తమది కాకుంటే కాశీ దాకా డేకించేస్తాం అనే టైపు మన సినిమా జనాలది. నిర్మాతలను గుల్ల చేసి వదుల్తున్నారు. మొన్నటికి మొన్న సమంత నిత్యం నాలుగు వేల విలువైన చేపను లంచ్ కు తీసుకుంటుంది అని తెలిసిందిగా..ఇలాంటి వ్యవహారాలు ఇండస్ట్రీలో చాలా వున్నాయట.
విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా మాంచి పేరు తెచ్చుకున్న ఓ పెద్దనటుడు సినిమా షూటింగ్ కొసం ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు వెళ్లాలంటే, ఒక టికెట్ సరిపోదట. ఆ రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు ఫ్లయిట్ టికెట్ లు కొనిపిస్తాడట. ఎక్కడ కుదిరి, ఏ ఫ్లయిట్ కు వెళ్తాడో ఆయనకే తెలియక ఇలా చేయిస్తాడట.
ఒక్కోసారి ఫ్లయిట్ టికెట్ తో పాటు, ఎందుకయినా మంచిది అని ట్రయిన్ ఫస్ట్ క్లాస్ కూడా తీయిస్తాడట. నిర్మాతలు కిక్కురుమనకుండా తీసి వుంచుతారట. అలాగే బయట నుంచి వస్తాడని తెలిస్తే, ఎప్పుడు, ఏ ఫ్లయిట్ కు వస్తాడో తెలియక, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎయిర్ పోర్టులో ఓ కారు వుంచేస్తారట.
ఇక ఇటీవల విడుదలైన ఓ పెద్ద సినిమాను తమిళంలో కూడా డబ్ చేసారు. అక్కడా భారీగా అడియో ఫంక్షన్ చేసారు. హీరో హాజరు అయితే కావచ్చు..లేదంటే లేదు అనే టైపులో చెప్పాడట. దాంతో తప్పదు కదా. ఫ్లయిట్ టికెట్, చెన్నయ్ లో హోటల్ సూట్ తీసి వుంచారట. కానీ హీరో రాలేదు. లక్షకు పైగా ఖర్చు మాత్రం అయిపోయిందట టికెట్ లకు, సూట్ కు.
తెలుగు, తమిళంలో కాస్త గట్టి సినిమాలే చేసి, రేటు దగ్గర అస్సలు రాజీపడదు అనిపించుకున్న చందమామలాంటి హీరోయిన్ అయితే నిర్మాతలకు షూటింగ్ సమయంలో తన డిమాండ్లతో చుక్కలు చూపించేస్తుందట.
ఏం చేస్తాం..డిమాండ్ వీరిది..అవసరం వారిది. మొత్తం మీద ఇదంతా ప్రేక్షకులు చెమటోడ్చి సంపాందించి టికెట్ రూపంలో ఇచ్చిన సొమ్మేగా.