పండగ సినిమాల హడావుడి పూర్తిగా ఊపందుకుంది.మరో పక్క థియేటర్ల సమస్య వుండనే వుంది. నిజానికి నాలుగు సినిమాలు పెద్ద సమస్య కాదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అయితే చాలా బి సి సెంటర్లలో రెండు థియేటర్లే వుంటాయి. అక్కడ సమస్య ఎదురవుతోంది.అలాగే నాలుగు థియేటర్లు వున్న చోట కూడా సమస్య వస్తోంది. తమకు రెండు థియేటర్లు కావాలని పట్టుపడుతున్నారు కొందరి సినిమా జనాలు. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాల పోటీ వచ్చింది.
మరి ఎవరు చెప్పారో? లేదా తమంతట తాము కలుగు చేసుకున్నారో, లేక మరేం జరిగిందో తెలియదు కానీ, కొన్ని సెంటర్లలో ఎమ్మెల్యేలు థియేటర్ల విషయంలో కలుగ చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ ప్రాంత బయ్యర్ల కోసమో, లేదా లోకేష్ మెచ్చుకుంటారనో, లేదా మరేమైనా ఆదేశాలు వున్నాయో కానీ, డిక్టేటర్ కు అనుకూలంగా ఎమ్మెల్యేలు కలుగచేసుకుని, థియేటర్లు ఇప్పిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
పోనీ ఎమ్మెల్యేలను కాదని, లేదా ఆల్రెడీ ముందే అగ్రిమెంట్ అయిపోయిందని చెబుదామా అని థియేటర్ యజమానులు అనుకున్నా ఫలితం వుండదు. ఎందుకంటే, పండుగ సందర్భంగా కనీసం వారం పది రోజుల పాటు ఫ్లాట్ రేట్లు అమ్మడం అలవాటు. అలాంటి వ్వవహారాన్ని అధికారుల చూసీ చూడనట్లు వదిలేయాలంటే, ఎమ్మెల్యేల అండదండలు తప్పని సరి.
అందుకే కొన్ని థియేటర్లు మార్నింగ్ షో, ఫస్ట్ షో, మాట్నీ, సెకెండ్ షో అనే విధంగా విడదీసి రెండు సినిమాలు వేయడం లేదా ఎర్లీ మార్నింగ్ షో తో ఫ్రారంభించి అయిదు ఆటలు వేసి, మూడు ఓ సినిమా, రెండు ఓ సినిమా వేయడం లాంటి అడ్జస్ట్ మెంట్ లు చేయాలనుకుంటున్నాయట. ఇలాంటివాటికి అధికారులు సహకరించాలంటే ఎమ్మెల్యేలు చెప్పినట్లు వినాల్సిందే మరి. మొత్తానికి ఎన్నడూ లేనట్లుగా వుంది ఈ సారి సంక్రాంతి సినిమాల పరిస్థితి. హీరోలు, హీరోలు బాగానే వున్నారు. మధ్యలో థియేటర్ల వాళ్లకు వచ్చింది తలకాయనొప్పి.
అన్నట్లు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈసారి థియేటర్ వాళ్లకు పంటే. ఫ్లాట్ రేట్లు 13న మొదలు పెట్టి, 20 వరకు కానిచ్చేయచ్చు..