జయలలిత బిజెపికి దగ్గరవుతోందని గుర్తించిన పివి జయలలితకు ఎలాగైనా అవరోధాలు కల్పించాలని నిశ్చయించుకున్నారు. ఎల్‌టిటిఇకి తమ సానుభూతిని బహిరంగంగా చూపిస్తున్న పిఎంకె పార్టీని నిషేధించాలని గతంలో కాంగ్రెసు తమిళనాడు యూనిట్ డిమాండ్ చేసేది. ఆ మేరకు జయలలిత 1992లో కేంద్రాన్ని కోరుతూ లేఖ కూడా రాసింది. ఆ కోరికను తిరస్కరిస్తూ కేంద్రం 1993 మార్చిలో ప్రకటన చేసింది. ఎడిఎంకె స్థానంలో మరో ప్రాంతీయపార్టీని మచ్చిక చేసుకోవాల్సిన అవసరం వుంది కాబట్టే పివి యిలాటి నిర్ణయం తీసుకున్నారనుకోవాలి. దానికి తగినట్టు పిఎంకె 'మేం ఎల్‌టిటిఇ తమిళుల కోసం చేసే పోరాటాన్ని సమర్థిస్తున్నాం తప్ప వాళ్ల టెర్రరిస్టు కార్యకలాపాలను కాదు' అని ఓ స్టేటుమెంటు యిచ్చేసి, నిషేధం తప్పించుకుంది. కాంగ్రెసు ఎడిఎంకెకు వ్యతిరేకంగా అసెంబ్లీలో గోల చేయసాగింది. ఏప్రిల్ 20 నాటి సమావేశంలో కాంగ్రెసుతో సహా ప్రతిపక్ష సభ్యులందరినీ జయలలిత బయటకు నెట్టించివేయడమే కాక, అసెంబ్లీ సిబ్బందిపై చేయి చేసుకున్నారనే నేరారోపణ చేసి యిద్దర్ని అరెస్టు చేయించింది కూడా. ఇటువంటివి జరిగాక జయలలితకు మద్దతుదారుడిగా వున్న వాళప్పాడి రామమూర్తి కూడా ఆమెకు వ్యతిరేకిగా మారాడు. మూపనార్‌తో కలిసి పనిచేయసాగాడు.
బాబ్రీ మసీదు విధ్వంసం తదనంతరం బొంబాయిలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ముస్లిం తీవ్రవాద సంస్థలు అంతటితో ఆగవని, యితర మెట్రోలపై కూడా పడతాయని అందరూ అనుకుంటూండగానే మద్రాసులోని చెట్‌పట్‌లో ఆరెస్సెస్ ముఖ్యకార్యాలయంపై బాంబు దాడి జరిగి 11 మంది చనిపోయారు, 5గురు గాయపడ్డారు. చనిపోయినవారిలో ఆరెస్సెస్ హెడ్‌క్వార్టర్స్ సెక్రటరీ కూడా వున్నాడు. దానికి నెల ముందు నిషేధిత ఇస్లామిక్ సేవా సంఘ్ నాయకుడు పళని బాబా తాంబరం వచ్చి ఆరెస్సెస్ హెడ్‌క్వార్టర్స్‌ను, కంచి శంకరాచార్య మఠాన్ని పేల్చేయమని తన కార్యకర్తలకు చెప్పాడని ఆరెస్సెస్ నాయకులు ఆరోపించారు. పేలుడు జరగగానే గవర్నరుగా వున్న చెన్నారెడ్డి యిదే అదనని జయలలిత ప్రభుత్వాన్ని ఏకి పారేశాడు. ఇంత ఘోరసంఘటన జరిగితే జయలలిత బాధ్యతారహితంగా పళని పార్లమెంటు ఉపయెన్నికల ప్రచారానికి వెళ్లిపోయిందని వ్యక్తిగతంగా దుమ్మెత్తిపోశాడు. 'నేను బయలుదేరినపుడు నా కా సంగతి తెలియదు' అని ఆమె చెప్పుకుంది.
ఆగస్టు నెలలో పళని పార్లమెంటు ఉపయెన్నికలతో బాటు, రాణీపేట అసెంబ్లీ ఉపయెన్నికలు కూడా జరిగాయి. ఎడిఎంకె, కాంగ్రెసు పొత్తు విచ్ఛిన్నమై విడివిడిగా పోటీ చేస్తున్నారు కాబట్టి డిఎంకె గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు. 'బాబ్రీ మసీదు కూలగొట్టిన బిజెపితో ఎడిఎంకె సఖ్యత నెరపుతోంది, ముస్లిం ఓటర్లలారా, బహుపరాక్' అంటూ డిఎంకె ముస్లిం ప్రాంతాల్లో పోస్టర్లు అతికించింది. ఏది ఏమైనా రెండు చోట్లా ఎడిఎంకె నెగ్గేసింది. రాణీపేటలో 42% ఓట్లు పడ్డాయి. డిఎంకెకు 34%. కాంగ్రెసు అభ్యర్థి ఆరోగ్యం బాగా లేదంటూ మధ్యలో తప్పుకుంటే అతనికి ఐదో స్థానం దక్కింది. పళనిలో కాంగ్రెసుది ఎడిఎంకె, డిఎంకెల తర్వాతి స్థానం. దొంగ ఓట్లు పడ్డాయని, మోసాలు జరిగాయని అలవాటుగా ఆరోపణలు చేశారు. కాంగ్రెసుతో పొత్తులో ఒక మైనర్ భాగస్వామిగా వుండడం కంటె బిజెపితో పొత్తులో మేజర్ భాగస్వామిగా వుండడం మేలనుకుని జయలలిత జాతీయ అంశాలపై బిజెపిని సమర్థించసాగింది. అయినా ఆమెకు ముస్లిము ఓటర్ల మద్దతు పోలేదు. కాంగ్రెసు పని ముగిసిపోయిందని ఆమె భావించసాగింది.
కాంగ్రెసు-ఎడిఎంకె పొత్తు విచ్ఛిన్నమై చిక్కుల్లో వున్నపుడు సహజంగా డిఎంకె లాభపడాలి. కానీ కరుణానిధి తన కొడుకు స్టాలిన్‌ను తన వారసుడిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో కొంపలో చిచ్చు పెట్టుకున్నాడు. డిఎంకెలో వై. గోపాలస్వామి (వైగో అంటారు) చాలా పవర్‌ఫుల్ లీడరు. రుణానిధి లాగానే తెలుగు మూలాలున్నవాడు. మంచి వక్త, మంచి ఆర్గనైజర్. డిఎంకె తరఫున రాజ్యసభ ఎంపీ. కానీ స్టాలిన్‌ను ఎలాగైనా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో కరుణానిధి పార్టీలో జరిగిన ఎన్నికలలో చాలా అక్రమాలు జరిపించాడు. దొంగ ఓట్లు, అభ్యర్థుల కిడ్నాప్‌లు, మారణాయుధాల ప్రయోగం, చివరకు హత్యలు జరిగాయి. అంత చేసినా 32 జిల్లాలలో 9 జిల్లా యూనిట్లు వైగో అనుయాయులను ఎన్నుకున్నాయి. వైగోకు పట్టున్న మధురైలో కరుణానిధి పనితీరును విమర్శిస్తూ పోస్టర్లు వెలిశాయి. ఇవన్నీ కేంద్రం, ఎడిఎంకె కలిసి మా పార్టీ చీల్చడానికి చేస్తున్న కుట్ర అని కరుణానిధి ఆరోపించాడు. మధురైలో పార్టీని తన కొడుకు అళగిరికి అప్పగించి వైగోను నియంత్రించమన్నాడు. కోయంబత్తూరులో జరిగిన సమావేశంలో డిఎంకె సీనియరు లీడర్లు పార్టీద్రోహి, విశ్వాసఘాతకుడు అంటూ వైగోను తిట్టిపోశారు.
నిజానికి కరుణానిధి చిన్న భార్య రాజాత్తి (కనిమొళి తల్లి) వైగోకు మద్దతు యిచ్చారు. పెద్ద భార్య దయాళు, అళగిరి (వైగో పార్టీలోంచి వెళ్లిపోయాక అళగిరి, స్టాలిన్ కలహించుకున్నారు, యిద్దరి మధ్య ఆధిపత్యానికి పోరు యింకా సాగుతూనే వుంది) ఇంకో కొడుకు తమిళరసు, విపి సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా వున్న కరుణానిధి మేనల్లుడు మురసొలి మారన్ (వైగో రహస్యంగా వెళ్లి ఎల్‌టిటిఇ ప్రభాకరన్‌ను కలిసిన సంగతి మీడియాకు లీక్ చేసినది అతనే అంటారు), అతని తమ్ముడు, కరుణానిధి అల్లుడు అయిన మురసొలి సెల్వం, యింకో మేనల్లుడు స్వర్ణం స్టాలిన్ వైపున్నారు. వీళ్లందరి చేతిలో పార్టీ నడిపే పత్రికలున్నాయి. వాటిలో వైగో గురించి వార్తలు రాకుండా తొక్కిపెట్టడమే వారి పని. డిఎంకె హయాంలో జరిగిన అధికారదుర్వినియోగం గురించి జయలలిత కమిషన్ వేసి వుంది. అళగిరి, కరుణానిధి మాజీ అల్లుడు అధిపన్ బోస్ (కనిమొళి పూర్వభర్త, యిద్దరికీ పడలేదు, ఆమె అతన్ని జైలుకి పంపేదాకా నిద్రపోనని శపథం చేసి, తండ్రి చేత వారం రోజుల పాటు జైల్లో కూర్చోబెట్టించింది. పొయెటిక్ జస్టిస్ జరిగి, కొన్నేళ్లకు స్వయంగా జైలుకెళ్లింది) చట్టవిరుద్ధంగా గ్రెనేట్ క్వారీ చేశారని, అళగిరి హోటల్ ఓనర్స్ అసోసియేషన్ నుండి బలవంతంగా రూ. 75 లక్షలు వసూలు చేసి కరుణానిధికి యిచ్చాడని అభియోగాలు. ఇలాటి పరిస్థితుల్లో కరుణానిధి వైగోకు పొగపెట్టాడు.
ఎన్నికలలో వ్యతిరేక ఫలితాలు వచ్చాక కాంగ్రెసును కలుపుకుంటే తప్ప ఎడిఎంకెను ఎదుర్కోలేమని కరుణానిధి గ్రహించాడు. కాంగ్రెసుకు, డిఎంకె పొత్తు ఏర్పడాలంటే మధ్యలో వున్న పెద్ద అడ్డుగోడ – ఎల్‌టిటిఇ అంశం. రాజీవ్‌ను హత్య చేసిన ఎల్‌టిటిఇకి మద్దతిచ్చే డిఎంకెను ఎలా దగ్గరకు తీస్తారని కాంగ్రెసు నాయకులు అడుగుతారు. సోనియా విధేయులు ప్రధానిగా వున్న పివిని రాజీవ్ ద్రోహిగా నిందిస్తారు. అందువలన ఎల్‌టిటిఇ పాపాన్ని వైగో నెత్తికి చుట్టేసి, అతన్ని బయటకు పంపేసి, కాంగ్రెసుకు చేరువవుదామని కరుణానిధి ప్రయత్నించాడు. తన కొడుకుల కంటె ఎక్కువ ప్రజాదరణ పొందిన వైగోను తోలేస్తే తన కుటుంబసభ్యుల మధ్యే అధికారం పంచడం సులభం. అందుకు మొదటి మెట్టుగా తను ఎల్‌టిటిఇకి విరోధి అయినట్లు, ప్రభాకరన్ తనను చంపడానికి వైగోతో కలిసి కుట్ర పన్నినట్లు డ్రామా ఆడాడు. ఆ స్క్రిప్ట్ ప్రకారం అక్టోబరులో డిఎంకె చీఫ్ సెక్రటరీ టివి వెంకటరామన్ రుణానిధికి ఒక బహిరంగ లేఖ రాశాడు 'తమకు అత్యంత సానుభూతిపరుడైన వైగో ద్వారా ఎల్‌టిటిఇ మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తోందని వార్తలు వస్తూన్నాయి. మిమ్మల్ని అడ్డు తొలగిస్తే వైగో డిఎంకెకు అధ్యక్షుడై పోయి తమకు సహాయమందిస్తాడని వారి ఆలోచనట. ఆ వార్తలు విని చాలా కలవరపడ్డాము. మేము మీకు రక్షకదళంగా పనిచేసి మీ ప్రాణాలను కాపాడుకుంటాం' అని.
వెంటనే కరుణానిధి ప్రెస్ మీట్ పెట్టి 'వైగో నన్ను చంపడానికి కుట్ర పన్నాడు, నేను అధ్యక్షపదవికి రాజీనామా చేస్తున్నాను. నా ప్రత్యర్థికి బుద్ధి చెప్పమని నా కార్యకర్తలను కోరుతున్నాను' అని ప్రకటించాడు. తన ప్రకటన వెలువడగానే కార్యకర్తలందరూ తన యింటికి వచ్చి రాజీనామా చేయవద్దని బతిమాలతారని లెక్క వేశాడు. కానీ 200 మందే వచ్చారు. ఇరు వర్గాల మధ్య మధురైలో కత్తిపోటు దాడులు జరిగాయి. తనపై ఎటాక్ జరుగుతుందన్న భయంతో వైగో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అక్కణ్నుంచే 'అది అన్యాయపు ఆరోపణ. నా నాయకుడు కరుణానిధి కోసం ప్రాణాలైనా అర్పిస్తాను.' అని స్టేటుమెంటు యిచ్చాడు. కార్యకర్తల కోరిక మేరకు రాజీనామా వెనక్కి తీసుకుంటూ కరుణానిధి 'డిఎంకె తమిళ ఈలం (శ్రీలంకలో తమిళుల కోసం ప్రత్యేక దేశం) డిమాండును కాని, ఎల్‌టిటిఇని కాని సమర్థించదు' అని ప్రకటన చేశాడు. ఈ విధంగా తమతో పొత్తుకు కాంగ్రెసుకు యిబ్బంది లేకుండా చూశాడు. అయినా కాంగ్రెసు తటపటాయిస్తూనే వుంది. ఇంతలో 1994 వచ్చింది. (సశేషం) (ఫోటో – కరుణానిధి, వైగో)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2016)