తమిళనాడులో శశికళ రాజ్యం స్థిరపడింది. ఆమె అక్క కొడుకు పార్టీకి డి-ఫాక్టో జనరల్ సెక్రటరీ. ఆమె అనుచరుడు ముఖ్యమంత్రిగా విశ్వాస తీర్మానాన్ని గెలిచేశాడు. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో చనిపోయిన జయలలిత, అనారోగ్యంతో రాలేని కరుణానిధి, సభను బహిష్కరించిన అరుణ్‌కుమార్ అనే ఎడిఎంకె ఎమ్మెల్యేలను తీసేస్తే 231 మంది వున్నారు. సగం కంటె ఎక్కువ అంటే 117 మంది ఓటేస్తే చాలు. డిఎంకె, 8 మంది సభ్యులున్న కాంగ్రెసు, ఒక సభ్యుడున్న ముస్లిం లీగు వాకౌట్ చేయగా మిగిలిన 133 మందిలో డివిజన్ చేసి చూస్తే 122 మంది పళనిస్వామికి వేశారు. 11 మంది ప్రతికూలంగా ఓటేశారు. పన్నీరు సెల్వం ఎన్ని డాబు కబుర్లు చెప్పినా రిసార్టు నుంచి వచ్చిన ఎమ్మెల్యేలలో ఎవరూ పార్టీ ఫిరాయించలేదు. పళనిస్వామి వెంట కావలసిన దాని కంటె ఎక్కువమంది ఎమ్మెల్యేలే వున్నారని నిస్సందేహంగా, నిర్ద్వంద్వంగా నిరూపితమైంది. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేనివారు తమిళ ప్రజలు పళనిస్వామికి ఓటేసిన ఎమ్మెల్యేల భరతం పట్టాలని పిలుపు నిస్తున్నారు.
రిసార్టు ఖాళీ చేసి ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు రాగానే ప్రజలు వారికి బుద్ధి చెప్తారని మేధావుల ఆశ. పళనిస్వామిది నైతికవిజయం కాదని, అతని ఎమ్మెల్యేలు ప్రజలు మధ్యకు వెళ్లినపుడు కథ తిరగబడుతుందని, అందువలన యీ ప్రభుత్వం ఎక్కువకాలం నిలబడదని మీడియా రిపోర్టర్లు జోస్యాలు చెప్పేస్తున్నారు. తనపై వీళ్లందరూ యిన్నేసి ఆశలు పెట్టుకోవడం చూసి సగటు తమిళ ఓటరు దడుసుకోవచ్చు.
అసెంబ్లీ నిర్వహణ సజావుగా సాగలేదు కాబట్టి యిది నైతిక విజయం కాదని మీడియా వ్యాఖ్యానించవచ్చు. అసెంబ్లీలో యిలాటి కొట్లాటలు యిదే ప్రథమమా? వివిధ పక్షాల శాసనసభ్యులు తమలో తాము కొట్టుకోలేదా? మైకులు విరగ్గొట్టలేదా? స్పీకరుపై విరుచుకు పడలేదా? వీటన్నిటిపై ప్రజలు స్పందించారా? గతంలో సంగతులన్నీ ఎందుకు? సురేశ్ ప్రభు శివసేన నుంచి రాత్రికి రాత్రి బిజెపిలోకి దూకి రైల్వే మంత్రి అయిపోయాడు. అతని నియోజకవర్గపు ప్రజలు అతన్ని ఛీత్కరించుకున్నారా? మన తెలుగు రాష్ట్రాలలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ ద్వారా ఎన్నికై, మరో పార్టీలోకి దూరిపోలేదు? ఫలానా పార్టీ తరఫున మమ్మల్ని సేవించు అని ప్రజలు కోరి ఎన్నుకున్నాక అతనికి ఆ పార్టీ సిద్ధాంతాలతో వైరుధ్యం వస్తే రాజీనామా చేసి మళ్లీ నిలబడాలి. గతంలో కొందరు అలా చేశారు కూడా.
2014 ఎన్నికల తర్వాత ఆంధ్ర, తెలంగాణలలో ఎంతోమంది మళ్లీ ఎన్నికలకు నిలబడకుండానే పార్టీలు మారేశారు. వారికి ఓటేసినవారు, వారిని చొక్కా పట్టుకుని నిలదీశారా? తలసాని అయితే మరీ ఘోరం. టిడిపి ఎమ్మెల్యేగా వుంటూనే తెరాస కాబినెట్లో సినిమాటోగ్రఫీ మంత్రి అయిపోయారు. తమ సినిమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చేస్తున్నామనే సినిమావారు ఆయన్ని యిదేమిటని అడిగారా? తమ రంగానికి ఏమైనా చేసిపెట్టమని అడగడం తప్ప ఆయనతో నీతినియమాల గురించి మాట్లాడగలిగారా? అరుణాచల్ ప్రదేశ్‌లో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ద్వారా ఎన్నికైన 33 మంది ముఖ్యమంత్రితో సహా బిజెపిలో చేరిపోయారు. రాత్రికి రాత్రి అది బిజెపి ప్రభుత్వం అయిపోయింది. గతంలో కాంగ్రెసు యిటువంటి తమాషాలు చాలా చేసి చూపించింది. ఇప్పుడు బిజెపి వంతు. అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు సెక్రటేరియట్‌కు వచ్చి యిది భావ్యం కాదు అంటూ ధర్నాలు చేశారా? కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీల్లో బూతు వీడియోలు చూస్తున్నారు, కొందరు అవినీతి కేసుల్లో, మరి కొందరు క్రిమినల్ కేసుల్లో యిరుక్కుంటున్నారు. వాళ్ల వాళ్ల నియోజకవర్గాల ప్రజలు వీళ్లకి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారా?
వీళ్లెవరూ చేయని పని మమ్మల్ని చేయమంటారేం అని తమిళనాడు ప్రజలు అడిగితే యీ మేధావులేమవుతారా అని నాకనిపిస్తుంది. నిజమే యిప్పుడున్న ప్రభుత్వం అవినీతి కేసుల్లో జైలుకి వెళ్లిన శశికళ కనుసన్నల్లో నడిచే ప్రభుత్వమే. దీనికి ప్రత్యామ్నాయంగా దేన్ని ఎన్నుకోవాలి? డిఎంకెనా? అది చేసిన రగడ చూశాం. పన్నీరు సెల్వంని నిలబెట్టి శశికళను చిత్తు చేదామని స్టాలిన్ ఎంత ఆరాటపడినా పన్నీరుకి ఆ సత్తా లేదని తేలిపోయింది. శశికళ ఎమ్మెల్యేలు దృఢంగా నిలబడ్డారు. 'అసెంబ్లీలో ఉమ్మడి తీర్మానం పెట్టాలని గవర్నరు సిఫార్సు చేస్తారు. అది జర్మనీలో సంప్రదాయం, ఒకసారి యుపి అసెంబ్లీలో పెట్టారు' అని చెప్తూ వచ్చారు. ఎవర్నీ ముఖ్యమంత్రిగా పిలవకుండా అసెంబ్లీలో ఎవరికి బలం వుందో తేల్చడానికి రెండు తీర్మానాలు పెడతారట. విద్యాసాగరరావుగారు ఎన్ని పొరపాట్లు చేసినా ఆ పొరపాటు మాత్రం చేయలేదు. అసెంబ్లీలో డిఎంకె వ్యవహరించిన తీరు చూశాక అలాటి ఉమ్మడి తీర్మానం సాధ్యపడేదే కాదని అర్థమవుతుంది. అసలు సభను నడవనిస్తే కదా! ఎంతో తర్జనభర్జన తర్వాత గవర్నరు పళనిస్వామి చేత సిఎంగా ప్రమాణస్వీకారం చేయించాక అందరికీ తెలిసిపోయింది – అతను విశ్వాస తీర్మానం గెలవక మానడని. ఇలాటి సందర్భాల్లో స్పీకరుకి అపరిమిత అధికారాలుంటాయి. కావాలనుకుంటే అతను ఎలాటి రూలింగైనా యివ్వగలడు. ఎవరూ అడిగేదానికి లేదు. అతను కూడా శశికళ మనిషే అని తెలిశాక పళనిస్వామి గెలుపుపై సందేహమే లేదు.
ఇన్ని గ్రహించుకున్న డిఎంకె సభకు రాకుండా గైరుహాజరై వుంటే మర్యాదగా వుండేది. కానీ ముందురోజు రాత్రి ఏదో స్ట్రాటజీ వర్కవుట్ చేసి సభకు వచ్చారు. స్టాలిన్ వింతవింత వాదనలు చేశారు. 15 రోజుల గడువుందిగా, యివాళే విశ్వాస తీర్మానం దేనికి, వాయిదా వేయండి అని అని మొదటి డిమాండు. ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు మీరు సాధ్యమైనంత త్వరగా బలం నిరూపించుకో అంటారు. ఇక్కడ ఉల్టాగా మాట్లాడాడు. ఆ తర్వాత రహస్య ఓటింగు కావాలన్నాడు. మూజువాణీ ఓటు ద్వారా గెలిచినా అది చాలదని డివిజను అడగడానికి హక్కు వుంది. డివిజను పనికి రాదని, రహస్య ఓటింగు జరిపి తీరాలని పట్టుబట్టడం వింత. ఆ ప్రతిపాదన నిరాకరించే హక్కు స్పీకరుకి వుందన్న సంగతి అంత సీనియరుకి తెలియదా? తమిళనాడు అసెంబ్లీ రూలు 99 ప్రకారం సీక్రెటు ఓటింగు జరిపే వీలు లేదని స్పీకరు అంటూంటే దాన్ని యితను ఖండించగలిగాడా? పళనిస్వామి తరఫు ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో కొన్నాళ్లు వదిలి, ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుని వచ్చాక అప్పుడు తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండు చేశాయి. ఎమ్మెల్యే కాంపుల నిర్వహించిన సందర్భాల్లో గతంలో యిలాగ ఎప్పుడైనా జరిగిందా? ఈ డిమాండ్లను స్పీకరు తిరస్కరించక సరేనంటాడా? తిరస్కరించాక డిఎంకె సభ్యులు స్పీకరుపై ఎలా దూసుకుపోయారో, ఎలా అల్లరి పెట్టారో టీవీల్లో వచ్చేసింది. అది పాక్షికంగానే చూపించారు అని డిఎంకె ఆరోపించింది. చూపించినంత వరకు అది అబద్ధం అని అనలేరు కదా. మీ ఎమ్మెల్యేలు స్పీకరు కుర్చీలో కూర్చున్నారేమిటి అని అడిగితే స్పీకరు లేనప్పుడు కూర్చుంటే తప్పేముంది అని వాదించాడు ఓ నాయకుడు. స్పీకరు కుర్చీలోంచి లేచి వెళ్లిపోతూ వుంటే ఎలా అడ్డుకున్నారో, వెనక్కి ఎలా గుంజారో అదీ స్పష్టంగా కనబడింది. ఇలా అల్లరి చేసిచేసి చివర్లో అమరవీరుడిలా స్టాలిన్ పోజు కొట్టబోయాడు. గతంలో చిరిగిన చీరతో జయలలిత ప్రజల సింపతీ పొందింది కదాని యిప్పుడు తను చిరిగిన జేబుతో, చొక్కా గుండీలు విప్పేసి బయటకు వచ్చాడు. కానీ జయలలితపై దాడి చేసినది డిఎంకె ఎమ్మెల్యేలు. ఇక్కడ స్టాలిన్‌పై దురుసుగా ప్రవర్తించినది మార్షల్స్. పళని స్వామి ఎమ్మెల్యేలు ఏమైనా చేసి వుంటే అప్పుడు స్టాలిన్‌పై సింపతీ వచ్చేదేమో కానీ వాళ్లంతా కదలకుండా మెదలకుండా కూర్చున్నారు.
నిజానికి తమిళనాడులో ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రయ్యే ఛాన్సు వున్నది స్టాలిన్‌కే. గత ఎన్నికలలోనే కరుణానిధి బదులు అతన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపి వుంటే డిఎంకె గెలిచేదని విశ్లేషకులు అన్నారు. ఇప్పుడు యీ చొక్కా చింపుకోవడం బొత్తిగా నాటకీయంగా వుంది. నాటకీయత తమిళ ఓటర్లకు కొత్తేమీ కాదు. స్టాలిన్ వ్యూహం ఏమిటి? ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని గవర్నరుకి ఫిర్యాదు, రాష్ట్రమంతా 22న నిరసన ప్రదర్శనలు, శాంతిభద్రతలకు విఘాతం, పౌరభద్రత లేకుండా పోయింది కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండు, ఆ తర్వాత సత్వరమే ప్రజాప్రభుత్వం ఏర్పడాలని దాని కోసం కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండు. ఇదే కదా వరస! ఆ రాబోయే ఎన్నికలలో సింపతీ కోసమే యీ చొక్కాలు చింపుకోవడాలు. ధోవతీలు వూడగొట్టుకోవడాలు (గలభాలో కొందరు డిఎంకె ఎమ్మెల్యేల పంచెలు వూడిపోయాయట). కానీ టీవీల్లో చూస్తూంటే డిఎంకె వారు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా కంటె ఆకతాయిలుగా ఎక్కువ కనబడ్డారు. స్టాలిన్ తన వ్యూహం అమలు చేస్తున్న కొద్దీ పళనిస్వామి ఎమ్మెల్యేలు 'మేం జయలలిత వారసులుగా నిలబడ్డాం, ఆమె వారసత్వం లేకుండా చేయాలని డిఎంకె కుట్ర పన్నుతూంటే, పదవీలాలసతో పన్నీరు వారితో చేతులు కలిపాడు' అని చెప్పుకోరా? వాళ్లు చెప్పి ఒప్పించాల్సింది యావన్మంది తమిళ ప్రజలనీ కాదు. కేవలం ఎడిఎంకె ఓటర్లను మాత్రమే. వాళ్ల ఓట్లతోనే ఏడాది క్రితం వారు గెలిచారు. ఆ ఓటర్లకు 2016లో ఓటేసినపుడు జయలలితపై కేసుల విషయం తెలుసు. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు తర్వాత వాళ్లు జయలలితపై విముఖత పెంచుకుంటారా? ఎందుకంటే శశికళను తిట్టేవాళ్లు జయలలితను కూడా బ్లేమ్ చేయాలి కదా. సరే శశికళ గుప్పిట్లో వున్న ఎడిఎంకె పార్టీ అవినీతికరమైన పార్టీ, పక్కకు పెడదాం అంటే మరి డిఎంకె మాట? సాక్షాత్తూ కరుణానిధి కూతురే జైలుకి వెళ్లింది. యుపిఏ హయాంలో డిఎంకె వారి అవినీతి పెచ్చుమీరడం చేతనే కదా, అన్ని కేసులు!
ఇటీవల కాలంలో నెటిజన్లకు ఫేవరేట్‌గా మారిన పన్నీరు ఏమవుతారు? అమ్మా డిఎంకె పేర పార్టీ పెడతారట. గతంలో ప్రతిపక్షాలు ఓ పన్నీరు సెల్వంను, జీరో పన్నీరు సెల్వం అనేవారు. ఇప్పుడది నిజం కావచ్చు. అతని ఎమ్మెల్యేలు శశికళకో, స్టాలిన్కో ఫిరాయించవచ్చు. పార్టీ మూతపడవచ్చు. అతన్ని బిజెపి పార్టీలోకి తీసుకుని నాయకత్వం అప్పగిస్తుందా అనేది కూడా సందేహమే. పదిరోజులు టైమిచ్చినా ఏమీ సాధించలేని విఫల నాయకుణ్ని ఎవరు మాత్రం ఆదరిస్తారు? అతని వెంట నిలిచిన పార్టీ ఎంపీలు మళ్లీ శశికళ వర్గానికి వచ్చేసినా ఆశ్చర్యం లేదు. ఈ 10 మంది అనుచరులను మేన్‌టేన్ చేస్తూ వేరే పార్టీ నిర్వహించగల సత్తా అతనికి వుందనుకోను. ఈ అనుచరులు డిఎంకె వాళ్లల్లా అసెంబ్లీలో రెచ్చిపోలేదు. ఉదాసీనంగానే వున్నారు. డిఎంకె వాళ్లు అల్లరి చేయడానికి కూడా కారణం వాళ్లకు బలం లేదనే సంగతీ ప్రజలకు అర్థమైంది. బలం లేనివారే అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ను భగ్నం చేయడానికి చూస్తారని నాదెండ్ల కాలంలోనూ చూశాం. ఎన్టీయార్‌ను పదవీచ్యుతుణ్ని చేసినపుడు నాదెండ్లపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ఆయన్ను కులంనుంచి బహిష్కరించామని, ఆయనింట్లో పిల్లలతో సాటి కులస్తులు పెళ్లి చేసుకోకూడదని కులసంఘం ఫర్మానాలు పేపర్లో వచ్చాయి. తర్వాత ఏమైంది? ఎన్టీయార్ బలపరీక్ష నెగ్గాక ప్రజలు ఎప్పటిలాగ వాళ్ల పనుల్లో వాళ్లు పడ్డారు. నాదెండ్లపై బహిష్కరణల సంగతి ఎవరికీ గుర్తుండి కూడా వుండదు. ఇప్పుడు పళనిస్వామి ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లి బహిరంగసభలు పెట్టకపోవచ్చు. పెడితే ఎవరో చెప్పు విసిరితే అదో పెద్ద వాట్సాప్ న్యూసు అయిపోతుంది. వెళ్లి వాళ్లవాళ్ల యిళ్లల్లో, వ్యాపారవ్యవహారాల్లో వుంటారు. వాళ్ల దగ్గరకు ఉద్యోగాల కోసమో, కాంట్రాక్టుల కోసమో, సిఫార్సుల కోసమో, వేరే పనుల కోసమో వచ్చే నియోజకవర్గ ఓటర్ల్లు వస్తూనే వుంటారు. మన ఎమ్మెల్యే ఏ పార్టీలో వుంటే మనకేం, మనకు కావలసిన పని చేసి పెడతానంటే అదే చాలు అనే ధోరణిలో ప్రజలుంటారు. అందువలననే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు సైతం ఏ బెదురూ లేకుండా తిరుగుతూ వుంటారు. ఎవరైనా వచ్చి నిరసన తెలపబోతే చావగొట్టి చెవులు మూయడానికి ఎమ్మెల్యే చుట్టూ కార్యకర్తలు ఎలాగూ వుంటారు.
ఇన్నాళ్లూ జరుగుతూ వచ్చిన వాస్తవాలివి. ఇప్పుడు మాత్రం ప్రజల్లో తిరుగుబాటు వచ్చేయాలని ఆశ పెట్టుకుంటున్నారు కొందరు. అదెలా అంటే జల్లికట్టు ఉద్యమంలో ప్రజాచైతన్యం వెల్లివిరియలేదా? ఆ ఉద్యమం నెగ్గలేదా అంటారు. గ్రహించాల్సింది ఏమిటంటే ఆ ఉద్యమానికి తమిళనాడులో ఎదురే లేదు, అడ్డుకున్న, యిదేమిటని వారించిన వాడే లేడు. అన్ని పార్టీల వారూ, మీడియాతో సహా అన్ని వర్గాల వారూ వత్తాసు పలికారు. అటు కేంద్రమూ సుముఖంగా వుంది. విలనంటూ ఏదైనా వుందా అంటే అది కోర్టు తీర్పు మాత్రమే. కేంద్రం తలచుకున్నాక ఆ తీర్పుకి విలువ లేకుండా పోయింది. జల్లికట్టు గెలిచింది కాబట్టి పళనిస్వామి వ్యతిరేకోద్యమమూ గెలుస్తుందని ఎలా అనగలం? ఇక్కడ వ్యక్తులెవరన్నది పక్కన పెడితే నియమాలు ముఖ్యం. పళనిస్వామికి అధిక సంఖ్యాకుల మద్దతుంది, అందుకే గవర్నరు పిలవాల్సి వచ్చింది, అందుకే అసెంబ్లీలో విశ్వాస తీర్మానం నెగ్గింది. స్పీకరు అప్రజాస్వామికంగా వ్యవహరించాడని ఎవరూ అనలేరు. శశికళ అభ్యర్థిని ఓడించడానికై కాస్త నియమాలు తప్పించైనా వ్యవహరించాల్సింది అని అనుకోవడం దుర్మార్గం. వ్యక్తుల గురించి రూల్సు మారిస్తే ప్రమాదం. అలాటి మార్పులు రేపు మంచివాళ్లకు కూడా హాని చేయవచ్చు.
ఓ పక్క ప్రజాస్వామ్యాన్ని గవర్నర్లు, స్పీకర్లు, నాయకులు ఖూనీ చేస్తూ వుంటే దాన్ని నిలబెట్టవలసిన భారం ప్రజలపై పెడితే ఎలా? చాలామంది ప్రజలకు విద్య లేదు. ప్రభుత్వాలు వారికి మంచి విద్య నందించటం లేదు. విద్య ఖరీదు పెంచేసి, అందుబాటులో లేకుండా చేసింది. విద్యాప్రమాణాలు నిలబెట్టడం లేదు. వారిని అజ్ఞానాంధకారంలో ముంచి అక్కడే వుంచుతున్నారు. మీడియా కూడా సమాజాన్ని కులాల వారీగా, ప్రాంతాల వారీగా విడదీస్తోంది. సరైన విధానంలో వారిని ఎడ్యుకేట్ చేయడం లేదు. తన రాతలతో ఆవేశాన్ని పెంచుతోంది తప్ప ఆలోచనను, వివేకాన్ని పెంచటం లేదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అని చెప్పుకుంటూ సమాజంలోని వివిధ వర్గాల్లో జరుగుతున్న అవినీతి కథనాలు విపరీతంగా వేసి, అతిశయోక్తులు జోడించి ప్రజలను వాటికి యిమ్యూన్ చేస్తోంది. నీతిపరుల కథలు వేయదు. అవినీతి కథనాలు కూడా సెన్సేషన్ సృష్టించడానికే తప్ప వాస్తవాలు వెలువడ్డాక కేసులు ఎలా నడిచాయి, వాళ్లకు శిక్షలు ఎలా పడ్డాయి అనేది కవర్ చేయదు.
వీటివలన ప్రజల్లో నెగటివిటీ పెరుగుతోంది. పేపరు చూడగానే కోట్లు, వందల కోట్లు తినేసినవారి వార్తలు చదివి, ఇది సాధారణ విషయమే, అందరూ అంతలేసి దిగమింగినపుడు మనం లక్షల్లో తీసుకుంటే తప్పేముంది అనుకునేట్లా చేస్తోంది. అంతేకాదు, లంచగొండుల పట్ల సహానుభూతి పెరుగుతోంది. అందుకే అవినీతి ఆరోపణలున్నవారికి, క్రిమినల్ కేసుల్లో యిరుక్కున్నవారికి కూడా ఎన్నికలలో ఓట్లేస్తున్నారు. శశికళ ఒక్కతే మూర్తీభవించిన అవినీతి అన్నట్లు యిప్పుడు ప్రచారం సాగుతోంది. ఆమెను నిరసించినవారు కర్ణాటక హైకోర్టు తీర్పు వచ్చాక జయలలితకు అభినందనలు తెలిపిన మోదీ పట్ల కూడా నిరసన తెలపాలి కదా! ఏడాదిన్నరగా, జయలలిత పాలించినంతకాలం యీ తీర్పును రిజర్వ్ చేసిపెట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పట్ల కూడా నిరసన తెలపాలి కదా! ఇప్పుడు శశికళకు, ఆమె అనుచరులకు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తున్న సినిమావారు ప్రజలను జాగృతం చేయడానికి తమ వంతుగా తాము ఏం చేశారన్న ప్రశ్న వస్తుంది. అదేమీ చేయకుండా యిప్పటికిప్పుడు ప్రజలు చైతన్యం తెచ్చేసుకుని తిరగబడాలి అని కోరడం అత్యాశ అని నా అభిప్రాయం. ఆ అత్యాశ వాస్తవంగా మారితే మాత్రం నా కంటె సంతోషించేవాళ్లుండరు.
ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2017)