ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు- 66

ఎమ్జీయార్‌ అస్వస్థతగా వుండి అమెరికా వెళ్లినపుడు, తిరిగి వచ్చాక కూడా అతనికి బదులుగా పాలన సాగించినది నెడుంజెళియన్‌. పరిపాలనా సమర్థుడు, సొంతంగా అవినీతికి పాల్పడనివాడు. ఎమ్జీయార్‌ తన వారసుడితనే అని ప్రకటించకుండా చనిపోయాడు. వీరప్పన్‌,…

ఎమ్జీయార్‌ అస్వస్థతగా వుండి అమెరికా వెళ్లినపుడు, తిరిగి వచ్చాక కూడా అతనికి బదులుగా పాలన సాగించినది నెడుంజెళియన్‌. పరిపాలనా సమర్థుడు, సొంతంగా అవినీతికి పాల్పడనివాడు. ఎమ్జీయార్‌ తన వారసుడితనే అని ప్రకటించకుండా చనిపోయాడు. వీరప్పన్‌, జయలలిత యిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. పార్టీ చీలిపోకుండా చూడడానికి రాజీ అభ్యర్థిగా నెడుంజెళియన్‌ను కొనసాగిస్తారని పరిశీలకులు అనుకున్నారు. 1989 ఎన్నికల వరకు తను ముఖ్యమంత్రిగా ఎమ్జీయార్‌ ఎంపిక చేసిన కాబినెట్‌నే కొనసాగిస్తారని నెడుంజెళియన్‌ కూడా ఆశించాడు. నిజానికి జయలలితను వ్యతిరేకించినవారిలో నెడుంజెళియన్‌ కూడా వున్నాడు. కానీ వీరప్పన్‌కు తనే ముఖ్యమంత్రి కావాలన్న ఆశ పుట్టింది. పార్టీ నిధులన్నీ అతని వద్దే వున్నాయి. నిర్వహణాసమర్థుడు కూడా. ఎమ్జీయార్‌ శవం అక్కడ వుండగానే 30 మంది ఎమ్మెల్యేలు వీరప్పన్‌ ముఖ్యమంత్రి కావాలంటూ ప్రచారం మొదలుపెట్టారు. 

శోకదినాలు పూర్తి అవుతూనేే వీరప్పన్‌ 87 మంది ఎమ్మెల్యేలను బృందంగా ఏర్పాటు చేసి ఒక లగ్జరీ హోటల్‌లో క్యాంపుగా నిర్వహించాడు. చుట్టూ గూండాల రక్షణ. పార్టీ వర్కర్లు కాదు కదా కుటుంబసభ్యులు కూడా కలవడానికి ఫోన్లో మాట్లాడడానికి వీల్లేదు. క్యాంపు నిర్వహణకు రోజుకు రూ.70 వేలు ఖర్చయేది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వున్నప్పటికీ నెడుంజెళియన్‌ వారిలో ఒక్క ఎమ్మెల్యేతో కూడా మాట్లాడలేకపోయాడు. క్యాంపును చెదరగొట్టలేకపోయాడు. అప్పుడు జయలలితతో పొత్తు కుదుర్చుకున్నాడు. అతను ముఖ్యమంత్రిగా కొనసాగడానికి జయలలిత సమ్మతించి, తన తరఫు ఎమ్మెల్యేలను అప్పగించింది. ఈ ఎమ్మెల్యేలందరూ కలిసి ఎమ్జీయార్‌ స్థానంలో జయలలితను పార్టీ జనరల్‌ సెక్రటరీగా ఎన్నుకున్నారు. మొత్తం 24 జిల్లాలలో 14 జిల్లాల సెక్రటరీలు తమకు అండగా వున్నారని చెప్పుకుంది. ఆ హోదాలో లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి నెడుంజెళియన్‌ను నాయకుడిగా ఎన్నికయ్యాడని ప్రకటించింది. ఇద్దరూ కలిసి దాదాపు 32 మంది ఎమ్మెల్యేలను పోగేసి మద్రాసులో ఫైవ్‌స్టార్‌ హోటల్లో 18 రూముల్లో క్యాంపు నిర్వహించారు. వీళ్లకు బెంగుళూరుకు చెందిన పారిశ్రామిక వేత్త ఒకతను ధనసహాయం చేశారు. ఈ సమావేశం చెల్లదంటూ వీరప్పన్‌ వర్గం కోర్టుకి వెళ్లింది.

నెడుంజెళియన్‌కున్న మంచిపేరు గురించి తెలిసిన వీరప్పన్‌ అతన్ని ఓడించాలంటే ఎమ్జీయార్‌ భార్య జానకిని తెరపైకి తేవాలని నిశ్చయించాడు. దివంగత నాయకుణ్ని గౌరవించాలంటే ఆయన జీవనసహచరిని ఆయన స్థానంలో కూర్చోబెట్టాలి అనే నినాదం అందుకున్నాడు. 'మీరు ఒప్పుకోకపోతే జయలలిత ముఖ్యమంత్రి అయిపోతుంది జాగ్రత్త' అని బెదిరించి జానకిని ఒప్పించాడు. ఆమె వీరప్పన్‌ చేసిన ప్రతి పనికి తల వూపింది. అనారోగ్యం కారణంగా ఎమ్జీయార్‌ చాలాకాలం యింటినుంచే పాలన సాగించాడు కాబట్టి ఆమె అందరికీ పరిచితురాలే. ఎమ్జీయార్‌ చేత తిట్లు తిన్న ఎమ్మెల్యేలు, మంత్రులు జానకి వద్దకు వచ్చి మొరపెట్టుకునేవారు. ఆమె అటు ఎమ్జీయార్‌కు, యిటు ఎమ్మెల్యేలకు నచ్చచెపుతూ వుండేది. అందువలన ఎమ్మెల్యేలకు జానకి పట్ల సదభిప్రాయమే వుంది. ఆమెకు ఏదీ చేతకాదనీ, తమ ఆటలు సాగుతాయనీ తెలుసు. పేరుకు ఆమె సింహాసనంపై వున్నా, వీరప్పనే తమ సంగతి చూసుకుంటాడని వారి ధీమా. వాళ్లందరికీ వీరప్పన్‌ 'మా యిష్టప్రకారమే జానకిని లెజిస్లేచర్‌ పార్టీ లీడరుగా ఎన్నుకుంటున్నాం' అనే సైక్లోస్టయిల్‌డ్‌ లేఖలిచ్చి సంతకాలు చేయమన్నాడు. అవి పట్టుకెళ్లి గవర్నరుగా వున్న మాజీ ఐయేయస్‌ సుందరలాల్‌ లాల్‌ ఖురానాకు యిచ్చాడు. 

ఖురానా యీ సందర్భంలో చాలా వింతగా ప్రవర్తించాడు. తనను ముఖ్యమంత్రిని చేసి బలపరీక్షకు ఒక వారం సమయం యివ్వమని కోరిన నెడుంజెళియన్‌ అభ్యర్థనను నిరాకరించి, జానకిని ముఖ్యమంత్రి చేసి మూడువారాల గడువు యివ్వడానికి నిశ్చయించుకున్నాడు. జనవరి 2 న మీడియాను పిలిచి ఆమెను ముఖ్యమంత్రిగా ప్రకటించాడు. నిజానికి ఆమె పక్షాన వున్న ఎమ్మెల్యేలు 87 మందే. వీరప్పన్‌ వారందరినీ డీలక్స్‌ బస్సుల్లో ఎక్కించి గవర్నరు ముందు చూపించాడు. 234 సభ్యులున్న ఎసెంబ్లీలో 87 మంది అంటే సగం కంటె చాలా తక్కువ. వారిని సమర్థిస్తున్నామని 64 మంది సభ్యులున్న కాంగ్రెసు పార్టీ లేఖ యివ్వలేదు. వారు ఎటూ తేల్చుకోలేకుండా వున్నారు. ఎమ్జీయార్‌ కనుమరుగయ్యాక గెలిచే అవకాశం తమకుందా, డిఎంకెకు వుందా అన్న విషయంపై వారికి క్లారిటీ రాలేదు. ప్రధానిగా వున్న రాజీవ్‌ గాంధీకి ఒక్కోరు ఒక్కోలా చెప్పసాగారు. అతనికి అప్పట్లో అతి ముఖ్యమైనది తను శ్రీలంక ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఇండో-శ్రీలంక ఒప్పందానికి  మద్దతు యిచ్చే పార్టీ తమిళనాడులో వుండాలి. ఆ ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు శాంతిసేన (ఐపికెఎఫ్‌) పంపితే దాన్ని కరుణానిధి తీవ్రంగా విమర్శించాడు. ఎమ్జీయార్‌కు టైగర్స్‌ పట్ల స్థిరమైన సిద్ధాంతం లేదు. మారుతూ వచ్చింది. అతని ఎమ్మెల్యేలలో చాలామంది ఒప్పందానికి వ్యతిరేకం. వారిలో ఒకడైన కె కలిముత్తు జానకి వర్గానికి జనరల్‌ సెక్రటరీ అయ్యాడు. వీరప్పన్‌ రాజీవ్‌ను మచ్చిక చేసుకోవడానికి బూటా సింగ్‌, నరసింహారావుల ద్వారా తాము ఒప్పందం అమలుకు సహకరిస్తామని కబురు పంపాడు. 

ఎమ్జీయార్‌ డిఎంకెనుంచి వెళ్లిపోయినప్పుడు ఎమ్మెల్యేలు  అధికారంలో వున్న కరుణానిధితో, కార్యకర్తలు, ప్రజలు ఎమ్జీయార్‌తో వున్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. ఎమ్మెల్యేలు జానకితో వుండగా, కార్యకర్తలు జయలలితవైపు నిలిచారు. వీరిలో ఏ వర్గం అంతిమంగా గెలుస్తుందో తెలియకుండా ఎటు మొగ్గడానికీ కాంగ్రెసు తటపటాయించింది. రాజీవ్‌ జూదం ఆడినట్లుగా గవర్నరు చేత జానకికి ఛాన్సు యిప్పించాడు. జనవరి 7 న ఆమె ప్రమాణస్వీకారం చేసింది. తొలి పత్రికా సమావేశంలోనే ఆమె సత్తా బయటపడింది. చీఫ్‌ సెక్రటరీ నా తరఫున ప్రకటనలు చేస్తారు అని అనేసి కూర్చుంది. 10 లక్షల ప్రభుత్వోద్యోగులకు సంక్రాంతి కానుకగా రూ.350 చొ||న యిస్తామని, దానికి గాను రూ.35 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించాడు. ఆ తర్వాత పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు వీరప్పనే సమాధానాలిచ్చాడు. బలపరీక్ష నిరూపించుకోవాల్సిన జనవరి 23 నాటి సమావేశంలో గందరగోళం నెలకొంది. ఎడిఎంకె చీలిపోయింది కాబట్టి ఎన్నికలు వస్తే తాము లాభపడతామన్న వుద్దేశంలో డిఎంకె జానకి ప్రభుత్వానికి మద్దతు యివ్వలేదు. గత 20 రోజులుగా ప్రభుత్వం నడుస్తున్న తీరు, వీరప్పన్‌ ఉధృతి గమనించిన కాంగ్రెసు బాహాటంగా సమర్థించడానికి వెనకాడింది. కానీ స్పీకర్‌ వీరప్పన్‌ మనిషే కాబట్టి 97 మంది మద్దతుతో ఆమె బలపరీక్షలో నెగ్గింది అని ప్రకటించేసి అసెంబ్లీ వాయిదా వేసేశాడు. ఈ ఆటవిక ప్రభుత్వాన్ని కుర్చీపై కూర్చోబెట్టినందుకు గవర్నరును అందరూ విమర్శించారు. దాంతో రాజీవ్‌ గాంధీ యిరకాటంలో పడ్డాడు. 

ఆ ఏడాది రిపబ్లిక్‌ డే సందర్భంగా యిచ్చే ఎవార్డుల్లో భారతరత్న ఎవార్డును ఎమ్జీయార్‌కు ప్రదానం చేయించి, నాలుగు రోజులు పోయాక 30 న, అంటే ఉత్తుత్తి బలపరీక్ష జరిగిన వారానికి, జానకి ప్రభుత్వాన్ని ఆర్టికల్‌ 356 ఉపయోగించి రద్దు చేసేసి, ఎన్నికలు ప్రకటింపచేశాడు. భారతరత్న యిస్తూనే ఆయన భార్య ప్రభుత్వాన్ని రద్దు చేయడమేమిటి అని కొందరు ప్రశ్నించారు. రెండూ వేర్వేరు విషయాలన్న సంగతి వారికి ఎందుకు తోచలేదో తెలియదు. ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎమ్జీయార్‌ పట్ల సానుభూతి ఒక అంశం కాబోతుంది కాబట్టి 'మా కాంగ్రెసు భారతరత్న ప్రదానం ద్వారా ఎమ్జీయార్‌ పట్ల గౌరవం ప్రకటించింది.' అని చెప్పుకోవడానికి ఎవార్డు యిచ్చారు. జానకి ప్రభుత్వానికి మెజారిటీ లేదు కాబట్టి, వేరే ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా లేదు కాబట్టి ప్రభుత్వాన్ని రద్దు చేశారు.  (సశేషం)  ఫోటో – ''మోహిని'' (1948) నాటి సినిమాలో ఎమ్జీయార్‌, విఎన్‌ జానకి 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015)

[email protected]

Click Here For Archives