1971 ఎన్నికల ఫలితాలు రాగానే పార్టీ కార్యకర్తలు రెండు గజమాలలు తెచ్చారు. ఒకటి కరుణానిధికి, మరొకటి ఎమ్జీయార్‌కు, ఎందుకంటే ఎమ్జీయార్ ప్రచారం చేయడం వలన 100 నియోజకవర్గాలలో డిఎంకెకు అనుకూలంగా ఫలితాలు మారి వారంతా నెగ్గారు. మాల వేయించుకోవడానికి కరుణానిధి వున్నాడు కానీ ఎమ్జీయార్ లేడు. అతను జయలలితతో కలిసి నేపాల్ వెళ్లి తననెవరూ గుర్తుపట్టకుండా బురఖా ధరించి తిరుగుతున్నాడు. సినిమా షూటింగుకై కాదు, విహారానికి! ఇంత ముఖ్యమైన సమయంలో తను వుండాలని ఎమ్జీయార్‌కు తోచలేదా? అతను ఏం చెప్పినా జయలలిత వినేది కాదు, అలక పూని తను చెప్పినట్టు ముక్కు పట్టుకుని ఆడించేది. తిరిగి వచ్చాక మంత్రి పదవి గురించి జయలలితే అడిగించిందని పార్టీలో అందరి నమ్మకం. ఎమ్జీయార్‌కు ఆప్తుడు, జయలలిత పేరు చెపితే మండిపడే ఆర్ఎం వీరప్పన్ ''మొత్తం మంత్రివర్గం ఏర్పడడానికి కారణభూతుడైన కింగ్‌మేకర్ తన కోసం ఆఫ్టరాల్ మంత్రిపదవి అడగడం ఎంత చిన్నతనం? జయలలితకు అదేం తోచదు. అడగమంది. మరో ఆలోచన లేకుండా ఎమ్జీయార్ అడిగేశాడు. జయలలిత నిన్ను అడిస్తోందని మేం ఎన్నోసార్లు ఎమ్జీయార్‌కు చెప్పాం. వినేవాడు కాదు.'' అని ఓ సారి చెప్పాడు. ఈ విషయం కరుణానిధికి కూడా తెలుసు కాబట్టి తన కంటె 30 ఏళ్లు చిన్నదైన జయలలిత వ్యామోహంలో పడి తిరుగుతూ వుంటాడని తనతో పేచీ పెట్టుకోకుండా సినిమాలకే పరిమితమవుతాడనీ కరుణానిధి లెక్క వేసి వుండవచ్చు.
ఎమ్జీయార్‌ను ముగ్ధుణ్ని చేసి తన వెంట తిప్పుకున్న జయలలిత గురించి యిక్కడ చెప్పుకోవాలి. మొట్టమొదటగా చెప్పుకోవలసినది ఆమె మూలాల గురించి. కణ్నగి శాపం తర్వాత మద్రాసు (తమిళనాడు)ను తమిళేతరులే పాలించారని కొందరు అంటూంటారు కానీ అది నిజం కాదు. ముఖ్యమంత్రుల్లో అచ్చమైన తమిళులు చాలామంది వున్నారు. జయలలితను తమిళేతరుల జాబితాలో వేస్తారు. అదీ తప్పే. ఆమె శ్రీరంగానికి చెందిన తమిళ అయ్యంగారు బ్రాహ్మణ (కులం పేరు ప్రస్తావించడానికి కారణం వుంది, డిఎంకె పార్టీ ఆమెను కులం పేరు పెట్టి అనేకసార్లు యీసడించింది, ఆమె దానికి దీటుగా జవాబిచ్చింది) కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె తాతగారు రంగాచారి సర్జన్. మైసూరు మహారాజా ఆస్థానంలో ఉద్యోగం వస్తే మైసూరులో స్థిరపడ్డారు. ఆమె తండ్రి పేరు జయరామ్. తల్లి వేదవల్లి. జయలలిత కర్ణాటకలోనే 1948లో పుట్టింది. మైసూరులో పుట్టింది కాబట్టి ఆమెను కన్నడిగురాలుగా లెక్కవేస్తారు కొంతమంది. కాదు, నేను తమిళురాలినే అని జయలలిత చెప్పుకునేది – రాజకీయాల్లోకి వచ్చాక కాదు, ముందు నుండీ కూడా! 1970లో ఒక కన్నడ పత్రికకు యిచ్చిన యింటర్వ్యూలో ఆ విషయంలో స్పష్టత యిచ్చింది. అది కొందరు కన్నడిగులు హర్షించలేదు. బెంగుళూరులో తమిళ చిత్రం ''గంగా గౌరీ'' (1970) సినిమా షూటింగు సమయంలో కొందరు కన్నడ కార్యకర్తలు చుట్టుముట్టి తను కన్నడిగ అని చెప్పమని, లేకపోతే దాడి చేస్తామనీ ఆమెను బెదిరించారు. కానీ ఆమె బెదరలేదు.
జయలలిత తాత బాగానే ఆస్తులు కూడబెట్టినా ఆమె తండ్రి జయరామ్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి అవన్నీ ఖర్చు పెట్టేశాడు. ఆయనకు జయమ్మ అనే మొదటి భార్య వుండేదని, ఆమె ద్వారా వాసుదేవన్ అనే కొడుకు వున్నాడనీ, ఆయన సామాన్య జీవితం గడుపుతూ మైసూరు తాలూకాలో జీవించి వున్నాడనీ గత ఏడాదే వార్తల్లో వచ్చింది. అతనే కాకుండా బెంగుళూరు నివాసి ఐన శైలజ అనే ఆమె కూడా జయలలిత నా సొంత సోదరి అంటూ టీవీలకు ఎక్కింది. జయలలిత వారిపై పరువునష్టం దావా వేస్తానని బెదిరించింది. ఈ శైలజ పేరు కొత్తగా వినబడుతోంది కానీ జయలలితకు జయకుమార్ అనే ఒక అన్నగారు వున్నమాట వాస్తవం. అతను కుటుంబానికి ఏ విధంగానూ వుపయోగపడినట్లు తోచదు. జీవనం గడవడానికి జయలలిత తల్లి తను సినిమాల్లోకి వెళ్లడమే కాకుండా యిష్టం లేని కూతుర్ని చిన్న వయసులోనే సినిమాల్లోకి నెట్టింది. ఆమె, జయలలిత మాత్రమే కలిసి వుండేవారు. తల్లి మరణం తర్వాత జయలలిత ఒంటరిదై పోయింది. అన్నగారు ఆమె జీవితంలో ప్రమేయం కల్పించుకున్నట్లు తెలియరాలేదు. అతను 1995లో పోయినప్పుడు జయలలిత టి.నగర్‌లోని వాళ్ల యింటికి వెళ్లి పరామర్శించిందట. జయలలిత దత్తతపుత్రుడి వివాహం తర్వాత వదినగారితో, అన్నగారి పిల్లలు దీప, దీపక్‌లతో సంబంధబాంధవ్యాలు పూర్తిగా చెడ్డాయట. బెంగుళూరు హైకోర్టు తీర్పు తర్వాత దీప, ఆమె భర్త మాధవన్ యిటీవల జయలలిత యింటి బయట కనబడ్డారు. జయలలిత వాళ్లను లోపలకి పిలవలేదు.
జయలలితకు తలితండ్రులు పెట్టిన పేరు కోమలవల్లి. ఆమెకు రెండేళ్ల వయసుండగా ఆమె తండ్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. భర్త అకాలమరణంతో 20 ఏళ్ల వేదవల్లి తన తల్లితండ్రులు నివసించే బెంగుళూరుకు వెళ్లి టైపిస్టుగా పనిచేయసాగింది. పిల్లలిద్దర్నీ బెంగుళూరులో మంచి స్కూల్లో చదివించేది. జయలలిత బిషప్ కాటన్ స్కూల్లో చదివింది. వేదవల్లి అక్క అంబుజవల్లి ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తూ విద్యావతి అనే పేరుతో తమిళ సినిమాల్లో వేస్తూ వుండేది. ''నువ్వు మద్రాసులో స్థిరపడి సినిమాల్లో ప్రయత్నించు'' అని చెల్లెల్ని ప్రోత్సహించింది. ఆమె 'సంధ్య' అనే పేరుతో తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించేది. పిల్లలిద్దరినీ మద్రాసులో మంచి స్కూలుకి పంపించింది.
జయలలిత వంటి పబ్లిక్ ఫిగర్ సొంత అన్నగారి గురించి పూర్తి వివరాలు తెలియకపోవడం వింతగానే తోస్తుంది. దానికి కారణం తన విషయాలు బయటకు రావడం జయలలిత యిష్టపడటం లేదు. నిజానికి 1970లలో సినీనటిగా వుండే రోజుల్లో ఆమె తన ఆత్మకథను ఒక తమిళ పత్రికలో సీరియల్‌గా రాయడం మొదలుపెట్టింది కానీ కొందరి ఒత్తిడితో ఆపేసింది. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రముఖస్థానాన్ని ఆక్రమించాక మీడియాను దూరంగా పెట్టడమే కాక, తన గురించి పుస్తకాలు వెలువడడం కూడా రావడం సహించలేకుండా వుంది. తమిళ రాజకీయాల గురించి ''కట్ఔట్స్, కాస్ట్, సినీస్టార్స్'' అనే పుస్తకం రాసిన వాసంతి అనే రచయిత్రి రెండేళ్లు పరిశోధించి ''జయలలిత, ఎ పోర్ట్రయిట్'' అనే పుస్తకం రాస్తే మొదటి పుస్తకాన్ని ప్రచురించిన పెంగ్విన్ వారే రెండో పుస్తకం కూడా వేశారు. పుస్తకం విడుదలయ్యేందుకు నెల ముందు పబ్లిసిటీ కోసం రచయిత్రి 2011 మార్చిలో ఔట్‌లుక్‌కు యింటర్వ్యూ యిచ్చి కొన్ని విషయాలు చెప్పింది. అంతే ఆ పుస్తకం బయటకు రాకూడదంటూ జయలలిత కోర్టులో కేసు వేసింది. ఆ సందర్భంగా కోర్టుకి వెళ్లిన వాసంతిపై జయలలిత లాయర్లు, అభిమానులు ఆరుకోట్ల మంది తమిళుల నాయకురాల్ని అవమానించావంటూ విరుచుకుపడ్డారు. చివరకు 2012 ఆగస్టులో కోర్టు పర్మనెంట్ యిన్జంక్షన్ యిచ్చింది. పుస్తకం చదవకుండానే అది ప్రైవసీ హక్కును హరించిందని, ఆమెకు పరువునష్టం కలిగించిందని కోర్టు ఎలా అభిప్రాయపడిందో అర్థం కాలేదని రచయిత్రి వాపోయినా లాభం లేకపోయింది. పెంగ్విన్ పై కోర్టుకి వెళ్లాలని అనుకోలేదు. ఇప్పటికీ ఫ్లిప్‌కార్ట్ వంటి వెబ్సైట్లలో ఆ పుస్తకం ధర యింత అని చూపిస్తూనే ఔట్ ఆఫ్ స్టాక్ అని రాస్తూంటారు. అందువలన జయలలిత గురించి సేకరించే సమాచారంలో కొన్ని గ్యాప్స్ కనబడతాయి. (సశేషం) ఫోటో – జయలలిత తల్లి సంధ్య
–ఎమ్బీయస్ ప్రసాద్