నేను పోటీలకు అతీతం..నాగార్జున

సోగ్గాడే చిన్ని నాయన…నాగార్జున అప్ కమింగ్ మూవీ. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు నాలుగింటిలో, అచ్చమైన తెలుగుదనం కనిపించే సినిమాగా ఇఫ్పటికే మాంచి హైప్ తెచ్చుకుంది. యాభై ఏళ్లు దాటినా ఇంకా జస్ట్ ఫార్టీ అన్నట్లు…

సోగ్గాడే చిన్ని నాయన…నాగార్జున అప్ కమింగ్ మూవీ. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు నాలుగింటిలో, అచ్చమైన తెలుగుదనం కనిపించే సినిమాగా ఇఫ్పటికే మాంచి హైప్ తెచ్చుకుంది. యాభై ఏళ్లు దాటినా ఇంకా జస్ట్ ఫార్టీ అన్నట్లు కనిపించే అదృష్టం సొంతం చేసుకున్న నాగ్ ఈ సినిమాలో మరీ అందంగా కనిపిస్తున్నాడు. తన జనరేషన్ హీరోతో, యంగ్ హీరోలతో పోటీ పడుతూ సంక్రాంతి రేస్ లో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా నాగార్జునతో 'గ్రేట్ ఆంధ్ర' ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూ.

సోగ్గాడే చిన్ని నాయనా..ఈ సినిమా ప్రయాణం ఎలా ప్రారంభమైంది?

నిర్మాత రామ్మోహన్ చిన్న కథ చెప్పారు. రెండు పేజీల కథ. పల్లెటూరిలో బతికే ఇలా బతకాలిరా అనిపించే మైనర్ బాబు లాంటి వాడు. కానీ ఉన్నట్లుండి చిన్న ప్రమాదంలో చనిపోతాడు. అతడు చనిపోయేసరికి భార్య రమ్యకృష్ణ కడుపులో వుంటాడు కుర్రాడు. జాగ్రత్తగా పెంచుతుంది..పల్లెలో వుండకూడదు..పట్నంలో మంచి ఉద్యోగం చేయాలి..ఇలాంటి ఆశలతో. పాతికేళ్లు గడుస్తాయి..డాక్టరేట్ చేసి రీసెర్చ్ చేసే లెవెలకు ఎదుగుతాడు రాముడు మంచి బాలుడు లాంటి కుర్రాడు..పెళ్లవుతుంది. కానీ తన పని తన లోకం తప్ప బాహ్య ప్రపంచం పట్టదు. దాంతో చిన్న చిన్న సమస్యలు.

ఏంటీ సినిమా కథ అంతా ఓపెన్ చేప్పేస్తున్నారు.?

లేదండీ..ఈ సినిమాకు ప్రేక్షకులను ప్రిపేర్ చేయాలి. లేదూ అంటే తీరా థియేటర్ కు వచ్చాక..అదేంటీ ఆ క్యారెక్టర్ అలా..ఆత్మ ఏమిటి? అంటూ కాస్త కిందా మీదా కావచ్చు..అందుకే ఇదీ కథ అని చెబుతున్నా.

అంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా వుంటుందా?

లేదు..చావు..కన్నీళ్లు..ఇలాంటివి ఏవీ వుండవు..అదంతా జస్ట్ నెరేట్ చేసేస్తాం అంతే. అంతే కాదు, పగలు ప్రతీకారాలు, ఇలాంటివి కూడా వుండవు.

అంటే మీ సినిమాలో విలన్ వుండడా?

వుండాడు..కానీ జస్ట్ చిన్న విలన్ అంతే. 

మరి ఇంతకీ సోగ్గాడే చిన్ని నాయనా ఈ టైటిల్ ఏమిటి? నాన్నగారి హిట్ సాంగ్ అనా?

ఒక హీరో సోగ్గాడు..మరో హీరో అతని కొడుకు..చిన్నినాయన. సోగ్గాడే చిన్ని నాయన..సరే ఎలాగూ సూపర్ హిట్ సాంగ్ కూడా వుంది..ఎవర్ గ్రీన్ ట్యూన్ అది. అందుకే కాస్త రీమిక్స్ చేసేసాం.

సంక్రాంతి అంటే ఎడ్ల పందాలు, కొడి పందాలు..కానీ ఈసారి సినిమా పందాలు అన్నట్లుగా వుంది వ్యవహారం. మీరు కూడా ఈ రేస్ లోకి దిగినట్లుగా వుంది.?

అదేం లేదండీ.రెండున్నర నెలల కిందటే ఫిక్స్ అయ్యాము సంక్రాంతికి రావాలని. 

కానీ నాగ్ అంటే డిసెంబర్ లాస్ట్ వీక్ అన్నది ఫిక్స్ అయిపోయింది కదా?

వరుసగా మూడు నాలుగు సినిమాలు వదిలేసరికి అలా అనుకున్నారు అంతా. కానీ మేము మాత్రం సంక్రాంతి అనే ఫిక్సయి వున్నాం. ఆ మేరకు అప్పుడే థియేటర్లు బుక్ చేసేసాం. ఇక రేస్ అంటారా..నాకు ఏ రేస్ లు తెలియవు. నేను ఈ పోటీలు, ఇతరత్రా వ్యవహారాలు అన్నింటికీ దూరం. ఇంకా చెప్పాలంటే వీటన్నింటికి చాలా దూరంగా వచ్చేసాను నేను ఎప్పుడో? నా సినిమా, నా వ్యవహారాలు అంతే, మిగిలినవి అస్సలు పట్టించుకోను.

కానీ థియేటర్ల కోసం చాలా హడవుడి జరుగుతోంది. పొలిటికల్ ప్రభావం కూడా పడిందంటూ వార్తలు వినవస్తున్నాయి.?

అవన్నీ నాకు తెలియదండి. నా మటుకు నాకు క్రీమీ థియేటర్లు ముందుగానే బుక్ చేసుకున్నాను. మరీ కిందుక వెళ్లేసరికి మాత్రం అప్పట్లో కుదరలేదు. అంటే రెండే ధియేటర్లు వుంటాయి చూడండి అలాంటి సెంటర్లన్నమాట. దొరికితే ఇప్పుడు వెళ్తాం. లేకుంటే వారం ఆగి వెళ్తాం. వచ్చిన నష్టం లేదు. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా జనం చూస్తారన్న నమ్మకం వుంది.

ఎన్ని థియేటర్లు దొరికాయి.?

యూజువల్ గా నా సినిమా ఆరు వందల థియేటర్లకు వరకు వేస్తుంటాం..ఇప్పుడు అయిదు వందల వరకు దొరికాయనుకుంటాను. ఇంకా మరి కొన్ని కూడా వస్తాయి.

సోగ్గాడే చిన్ని నాయనా..చాలా వరకు రీషూట్ చేసారని వార్తలు వినిపించాయి.?

చేసాం..నా సినిమాలు అంటే నేను నటించి, నేను నిర్మించే సినిమాలు ఎఫ్పుడూ రీ షూట్ చేస్తాను. షెడ్యూల్ లో వారం రోజులు రీషూట్ కోసం వుంచేస్తాను. మనం సినిమాకు కూడా అలాగే చేసాం.ఒక విషయం అండీ..రీ షూట్ చేసే వాళ్లని మీరు అభినందించాలి. అంతే కానీ, సినిమా ఏదో తేడా వచ్చేసింది..రీ షూట్ చేస్తున్నారు అనడం సబబు కాదు. ఎందుకుంటే సినిమా ఒకసారి థియేటర్లలోకి వదిలేసిన తరువాత, ఇంక ఏం చేసినా ప్రయోజనం వుండదు. మరి అలాంటపుడు, ముందే చూసుకుని, అవసరమైతే రీ షూట్ చేసుకోవడంలో తప్పేముంది? నా మటుకు నేను నా సినిమాను సంబంధం వున్నవాళ్లకి లేనివాళ్లకి కూడా చూపించి ఒపినియన్ తీసుకుంటాను. అది పాటిస్తానా లేదా తరువాత, ముందు అభిప్రాయం తెలుసుకుంటాను. 

మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కదా? భాయ్ ఎందుకలా అయింది?

అది రిపేర్లకు అతీతంగా తయారయింది. మొత్తం పక్కన పడేయాలి. అందుకే మూడు నాలుగు కోట్లు పోతాయని తెలిసీ వదిలేసాం?

మరి మీ సినిమాకు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కదా? అఖిల్ సినిమా అఖిల్ ను ఎందుకు వదిలేసారు?

నమ్మకం. వివి వినాయక్..అంటే ఎంత పెద్ద దర్శకుడు. అందుకే ఆయనపై పూర్తి భరోసా వుంచాం. అదీ కాక, ఆయన వరకు ఆయన అనుకన్నది అనుకున్నట్లు తీసారనే చెప్పాలి. జనం రిసీవ్ చేసుకోలేదంటే అది వేరే సంగతి.

కళ్యాణ్ కొత్త దర్శకుడు. మీకు ఆయనలో కనిపించిన భరోసా ఏమిటి?

టీమ్ వర్క్. మంచి రైటర్. ఇప్పుడు సినిమా నిర్మాణానికి టీమ్ వర్క్ చాలా కీలకం. నేను..నా చుట్టూ గిరిగీసుకుని వుంటాను..అనుకుంటే కుదరదు. రాజమౌళి దగ్గర ఎంతమంది వుంటారు. వాళ్ల డిస్కషన్లు చాలా ఓపెన్ గా వుంటాయి.ఆల్ మోస్ట్ కొట్టుకున్నట్లే. అందుకే మంచి అవుట్ పుట్ వస్తుంది ఫైనల్ గా. 

మధ్యలో బుర్రా సాయి మాధవ్ ను సీన్లోకి తెచ్చినట్లున్నారు.?

ఓ మంచి సీన్ వుంది. మా అవుట్ లుక్ ఒకలా వుంది. అది ఇంకోలా వుంటే ఎలా వుంటుందీ అనిపించింది. పిలిచాం..లైన్ చెప్పాం..ఈ సీన్ చెప్పాం..డిఫరెంట్ గా చెప్పండి అన్నాం. అంతే. అంతే కానీ స్క్రిప్ట్ అంతా మార్పించేసామని, అంతా ట్రాష్.

రమ్యకృష్ణతో చాన్నాళ్ల తరువాత వర్క్ చేసారు. బాహుబలి ముందే అనుకున్నారా..తరువాతనా?

మా కాస్టింగ్ దాదాపు ఏడాదిన్నర కిందటే డిసైడ్ అయిందండీ..చాలా మంచి నటి..మా జోడీ గురించి చెప్పేదేముంది?

గ్రీకువీరుడు, భాయ్, సోగ్గాడే చిన్ని నాయనా ఈ మూడు సినిమాల్లో మూడు గెటప్ లు ట్రయ్ చేసారు. కానీ ఈ సినిమాకే మంచి అప్లాజ్ వచ్చినట్లుంది.?

జనం ప్రెష్ గా ఫీలవుతున్నారండీ. మన తెలుగుదనం, మనకి బాగా పరిచయం అయినది..ఇటీవల మనం మరిచిపోతున్నది..అందుకే జనం ఒక్కసారి తమకు బాగా పరిచయం అయినది మళ్లీ ప్రెష్ గా చూసినట్లు అనుకుంటున్నారు. పైగా నాన్నగారు పంచెలో ఎలా వుంటారో మీకు తెలుసుగా.

సోగ్గాడు సినిమాకు పబ్లిసిటీ మీద కూడా బాగా దృష్టి పెట్టినట్లున్నారు.?

అవునండీ..అది కూడా కీలకం అయింది ఇప్పుడు. పది హేను రోజుల నుంచీ పబ్లిసిటీ మీదే వున్నాను.

మీకు పోటీగా సినిమా విడుదలవుతుంటే, ఆ హీరో ప్రమోషన్ కు పనికి వచ్చేలా టీవీ కార్యక్రమం చేసారు.?

తారక్ తో మీలో ఎవరు కోటీశ్వరుడు చేయడం గురించేనా? నాకు తారక్ అంటే ఇష్టం. బాబాయ్..బాబాయ్ అంటూ వుంటాడు. లాస్ట్ మూవీ ముందే చేయాల్సింది కుదరలేదు. ఈసారి మావాళ్లు అడిగినట్లున్నారు. ఓకె అన్నాం. పోనీ నావల్ల తారక్ సినిమాకు ప్రమోషన్ వస్తే మంచిదేగా. 

నిర్మాతగా, స్టూడియో యజమానిగా, హీరోగా, బిజినెస్ మెన్ గా మీరు విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. కానీ కొడుకులు ఇధ్దరినీ సరిగ్గా లాంచ్ చేయలేకపోయినట్లుంది.?

దిల్ రాజు బ్యానర్. అంతకన్నా ఏం కావాలి. అలాగే వివి వినాయక్ డైరక్షన్ అంతకన్నా ఇంకేమిటి. కానీ రిజల్ట్ సరిగ్గాలేదు. నేర్చుకుంటారు..నాకు ఎవరు సాయం చేసారు..ఎవరు నేర్పారు. గీతాంజలి వచ్చేవరకు నా కెరీర్ టర్న్ తీసుకోలేదు. శివ చేసిన తరువాత స్టాండ్ అయ్యాను. వాళ్లు కూడా అలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ అఖిల్ విషయంలో మరో పాయింట్ వుంది. సబ్జెక్ట్ సెలక్షన్. నేను గీతాంజలి చేసేటప్పడికి చిరంజీవి, శోభన్ బాబుతో సహా బోలెడు మంది ఎస్టాబ్లిష్డ్ నటులు వున్నారు. వాళ్లు చేయలేనిది చూసి, ఎంచుకుని చేసాను. అఖిల్ కూడా అలాగే చేయాలి. అందరూ చేసే సినిమానే తను ఎందుకు చేయాలి.తను మాత్రమే చేయగలిగింది చూసుకోవాలి. 

ఈ సినిమా తరువాత ఊపిరి..ఆ తరువాత?

ఇంకా ఆలోచించలేదు. ముందు చైతూ, అఖిల్ పై దృష్టి పెట్టాలి. తండ్రిగా నా బాధ్యత కూడా వుందిగా. అందువల్ల ఇద్దరికీ చెరో మంచి సినిమా చేసి ఇవ్వాలి.

రాఘవేంద్రరావుతో కలిసి వెంకటేశ్వరుడిపై సినిమా చేస్తారని.?

అవును..ఆయన మంచి లైన్ చెప్పారు. ఓ భక్తుడి కథ. ఇందులో నేను భక్తుడిగా కనిపిస్తాను. చాలా బాగుంది లైన్. రాఘవేంద్రరావు గారు కూడా దాన్ని చాలా బాగా తయారుచేయాలని చూస్తున్నారు.

షిరిడిసాయి ఫలితం ఎలా అనిపించింది.?

ఆ సినిమా ఫలితానికి నేను ఏ మాత్రం బాధపడను. ఎందుకంటే నేను చేసిన మంచి సినిమాల్లో, కష్టపడి చేసిన సినిమాల్లో అది ఒకటి. నా ప్రయత్నం నేను సిన్సియర్ గా చేసాను. రాజమౌళి నా ఇంటికి వచ్చి మరీ అదే విధంగా అభినందించి వెళ్లాడు. రాఘవేంద్రరావు గారు కూడా ఎంతో కష్టపడ్డారు. కానీ ఎక్కడో తేడా జరిగింది. దానికి ఎవరూ ఏమీ చేయలేరు.

వెబ్ సైట్లు, గ్యాసిప్ లు చూస్తుంటారా? ఎలా అనుకుంటారు మీరు?

మీకు తెలుసా? నా ఇంటికి న్యూస్ పేపర్ రాదు. నేను నాకు సంబంధించని వాటిని పట్టించుకోను. సెట్ లో ఎవరైనా నాకు ఈ గ్యాసిప్ వచ్చింది..అది వచ్చింది అని చెబితే, మరి సెట్ లో వుండరు. టాక్స్ పద్దతులు మారాయి..కార్పొరేషన్ రూల్స్ మరాయి…ఇలాంటివి మాత్రం తెలుసుకుంటాను. మిగిలినవి పట్టించుకోను.

సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకు ఏం చెబుతారు?

మనదైన అచ్చమైన తెలుగు దనం నిండిన సినిమా ఇది. హాయిగా పండగ చేసుకోండి..వీలైతే సినిమా చూడండి..ఇంటిల్లిపాదీ హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఆ భరోసా ఇవ్వగలను.

థాంక్యూ బెస్టాఫ్ లక్ 

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి