తెలుగు టీవీ తెరపై హాట్ ఏంకర్ ఆమె. అప్పుడప్పుడు సినిమాల్లో తళక్కున కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఆమె చార్జ్ కూడా కాస్త ఎక్కువే. అడియో ఫంక్షన్ కు లక్షన్నర తీసుకుంటుంది. అదే సినిమాలకు అయితే రోజుకు రెండు లక్షలు. అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే, ఈమధ్య ఆ అమ్మడు ఓ సినిమాలో ఆడిపాడేసిందట.
అందుకు గాను కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం పదిలక్షలు పారితోషికం అడ్వాన్స్ గా అందింది. మరో నాలుగు లక్షల వరకు రావాల్సి వుందట. అయితే పని మరో మూడు రోజులు అదనం కావడంతో ఆరు లక్షలు ఇస్తామని మాటిచ్చిందట చిత్ర యూనిట్. అంటే మొత్తం పది లక్షలు రావాల్సి వుందన్నమాట. కానీ ఇప్పుడు యూనిట్ తమ పనిలో తాము పడి ఈ పదిలక్షల సంగతి మరిచిపోయారట.
దాంతో ఈ హాట్ ఏంకర్ తెగ ఫీలైపోతున్నట్లు వినికిడి. ఒప్పుకుని సినిమా చేస్తే, ఇలాచేసారు అంటూ తెలుసున్నవాళ్లకు చెప్పుకుని వాపోతోందట. ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్, మరీ ఎక్కువ ఫీలవకండి అని చెబుతున్నారట విన్నవాళ్లు. అదీ నిజమేనేమో? దంపిన దానికి తినేసిందే కూలి అన్నట్లు, టాలీవుడ్ లో చేసిన దానికి వచ్చిందే ఫీజు అనుకోవాల్సిందేనేమో?