వడానికి ముందుకు రావడం లేదు.
అందుచేత యీ కంపెనీని ఆదుకోవడం ప్రభుత్వబాధ్యత అంటున్నాడు మారన్. తన డబ్బు తీసేలా కనబడటం లేదు. ఈ మొర విని, సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గజపతి రాజు మారన్ నుండి హామీ తీసుకుని స్పైస్ జెట్‌కు రూ. 600 కోట్ల వర్కింగ్ కాపిటల్ లోన్లు యివ్వమని డిసెంబరు 16 న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను కోరాడు. దాంతో బాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను 15 రోజుల అరువు యిమ్మన్నాడు. ఎయిర్‌లైన్సు వాళ్లు ముందే బుకింగ్‌లు చేసేస్తూ డబ్బు తక్షణం కట్టించేసుకుంటారు కదా. స్పైస్‌జెట్ అలా 30 రోజులకు మించి ఫ్యూచర్ బుకింగ్స్ చేయకూడదని డిసెంబరు 5 న డిసిజిఎ ఆర్డర్ పాస్ చేసింది. అయితే అశోక్ గజపతి రాజు మార్చి 2015 వరకు బుకింగ్స్ చేసుకోవచ్చని వెసులుబాటు యిచ్చారు. ఇవన్నీ ఫలించకపోతే మారన్‌ను తప్పించి యిప్పటికీ 4.5% వాటా కలిగివున్న అజయ్ సింగ్‌ను మళ్లీ చైర్మన్‌గా తీసుకుని వచ్చి బాధ్యతలు అప్పగించవచ్చు అని వార్తలు వస్తున్నాయి.
-ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2015)