రజనీకాంత్‌..డ్యామేజీ కంట్రోల్‌ అయినట్టేనా మరి!

చెన్నై వరద బాధితుల కోసం ఏకంగా పదికోట్ల రూపాయలను డొనేషన్‌గా అందించాడు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. ఇతర సినిమా హీరోలు, క్రికెట్‌ ఆటగాళ్ళు.. మరే సెలబ్రిటీలూ అందించనంత స్థాయి మొత్తాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి…

చెన్నై వరద బాధితుల కోసం ఏకంగా పదికోట్ల రూపాయలను డొనేషన్‌గా అందించాడు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. ఇతర సినిమా హీరోలు, క్రికెట్‌ ఆటగాళ్ళు.. మరే సెలబ్రిటీలూ అందించనంత స్థాయి మొత్తాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేశాడు రజనీకాంత్‌. తను సూపర్‌ స్టార్‌ను అని… ఎవరికీ అందనంత స్థాయి మొత్తాన్ని విరాళంగా ఇచ్చాన్న సందేశాన్ని ఇచ్చాడు ఆయన. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఇది రెండో విడతలో ప్రకటించిన మొత్తం!

తొలి విడతలో తమిళ సూపర్‌ స్టార్‌ చెన్నై వరద బాధితులకు ఇచ్చింది కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే! చాలా మంది సినిమా వాళ్లు స్పందించారు.. చెన్నై వరదల తీవ్రతో కడుపు తరుక్కుపోయి.. వాళ్లు బాధితుల కోసం డబ్బును డొనేట్‌ చేశారు. ఈ డొనేషన్లలో ఎవరెంత ఇచ్చారు.. అనే అంశం ప్రేక్షకుల్లో బాగా చర్చనీయాంశం అయ్యింది. కేవలం తమిళనాడు ప్రజలకే కాకుండా. ఏపీ ప్రజలు కూడా ఈ అంశాన్ని ఆసక్తిగా గమనించారు. తమ అభిమాన తారల్లో ఎవరెంత ప్రకటించారనే లెక్కలను వాళ్లు పరిశీలించారు. ఈ పరిశీలనలతో.. రజనీకాంత్‌పై మత్రం విమర్శల వర్షం కురిసింది. సూపర్‌ స్టార్‌.. దక్షిణాదిలోనే టాప్‌ హీరో అనే బిరుదు ఉన్నా ఆయన ఇచ్చింది కేవలం పదిలక్షలేనా! అనే ఆశ్చర్యాలు వ్యక్తం అయ్యాయి.

తెలుగులో నిన్న మొన్న తెరపైకి వచ్చిన హీరోలు తమిళనాడు కోసం పాతిక లక్షల రూపాయల స్థాయి డొనేషన్లు ఇస్తే.. తమిళ ఇండస్ట్రీలో రజనీ ముందు చోటాలు అనుకొనే హీరోలు ఐదారు కోట్ల రూపాయల స్థాయి విరాళాలు ఇస్తే.. సూపర్‌ స్టారు మాత్రం పదిలక్షల రూపాయలు విధిల్చి తన కక్కుర్తిని చాటుకున్నాడా..! అనే కామెంట్లు వినిపించాయి. ఒకవైపు రజనీ సినిమాలు కోట్లకు కోట్ల రూపాయలు వసూలు చేసుకొంటుంటాయని అంటున్నారు. ఆ వసూళ్లలో రజనీకే ఎక్కువ ముడుతుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. మరి అలాంటి రజనీ ఇచ్చింది పదిలక్షలేనా! అనే విమర్శలూ వచ్చాయి. దీంతో రజనీ నష్ట నివారణకు దిగినట్టుగా ఉన్నాడు. కళ్లు చెదిరే పదికోట్ల రూపాయల విరాళంలో అందరికీ సమాధానం ఇచ్చాడు. మరి… ఈ పది కోట్లతో డ్యామేజీ కంట్రోల్‌ అయినట్టేనా?!