వీరమ్‌గామ్ నుండి గాంధీ భార్యాసమేతంగా కలకత్తా వెళ్లాడు. ఫిబ్రవరి 17 న కలకత్తా దగ్గర్లో వున్న బోల్‌పూర్‌లో రవీంద్రనాథ్ టాగూర్ నడుపుతున్న శాంతినికేతన్ చూడబోయాడు. గాంధీ, అతని భార్య వెళ్లేసరికి ఠాగూరు లేడు. ఆయన వేరే వూరు వెళ్లాడు. గాంధీ వెళ్లిన రెండు రోజులకు పూనాలో గోఖలే మరణించినట్లు టెలిగ్రాం వచ్చింది. వెంటనే అతను పూనాకు ప్రయాణం కట్టాడు. గాంధీ వచ్చి వెళ్లిన సంగతి తెలిసిన సంగతి తెలిసిన ఠాగూరు యిద్దరికీ మిత్రుడైన సి.ఎఫ్. ఆండ్రూస్‌కు లేఖ రాస్తూ ''ఐ హోప్ దట్ మహాత్మా అండ్ మిసెస్ గాంధీ హేవ్ ఎరైవ్‌డ్ యిన్ బోల్‌పూర్'' అని గాంధీని తొలిసారిగా మహాత్మా అని పేర్కొన్నాడు. ఇక ఆ విశేషణం గాంధీకి వచ్చి చేరింది. (ఠాగూరు, గాంధీ కలిసినపుడు గాంధీ ఠాగూరును 'మహాకవీ' అన్నాడనీ, దానికి ప్రతిగా ఠాగూరు గాంధీని 'మహా ఆత్మా' అన్నాడనీ, అంతకు మించి విశేషం ఏమీ లేదనీ ఒక పాఠకుడు రాశారు. ఠాగూరుకి వున్న బిరుదు మహాకవి కాదు, విశ్వకవి. ఆ స్థాయి కవీంద్రుడు మర్యాదకైనా వ్యర్థంగా పదాలు, విశేషణాలు వాడరు. దక్షిణాఫ్రికాలో గాంధీ సత్యాగ్రహోద్యమం గోఖలే వంటి వారినే కదిలించింది. ఠాగూరు కవి కాబట్టి చక్కగా వ్యక్తీపరచారు. ఆయన వాక్కు వృథా పోలేదు). గురువుగారు గోఖలేకి అంజలి ఘటిస్తూ సంతాపసూచకంగా 1915 ఫిబ్రవరి 20 నుండి తాను ఏడాది పాటు పాదరక్షలు ధరించనని గాంధీ ప్రకటించాడు. పూనా నుండి మళ్లీ శాంతినికేతన్‌కు మార్చి 6 న వచ్చేసరికి అప్పటికి ఠాగూరు వున్నాడు. ఇద్దరూ కలిసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు తమ పనులు తామే చేసుకోవాలనీ, తమ టాయిలెట్లు తామే శుభ్రపరచుకోవాలనీ గాంధీ ఉపన్యసిస్తే 'అది తర్వాతి విషయం, ముందు చదువుపై శ్రద్ధ చూపండి చాలు' అని ఠాగూరు అన్నారు. గాంధీ ఉపన్యాసాన్ని పురస్కరించుకుని శాంతినికేతన్‌లో యిప్పటికీ మార్చి 6 ను శుభ్రతాదినంగా పాటిస్తారు.
కలకత్తాలోని కాళీ మందిరం చూడడానికి వెళ్లిన గాంధీ అక్కడి అశుభ్రతను, జంతుబలిని అసహ్యించుకున్నాడు. అక్కణ్నుంచి వారణాశి వెళ్లి అక్కడ రాజ్యమేలుతున్న మురికిని చూసి భరించలేకపోయాడు. కాశీ విశ్వనాథుని మందిరంలో ఎక్కడా చూసినా చెత్త వుండడం, అక్కడి పూజారులు దక్షిణ కోసం భక్తులను పీడించడం చూసి రోత పుట్టింది. పూజారి వేధింపు తట్టుకోలేక దక్షిణగా ఒక పైస యిచ్చాడు గాంధీ. పూజారి దాన్ని విసిరికొట్టి ''నాకు చేసిన యీ అవమానానికి నువ్వు నరకానికి పోవడం తథ్యం'' అని శపించాడు. ''నా నుదుటిపై ఏం రాస్తే అదే జరుగుతుంది కానీ, మీలాటి పండితుల నోట అలాటి మాటలు రాకూడదు'' అని చెప్పేసి గాంధీ బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత వారణాశి మూడుసార్లు వెళ్లినా విశ్వనాథ మందిరం వైపు తొంగి చూడలేదు. నూరేళ్లు గడిచాయి, ఇప్పటికీ కాళీఘాట్ గానీ, వారణాశి గానీ వెళ్లాలంటే భయం, అసహ్యం కలుగుతాయి. 'గంగను శుద్ధి చేస్తున్నామని 30 ఏళ్లగా చెపుతూ అపారమైన నిధులు ఖర్చు చేశారు. ఇప్పటిదాకా ఏం సాధించారు చెప్పండి' అని సుప్రీం కోర్టు నిలదీస్తే కేంద్రప్రభుత్వం గుడ్లు తేలవేస్తోంది.
వారణాశి నుండి గాంధీ హరిద్వార్ వెళ్లాడు. అక్కడ కాంగ్డీ గురుకులంలో మహాత్మా మున్షీరామ్‌ను కలిసి ఆయన నడుపుతున్న స్కూలును చూశాడు. ఉపాధ్యాయులతో, విద్యార్థులతో కలిసి మాట్లాడాడు. స్కూలులో యిండస్ట్రియల్ ట్రైనింగ్ పెడితే బాగుంటుందేమోనని సూచించాడు. హరిద్వార్‌లో కొన్నాళ్లు వుండి రామకృష్ణ మిషన్‌లోని సన్యాసులతో కలిసి చర్చించాడు. హరిద్వార్‌లో గడ్డాలు పెంచిన దొంగ సాధువులు భక్తులను భక్తి పేరుతో దోపిడీ చేయడమూ గమనించి ఖేదపడ్డాడు. అక్కడ వుండగానే ఏప్రిల్ 10 న – యికపై రోజులో ఐదు ఆహారపదార్థాల కంటె ఎక్కువ సేవించనని, సూర్యాస్తమయం తర్వాత ఏమీ తిననని ఒట్టేసుకున్నాడు. జీవితాంతం అది పాటించాడు. మున్షీరామ్‌కు గాంధీ వరస నచ్చింది. హరిద్వార్‌లో శాశ్వతనివాసం ఏర్పరచుకోమని చెప్పాడు. 'ఇక్కడి వాతావరణం బాగుంది. వారణాశి కంటె గంగానది స్వచ్ఛంగా వుంది. కానీ దేశంలో నేను చేయవలసినది చాలా వుంది' అంటూ గాంధీ వినమ్రంగానే తిరస్కరించాడు.
హరిద్వార్ నుండి గాంధీ మద్రాసు ప్రయాణం కట్టాడు. ఏప్రిల్ 17 న చేరాడు. అక్కడ పచ్చయప్ప కాలేజీలో విద్యార్థులను, ప్రొఫెసర్లను కలిశాడు. పాత మద్రాసులోని షావుకారు పేటలో ఒక లైబ్రరీ ప్రారంభించాడు. రనడే హాలులో అతని ఉపన్యాసం ఏర్పాటు చేశారు. తర్వాత వైఎంసిఎలో సన్మానసభ జరిగింది. ఆ సభలో గాంధీ ప్రసంగిస్తూ ''నేను ప్రొబేషనరీ పీరియడ్‌లో వుంటూ నేర్చుకునే థలో వున్నాను. మహానుభావుడు గోఖలే ఆదేశానుసారం సర్వెంట్స్ ఆఫ్ ఇంతీడాయ సొసైటీ ఖర్చుతో తిరుగుతున్నాను. మీరు నాపై ఔదార్యంతో కురిపించిన ప్రశంసలకు తగను. కానీ మాతృదేశానికి సేవ చేసి ఆ అర్హత సంపాదించుకోవడానికై నేను నిరంతరం శ్రమిస్తాను.'' అన్నాడు. ఆ తర్వాత బెంగుళూరు వెళ్లి మే 11 నాటికి అహ్మదాబాదు చేరాడు.
ఈ విధంగా గాంధీ పశ్చిమ, తూర్పు, ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాలను చూశాడు. దారిలో ఎంతోమందితో ముచ్చటించాడు. దేశంలోని దారిద్య్రాన్ని కళ్లారా చూశాడు. ప్రజల వేదనలను, ఆశలను, వారి పరిమితులను అర్థం చేసుకున్నాడు. వారికి బోధపడే భాష ఏమిటో తెలుసుకున్నాడు. ఈ ప్రయాణాల తర్వాతనే అతను పరిమిత వస్త్రాలను ధరించ నారంభించాడు. విదేశీయుల్లో కొందరు 'ఆఫ్ నేకెడ్ ఫకీర్' అని యీసడించినా 'నా దేశంలో అనేకమంది ప్రజల ఆర్థికస్థితికి యిది దర్పణం' అని సమాధానం చెప్పాడు. ''గాంధీ'' సినిమాలో రిచర్డ్ ఎటెన్‌బరో యీ ప్రయాణఘట్టాన్ని హృదయానికి హత్తుకునేట్లు చిత్రీకరించాడు. 1915 సంవత్సరమంతా దేశంలో అనేక ప్రాంతాలు తిరిగి అధ్యయనం చేయడం కారణంగానే గాంధీ నాయకుడు కాగలిగాడు. జాతిపిత కాగలిగాడు. అందుకే ఆ సందర్భాన్ని భారతప్రభుత్వం వేడుకగా జరుపుతోంది. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2015)