జవాబులు – నగరాల్లో హోటల్లో కూర్చుని కథనాలు రాసే పాత్రికేయుల గురించి నేను వ్యాఖ్యానిస్తే ఒక పాఠకుడు 'ఇంట్లో కూర్చుని రాసే ఎమ్బీయస్‌కే అది వర్తిస్తుంది' అని రాశారు. కరక్టు. అయితే నేను ఆ విషయం ముందుగానే చెప్పి కేవియట్ అడుగడుగునా చెప్తూంటాను. వాళ్లు అలా చెప్పరు, అదీ తేడా! తెలంగాణ సెంటిమెంటు విషయంలో నా పరిశీలన తప్పని ఆయన రాశారు. తెలంగాణలో ఏ మేరకు సెంటిమెంటు వుందో విభజన ప్రకటనకు ముందు జరిగిన ఎన్నో ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గిన చోటే ఉపయెన్నికల్లో నెగ్గారు. కొన్నిసార్లు నెగ్గలేదు కూడా. వాటి గురించి ఎన్నోసార్లు రాశాను. ఇప్పటికి కూడా కెసియార్ యితర పార్టీల నాయకులకు గేలం వేస్తూన్నారంటేనే తెలుస్తోంది ఆ సెంటిమెంటుతో గట్టెక్కలేమని ఆయనా గ్రహించారని. ఇక కిరణ్ కుమార్ రెడ్డిని నేను హీరోగా చూశానని ఒకాయన పదేపదే రాస్తారు. అవును, విభజన ఉద్యమాన్ని ధైర్యంగా అదుపులో పెట్టి, సమైక్యత గురించి పాటుపడి, విభజన వలన దుష్ఫలితాలను ప్రజలకు పదేపదే వివరించి (అవన్నీ యిప్పుడు నిజమయ్యాయి) చివరకు విఫలమయ్యాక పదవి వదిలేసినవాడు నా కంటికి హీరోయే. కిరణ్ దిగిపోగానే ఒక్కరోజు సిఎం అయినా చాలని ఎంతమంది ఎగబడ్డారో చూశాం. అలాటిది తనకు తానుగా పదవీకాలాన్ని కుదించుకున్నవాడతను. 'తెలంగాణ కాంగ్రెసు నాయకుల మాటలు విని చీల్చకండి. రాష్ట్రానికి, పార్టీకి నష్టం' అని సోనియాకు నెత్తి నోరుకొట్టుకుని చెప్పినా ఆమె వినలేదు. ఇప్పుడు అనుభవిస్తోంది. కెసియార్‌తో కుమ్మక్కయి తనను తప్పుదోవ పట్టించిన యింటి దొంగలందరూ యిప్పుడు తెరాసలో చేరుతూంటే నాలిక కరుచుకుంటోంది.
ఇక కిరణ్ జగన్, బాబులతో సమానంగా సీట్లు సంపాదిస్తాడని నేను జోస్యం చెప్పానని ఒకాయన అబద్ధాలు రాస్తున్నాడు. ఆర్కయివ్స్ చూస్తే తెలుస్తుంది – ఎన్నికలకు ముందు నేను రాసినది యిది – '…విభజన నేరంలో పాలు పంచుకున్నవారందరినీ శిక్షించకుండా వదిలేయకూడదనే నా భావన. వదిలేస్తే 'ఆంధ్రులను ఏం చేసినా ఫర్వాలేదు, ఏవో నిధులు విదిలిస్తామని హామీలు చూపితే చాలు తోక వూపుకుంటూ ఓట్లేస్తారు' అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. రేపు యింకో రాష్ట్రాన్ని యిదే పద్ధతిలో చీలుస్తారు. తెలుగువారందరూ తమ కసిని ఓట్ల ద్వారా చూపలేకపోతే నోటా ద్వారానైనా చూపాలని నా ఆశ. కిరణ్ సమైక్యపార్టీ వీటన్నిటి గురించి మాట్లాడుతోంది. కానీ కిరణ్ నాయకత్వంపై తక్కిన నాయకులెవరికీ నమ్మకం లేకపోవడం వలన దానికి ఆదరణ లేకుండా పోయింది. ప్రజలైనా ఆదరిస్తారని మీడియా చెప్పడం లేదు. కానీ కిరణ్ పార్టీ కొన్నయినా ఓట్లను తప్పక చీలుస్తుందని నా అభిప్రాయం. అలాగే కాంగ్రెసు కూడా. టిడిపి, వైకాపా అభిమానులు ఎదుటి పార్టీకి బలం వుందని అంగీకరిస్తూనే తమ పార్టీకి 100కు పైగా వస్తాయని, ఎదుటివాళ్లకు 60 చిల్లర వస్తాయని అంటున్నారు. అంటే కాంగ్రెస్, జెయస్పీ, లెఫ్ట్, బిజెపి, యిండిపెండెంట్స్, రెబెల్స్ వీళ్లందరికీ కలిపి పదిలోపే వస్తాయా? అది తర్కబద్ధంగా లేదు. నా దృష్టిలో వాటన్నిటికి కలిపి 15-20 సీట్లు తప్పకుండా పోతాయనుకుంటున్నాను….'
ఫలితాల తర్వాత నేను రాసినది – '..నేను నెగ్గే పార్టీకి 90 నుండి 100 మాత్రమే వస్తాయని చెప్పాను. నెగ్గిన టిడిపికి 102 వచ్చాయి. అంటే నా అంచనా 2% తప్పితే బాబు అంచనా 30% కు పైగా తప్పింది. (జగన్‌దైతే చెప్పినదానిలో 50% కూడా రాలేదు) ఓడే పార్టీకి 55 నుండి 70 లోపున వస్తాయన్నాను. (వైకాపాకు 67 వచ్చాయి) అంత మార్జిన్ కూడా ఎందుకిచ్చానంటే కాంగ్రెస్, జెయస్పీ, బిజెపి, యిండిపెండెంట్స్, లెఫ్ట్ వంటి పార్టీలకు ఎన్ని వస్తాయో చెప్పలేకపోతున్నాం కాబట్టి అన్నాను. అంటూనే ఎంతైనా వాటికి 15-20 సీట్లు వస్తాయని గెస్ చేశాను. వాస్తవానికి వాటికి 6 (బిజెపికి 4, యితరులకు 2) మాత్రమే వచ్చాయి…' నేను రాసినది యిది కాగా జెస్పీకి టిడిపి, వైకాపాలతో సమానంగా వస్తాయని రాశానని ఆయనెలా అంటారు? ఎన్నికల సమయానికి ఆంధ్రులకు బాగా ఆశ పెట్టారు. 'మనం బాగుపడాలంటే నిధులు కావాలి. కేంద్రంలో బిజెపి రావడం కచ్చితం. అందువలన బిజెపి-టిడిపి కూటమికి ఓట్లేస్తేనే నిధులు కురుస్తాయి. అద్భుతమైన రాజధాని అవతరిస్తుంది.' అని. ఆ హోరులో కిరణ్‌ది అరణ్యరోదనే అయింది. నమ్మిన ప్రజలకు గత ఏడాదిన్నరలో ఏం దక్కిందో చూశాం. ఎవరు దీర్ఘదర్శో, ఎవరు కబుర్లపోగో కాలమే నిర్ణయిస్తుంది. ఐదేళ్లు ఆగి చూసి కావాలంటే అప్పుడు నన్ను వెక్కిరించవచ్చు.
జయప్రకాశ్ నారాయణ్ (జెపి) రాకతో విద్యార్థి ఉద్యమం రంగే మారిపోయింది. దాని విస్తృతి పెరిగి 'సంపూర్ణ క్రాంతి ఉద్యమం'గా రూపుదిద్దుకుని ఎమర్జన్సీ విధింపుకు దారి తీసింది. ఆయన సూచనల మేరకు ఏర్పడిన జనతా పార్టీ 1977లో గెలవగానే ఆయనను 'మరో మహాత్మా గాంధీ'' అని కీర్తించారు. లోకనాయక్ బిరుదిచ్చారు. కొంతకాలం పాటు మీడియా ఆయన్ను నెత్తిన పెట్టుకుని మోసింది. జెపి 1902లో బిహార్‌లో పుట్టాడు. చిన్నప్పటినుంచి ఆదర్శాలే ఆయన్ను నడిపించాయి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉపన్యాసంతో ప్రభావితుడై 19వ ఏట పట్నా కాలేజీ చదువు వదిలేసి కాంగ్రెసు వాళ్లు నడిపే విద్యాపీఠ్‌లో చేరాడు. తర్వాత సోషియాలజీలో పై చదువులకై అమెరికా వెళ్లాడు. ఫీజులు కట్టుకోవడానికి అక్కడ కార్మికుడిగా పని చేశాడు. అనేక యూనివర్శిటీలు మారి చివరకు విస్కాన్సన్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేసి, అక్కడ వున్నపుడే మార్క్‌స్ రచనలతో ప్రభావితుడై కమ్యూనిస్టుగా దేశానికి 1929లో తిరిగి వచ్చాడు. ఎంఎన్ రాయ్‌ను కూడా అభిమానించాడు. కమ్యూనిజం మన దేశానికి పనికి రాదని, సోషలిజమే సరైనదని వాదించిన నెహ్రూ బోధనలకు సమ్మోహితుడై యితరులతో కలిసి 1934లో కాంగ్రెసు సోషలిస్టు పార్టీ అని కాంగ్రెసులో అంతర్భాగంగా పెట్టాడు. ఈ దశలో జెపి కార్యకలాపాల గురించి, నెహ్రూతో తదనంతరం తలెత్తిన విభేదాల గురించి యిదే సీరీస్‌లో సోషలిస్టు పార్టీ, కాంగ్రెసు పార్టీల చరిత్రలు రాసినప్పుడు రాశాను. ఉన్నదున్నట్టుగా చెప్పాలంటే జెపి ఆదర్శవాదే కానీ ఆచరణవాది కాదు. ఎవరితోనూ రాజీపడే మనిషి కాదు, ఎవరినీ కలుపుకుని పోగలిగినవాడు కాదు. గాంధీని ఆరాధించి ఆ తర్వాత విభేదించాడు. ( 'ఈ మనిషి ఎప్పుడో ఒకప్పుడు నా భాషే మాట్లాడతాడు' అన్నాడు గాంధీ. అదే నిజమైంది) అలాగే నెహ్రూతో స్నేహం కూడా చెడింది. నెహ్రూ ఎంత కలుపుకుని పోవాలని చూసినా యితను మొండిగానే వుండి, అసాధ్యమైన షరతులు పెట్టేవాడు.
ఇలాటి మనిషికి 1952 ఎన్నికల తర్వాత రాజకీయాలపై విరక్తి కలిగిందంటే ఆశ్చర్యం లేదు. అప్పట్లో రాజకీయాలకు అతీతంగా సర్వోదయ ఉద్యమం అంటూ ఆచార్య వినోబా భావే మొదలుపెట్టాడు. ఆయనా గాంధేయవాదే. జెపి ఆయన సర్వోదయ ఉద్యమంలో చేరాడు. ఉద్యమంలో భాగంగా భూదానోద్యమం, చంబల్ లోయలో బందిపోట్లను దొంగతనం మాన్పించి జనస్రవంతిలోకి తీసుకురావడం వంటి కార్యక్రమాలు చేపట్టాడు. 1957లో రాజకీయ సన్యాసం ప్రకటించి సంస్కరణలకే జీవితాన్ని వెచ్చించేవాడు. నెహ్రూ అతనికి చురుకైన పాత్ర అప్పగిద్దామని చూసినా కుదరలేదు. తర్వాతి రోజుల్లో ఇందిర బ్యాంకుల జాతీయకరణ చేయడం సోషలిస్టయిన జెపికి నచ్చలేదు. కాంగ్రెసును చీల్చడం యింకా నచ్చలేదు. క్రమేపీ ఇందిర సర్వాధికారాలు తన చేతిలో పెట్టుకుంటోందని బాధపడేవాడు. పార్టీరహిత ప్రజాస్వామ్యం రావాలని ఉద్భోదించేవాడు. ఆచరణకు సాధ్యం కాని యిలాటి ఆలోచనలు ప్రతిపక్షంలో వున్నవాళ్లకే నచ్చుతాయి. 1971 ఎన్నికలకు ముందు కాంగ్రెసుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడానికి ప్రయత్నం చేశాడు. అందరూ ఆయనను గౌరవించినవాళ్లే తప్ప ఆయన మాట వినేవాళ్లు లేరు. ఇందిర క్రమేపీ బలపడిపోవడం ఆయనను తీవ్రంగా బాధించింది. రాజకీయాల్లోకి మళ్లీ వచ్చి నియంతృత్వాన్ని అడ్డుకోవాలని అనుకోసాగాడు. 1973 జులైలో ''ఎవరిమన్స్ వీక్లీ'' అనే వారపత్రిక ప్రారంభించి తన ఊహలూ, ఉద్దేశాలు రాసేవాడు. ఇలాటి దశలో బిహార్‌లో ఆందోళన చేసే విద్యార్థులు ఆయన వద్దకు వచ్చి తమకు మార్గనిర్దేశనం చేయమని కోరారు.
1974 ఫిబ్రవరిలో గుజరాత్‌లో విద్యార్థుల ఆందోళన విజయవంతం కావడంతో బిహార్ విద్యార్థుల్లో ఉత్సాహం రగిలింది. ఆ పై నెలలోనే ఉద్యమం మొదలుపెట్టారు. గుజరాత్‌తో పోలిస్తే బిహారులో ఆందోళన చేపట్టడానికి పది రెట్లు ఎక్కువ కారణాలున్నాయి. బిహారు మొదటి నుంచి వెనకబడి వుంది. అవినీతి, అసమర్థత, రాజకీయ అస్థిరత విపరీతంగా వుంది. 1967 మార్చి నుంచి 1974 మార్చి లోపల 11 ప్రభుత్వాలు మారాయి. మూడుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. కాంగ్రెసు పార్టీలో అంతఃకలహాలు మిన్నుముట్టాయి. ధరలు విపరీతంగా పెరగడంతో, ప్రజాజీవితం దుర్భరంగా మారింది. ఉపాధ్యాయుల పోస్టింగుల్లో ఆశ్రితపక్షపాతం, పాఠ్యపుస్తకాల ప్రచురణ, ఎడ్మిషన్లలో కులపక్షపాతం కారణంగా చదువులు సవ్యంగా సాగేవి కావు, చదివాక నిరుద్యోగం వెంటాడేది. దిక్కు తోచని పరిస్థితుల్లో బిహార్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బిహార్‌లో 1956 నుంచి విద్యార్థులు సమ్మెబాట పడుతూండేవారు. యూనివర్శిటీలలో జనసంఘ్‌కు అనుబంధ ఎబివిపి, కమ్యూనిస్టులకు అనుబంధ ఎఐఎస్‌ఎఫ్ సమ్మెల్లో చురుగ్గా పాల్గొనేవి. స్టూడెంటు యూనియన్ ఎన్నికల్లో హింస చెలరేగేది. యూనివర్శిటీ అధికారులు వాటిని అణచాలని చూసేవారు. గుజరాత్‌లో ఆందోళన ప్రారంభం కాగానే 1973 డిసెంబరు లో పట్నాలో ఫీజులు తగ్గించాలని, యూనియన్‌లను అనుమతించాలని ప్రదర్శన నిర్వహించారు.
గుజరాత్‌లో ప్రభుత్వం మారడంతో ఉత్తేజం కలిగిన ప్రతిపక్షాలు బిహార్‌లో 1974 జనవరి 21న అధిక ధరలకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించాయి. ఆ వెంటనే ఫిబ్రవరి 18న రాష్ట్రంలోని 300 కాలేజీల ప్రతినిథులు పట్నాలో సమావేశమై బిహార్ ఛాత్ర సంఘర్ష్ సమితి (బిసిఎస్‌ఎస్) అనే పేర విద్యార్థి సంఘం ఏర్పడింది. దానికి నాయకుడు పట్నా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడైన లాలూ ప్రసాద్ యాదవ్! ఇక డిమాండ్ల చిఠ్ఠా తయారైంది. అచ్చుపుస్తకాల ధర తగ్గాలి, ట్యూషన్ ఫీజు తగ్గాలి, హాస్టలు ఫీజు తగ్గాలి అంటూనే, వీటన్నిటితో బాటు సినిమా హాళ్ల రేట్లు కూడా తగ్గాలి అని చేర్చారు. అవినీతిపరులను, బ్లాక్ మార్కెటీర్లను అరెస్టు చేయాలి, ఆహారపదార్థాల ధరలు తగ్గాలి కూడా కలిపారు. ఈ సంఘంలో ఎస్‌ఎస్‌పికి సంబంధించిన విద్యార్థి యూనియన్, జనసంఘ్‌కు సంబంధించిన ఎబివిపి కూడా సభ్యులుగా చేరాయి కానీ కమ్యూనిస్టు సంఘాలను మాత్రం దరి చేరనీయలేదు. మార్చి మధ్యకు వచ్చేసరికి ఉద్యమం బాగా వూపందుకుంది. పూర్తి హింసాత్మకంగా మారిపోయింది. పోలీసు దాన్ని అణచడానికి లాఠీచార్జిలు, కాల్పులు జరిపేవారు. దాన్ని నిరసిస్తూ మరో బంద్ జరిగేది. పోలీసులపై చర్య తీసుకోవాలంటూ విద్యార్థి సంఘం విద్యామంత్రికి అర్జీ పెట్టుకుంది. అర్జీ తీసుకున్నాడు కానీ దానిపై ఆయన చర్య తీసుకోలేదంటూ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నరు ఘొరావ్ చేసేశారు యీ విద్యార్థులు. మార్చి 18 నాటి యీ ఘటనతో దేశం దృష్టిని ఆకర్షించారు. ఘొరావ్‌ను అడ్డుకోవడానికి పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దానికి వ్యతిరేకంగా పట్నా అంతటా లూటీలు, దోపిడీలు జరిగాయి. అదుపు చేయడానికి జరిగిన పోలీసు కాల్పుల్లో అయిదుగురు మరణించారు.
అంతే, దానితో విద్యార్థులు మరింత రెచ్చిపోయి ప్రభుత్వ భవనాలకు నిప్పు ముట్టించారు. ఫైవ్ స్టార్ హోటళ్లను దోచుకున్నారు. ఫుడ్ కార్పోరేషన్ గోడౌన్ బద్దలు కొట్టారు. ఆరు రైల్వే వ్యాగన్లు తెరిచివేసి దానిలో సరుకులు ఖాళీ చేసేశారు. పత్రికల ఆఫీసులను దగ్ధం చేశారు. మార్చి 20 కల్లా బిహార్‌లోని యితర పట్టణాలకు కూడా హింస వ్యాపించింది. 11 పట్టణాలలో కర్ఫ్యూ విధించారు. ఆర్మీని పిలిపించారు. వారంలో పాతిక మంది దాకా చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ప్రభుత్వం చేతకాక చేష్టలుడిగి కూర్చుంది. ఇదే సందని ప్రతిపక్షాలు ఉద్యమంలో చొరబడి విద్యార్థుల కోర్కెలకు తోడుగా తమ కోర్కె – ప్రభుత్వం చేత రాజీనామా చేయించి, అసెంబ్లీని రద్దు చేయాలని – కూడా కలిపారు. ఉద్యమం యీ దశకు చేరాక ఏప్రిల్‌లో విద్యార్థి నాయకులు జెపి వద్దకు వెళ్లి తమకు నాయకత్వం వహించమన్నారు. – (సశేషం) (ఫోటో – విద్యార్థి నాయకుడిగా లాలూ ప్రసాద్ యాదవ్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2016)