అసెంబ్లీలో దుశ్శాసనపర్వం జరగడంతో పాంచాలీ శపథం లాటిది చేసి, ఆడవాళ్ల చేత కన్నీరు కార్పించి జయలలిత అధికారంలోకి వచ్చేసింది అన్నంత సింపుల్‌గా కథ జరగలేదు. అవతల వున్నది 'అనేక యుద్ధముల నారితేరిన' యోద్ధ కరుణానిధి. పరాభవం సింపతీ జయలలిత కుంటే పదవీభంగం సింపతీ అతని కుంది. పైగా అతను బిసి కార్డును విచ్చలవిడిగా వుపయోగించాడు. నీతివంతుడనే తేజోచక్రం తల వెనుక వెలుగుతున్న విపి సింగ్ అతనికి అండగా నిలిచాడు. నిజానికి విపి సింగ్ ప్రభుత్వం పడిపోయి, కాంగ్రెసు, ఎడిఎంకెల మద్దతుతో చంద్రశేఖర్ అధికారంలోకి రాగానే కరుణానిధికి గుండెదడ ప్రారంభమైంది. తమిళనాడులో శాంతిభద్రతలు బాగా లేవని, టైగర్లు విచ్చలవిడిగా తిరుగుతున్నారని చంద్రశేఖర్ తనకు హెచ్చరికలు పంపుతూండగానే తెలిసిపోయింది – యీ పేరు చెప్పి తన ప్రభుత్వానికి ఎసరు పెడతాడని. పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తించాడు. కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసేముందు వందసార్లు ఆలోచిస్తామని చంద్రశేఖర్ పార్లమెంటులో హామీ యిచ్చాడు కానీ కరుణానిధి నమ్మదలచుకోలేదు. ఎన్నికలు వచ్చే నెలలోనే వచ్చి పడతాయన్నంత హడావుడి చేస్తూ విపి సింగ్‌తో కలిసి ఊళ్లు తిరిగాడు. 850 కి.మీ.ల ప్రయాణంలో 12 వూళ్లలో సభలు ఏర్పాటు చేస్తే 10 లక్షల మంది దాకా వచ్చారు.
వాళ్లిద్దరూ చెప్పేది ఒకటే – విపి సింగ్ బిసిల కోసం మండల్ కమిషన్ రిపోర్టు అమలు చేస్తే దాన్ని అడ్డుకోవడానికి, బిసి వ్యతిరేకి అయిన కాంగ్రెసు, ఎడిఎంకె విపి సింగ్‌ను పడగొట్టి చంద్రశేఖర్‌ను కూర్చోబెట్టాయి. అంతేకాదు, బిసి, ఎస్సీలకు అండగా నిలిచిన డిఎంకె ప్రభుత్వాన్ని పడగొట్టడానికి టైగర్ల బూచిని చూపిస్తున్నాయి అని. ద్రవిడ పార్టీలకు మొదటి నుండి మద్దతు యిస్తున్నవి బిసి వర్గాలే కాబట్టి యీ ప్రచారం వాళ్లను ఆకట్టుకుంది. దీనితో బాటు ఓటర్లకు గాలాలు వేయడం కూడా జరిగింది. అక్టోబరు నెల చివర్లో ధనిక, పేద రైతుల తేడా లేకుండా అందరి పంపు సెట్లకు విద్యుత్ ఉచితం అన్నాడు. రేషన్ షాపుల్లో బియ్యం ధర కిలో రూ.3.25 నుండి 2.50కు తగ్గించాడు. ఆదిద్రావిడులకు చౌకగా 2512 యిళ్లు సమకూరుస్తానన్నాడు. జనవరిలో రథయాత్ర చేస్తానని, ఆ రథం ఆకారం తను వారి కోసం కట్టించబోయే చౌక యింటి షేపులో వుంటుందని చెప్పాడు.
దీన్ని ఎదుర్కోవడానికి జయలలిత వద్ద నాయకత్వపటిమ లోపించింది. మాటిమాటికీ ఎవరికీ కనబడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయే అలవాటు ఆమె మాన్పుకోలేక పోయింది. ఎప్పుడో ఒకప్పుడు గబుక్కున బయటకు రావడం, ప్రెస్ మీట్ పెట్టి ఫలానాఫలానా వాళ్లని పార్టీలోంచి తీసేశానని ప్రకటించడం ఆమె ట్రేడ్‌మార్క్ అయిపోయింది. ఈమెను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని కావేరి యీదినట్లే అనుకున్నారు ఆమె అనుచరులు. బ్యాచ్‌బ్యాచ్‌లుగా విడిచి వెళ్లిపోయేవారు. ఆగస్టులో అలాగే ఒకసారి 30 మంది పార్టీ సభ్యులను తీసేసింది. వారిలో మాజీమంత్రులు తిరునావిక్కరసు, కోదండవేలుతో బాటు యిద్దరు ఎమ్మెల్యేలు కెకె రామచంద్రన్, ఉగమ్‌చంద్ కూడా వున్నారు. ఈ ప్రకటన తిరునావిక్కరసు పుట్టినరోజు సందర్భంగా వెలువడడంతో అక్కడ వున్న ఆమె వాల్‌పోస్టర్ల మీద అతని అనుచరులు పేడముద్దలు కొట్టారు. తర్వాత పార్టీ హెడాఫీసు స్వాధీనం చేసుకోవడానికి రెండు వర్గాలు కొట్లాడుకున్నాయి. పోలీసులు అందర్నీ అరెస్టు చేశారు. తిరునావిక్కరసును తన పార్టీలో చేర్చుకోవడానికి కరుణానిధి ప్రయత్నించాడు. అప్పటికే ఎమ్జీయార్‌కు అనుయాయి అయిన కాళిముత్తును లాక్కున్నాడు. అసెంబ్లీ సెషన్ ప్రారంభం కాగానే తిరనావిక్కరసు, రామచంద్రన్, ఉగమచంద్‌లతో కూడిన గ్రూపును ఎడిఎంకె -2గా స్పీకరు తమిళ కుడిమగన్ గుర్తించాడు. ఈ గుర్తింపు ప్రకటించగానే ఎడిఎంకె సభ్యులు స్పీకరుపై దాడి చేశారు. స్పీకరు వాళ్లను ఆ సెషనే కాదు, వచ్చే సెషన్‌కు కూడా బహిష్కరించేశాడు.
ఇలాటి పరిస్థితుల్లో చంద్రశేఖర్ కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకున్నాడు. శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా వుందని గవర్నరు ఎస్‌ఎస్ బర్నాలాను కోరాడు. అతను అకాలీదళ్ లీడరు. కాంగ్రెసు వ్యతిరేకి. డిఎంకె సానుభూతిపరుడు. అందువలన రిపోర్టు పంపనన్నాడు. (…రిపోర్టు తెప్పించుకుని.. అని ముందు భాగంలో రాసినది తప్పు) రివాజు ప్రకారం అలాటి రిపోర్టు లేనిదే రద్దు చేయరు. అయినా చంద్రశేఖర్ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతి వెంకట్రామన్‌కు తన సిఫార్సు పంపాడు. డిఎంకె చేతిలో చిత్తయిన కాంగ్రెసు పార్టీకి చెందిన వెంకట్రామన్‌కు ఎలాటి శంకలూ పెట్టుకోకుండా సరేననేశాడు. ప్రభుత్వం రద్దయిపోయి, రాష్ట్రపతి పాలన విధించారు. జయలలిత ఢిల్లీ వెళ్లి ఆ పని సాధించుకుని రావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం పెల్లుబికింది. మద్రాసు ఎయిర్‌పోర్టుకి వెయ్యిమంది కార్యకర్తలు వచ్చి ఆమెను ఊరేగింపుగా తీసుకెళ్లారు. మర్నాటి నుంచి ఎడిఎంకె, కాంగ్రెసు గవర్నరుకు పిటిషన్లపై పిటిషన్లు యిస్తూ పోయారు. ఫలానా ఆఫీసరు డిఎంకె సానుభూతిపరుడని, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే అతన్ని తీసేసి ఫలానా వాణ్ని వేయాలని ఒత్తిడి తేసాగారు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు రంగం సిద్ధమైందని గ్రహించగానే తన బిసి కార్డు మరింత విస్తృతంగా వుపయోగించసాగింది. తమ సర్కారు రద్దుకు వెనక్కాల బ్రాహ్మల, యితర అగ్రవర్ణాల కుట్ర వుందని డిఎంకె నాయకుడు నాంజిల్ మనోహరన్ ఆరోపించాడు. వెంకట్రామన్, కామర్స్ మంత్రి సుబ్రహ్మణ్యం స్వామి, జయలలిత బ్రాహ్మణులు. చంద్రశేఖర్ రాజ్‌పుట్. చిదంబరం, ఇంటెలిజెన్సు చీఫ్ ఎంకె నారాయణన్ అగ్రవర్ణులు. రాజీవ్ గాంధీ తండ్రి పార్శీ, తల్లి బ్రాహ్మణి. వీరంతా కలిసి బిసిలు, హరిజనులు, మైనారిటీలు డామినేట్ చేస్తున్న డిఎంకెను అణచివేస్తున్నారని ప్రచారం సాగింది. రద్దుకు వ్యతిరేకంగా జరిగిన బంద్ సందర్భంగా 25 వేల మంది కార్యకర్తలు అరెస్టయ్యారు. విపి సింగ్ కేరళలో పర్యటించాక జిల్లా కౌన్సిల్ ఎన్నికలలో ఎల్‌డిఎఫ్ గెలిచింది. అలాటి ఫలితమే యిక్కడ వస్తుందన్న ఆశతో డిఎంకె విపి సింగ్‌ను స్టార్ కాంపెయినర్‌గా పెట్టుకుంది.
జూన్‌లో జరగబోయే ఎన్నికలకై కూటములు ఏర్పడ్డాయి. 234 అసెంబ్లీ స్థానాల్లో జయలలిత 70% స్థానాలు 168 తీసుకుని కాంగ్రెసుకు 65, ఐసి (సోషలిస్టు)కు 1 వదిలింది. పార్లమెంటుకు వచ్చేసరికి 39 లో 30% సీట్లు అంటే 11 తీసుకుని కాంగ్రెసుకు 28 యిచ్చింది. ఈ పొత్తు గురించి రాజీవ్ మూపనార్‌తో ఒక్క మాట కూడా చెప్పలేదు. దీని ప్రకటన కూడా ఢిల్లీ నుంచి వెలువడింది. చంద్రశేఖర్‌కు చెందిన జనతా (ఎస్) తనను కూడా భాగస్వామిగా చేర్చుకోమంది కానీ జయలలిత నో అనేసింది. అందరూ కలిసి కుట్రపన్నారన్న కరుణానిధి కథనం రుజువు చేసినట్లవుతుందని భయపడింది. డిఎంకె కూటమిలో డిఎంకెకు 176 సీట్లు, సిపిఎంకు 22, సిపిఐకు 10, జనతా దళ్‌కు 11, టిఎంకెకు 11 యిచ్చారు. జనతా దళ్‌కు తమిళనాడు యూనిట్‌కు శివాజీ గణేశన్ అధ్యక్షుడై కరుణానిధితో కలిసి ప్రచారంలో పాల్గొన్నాడు. మరో భాగస్వామి టిఎంకె పార్టీ అనేది డిఎంకె నుంచి విడిగా వెళ్లిన టి. రాజేందర్, ఎడిఎంకె నుండి విడిగా వెళ్లిన తిరునావిక్కరసు వంటి లీడర్లు ఏర్పరచుకున్న పార్టీ. ఈ కూటముల్లో కలవకుండా విడిగా పోటీ చేస్తూ అందరికీ కలవరం పుట్టించినది – పూర్తిగా కులప్రాతిపదికపై ఏర్పడిన పిఎంకె ! (సశేషం) ఫోటో – చంద్రశేఖర్
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2015)